EPF account
-
పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం విత్‌డ్రా.. ఎలాగో తెలుసా?
హోమ్ లోన్ (home loan) వడ్డీ భారం భరించలేకపోతున్నారా.. ముందస్తుగా చెల్లించేందుకు డబ్బు కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. మీ పీఎఫ్ ఖాతా (PF Account) లోంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీ లోన్ చెల్లించేయండి. ఇందుకోసం అత్యధికంగా నగదు విత్‌డ్రా (PF withdraw) చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ (EPFO) కల్పిస్తోంది. అయితే ఇది లాభదాయకమా.. కాదా? అన్నది ఆలోచించుకోవాలి. వడ్డీ రేటు, వయసు కీలకం హోమ్ లోన్ వడ్డీ రేటు.. ఈపీఎఫ్ చెల్లించే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసి ఈ మొత్తంతో రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు. అయితే భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరం. అయితే కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వారు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకుని లోన్ చెల్లించవచ్చు. ఎందుకంటే డబ్బును కూడబెట్టుకోవడానికి వీరికి చాలా కాలం ఉంటుంది. (ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు) 90 శాతం వరకు.. గృహ రుణాన్ని తిరిగి చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్ మొత్తంలో గరిష్టంగా 90 శాతం విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతిస్తుంది. అయితే ఇందుకోసం 10 ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. జాతీయ బ్యాంకులు, రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్, నేషనల్ హౌసింగ్ బోర్డ్ వంటి సంస్థల నుంచి హోమ్ తీసుకుని ఉండాలి. హోమ్ లోన్ రీపేమెంట్ స్కీమ్ కింద ఈపీఎఫ్ఓ సభ్యులు వారి ఖాతా నుంచి ఈఎంఐలు కూడా చెల్లించవచ్చు. ఇదీ ప్రాసెస్.. ➤ EPFO e-service పోర్టల్‌కు లాగిన్ చేయండి. ➤ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. ➤ ఆన్లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి. ➤ ఫారం 31 ద్వారా క్లెయిమ్ చేయండి. ➤ మీ బ్యాంక్ వివరాలను ధ్రువీకరించండి. ➤ డబ్బు ఉపసంహరణకు కారణాన్ని ఎంచుకోండి. ➤ సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. అత్యవసరమైతేనే డ్రా చేయండి చాలా అవసరం అయితే తప్ప పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయకూడదని మనీ మేనేజ్మెంట్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ చెల్లిస్తోంది.పీఎఫ్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేస్తే, రిటైర్మెంట్ ఫండ్‌పై అంత పెద్ద ప్రభావం పడుతుంది. పీఎఫ్ ఖాతాలో ఎంత జమవుతుంది? నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు తమ జీతం, డియర్నెస్ అలవెన్స్‌లో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేయడం తప్పనిసరి. అదే సమయంలో కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్‌లో ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మిగిలిన 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)లో జమవుతుంది. -
ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల ప్రొఫైల్ అప్డేషన్ ప్రక్రియకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులు వారి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవడానికి జాయింట్ డిక్లరేషన్ల ప్రాసెసింగ్‌లో ఎస్ఓపీ సహాయం చేస్తుంది. అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వివరాల నమోదులో అవకతవకలను నివారించేందుకు ఈ కొత్త ప్రక్రియను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈపీఎఫ్‌వో డేటాబేస్‌లో అసంపూర్ణంగా లేదా సరిపోలని విధంగా ఉన్న వివరాల అప్డేషన్ కోసం కాగితాల ద్వారా సమర్పించే జాయింట్ డిక్లరేషన్ విధానం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇందుకు చాలా సమయం పడుతోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త విధానానం (ఎస్ఓపీ) సహాయపడుతుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అప్డేషన్ వివరాలు, పరిమితులు ప్రొఫైల్స్ సక్రమంగా లేకపోవడంతో తరచూ తిరస్కరణలు, కొన్నిసార్లు అవకతవకలకు సైతం దారితీసే అవకాశం ఉంటోంది. పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు/తల్లి పేరు, సంబంధ స్థితి, ఆరోగ్య స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, నిష్క్రమించడానికి కారణం, నిష్క్రమించిన తేదీ, జాతీయత, ఆధార్ నంబర్ తదితర వివరాల్లో డేటా సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైన పేర్కొన్న 11 రకాల వివరాల్లో సవరణలను ఈపీఎఫ్‌వో సభ్యులు చేసుకోవచ్చు. కొత్త ఎస్ఓపీ ప్రకారం.. వీటిని చిన్న, పెద్ద మార్పులుగా వర్గీకరించారు. అలాగే ఈ వివరాలను ఎన్నిసార్లు అప్డేషన్ చేసుకోవచ్చన్న దానిపై కూడా పరిమితిని విధించింది ఈపీఎఫ్‌వో. చిన్న అభ్యర్థనలు ఏడు రోజుల్లో పెద్ద అప్డేషన్లు 15 రోజుల్లో పూర్తయ్యే చర్యలు చేపట్టింది. అప్డేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశలోనూ సభ్యులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. అప్డేషన్ ప్రక్రియతో పాటు, ఇందుకు అవసరమైన పత్రాలను సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పేరు, జెండర్ అప్డేట్ చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. అగానే సభ్యులు మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. -
ఈపీఎఫ్ ఖాతాల్లో అక్రమాలపై సీబీఐ కేసు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాల్లో అక్రమాలకు పాల్పడిన గుంటూరులోని ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలోని పలువురు అధికారులపై సీబీఐ బుధవారం కేసులు నమోదు చేసింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చీరాల, గుంటుపల్లి తదితర చోట్ల ఈపీఎఫ్ అధికారులకు చెందిన 40 నివాసాలు, ఇతర ప్రదేశాలపై సీబీఐ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈపీఎఫ్ అధికారులు కొందరు ప్రైవేటు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ గుర్తించింది. ఈపీఎఫ్ క్లెయిములు, సేవలు, ఉద్యోగులకు బకాయిల చెల్లింపు వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. అందుకోసం గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే మొదలైన మొబైల్ వాలెట్ల ద్వారా భారీగా లంచాలు తీసుకున్నట్టు కూడా ఆధారాలు సేకరించింది. అక్రమాలకు పాల్పడిన ఈపీఎఫ్ అధికారులపై 4 కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఈపీఎఫ్ విత్‌డ్రాలకు ఒక్కటే దరఖాస్తు
న్యూఢిల్లీ: పిల్లల వివాహాలు, ఉన్నత విద్య, గృహరుణాలు, గృహనిర్మాణం, ఆధునీకీకరణ, భూమి కొనుగోలు ఇలా వేర్వేరు సందర్భాల్లో నగదు అవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతాలోని నగదును విత్‌డ్రా చేసే చందాదారులు ప్రస్తుతం వేర్వేరు దరఖాస్తు ఫామ్‌లను నింపుతున్నారు. ఇకపై వీటన్నింటికీ బదులుగా ఒకే పేజీలో తయారైన ఒక్కటే దరఖాస్తు నింపితే సరిపోతుందని ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్‌వో) సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ దరఖాస్తుకు స్వీయ ధ్రువీకరణ లాంటివి కూడా అవసరంలేదని సంస్థ స్పష్టంచేసింది. పీఎఫ్ ఖాతాతో ఆధార్, బ్యాంకు ఖాతా లను అనుసంధానం చేసుకున్న వారు నేరుగా 19(యూఏఎన్), 10సీ(యూఏఎన్), 31(యూఏఎన్) ఫారాలను పంపే వీలుంది. ఈ ఫారాలకు ఉద్యోగ సంస్థల అటస్టేషన్ అక్కర్లేదు. అనుసంధానం చేసుకోనివారు అటస్టేషన్తో 19, 10సీ, 31 ఫారాలను నింపాల్సి ఉంటుంది. -
ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త!
ముంబై: కేంద్ర కార్మిఖ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. నిర్వహణలో లేని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలకు కొత్త నిర్వచనాన్ని అందించిన కార్మికశాఖ తాజాగా అలాంటి ఖాతాలకు వడ్డీ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా కోట్లాదిమంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఈ చెల్లింపులను ఏప్రిల్ 1, 2011 నుంచి వర్తింప చేయనున్నట్టు వెల్లడించింది. గత మూడు సంవత్సరాలుగా లావాదేవీలు జరపని ఈపీఎఫ్ ఖాతాలకు కూడా ఇకముందు వడ్డీ చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 'పనిచేయని' ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలకు కూడా వడ్డీ చెల్లింపును ప్రారంభిస్తున్నట్టుగా నవంబర్ 11 న ఒక నోటిఫికేషన్ జారిచేసింది. గత 36 నెలలుగా పనిచేయని పీఎఫ్ ఖాతాలను కార్మిక మంత్రిత్వ శాఖ ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించడంతోపాటు వాటికి వడ్డీ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించడానికి నిర్ణయించుకుంది. ఈ నోటిఫికేషన్ అందించిన సమాచారం ప్రకారం ఒక ఉద్యోగి రాజీనామా చేసి రెండు నెలలలోపు మరో ఉద్యోగం చేపట్టకపోయినా కొత్త ఉద్యోగాన్ని ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. లేదా కొత్త ఉద్యోగంలో ఈపీఎఫ్ ఖాతాలో బదిలీచేయడంలో విఫలమైనా కూడా సదరు ఉద్యోగి ఖాతాను యాక్టివ్ ఖాతాగా పరిగణిస్తారు. దీంతోపాటుగా సంవత్సరానికి 8.8శాతం వడ్డీచెల్లించనున్నట్టు నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అయితే 55 ఏళ్ల తరువాత ఉద్యోగాన్ని విరమించినా, లేదా శాశ్వతంగా విదేశాలకు వలస వెళ్లినా లేదా 36 నెలలలోపు ఆ ఉద్యోగి ఖాతాను స్వయంగా ఉపసంహరించుకున్నా, లేదా మరణించిన సందర్భంలో మాత్రమే పీఎఫ్ ఖాతా రద్దు అవుతుంది. కాగా గత రెండు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా సుమారు 42, 000 కోట్ల నిధులు సంస్థలో ఉన్నట్టు సమాచారం. ఈ కీలక నిర్ణయం కారణంగా దాదాపు 9.70కోట్ల పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.దీంతో కార్మికుల సంక్షేమం కోసం నిర్వహణలో లేని ఖాతాలకు ఇకముందు యాక్టివ్ ఖాతాలుగా పరిగణించనున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించిన సంగతి తెలిసిందే.