
న్యూఢిల్లీ: ఒక సంస్థలో ఉద్యోగం వీడి, మరో సంస్థలో చేరిన సందర్భాల్లో భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాను ఆన్‌లైన్‌లో సులభంగా బదిలీ చేసుకునే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని రకాల అనుమతులను తొలగించింది.
‘‘ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా బదిలీ రెండు ఈపీఎఫ్ కార్యాలయాలతో ముడిపడి ఉండేది. ఇందులో ఒకటి పీఎఫ్ జమలు జరిగిన (సోర్స్) ఆఫీస్. ఈ మొత్తం మరో ఈపీఎఫ్ కార్యాలయం పరిధిలో (డెస్టినేషన్ ఆఫీస్)కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో క్లెయిమ్‌ల బదిలీకి డెస్టినేషన్ ఆఫీస్ అనుమతుల అవసరాలను తొలగించాం. ఇందుకు సంబంధించి పునరుద్ధరించిన ఫామ్ 13 సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చాం. ఇక నుంచి క్లెయిమ్‌లకు సోర్స్ ఆఫీస్ నుంచి అనుమతి లభించగానే, సభ్యుడి/సభ్యురాలి పీఎఫ్ ఖాతా ప్రస్తుత కార్యాలయం పరిధిలోకి మారిపోతుంది’’అని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.