డ్రైవరే టార్గెట్! | Target drive! | Sakshi
Sakshi News home page

డ్రైవరే టార్గెట్!

Published Sat, Apr 16 2016 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

డ్రైవరే టార్గెట్!

డ్రైవరే టార్గెట్!

ఉల్లంఘనల నమోదులో కొత్త ప్రక్రియ
పదేపదే వైలేషన్స్ చేసే వారి  గుర్తింపు కోసమే
తప్పుడు ‘నెంబర్లు’ చెప్పకుండా  ఓటీపీ విధానం

 

సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నిత్యం ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఆయా వ్యక్తుల పైనే కేసులు నమోదు చేస్తున్నారు. తద్వారా ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన వారిని గుర్తించడం తేలికవుతోంది. దీంతో ఆయా వివరాలను కోర్టుకు సమర్పించి ట్రాఫిక్ పోలీసులు జరిమానాతో పాటు జైలు శిక్ష పడేలా, శిక్షాకాలం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

 
రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడే వారిని పట్టుకుంటున్న క్షేత్రస్థాయి ట్రాఫిక్ పోలీసులు... ఈ వాహనం నెంబర్ ఆధారంగా జరిమానా విధిస్తున్నారు. దీంతో పదేపదే చిక్కుతున్న వాహనాల డేటాబేస్ రూపొందుతోంది. అయితే అసలు తప్పు వాటిని డ్రైవ్ చేసిన వ్యక్తులదని తెలిసినా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించడం సాధ్యం కావడట్లేదు. దీంతో ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడినా ఒకే తరహాలో జరిమానా విధిస్తున్నారు.

 
‘డ్రంకన్ డ్రైవింగ్’ను స్ఫూర్తిగా తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనల నమోదును వాహనం నుంచి డ్రైవర్ ఆధారంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల అమలవుతున్న ఈ విధానం త్వరలో నగర వ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని ఆధారంగా రూపొందే డేటాబేస్ ద్వారా రిపీటెడ్ వైలేటర్స్‌ను గుర్తించడం, ఆర్టీఏ, న్యాయస్థానాల సహకారంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ కాప్స్ సన్నాహాలు పూర్తి చేశారు.

 

పీడీఏ మిషన్లలో  ప్రత్యేక ఏర్పాట్లు...
ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పుస్తకాలను వాడట్లేదు. ఉల్లంఘనులకు జరిమానా విధించడం, వారి నుంచి క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆ మొత్తాన్ని వసూలు చేయడం తదితరాలన్నీ చేతిలో ఇమిడిపోయే పీడీఏ మిషన్లు ద్వారానే నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు తాజాగా తీసుకున్న ‘డ్రైవర్’ నిర్ణయంతో ఈ పీడీఏ మిషన్లలో కొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాహనచోదకుడి వద్ద ఒరిజినల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉంటే దాన్ని రీడ్ చేసే పరిజ్ఞానం జోడించారు. ఉల్లంఘనుడి వద్ద ఉన్నది జిరాక్సు ప్రతి అయితే ఆ వివరాలు మాన్యువల్‌గా ఫీడ్ చేయనున్నారు. ప్రతి ఉల్లంఘనుడు తన డ్రైవింగ్ లెసైన్స్‌తో పాటు మరో గుర్తింపు కార్డును చూపించడం కచ్చితం చేయనున్నారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ తదితరాల్లో ఏదో ఒకటి అదనంగా చూపించాల్సిన విధానం అమలులోకి తీసుకువస్తున్నారు. ఈ వివరాలను సైతం పీడీఏ మిషన్లలో ఫీడ్ చేయడం ద్వారా ఉల్లంఘనులకు సంబంధించిన డేటాబేస్ రూపొందించనున్నారు.

 

ఫోన్ నెంబర్ సైతం కచ్చితం..
సిటీలో పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్ల సంఖ్య సైతం భారీగానే ఉంది.  ఆయా వాహనచోదకులకు పోలీసులు ఎస్సెమ్మెస్‌ల రూపంలో రిమైండర్స్ ఇస్తున్నారు. దీనికి అవసరమైన ఫోన్ నెంబర్లను వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ అధికారులకు ఇచ్చింది తీసుకుంటున్నారు. అయితే ఆయా వాహనాలు చేతులు మారిపోవడం, అసలు యజమాని దగ్గరే ఉన్నా ఆయన ఫోన్ నెంబర్లు మార్చేయడంతో ఈ సమాచారం వారికి చేరట్లేదు. మరోపక్క అత్యవసర సమయాల్లో వాహనచోదకుడిని సంప్రదించడానికీ అవకాశం ఉండట్లేదు. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు వైలేషన్స్‌ను డ్రైవర్ కేంద్రంగా నమోదు చేయడంతో పాటు వారి నుంచి ఫోన్ నెంబర్లనూ కచ్చితంగా తీసుకోనున్నారు.

 

నెంబర్ ‘మార్చకుండా....
ఈ రకంగా ట్రాఫిక్ పోలీసులు కోరినప్పుడు ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగానో, అనివార్యకారణాల నేపథ్యంలోనే తప్పు నెంబర్లు చెప్పే అవకాశం ఉంది. ఏవో పది అంకెల నెంబర్ చెప్పి తప్పించుకోవడానికీ ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు ఫోన్ నెంబర్ల సేకరణలో వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) విధానం అమలు చేస్తున్నారు. ఉల్లంఘనుడు ట్రాఫిక్ పోలీసులకు తన ఫోన్ నెంబర్ చెప్పిన వెంటనే దాన్ని అధికారులు పీడీఏ మిషన్‌లో నమోదు చేస్తారు. ఈ వెంటనే పీడీఏలు కనెక్ట్ అయి ఉండే సర్వర్ నుంచి సదరు ఉల్లంఘనుడు చెప్పిన నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సైతం ఉల్లంఘనుడు అందుకుని, చెప్తేనే అసలు నెంబర్ చెప్పినట్లు నిర్థారిస్తారు. ఈ నూతన విధానంతో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం తేలికవుతుందని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. అలా రూపొందే రిపీటెడ్ వైలేటర్స్ డేటాబేస్ ఆధారంగా ఆర్టీఏ ద్వారా లెసైన్స్ సస్పెండ్ చేయించడం, కొన్ని రకాలైన ఉల్లంఘనుల్ని కోర్టు ద్వారా జైలుకు తరలించడం తదితర కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement