ఆ హక్కు ప్రభుత్వానికి ఉంది: రూప
బెంగళూరు: అధికారులు బదిలీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వ ఉత్తర్వులను పాటించానని ట్రాఫిక్ ఐజీ రూప తెలిపారు. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీకి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్ బేడీ ఇచ్చిన మద్దతు తనకు అమూల్యమైందని రూప పేర్కొన్నారు. కాగా అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో అందుతున్న వీఐపీ ట్రీట్‌మెంట్, జైల్లో అవకతవకలను బయటపెట్టిన డేరింగ్ ఐపీఎస్, డీఐజీ రూప మౌద్గిల్‌కు బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. గత నెల 23న జైళ్ల డీఐజీగా చార్జ్ తీసుకున్న ఆమెపై నెల తిరక్కుండానే బదిలీ వేటు పడడం గమనార్హం.
మరోవైపు విపక్ష నేతలు సర్కారు చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. ఇక జైళ్ల డీజీపీ సత్యనారాయణరావు, నిఘా డీజీపీ ఎంఎన్.రెడ్డిలు కూడా బదిలీ అయ్యారు. మరోవైపు డీజీపీ ఆర్కే దత్త మాట్లాడుతూ రహదారుల భద్రతకు సంబంధించి రూపకు కీలక, బాధ్యతయుతమైన పోస్ట్ కేటాయించడం జరిగిందే కానీ, పనిష్‌మెంట్ కింద బదిలీ జరగలేదని అన్నారు.