ఫ్రీ లెఫ్ట్‌తో వాహనదారులకు ఊరట | Relief For Motorists With Free Left | Sakshi
Sakshi News home page

ఫ్రీ లెఫ్ట్‌తో వాహనదారులకు ఊరట

Published Sun, Dec 25 2022 9:40 PM | Last Updated on Sun, Dec 25 2022 9:42 PM

Relief For Motorists With Free Left - Sakshi

కుత్బుల్లాపూర్‌(హైదరాబాద్‌): వాహనదారులకు ఊరట లభించింది. ప్రతినిత్యం సుచిత్ర నుంచి కొంపల్లి వరకు నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ కావడం, వాహనదారులు ఇబ్బందులు పడటాన్ని గుర్తించిన అల్వాల్‌ ట్రాఫిక్‌ పోలీసులు అన్ని ప్రధాన చౌరస్తా రహదారుల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ సీఐ రాజు పర్యవేక్షణలో ఉన్నతాధికారుల సూచన మేరకు ఒకవైపు రహదారి పనులు జరుగుతుండగా మరోవైపు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీలో రోడ్డు వైపు వచ్చి వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే వుడ్స్‌ కాలనీ, రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్, జయభేరి, దండమూడి ఎన్‌క్లేవ్, డీ–మార్ట్‌ సమీపంలో రోడ్లను పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఫ్రీలెఫ్ట్‌ ఏర్పాటు చేసిన ప్రాంతాలివే... 
సుచిత్ర చౌరస్తాలో కుత్బుల్లాపూర్‌ నుంచి అటు అల్వాల్‌ ఇటు సికింద్రాబాద్‌కు వెళ్లేవారు ఫ్రీ లెఫ్ట్‌ ద్వారా మళ్లించి స్వాగత్‌–సురభి హోటల్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన యూటర్న్‌ వద్ద మళ్లీ వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీంతో సుచిత్ర చౌరస్తా వద్ద కొద్దిగా ట్రాఫిక్‌ రద్దీ తగ్గింది. ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

జీడిమెట్ల గాంధీ విగ్రహం చౌరస్తాలో కూడా గ్రామం నుంచి వచ్చే వాహనాలకు ఒక దారి, అటు షాపునగర్‌ నుంచి సుభాష్‌నగర్‌ మీదుగా వచ్చే వారికి ఫ్రీ లెఫ్ట్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నర్సింగ్‌ క్లాత్‌ ఎంపోరియం సమీపంలో ఏర్పాటు చేసిన యూటర్న్‌ వద్ద తిరిగి సికింద్రాబాద్‌ వైపు వెళ్లొచ్చు. 

జాతీయ రహదారి–44 రోడ్డు వెడల్పులో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తుండగా అక్కడక్కడ ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కావడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆయా కాలనీల సంక్షేమ సంఘాల విజ్ఞప్తులను పరిశీలించి రోడ్డు మార్గాలను ముందే చెప్పేస్తున్నారు. 

ప్రస్తుతం జీడిమెట్ల, సుచిత్ర, దూలపల్లి క్రాస్‌ రోడ్, కొంపల్లి ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ దృష్టి సారించి ఆయా వాహనాలను మళ్లిస్తున్నారు. 

వెన్‌ సాయి అపార్ట్‌మెంట్‌ సమీపంలో యూటర్న్‌ ఏర్పాటు చేయగా కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వచ్చే వాహనాలు వేగంగా రావడం మూలంగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని పలువురు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement