రవితేజ అనుచరుల హల్ చల్
విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెండో కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించేందుకు తమ అనుమతి తీసుకోలేదని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వర రావు చెప్పారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వాహనాలను సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆ వాహనదారులకు ఈ-చలానాలు పంపుతామని కమిషనర్ చెప్పారు.
రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విజయవాడ నగరంలో భీతావహ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రవితేజ అనుచరులు ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లు వదిలి రోడ్డు మీద రేసుల తరహాలో 30 బైకులు నడిపారు. బైకుల సెలైన్సర్లు తొలగించిన రణగొణ ధ్వనులు సృష్టించారు. ఆపకుండా హారన్లు మోగిస్తూ రాంగ్ రూట్‌లో కార్లు నడిపారు.
దీంతో వాహనదారులకు, రోడ్డుపై వెళ్లే అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విషయాన్ని వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఈ రోజు పోలీస్ కమిషనర్ స్పందించారు.