
నేను ఒక కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాను. నా సోదరి వివాహం కోసం నా పీఎఫ్ ఫండ్‌ను వాడుకోవాలని అనుకుంటున్నాను. నా సందేహం ఏమిటంటే.. నేను కరోనా లాక్‌డౌన్‌ల సమయంలో ఒకసారి పాక్షికంగా ఉపసంహరించుకున్నాను. కనుక మరోసారి పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చా? పన్ను పడుతుందా?
– వేణు ఉదత్
ప్రావిడెంట్ ఫండ్ నుంచి రెండు సార్లు ఉపసంహరించుకోవచ్చు. పన్నుల అంశానికంటే ముందు తెలుసుకోవాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో పీఎఫ్ నుంచి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం, రుణాల చెల్లింపు, కొన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సా వ్యయాల చెల్లింపులకు, వివాహం లేదా పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్‌కు ఏడాది ముందు సందర్భాల్లో ఉపసంహరించుకోవచ్చు.
(ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!)
ఈ ప్రత్యేక సందర్భాలకు సంబంధించి ఈపీఎఫ్‌వో సభ్యుడు నిర్ణీత సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సభ్యుడు/సభ్యురాలి వివాహం కోసం లేదంటే కుమార్తె, కుమారుడు, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలంటే కనీసం ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. ఉద్యోగి వాటా కింద జమ అయి, దానికి వడ్డీ చేరగా సమకూరిన మొత్తం నుంచి 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ అవసరాల కోసం మూడు సార్లు ఉపసంహరణకు అనుమతిస్తారు.
మీరు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కనుక మీరు చేసే ఉపసంహరణలపై పన్ను ఉండదు. మీ సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారు. కనుక కనీసం ఏడేళ్ల సర్వీసు ఉండాలి. మీకు ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉంది. ఏడేళ్లు పూర్తి కాకుండా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతుంది. గతంలో మీరు కోవిడ్ సమయంలో చేసిన ఉపసంహరణ ప్రభావం తాజా ఉపసంహరణలపై ఉండదు.
ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌ను ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మార్చుకోవచ్చా..? – రాజేష్ షా
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్స్ మూడేళ్ల తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఈ లాకిన్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. ఒక సంస్థ నుంచి ఈఎల్‌ఎస్‌ఎస్ పెట్టుబడిని మరోసంస్థకు చెందిన ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లోకి మార్చుకోవాలంటే ముందుగా ఉపసంహరించుకోవాలి. మూడేళ్ల లాకిన్ పీరియడ్ వరకు ఉపసంహరించుకోలేరు.
(ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?)
మూడేళ్లు నిండిన తర్వాత అప్పుడు మీ పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవచ్చు. మీకు నచ్చిన పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్ కానీ, మరే ఇతర పన్ను ఆదా పథకాలు అయినా తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తుంటాయి. కనుక లాకిన్ సమయంలో ఉపసంహరణలను అనుమతించరు.
ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్!