EPF withdrawal
-
ఏటీఎం నుంచి ఈపీఎఫ్‌వో సొమ్ము!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యే ప్రణాళికలో ఉంది. ఏటీఎం నుండి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఉద్యోగి ప్రస్తుత 12 శాతం చందా పరిమితి పెంపు, పీఎఫ్ సొమ్మును పెన్షన్‌గా మార్చుకునే అవకాశం వంటి కొత్త సంస్కరణలు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు.ఏటీఎం తరహా కార్డుఈటీ నౌ రిపోర్ట్ ప్రకారం.. ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణల కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇలా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు చేయవచ్చు.ఇక మరొక పరిణామం ఏమిటంటే, ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్‌కు జమ చేసే కాంట్రిబ్యూషన్లపై ప్రస్తుతం ఉన్న 12% పరిమితిని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చినంత మొత్తాన్ని పీఎఫ్‌కు జమ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అయితే, యజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
EPF Update: ఇక ఆ సౌకర్యం లేదు.. ప్రకటించిన ఈపీఎఫ్‌వో
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇకపై కోవిడ్ -19 అడ్వాన్స్‌లను అందించబోమని ప్రకటించింది. కోవిడ్ -19 ఇకపై మహమ్మారి కానందున, తక్షణమే ఈ అడ్వాన్స్ నిలిపివేయాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిందని ఈపీఎఫ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. మినహాయింపు పొందిన ట్రస్టులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది.కరోనా మహమ్మారి సమయంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులు రెండుసార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ ఆప్షన్‌ను మొదటి వేవ్ సమయంలో ప్రవేశపెట్టగా, సెకండ్ వేవ్‌లో మరో అడ్వాన్స్‌తో పొడిగించారు. ఈ వెసులుబాటు కింద ఈపీఎఫ్ఓ చందాదారులు మూడు నెలల బేసిక్ వేతనం, కరువు భత్యాలు లేదా తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌లో 75 శాతం ఏది తక్కువైతే అది నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉండేది.కాగా పిల్లల చదువులు, పెళ్లిళ్ల, మెడికల్ ఎమర్జెన్సీ, రెసిడెన్సియల్ ప్రాపర్టీ కొనుగోలు వంటి వాటి కోసం ఉద్యోగుల ఈపీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. నగదు ఉపసంహరణ కోసం ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది. ఈ ఆన్లైన్ విత్‌డ్రాయల్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేసింది.పీఎఫ్ విత్‌డ్రా ఎలా?» ముందుగా మీరు మీ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అర్హులా కాదా నిర్ధారించుకోండి.» ఈపీఎఫ్ పోర్టల్ లో మీ వ్యక్తిగత వివరాలు అప్టు డేట్‌గా ఉండేలా చూసుకోండి.» మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) ఇప్పటికే యాక్టివేట్ కాకపోతే యాక్టివేట్ చేయండి.» పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ కోసం ఈపీఎఫ్ ఫారాన్ని పూర్తి చేయండి.» రిటైర్మెంట్ తర్వాత లేదా రెండు నెలల కంటే ఎక్కువ నిరుద్యోగం తర్వాత మాత్రమే పూర్తి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.ఆన్లైన్లో క్లెయిమ్ ఇలా..» మీ UAN క్రెడెన్షియల్స్ ఉపయోగించి మెంబర్ ఇంటర్ ఫేస్ ని యాక్సెస్ చేసుకోండి.» మీ యూఏఎన్ తో లింక్ చేసిన అన్ని సర్వీస్ అర్హతలు, కేవైసీ ఆవశ్యకతలను మీరు తీర్చారని నిర్ధారించుకోండి.» సంబంధిత క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.» యూఐడీఏఐతో మీ రిజిస్టర్డ్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఉపయోగించి మీ వివరాలను ధ్రువీకరించండి.» ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయండి. -
ఇకపై రూ.1 లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు.. పీఎఫ్‌లో కీలక మార్పు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO ) చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్‌ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్‌వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. -
పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా.. ట్యాక్స్ రూల్స్ తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది దేశంలో వేతనాలు పొందే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పదవీ విరమణ నిధి. ఇందులో ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12 శాతం వాటాను జమ చేస్తూ ఉంటారు. యాజమాన్యాలు కూడా అదే మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటాయి. ఇలా పోగైన మొత్తాన్ని ఉద్యోగ విరమణ తర్వాత, వడ్డీతో పాటు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఇతర ఆదాయాల మాదిరిగానే ఈపీఎఫ్ ఉపసంహరణలు కొన్ని పరిస్థితులలో పన్నుకు లోబడి ఉంటాయి. ఈపీఫ్ విత్‌డ్రా షరతులు ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఖాతాలోని మొత్తాన్ని సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణకు ఒక సంవత్సరం ముందు అయితే పీఎఫ్ ఖాతాలోని 90 శాతం నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక నిరుద్యోగం విషయంలో అయితే ఉద్యోగం కోల్పోయిన ఒక నెల తర్వాత 75 శాతం, రెండు నెలల తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితులు, ఇతర అవసరాల నిమిత్తం తమ పీఎఫ్ నిధులను ఉపయోగించుకునేందుకు ఈ నియమాలు సౌలభ్యాన్ని అందిస్తాయి. పన్నులేమైనా ఉంటాయా? ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై సాధారణంగా ఎలాంటి పన్ను ఉండదు. అయితే, మునుపటి సంవత్సరాల్లో జమ చేసిన మొత్తాలపై సెక్షన్ 80C కింద తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు. అటువంటి సందర్భాలలో, సెక్షన్ 80C గతంలో క్లెయిమ్ చేయకుంటే అదనపు పన్ను వర్తించవచ్చు. ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తవ్వని ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో పీఎఫ్ నిధులను ఉపసంహరించుకుంటే మూలం వద్ద పన్ను (TDS) మినహాయిస్తారు. అదే ఉపసంహరణ మొత్తం రూ.50,000 కంటే తక్కువ ఉంటే టీడీఎస్ ఉండదు. ఇక ఐదేళ్ల నిరంతర సర్వీసు తర్వాత చేసే ఈపీఎఫ్ ఉపసంహరణలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగి ఒకటి కంటే కంపెనీల్లో పనిచేసిన సందర్భంలో ఈ ఐదేళ్ల నిరంతర సర్వీసుకు ఉద్యోగి పూర్వ కంపెనీలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. -
పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం విత్‌డ్రా.. ఎలాగో తెలుసా?
హోమ్ లోన్ (home loan) వడ్డీ భారం భరించలేకపోతున్నారా.. ముందస్తుగా చెల్లించేందుకు డబ్బు కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. మీ పీఎఫ్ ఖాతా (PF Account) లోంచి డబ్బు తీసుకుని ఎక్కువ వడ్డీ లోన్ చెల్లించేయండి. ఇందుకోసం అత్యధికంగా నగదు విత్‌డ్రా (PF withdraw) చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ (EPFO) కల్పిస్తోంది. అయితే ఇది లాభదాయకమా.. కాదా? అన్నది ఆలోచించుకోవాలి. వడ్డీ రేటు, వయసు కీలకం హోమ్ లోన్ వడ్డీ రేటు.. ఈపీఎఫ్ చెల్లించే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసి ఈ మొత్తంతో రుణాన్ని ముందస్తుగా చెల్లించవచ్చు. అయితే భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరం. అయితే కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వారు తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకుని లోన్ చెల్లించవచ్చు. ఎందుకంటే డబ్బును కూడబెట్టుకోవడానికి వీరికి చాలా కాలం ఉంటుంది. (ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు) 90 శాతం వరకు.. గృహ రుణాన్ని తిరిగి చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్ మొత్తంలో గరిష్టంగా 90 శాతం విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతిస్తుంది. అయితే ఇందుకోసం 10 ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. జాతీయ బ్యాంకులు, రిజిస్టర్డ్ కో-ఆపరేటివ్, నేషనల్ హౌసింగ్ బోర్డ్ వంటి సంస్థల నుంచి హోమ్ తీసుకుని ఉండాలి. హోమ్ లోన్ రీపేమెంట్ స్కీమ్ కింద ఈపీఎఫ్ఓ సభ్యులు వారి ఖాతా నుంచి ఈఎంఐలు కూడా చెల్లించవచ్చు. ఇదీ ప్రాసెస్.. ➤ EPFO e-service పోర్టల్‌కు లాగిన్ చేయండి. ➤ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. ➤ ఆన్లైన్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి. ➤ ఫారం 31 ద్వారా క్లెయిమ్ చేయండి. ➤ మీ బ్యాంక్ వివరాలను ధ్రువీకరించండి. ➤ డబ్బు ఉపసంహరణకు కారణాన్ని ఎంచుకోండి. ➤ సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. అత్యవసరమైతేనే డ్రా చేయండి చాలా అవసరం అయితే తప్ప పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయకూడదని మనీ మేనేజ్మెంట్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ చెల్లిస్తోంది.పీఎఫ్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేస్తే, రిటైర్మెంట్ ఫండ్‌పై అంత పెద్ద ప్రభావం పడుతుంది. పీఎఫ్ ఖాతాలో ఎంత జమవుతుంది? నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు తమ జీతం, డియర్నెస్ అలవెన్స్‌లో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ చేయడం తప్పనిసరి. అదే సమయంలో కంపెనీ డిపాజిట్ చేసిన మొత్తంలో 3.67 శాతం ఈపీఎఫ్‌లో ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మిగిలిన 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)లో జమవుతుంది. -
పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా?
నేను ఒక కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాను. నా సోదరి వివాహం కోసం నా పీఎఫ్ ఫండ్‌ను వాడుకోవాలని అనుకుంటున్నాను. నా సందేహం ఏమిటంటే.. నేను కరోనా లాక్డౌన్ల సమయంలో ఒకసారి పాక్షికంగా ఉపసంహరించుకున్నాను. కనుక మరోసారి పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చా? పన్ను పడుతుందా? – వేణు ఉదత్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రెండు సార్లు ఉపసంహరించుకోవచ్చు. పన్నుల అంశానికంటే ముందు తెలుసుకోవాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో పీఎఫ్ నుంచి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం, రుణాల చెల్లింపు, కొన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సా వ్యయాల చెల్లింపులకు, వివాహం లేదా పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్కు ఏడాది ముందు సందర్భాల్లో ఉపసంహరించుకోవచ్చు. (ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!) ఈ ప్రత్యేక సందర్భాలకు సంబంధించి ఈపీఎఫ్‌వో సభ్యుడు నిర్ణీత సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సభ్యుడు/సభ్యురాలి వివాహం కోసం లేదంటే కుమార్తె, కుమారుడు, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలంటే కనీసం ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. ఉద్యోగి వాటా కింద జమ అయి, దానికి వడ్డీ చేరగా సమకూరిన మొత్తం నుంచి 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ అవసరాల కోసం మూడు సార్లు ఉపసంహరణకు అనుమతిస్తారు. మీరు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కనుక మీరు చేసే ఉపసంహరణలపై పన్ను ఉండదు. మీ సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారు. కనుక కనీసం ఏడేళ్ల సర్వీసు ఉండాలి. మీకు ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉంది. ఏడేళ్లు పూర్తి కాకుండా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతుంది. గతంలో మీరు కోవిడ్ సమయంలో చేసిన ఉపసంహరణ ప్రభావం తాజా ఉపసంహరణలపై ఉండదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మార్చుకోవచ్చా..? – రాజేష్ షా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ మూడేళ్ల తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఈ లాకిన్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. ఒక సంస్థ నుంచి ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడిని మరోసంస్థకు చెందిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోకి మార్చుకోవాలంటే ముందుగా ఉపసంహరించుకోవాలి. మూడేళ్ల లాకిన్ పీరియడ్ వరకు ఉపసంహరించుకోలేరు. (ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?) మూడేళ్లు నిండిన తర్వాత అప్పుడు మీ పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవచ్చు. మీకు నచ్చిన పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ కానీ, మరే ఇతర పన్ను ఆదా పథకాలు అయినా తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తుంటాయి. కనుక లాకిన్ సమయంలో ఉపసంహరణలను అనుమతించరు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! -
ఈపీఎఫ్ఓ మెడికల్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష సాయం
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కింద రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులు ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్ కింద లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు ఈ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి ముందు ఎటువంటి ఆసుపత్రి బిల్లుల సమర్పించాల్సిన అవసరం లేదు. సెంట్రల్ సర్వీసెస్ మెడికల్ అటెండెంట్(సీఎస్(ఎంఎ) నియమాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద కవర్ అయ్యే ఉద్యోగులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొంది. ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ క్రింద తెలుసుకుందాం. నిబంధనల ప్రకారం రోగిని ప్రభుత్వ/పీఎస్ యు/సీజీహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒకవేళ రోగిని ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే, అప్పుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు. ఉద్యోగి లేదా వారి కుటుంబం అడ్వాన్స్ క్లెయిం చేయడం కొరకు ఆసుపత్రి, రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. వారు దరఖాస్తులో బిల్లు అంచనాను రాయాల్సిన అవసరం లేదు. రోగి కుటుంబానికి ఈ డబ్బు అడ్వాన్స్‌గా ఇవ్వవచ్చు లేదా రోగిని చేర్చిన నిర్ధిష్ట ఆసుపత్రికి నేరుగా చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ చికిత్స బిల్లు లక్ష పరిమితిని మించితే మరోసారి అడ్వాన్స్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ఆసుపత్రిలో వేసిన అంచనా బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. రోగి డిశ్చార్జ్ అయిన 45 రోజుల్లోగా మెడికల్ బిల్లులు ఈపీఎఫ్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. -
పీఎఫ్ విత్ డ్రాపై ట్యాక్స్ మినహాయింపు పొందడం ఎలా?
Tax On EPF Withdrawl: కరోనా వైరస్ మహమ్మారి వల్ల సామాన్య ప్రజానీకం సేవింగ్స్ కోసం దాచుకున్న నగదును మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా మారింది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నారు. సాదారణంగా అయితే, పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే కొన్ని సందర్భాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక ఈపీఎఫ్ ఖాతాదారులు చిక్కుల్లో పడుతున్నారు. ఇతర కారణాల చేత ఐదేళ్ల సర్వీస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డబ్బులు డ్రా చేస్తే పన్నులు చెల్లించాలి. విత్‌డ్రా చేసే మొత్తం రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే సెక్షన్ 192ఏ ప్రకారం 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అంతకన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే 30 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రూ.30,000 కన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ ఉండదు. ఐదేళ్ల సర్వీస్ దాటితే ఎలాంటి పన్నులు ఉండవు. ఇక ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 నాల్గవ షెడ్యూల్ రూల్ 8 సెక్షన్ 10(12) ప్రకారం.. ఒక వ్యక్తి తన ఉద్యోగం మానేసిన తేదీ నాటికి ముందు అతను ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసినట్లయితే విత్ డ్రా చేసే నగదుపై పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. 5 ఏళ్లు పైగా పని చేసి ఉండాలి అలాగే ఒక వ్యక్తి ఒక కంపెనీలో 2 ఏళ్లు పనిచేసి తర్వాత మరో కంపెనీలో 3 ఏళ్లు పైగా పనిచేస్తే ఇటువంటి సందర్భంలో కూడా తను ఉపసంహరించే నగదుపై పన్ను వర్తిస్తుంది. కానీ, అతను మొదటి సంస్థలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న పీఎఫ్ ఖాతాను, మరో సంస్థలో జాయిన్ అయినప్పుడు పూర్వ పీఎఫ్ ఖాతాను కొత్త పీఎఫ్ కొత్త లింకు చేయడం వల్ల అతను 5 ఏళ్లకు పైగా పనిచేసినట్లు పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సందర్భంలో కూడా అతను పూర్తి సర్విస్ పీరియడ్ కనుక 5 ఏళ్లు కంటే తక్కువగా ఉంటే కచ్చితంగా తను ఉపసంహరించే నగదుపై పన్ను పడుతుంది. కరోనా మహమ్మరి కాలంలో కాకుండా సాధారణంగా నగదు డ్రా చేసినప్పుడు పన్ను నుంచి మినహాయింపు పొందాలంటే కచ్చితంగా 5 ఏళ్లు పని చేసి అయిన ఉండాలి లేదా గత కంపెనీలో పనిచేసిన సర్వీస్ పీరియడ్ అయిన 5 ఏళ్లు పైగా అయిన ఉండాలి. -
ఆధార్‌లో పొరపాటు.. ఈపీఎఫ్ విత్‌డ్రాకు బ్రేక్
భువనేశ్వర్ : ఆధార్ కార్టులో పొరపాటు వల్ల ఓ ఉద్యోగి తీవ్ర మనోవేదనకు గురౌతున్నాడు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తుందనుకున్న తన ఈపీఎఫ్ (ఉద్యోగ భవిష్యనిధి) ఎందుకూ పనికిరాకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. మయూర్బంజ్ జిల్లాలోని బరిపడాకు చెందిన సంతోష్ జేనా విద్యుత్ డిపార్ట్మెంట్లో చిరుద్యోగి. అసలే అంతంత మాత్రంగా ఉన్న తన జీతంతో కుటుంబ పోషణ భారమైంది. అప్పుల్లో కూరుకుపోయిన తనకు ఈపీఎఫ్ ఆసరా అవుతుందనకున్న సంతోష్‌కు ఊహించని షాక్ తగిలింది. సెటిల్మెంట్ కోసం ఈపీఎఫ్ ఆఫీస్‌కు వెళ్లగా.. ‘నీ ఆధార్ కార్డులో లోపం ఉంది. దానిని సరిచేయించి తీసుకొస్తేనే డబ్బులిస్తాం’ అని అధికారులు స్పష్టం చేశారు. ఆదుకోకపోతే.. ఆత్మహత్యే.. ఆధార్ కార్డులో తప్పుడు ఎంట్రీవల్ల ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోలేకపోతున్నానని సంతోష్ మీడియా ఎదుట వాపోయాడు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తన సమస్యను పరిష్కరించకపోతే... తనకు చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు గతవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు మేలు చేయండి.. దొంగలకు కాదు
ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను వద్దు న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఉపసంహరణపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. నల్లధనాన్ని చట్టబద్ధ ఆదాయంగా మార్చుకునే అవకాశమివ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేయాలిగానీ దొంగలకు కాదని వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటు ఆవరణలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగులకు రక్షణగా ఉండే ఎంతో ముఖ్యమైన పీఎఫ్‌పై పన్ను విధించడం సరికాదు. ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం నింపాలని ప్రధాని మోదీని కోరుతున్నా..’’ అని రాహుల్ పేర్కొన్నారు. చిల్లర రాజకీయ ప్రసంగం పలు రంగాల్లో సంక్షోభం ఎదుర్కొంటున్న దేశానికి సాంత్వన చేకూర్చేలా ప్రధాని మోదీ ప్రసంగం లేదని కాంగ్రెస్ విమర్శించింది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై స్పందించకుండా చిల్లర రాజకీయాలకే ఆయన ప్రసంగం పరిమితమైందని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. కృశ్చేవ్ వ్యాఖ్యలను మోదీ ఉటంకించడం ప్రమాదకర ధోరణికి సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, వ్యతిరేకించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాల గురించి కానీ ఆయన ఒక్కమాటా మాట్లాడలేదు’ అన్నారు. నెహ్రూ వ్యాఖ్యలను మోదీ గుర్తు చేయడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఈ మధ్య ప్రధాని కాస్త చదవడం ప్రారంభించినట్లున్నారు.