ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల ప్రొఫైల్ అప్‌డేషన్ ప్రక్రియకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులు వారి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి జాయింట్ డిక్లరేషన్‌ల ప్రాసెసింగ్‌లో ఎస్‌ఓపీ సహాయం చేస్తుంది.
అప్‌డేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వివరాల నమోదులో అవకతవకలను నివారించేందుకు ఈ కొత్త ప్రక్రియను ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈపీఎఫ్‌వో డేటాబేస్‌లో అసంపూర్ణంగా లేదా సరిపోలని విధంగా ఉన్న వివరాల అప్‌డేషన్ కోసం కాగితాల ద్వారా సమర్పించే జాయింట్ డిక్లరేషన్ విధానం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇందుకు చాలా సమయం పడుతోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త విధానానం (ఎస్‌ఓపీ) సహాయపడుతుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
అప్‌డేషన్ వివరాలు, పరిమితులు
ప్రొఫైల్స్ సక్రమంగా లేకపోవడంతో తరచూ తిరస్కరణలు, కొన్నిసార్లు అవకతవకలకు సైతం దారితీసే అవకాశం ఉంటోంది. పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు/తల్లి పేరు, సంబంధ స్థితి, ఆరోగ్య స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, నిష్క్రమించడానికి కారణం, నిష్క్రమించిన తేదీ, జాతీయత, ఆధార్ నంబర్ తదితర వివరాల్లో డేటా సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పైన పేర్కొన్న 11 రకాల వివరాల్లో సవరణలను ఈపీఎఫ్‌వో సభ్యులు చేసుకోవచ్చు. కొత్త ఎస్‌ఓపీ ప్రకారం.. వీటిని చిన్న, పెద్ద మార్పులుగా వర్గీకరించారు. అలాగే ఈ వివరాలను ఎన్నిసార్లు అప్‌డేషన్ చేసుకోవచ్చన్న దానిపై కూడా పరిమితిని విధించింది ఈపీఎఫ్‌వో. చిన్న అభ్యర్థనలు ఏడు రోజుల్లో పెద్ద అప్‌డేషన్‌లు 15 రోజుల్లో పూర్తయ్యే చర్యలు చేపట్టింది. అప్‌డేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశలోనూ సభ్యులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
అప్‌డేషన్ ప్రక్రియతో పాటు, ఇందుకు అవసరమైన పత్రాలను సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పేరు, జెండర్ అప్‌డేట్ చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. అగానే సభ్యులు మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment