ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ 8 కోట్ల మంది క్రియాశీలక చందాదారుల కోసం కీలక సంస్కరణలు తీసుకువస్తోంది. వచ్చే జూన్ నుండి కేవైసీ (KYC) ధ్రువీకరణ కోసం స్వీయ-ధ్రువీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతోంది. దీంతో కంపెనీ హెచ్‌ఆర్ ఆమోదంతో పనిలేకుండానే ఉద్యోగులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో సభ్యులకు వేగంతోపాటు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది.
కేవైసీ ప్రక్రియ సులభతరం
ఇప్పటి వరకు సభ్యుల కేవైసీ వివరాలను వారి యూఏఎన్ (UAN) నంబర్‌ల ఆధారంగా ప్రామాణీకరించే బాధ్యత కంపెనీకు ఉండేది. ఇప్పుడు కంపెనీల ఆమోదంతో పని లేకుండా స్వీయ-ధ్రువీకరణ సదుపాయం ద్వారా సభ్యులు తామే ధ్రువీకరిస్తే సరిపోతుంది. దీంతో కంపెనీ షట్-డౌన్ మోడ్‌లోకి వెళ్లినప్పుడు లేదా సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు ప్రతిసారీ తలెత్తే ఇటువంటి ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే కేవైసీ ఫార్మాలిటీల అసంపూర్తి కారణంగా జరిగే ఈపీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కరణలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.
సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈపీఎఫ్‌వో 3.0 (EPFO 3.0) ప్రాజెక్ట్‌లో స్వీయ-ధ్రువీకరణ సదుపాయం కూడా భాగం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లతో ఈపీఎఫ్‌వో మెంబర్‌షిప్ బేస్ 10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ సహాయం అందించనుంది. ఇప్పటికే సంస్థ ఐటీ వ్యవస్థలు బలంగా ఉన్న క్రమంలో ఇక సభ్యులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడంపై ఈపీఎఫ్‌వో దృష్టి సారిస్తోంది.
క్లెయిమ్ పెట్టకుండానే ఉపసంహరణ
బ్యాంక్ ప్లస్ ఈపీఎఫ్‌వో 3.0 సిస్టమ్‌లో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్‌కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకోవడం. దీనికి సంబంధించిన వ్యవస్థను వచ్చే మార్చి లోపు ప్రవేశపెట్టాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కింద చందాదారు తన ఈపీఎఫ్ కార్పస్ నుండి క్లెయిమ్ దాఖలు చేయకుండానే నేరుగా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.
ఈపీఎఫ్‌వో చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం, అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల హామీ ఇచ్చారు. ఈపీఎఫ్‌వో అందించే సేవల ఆధునీకరణ దిశగా, లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment