‘జీరో యాక్సిడెంట్ నైట్’గా డిసెంబర్ 31
కూల్... కూల్‌గా!
ప్రశాంతంగా ప్రారంభమైన కొత్త ఏడాది
ఫలించిన ‘జంట పోలీసుల’ వ్యూహం
అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా వే డుకలు
‘జీరో యాక్సిడెంట్ నైట్’గా డిసెంబర్ 31
సిటీబ్యూరో: జంట కమిషనరేట్ల పోలీసులు ఏర్పాటు చేసిన బందోబస్తు, విధించిన ఆంక్షలు ఫలితాలనిచ్చాయి. కొత్త సంవత్సర స్వాగత వేడుకలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా... ఒక్క ప్రమాదం కూడా నమోదు కాకుండా ‘జీరో యాక్సిడెంట్ నైట్’గా చేయగలిగారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతో పాటు అదనపు బలగాలు గురువారం రాత్రంతా విధుల్లోనే ఉన్నాయి. నగరంలోని కీలక ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్‌లలో నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. వేడుకలు జరుపుకునే వారు ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండాచర్యలు తీసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం... దురుసుగా డ్రైవింగ్ చేయడం... మితిమీరిన వేగం... పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం తదితర ఉల్లంఘనలపై ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సిటీలో 557 మంది, సైబరాబాద్‌లో 505 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కారు.
గతంలోని ప్రమాదాలు, ఘటనలను దృష్టిలో పెట్టుకున్న పోలీసలు ముందు జాగ్రత్తగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను బంద్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గం లేని కారణంగా బేగంపేట, డబీర్‌పుర, సనత్‌నగర్ వంటి కొన్ని ఫ్లైఓవర్లకు మాత్రమే మినహాయింపునిచ్చారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లతో పాటు హుస్సేన్ సాగర్ చుట్టు పక్కలవాహనాలను అనుమతించలేదు. ఓఆర్‌ఆర్, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేలోనూ ఆంక్షలు కొనసాగాయి. జంట కమిషనరేట్లలోని ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు వాహన చోదకుల వేగాన్ని నియంత్రించారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యలతో డిసెంబర్ 31 ప్రశాంతంగా గడిచింది. శుక్రవారం తెల్లవారు జాము 2 గంటల తరవాత ఫ్లైఓవర్లు, 3 గంటలకు ట్యాంక్‌బండ్, 5 గంటలకు నెక్లెస్ రోడ్‌లలో సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు.