Dhirendra Kumar
-
మ్యూచువల్ ఫండ్ ఎంపిక ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్‌ను దీర్ఘకాలానికి ఎంపిక చేసుకునే సమయంలో గత పనితీరుపై ఆధారపకుండా.. చూడాల్సిన ఇతర అంశాలు ఏవి? – వినుత్ రాయ్ కేవలం గత పనితీరుపైనే ఆధారపడడం తప్పుదోవలో పయనించడమే అవుతుంది. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచి్చందంటే, అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి కారణం అంతర్గతంగా అవి పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీలే. కనుక ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ చేసి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ ఉత్థాన పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గృహ రుణం, కారు రుణం, క్రెడిట్ కార్డు రుణాలున్నాయి. వీటి కోసం ప్రతి నెలా రూ.40,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రుణాలను తీర్చివేసే మార్గాన్ని చూపగలరు? – ప్రేమ్ నాయక్ రుణాలు భవిష్యత్ ఆదాయాన్ని హరించివేస్తాయి. కనుక వీలైనంత వెంటనే వాటిని వదిలించుకోవాలి. ముఖ్యంగా వీటిల్లో ఆర్థిక భారంగా మారిన రుణాన్ని మొదట తీర్చివేయాలి. ముందుగా క్రెడిట్ కార్డు రుణంతో మొదలు పెట్టండి. అధిక వడ్డీ రేటుతో ఖరీదైన రుణం ఇది. అవసరమైతే మీ పెట్టుబడుల్లో కొన్నింటిని ఉపసంహరించుకుని క్రెడిట్‌కార్డు రుణం తీర్చివేయాలి. లేదంటే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అయినా దీన్నుంచి బయటపడే మార్గాన్ని చూడండి. క్రెడిట్ కార్డ్ రుణం చెల్లించిన అనంతరం కారు రుణాన్ని తీర్చివేయడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వాహనాల విలువ స్వల్పకాలంలోనే తగ్గిపోతుంది. కనుక వీలైనంత ముందుగా ఈ రుణాన్ని కూడా తీర్చివేయాలి. గృహ రుణాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో విలువ పెరిగే ఆస్తి ఇది. పైగా గృహ రుణాలపై అన్నింటికంటే తక్కువ వడ్డీ రేటుతోపాటు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. -
కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా.. రెండు టాపప్ ప్లాన్లు తీసుకోవచ్చా?
నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నాను. రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. అంటే నా ముగ్గురు సభ్యుల కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల కవరేజీ ప్రస్తుతానికి ఉంది. రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్‌ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. దాని ప్రీమియం చాలా తక్కువ. ఇప్పుడు రూ.40 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే మొత్తం కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా? నేను రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండొచ్చా? – తన్మోయ్ పంజా టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, అంత మొత్తాన్ని పాలసీదారు భరించాల్సి ఉంటుంది. అంతకు మించిన మొత్తానికి సూపర్ టాపప్ కవరేజీ అమల్లోకి వస్తుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాలనేమీ లేదు. బేసిక్ టాపప్ ప్లాన్‌లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. కానీ, సూపర్ టాపప్ ప్లాన్‌లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం అని చెప్పుకోవాలి. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ రూ.2 లక్షల కవరేజీని ఇస్తుంటే, రూ.2 లక్షల డిడక్టబుల్‌తో రూ.5 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ ఉంటే.. ఇప్పుడు రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.10 లక్షలకు మరో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.2 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.5 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.11 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.10 లక్షలు చెల్లింపులు వస్తాయి. మిగిలిన రూ.లక్షను పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక సూపర్ టాపప్ ప్లాన్‌ను కలిగి ఉండడం సూచనీయం. మూడు బీ మా సంస్థల వద్ద క్లెయిమ్ కోసం చేయాల్సిన పేపర్ పని ప్రతిబంధకంగా మారుతుంది. కనుక కవరేజీని సాధ్యమైనంత సులభంగా ఉంచుకోవాలి. నేను 1994లో మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. అందుకు సంబంధించి భౌతిక సర్టిఫికెట్ నా వద్ద ఉంది. ఈ మొత్తాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి? వీటి విలువ ఎంత? – వచన్ 2014లో మోర్గాన్ స్టాన్లీ భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయింది. మోర్గాన్ స్టాన్లీ నిర్వహణలోని ఎనిమిది మ్యూచువల్ ఫండ్ పథకాలను హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్ హెచ్డీఎఫ్సీ లార్జ్‌క్యాప్ ఫండ్‌లో విలీనం అయింది. హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ 2009 వరకు హెచ్డీఎఫ్సీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌గా కొనసాగింది. 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన అనంతరం ఇది ఓపెన్ ఎండెడ్ పథకంగా మార్పు చెందింది. ఇప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే, హెచ్డీఎఫ్సీ అస్సె ట్ మేనేజ్మెంట్ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్‌లో మీ పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను సమరి్పంచాలి. అ ప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమైన వారి నుంచి తగిన సహకారం లభిస్తుంది. సమాధానాలు ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రిటైర్మెంట్ తరువాత పీఎఫ్ వడ్డీ ఎన్ని సంవత్సరాలు జమవుతుంది?
నా వయసు 59 ఏళ్లు. నేను పదవీ విరమణ తీసుకున్నప్పటికీ, నా పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలన్స్‌ను ఉపసంహరించుకోలేదు. అయినప్పటికీ నా పీఎఫ్ బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుందా? – నానీ పార్థీ పదవీ విరమణ అనంతరం, పీఎఫ్ ఖాతాకు వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి చందాలు జమ అవ్వకపోతే, అప్పుడు ఆ ఖాతా ఇన్ఆపరేటివ్గా మారిపోతుంది. అక్కడి నుంచి ఇక వడ్డీ జమ అవ్వడం కూడా నిలిచిపోతుంది. అంటే పదవీ విరమరణ తర్వాత మూడేళ్ల పాటే వడ్డీ జమ అవుతుంది. పదవీ విరమణ అనంతరం భవిష్యనిధి ఖాతాలోని బ్యాలన్స్‌ను పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు. ఐదేళ్లు సర్వీసు నిండిన తర్వాత ఉపసంహరించుకునే పీఎఫ్ బ్యాలన్స్ మొత్తంపై పన్ను ఉండకపోవడం అదనపు ప్రయోజనం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ బ్యాలన్స్‌ను వెనక్కి తీసుకోకపోతే, జమయ్యే వడ్డీ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. కనుక పీఎఫ్ బ్యాలన్స్‌ను ఉపసంహరించుకుని, మీ లక్ష్యాలు, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఏదైనా ఒక కంపెనీ షేరు ముఖ విలువ రూపాయి ఉంటే దాన్ని ఎలా విభజిస్తారు? వారి ముందున్న ఆప్షన్లు ఏంటి? – అరుణ్ పాలస్ మన దేశంలో ఒక షేరు కనిష్ట ముఖ విలువ రూ.1గా ఉంది. దీని ప్రకారం ఒక షేరు ముఖ విలువ రూపాయిగా ఉంటే, దాన్ని విభజించడానికి అవకాశం ఉండదు. ఒక కంపెనీ ముఖ విలువను విభజించడం వెనుక ఉద్దేశ్యం ఆయా కంపెనీ షేర్ల లిక్విడిటీని (అందుబాటు) పెంచడమే. షేరు ధరను విభజించడం వల్ల మూలధనంలో ఎలాంటి మార్పు ఉండదు. కనుక ఒక ఇన్వెస్టర్‌గా ముఖ విలువను విభజించే విషయంలో పొందే ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే, నష్టపోయేదీ ఉండదు. ఉదాహరణకు ఎక్స్‌వైజెడ్ అనే కంపెనీ షేరు మార్కెట్ ధర రూ.100 ఉందనుకుందాం. మార్కెట్లో 50,000 వేల షేర్లు ఉన్నాయి. మిస్టర్ ఏ రూ.5,000 పెట్టి ఈ కంపెనీలో 50 షేర్లను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కంపెనీ 5:1 స్టాక్ స్లి్పట్ను ప్రకటించింది. అంటే ప్రతి ఒక్క షేరు ఐదు షేర్లుగా విభజించనున్నారు. విభజన తర్వాత మిస్టర్ ఏ వద్దనున్న 50 షేర్ల స్థానంలో 250 షేర్లు జమ అవుతాయి. అప్పటి వరకు రూ.10గా ఉన్న ముఖ విలువ రూ.2గా మారుతుంది. (ఇదీ చదవండి: 7లక్షలు అప్పు చేసి కారు కొన్నా.. లోన్ త్వరగా తీర్చేందుకు ఏమైనా ఫండ్స్ ఉన్నాయా?) విభజన తర్వాత షేరు మార్కెట్ ధర కూడా రూ.100 నుంచి రూ.20కు సవరణ అవుతుంది. 250 షేర్లు, రూ.20 చొప్పున వాటి మొత్తం మార్కెట్ విలువలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఒక కంపెనీ షేరు ముఖ విలువను విభజిస్తుందా, లేదా? అన్నది ముఖ్యం కాదు. స్టాక్ ముఖ విలువ విభజన అంచనా ఆధారంగా పెట్టుబడులు పెట్టకూడదు. స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తగినంత సమయం, కృషి అవసరం. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు వ్యాపార నమూనా, ఆర్థిక మూలాలు, యాజమాన్యం సమర్థత, కార్యకలాపాలను నైతికంగా నిర్వహిస్తున్నారా? వృద్ధి అవకాశాలు, వ్యాల్యూషన్ సహేతుక స్థాయిలోనే ఉందా? పోటీ కంపెనీలతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించగలదా? తదితర అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం సూచనీయం. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా?
నేను ఒక కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాను. నా సోదరి వివాహం కోసం నా పీఎఫ్ ఫండ్‌ను వాడుకోవాలని అనుకుంటున్నాను. నా సందేహం ఏమిటంటే.. నేను కరోనా లాక్డౌన్ల సమయంలో ఒకసారి పాక్షికంగా ఉపసంహరించుకున్నాను. కనుక మరోసారి పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చా? పన్ను పడుతుందా? – వేణు ఉదత్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి రెండు సార్లు ఉపసంహరించుకోవచ్చు. పన్నుల అంశానికంటే ముందు తెలుసుకోవాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి. పలు సందర్భాల్లో పీఎఫ్ నుంచి ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం, రుణాల చెల్లింపు, కొన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సా వ్యయాల చెల్లింపులకు, వివాహం లేదా పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్కు ఏడాది ముందు సందర్భాల్లో ఉపసంహరించుకోవచ్చు. (ఇదీ చదవండి: పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!) ఈ ప్రత్యేక సందర్భాలకు సంబంధించి ఈపీఎఫ్‌వో సభ్యుడు నిర్ణీత సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు సభ్యుడు/సభ్యురాలి వివాహం కోసం లేదంటే కుమార్తె, కుమారుడు, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలంటే కనీసం ఏడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. ఉద్యోగి వాటా కింద జమ అయి, దానికి వడ్డీ చేరగా సమకూరిన మొత్తం నుంచి 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ అవసరాల కోసం మూడు సార్లు ఉపసంహరణకు అనుమతిస్తారు. మీరు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. కనుక మీరు చేసే ఉపసంహరణలపై పన్ను ఉండదు. మీ సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారు. కనుక కనీసం ఏడేళ్ల సర్వీసు ఉండాలి. మీకు ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉంది. ఏడేళ్లు పూర్తి కాకుండా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవుతుంది. గతంలో మీరు కోవిడ్ సమయంలో చేసిన ఉపసంహరణ ప్రభావం తాజా ఉపసంహరణలపై ఉండదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌ను ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకు మార్చుకోవచ్చా..? – రాజేష్ షా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ మూడేళ్ల తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఈ లాకిన్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. ఒక సంస్థ నుంచి ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడిని మరోసంస్థకు చెందిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోకి మార్చుకోవాలంటే ముందుగా ఉపసంహరించుకోవాలి. మూడేళ్ల లాకిన్ పీరియడ్ వరకు ఉపసంహరించుకోలేరు. (ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?) మూడేళ్లు నిండిన తర్వాత అప్పుడు మీ పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవచ్చు. మీకు నచ్చిన పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ కానీ, మరే ఇతర పన్ను ఆదా పథకాలు అయినా తప్పనిసరి లాకిన్ పీరియడ్‌తో వస్తుంటాయి. కనుక లాకిన్ సమయంలో ఉపసంహరణలను అనుమతించరు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! -
రూ. కోటి ఉంది, నెలకు లక్ష రూపాయలు కావాలంటే ఎలా?
నేను మరో 10 - 15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నాను. రూ.2.5 - 3 కోట్ల బడ్జెట్లో ఇల్లు కొనాలన్నది నా ఆలోచన. గృహ రుణం తీసుకునే విషయంలో నా వంతు డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకోవాలి కదా. వచ్చే 10 - 15 ఏళ్లలో గృహ రుణం డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకునేందుకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? టాటా స్మాల్ క్యాప్ లేదా, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ ఫండ్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ పథకాలు నా డౌన్ పేమెంట్‌కు అనుకూలమైనా..? – ఆదిత్య బి 10 - 15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేద్దామన్న నిర్ణయం సరైన దారిలోనే ఉంది. మీ పెట్టుబడులు వృద్ధి చెందడానికి సరిపడా సమయం మీ చేతుల్లో ఉంది. ఈ కాలంలో ఈక్విటీ పథకాల నుంచి సహేతుక రాబడులు వస్తాయని ఆశించొచ్చు. తద్వారా గృహ కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకోవచ్చు. మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొనుగోలు చేద్దామనుకుంటున్న ఇంటి బడ్జెట్ రూ.2.5 - 3 కోట్లు అని చెప్పారు కదా. ఇది నేటి ధరల ఆధారంగా అంచనా వేశారా? అయితే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. అప్పుడు 10 - 15 ఏళ్ల తర్వాత ఇల్లు కొనుగోలుకు అసలు ఎంత అవుతుందన్న వాస్తవ అంచనాకు రావడానికి ఉంటుంది. ఆ తర్వాత నెలవారీ సిప్ మొత్తాన్ని రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు ఒకటి నుంచి రెండు వరకు మిడ్, స్మాల్‌క్యాప్ పథకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే మిడ్, స్మాల్‌క్యాప్ అన్నవి మొత్తం పోర్ట్‌ఫోలియోలో 25 - 30 శాతం మించి ఉండకూడదు. మీ పోర్ట్‌ఫోలియోలో ఏ పథకాలు ఉండాలన్నది మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఈక్విటీ పెట్టుబడుల్లో మీకున్న అనుభవం కీలకంగా మారతాయి. ఇల్లు కొనుగోలు చేయడం అన్నది ఆర్థికంగా అతిపెద్ద నిర్ణయం. కనుక చాలా జాగ్రత్తగా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చాలా కేసుల్లో నివాసం ఉండేట్టు అయితే రుణంపై ఇల్లు కొనుగోలు చేయడం న్యాయమే అవుతుంది. గృహ రుణంపై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పైగా ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే రుణ బాధ్యత. అలాగే, గృహ రుణానికి మీరు చెల్లించే ఈఎంఐ అన్నది నెలవారీ నికరంగా చేతికి అందుకునే మొత్తంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. పెట్టుబడి కోణంలో అయితే రుణంపై ఇల్లు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కాబోదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ తక్కువ. కొనుగోలు, విక్రయం వేగంగా సాధ్యపడదు. డబ్బులు కావాలంటే వెంటనే అడిగిన రేటుకు విక్రయించాల్సి వస్తుంది. అధిక విలువ కలిగిన ఇంటిని అమ్మడం అంత సులభమైన విషయం కాదు. నా వయసు 59 ఏళ్లు. వచ్చే నెలలో పదవీ విరమణ తీసుకోబుతున్నాను. రిటైర్మెంట్ తర్వాత నా వద్ద రూ.కోటి నిధి ఉంటుంది. నెలవారీ ఖర్చులు రూ.లక్ష వరకు ఉంటాయి. కనుక నా వద్ద ఉండే రూ.కోటిని నెలనెలా రూ.లక్ష వచ్చేలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో సూచించగలరు. – భానుప్రకాశ్ మీరు రూ.కోటి పెట్టుబడిపై ప్రతి నెలా రూ.లక్ష ఆదాయం కోరుకుంటున్నారు. అంటే వార్షిక రాబడి 12 శాతం ఉండాలి. ఈ స్థాయి రాబడి అన్నది ఈక్విటీలలో, అదీ దీర్ఘకాలంలోనే (ఏడేళ్లకు మించి) సాధ్యపడతాయి. ఏటా ఇదే స్థాయిలో ఈక్విటీలు కూడా రాబడులు ఇస్తాయని గ్యారంటీ ఉండదు. అలాగే, ఒక ఏడాదిలో వచ్చిన రాబడులన్నింటినీ వినియోగించుకోకూడదు. మీ పెట్టుబడి నిధి ద్రవ్యోల్బణ ప్రభావం (5 - 6 శాతం) మేర ఏటా వృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడే కావాల్సినంత మొత్తం సమకూర్చుకోగలరు. ఉదాహరణకు మీ రూ.కోటి నిధి.. ఐదు, ఏడేళ్ల తర్వాత కూడా అక్కడే ఉంటే.. ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల అప్పటికి నెలవారీగా రూ.లక్ష ఆదాయం సరిపోదు. పెరిగే ధరలకు అనుగుణంగా మీకు మరింత మొత్తం ఆదాయం వచ్చేంత నిధి ఉండాలి. కనుక మీ పెట్టుబడిపై వచ్చే రాబడిలో కొంత మొత్తాన్ని అక్కడే వృద్ధి చెందేందుకు వీలుగా ఉంచేయాలి. మీ విషయంలో మీరు ఆశించే రాబడి రేటు ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించుకోండి. మీరు కోరుకున్నట్టు ప్రతి నెలా రూ.లక్ష చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే.. మీ వద్దనున్న పొదుపు నిధి కూడా తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణం అధిగమించి నిధి వృద్ధి చెందాలంటే.. పెట్టుబడి నుంచి రాబడి 6 శాతానికి మించి ఉపసంహరించుకోకూడదు. అంటే రూ.కోటి నిధిపై ఏటా రూ.6 లక్షల వరకే ఉపసంహరించుకోవాలి. పెట్టుబడి నిధిలో మూడింట ఒక వంతును ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన రెండు భాగాలకు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు (డెట్) కేటాయించుకోవాలి. ప్రభుత్వ హామీ ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీవో ఎంఐఎస్), ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎం వీవీవై) పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో పీఎం వీవీవై, ఎస్సీఎస్ఎస్ 8 శాతం రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో పీఎం వీవీవై ఈ ఏడాది మార్చితో ముగియనుంది. ఈ పథకాలకు కేటాయించుకోగా మిగిలే మొత్తాన్ని అధిక నాణ్యత కలిగిన షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎంత వరకు సురక్షితం?
ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎంత వరకు సురక్షితం? ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో ఇవి ఉండాలా? ఈక్విటీలో నగదు, ఫ్యూచర్స్ మార్కెట్లో ధరల పరంగా ఉండే వ్యత్యాసాలను అవకాశాలుగా తీసుకుని ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇవి. ఈ రూపంలోనే ఇవి రాబడులను ఆర్జిస్తుంటాయి. ఉదాహరణకు ‘ఎస్’ అనే స్టాక్ ఈక్విటీ మార్కెట్లో రూ.100 వద్ద ట్రేడవుతుందనుకుందాం. ఇదే స్టాక్ ఫ్యూచర్ మార్కెట్లో రూ.101 వద్ద ట్రేడవుతుందనుకుంటే.. ఈ సందర్భంలో ఆర్బిట్రేజ్ ఫండ్ ‘ఎస్’ స్టాక్‌ను ఈక్విటీలో రూ.100కు కొనుగోలు చేసి.. ఫ్యూచర్ మార్కెట్లో రూ.101కు విక్రయిస్తుంది. దీంతో ఒక రూపాయి లాభాన్ని సొంతం చేసుకుంటుంది. సెటిల్మెంట్ తేదీనాడు (అంటే నెల చివర్లో కాంట్రాక్టుల ముగింపు) ధర నగదు, ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కటిగా మారుతుంది. దాంతో ఆర్బిట్రేజ్ ఫండ్ అదే స్టాక్‌కు సంబంధించి మళ్లీ లావాదేవీలను పునరావృతం చేస్తుంది. ఈ సారి నగదు మార్కెట్లో విక్రయించి ఫ్యూచర్ మార్కెట్లో కొనుగోలు చేస్తుంది. దీంతో ఆయా లావాదేవీలు సమం అవుతాయి. ఒక్క విడత ఇలా చేసినట్టయితే ముందు గడించిన రూపాయి లాభం ఖాయమైనట్టే. అంతేకానీ, సెటిల్మెంట్ తేదీనాటికి ఆయా స్టాక్ ధర పెరిగిందా, తరిగిందా అన్నదానితో సంబంధం ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇదే మాదిరి లావాదేవీలు నిర్వహిస్తూ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెడుతుంటాయి. ఆర్బిట్రేజ్ అవకాశాల్లేని సమయాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులను ట్రెజరీ బిల్లులు, స్వల్పకాల డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రిస్క్‌ను పరిశీలించినట్టయితే.. చాలా తక్కువ రిస్క్‌లోనే ఇవి ఉంటాయి. కాకపోతే స్వల్ప కాలంలో మాత్రం అస్థిరతలతో ఉంటుంటాయి. కనీసం మూడు నెలలు అంతకంటే ఎక్కువ కాలం కోసం అయితే నష్టాలకు అవకాశాలు చాలా తక్కువ. అదే సమయంలో ఆర్బిట్రేజ్ ఫండ్స్ నుంచి ఎక్కువ రాబడులను ఆశించరాదు. లిక్విడ్ ఫండ్స్ స్థాయిలో రాబడులను అంచనా వేసుకోవచ్చు. అంటే రాబడులు బ్యాంకు ఖాతాల కంటే మెరుగ్గా ఉంటాయని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో మంచి రాబడులు, సంపద కోసం ఆర్బిట్రేజ్ ఫండ్స్ అనుకూలం కావు. కొన్ని నెలల నుంచి ఏడాది వరకు తమ నిధులను ఒక్కచోట ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి అనుకూలం. ముఖ్యంగా అధిక పన్ను రేటులో (30 శాతం) ఉన్న వారికి ఆర్బిట్రేజ్ ఫండ్స్ లాభదాయకం. ఎందుకంటే ఇందులో రాబడులను ఈక్విటీ రాబడులుగానే ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. అధిక పన్ను రేటులో లేని వారు, చాలా స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే లిక్విడ్ ఫండ్స్ సరిపోతాయి. ఇప్పటికైతే డివిడెండ్ ఇచ్చే మంచి మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందా?.. అలాగే కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? – రత్నాకర్ డివిడెండ్ కోసం మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం అన్నది సరైన మార్గం కాదు. ఎందుకంటే దీనివల్ల పెద్దగా రాబడి ఉండదు. ఒక షేరును కొనుగోలు చేస్తే అది మీకు డివిడెండ్ ఇస్తుంది. అది స్టాక్ ధరలో సర్దుబాటు కాదు. అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే డివిడెండ్ చెల్లింపు ప్రభావం ఫండ్ యూనిట్ ఎన్ఏవీ (నికర యూనిట్ విలువ)లో ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక పథకంలో రూ.10 ఎన్‌ఏవీపై రూ.10,000ను ఇన్వెస్ట్ చేశారనుకుందాం. తర్వాత కాలంలో అది వృద్ధి చెంది ఎన్ఏవీ కాస్తా రూ.15కు చేరితే.. మీ పెట్టుబడి విలువ రూ.15,000 అవుతుంది. ఫండ్ సంస్థ రూ.2,000ను డివిడెండ్ కింద చెల్లించాలని నిర్ణయించినట్టయితే ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. డివిడెండ్ చెల్లింపు ముగిసిన తర్వాత ఆ పథకంలో మీ పెట్టుబడి విలువ వెంటనే రూ.13,000కు తగ్గిపోతుంది. అంటే మీ పెట్టుబడుల నుంచి మీకు చెల్లింపులు చేయడం. ఫండ్స్‌లో డివిడెండ్ చెల్లింపుల విధానం ఇదే మాదిరిగా ఉంటుంది. కానీ, చాలా మంది ఫండ్స్ నుంచి వస్తున్న డివిడెండ్ పనితీరు కు నిదర్శనంగా పొరపడుతుంటారు. కానీ, స్టాక్‌లో అలా కాదు. లాభాల నుంచి డివిడెండ్ చెల్లింపులు చేయడం ఉంటుంది. ఫండ్‌ను డివిడెండ్ కోణం నుంచి ఎంపిక చేసుకోవడం సరికాదు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
నేను ప్రతి నెలా కొంత మొత్తం యాక్సిస్ బ్లూచిప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది మంచి ఫండేనా? దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? –లావణ్య, విశాఖపట్టణం యాక్సిస్ బ్లూచిప్ ఫండ్... ఆ కేటగిరీలోని అత్యుత్తమ ఫండ్స్‌లో ఒకటి. సాధారణంగా బ్లూచిప్ ఫండ్స్ అన్నీ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. గత ఐదేళ్లలో ఈ ఫండ్ సగటు రాబడి 8 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ 4 శాతం మేర నష్టపోయింది. ఇదే కాలానికి బీఎస్ఈ 100 సూచీ 11 శాతం మేర నష్టపోయింది. ఇక గత ఆర్నెల్లలో ఈ ఫండ్ ఒకింత రికవరీ అయింది. మంచి వృద్ధి అవకాశాలున్న అత్యున్నత స్థాయి నాణ్యత గల కంపెనీల్లోనే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. మార్కెట్ పుంజుకుంటే, ఈ ఫండ్ రాబడులు మరింతగా పెరుగుతాయి. ఈ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. షేర్లకు, బాండ్లకు మధ్య తేడా ఏమిటి? కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా? –ఫయాజ్, విజయవాడ కంపెనీ యాజమాన్యంలో భాగస్వామ్యంగా గల వాటాలనే షేర్లుగా పరిగణిస్తారు. స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల ట్రేడింగ్‌లో ఈ షేర్ల క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చు. సాధారణంగా ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ కోసం ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న షేర్లను కొనుగోలు చేస్తారు. షేర్ ధరల్లో వృద్ధి, బోనస్ షేర్లు, డివిడెండ్లు...తదితర ప్రయోజనాలు లభిస్తాయి. ఇక బాండ్ల జారీ ద్వారా కంపెనీ రుణాలను సమీకరిస్తుంది. ఈ బాండ్లకు కాలపరిమితి, వడ్డీరేటు ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్టులాంటిదే కంపెనీ బాండ్ కూడా. అయితే బ్యాంక్ డిపాజిట్లలాగా బాండ్లు సురక్షితమనే విషయం.. మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీపై ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా కంపెనీ ఎంత పటిష్టమో అనే విషయాన్ని బట్టే ఆ కంపెనీ బాండ్ల నష్టభయం ఆధారపడి ఉంటుంది. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న కంపెనీ తన బాండ్లపై తక్కువ వడ్డీనే ఇవ్వవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉంటాయనే ధీమానే దీనికి కారణం. ఇక ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తంగా ఉన్న కంపెనీ అధిక వడ్డీరేటును ఆఫర్ చేయవచ్చు. కానీ ఇలాంటి కంపెనీల బాండ్లకు నష్ట భయం అధికంగా ఉంటుంది. కంపెనీ ఆర్థిక స్థితిగతులను కూలంకషంగా మదింపు చేసిన తర్వాతే కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రస్తుత పరిస్థితుల్లో ‘సిప్’లు ఆపేయాలా?
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా ఉంది కదా ! ఈ నేపథ్యంలో నా సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లను వాయిదా వేద్దామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? –ప్రియాంక, హైదరాబాద్ చాలా మంది ఇన్వెస్టర్లను ప్రస్తుతం అత్యధికంగా తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, సిప్‌లను ఆపేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. సమీప భవిష్యత్తులో ఈ సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేసే సొమ్ములు మీకు అవసరం లేని పక్షంలో సిప్‌లను వాయిదా వేయాలనుకోవడం మంచి నిర్ణయం కాదు. మార్కెట్ పుంజుకొని మళ్లీ పెరగడానికి ఎంత కాలం పడుతుందో సరైన అంచనాలు లేవు. మూడు నెలలు కావచ్చు. లేదా ఏడాది పట్టవచ్చు. మార్కెట్ రికవరీకి ఇంకా ఎక్కువ కాలమే పట్టినా, ఆశ్చర్యపోవలసిన పని లేదు. మార్కెట్ రికవరీకి ఎంత కాలం పట్టినా, మీరు మీ సిప్‌లను కొనసాగిస్తే, మీకు చౌకగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభించే అవకాశాలున్నాయి. కనీసం ఐదేళ్లు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీ సిప్‌లను నిరభ్యంతరంగా కొనసాగించండి. మార్కెట్ ఇంకా పతనమవుతుందనే భయాలతో ఇప్పటికిప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను అమ్మేస్తే, మీకు నష్టాలు రావచ్చు. మార్కెట్ పడుతుంది కదా అని మీ సిప్‌లను ఆపేస్తే, చౌకలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ప్రస్తుత మార్కెట్ పతన సమయంలో మీ ఇన్వెస్ట్మెంట్స్ విలువలు బాగా తగ్గి, మీకు నిరాశను కలిగిస్తున్నా, మీరు మాత్రం మీ సిప్‌లను ఆపేయక, కొనసాగించండి. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎనిమిది నుంచి పదేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి కెనరా రొబెకొ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్‌ను ఎంచుకున్నాను. మూడేళ్ల రాబడులను పరిగణనలోకి తీసుకొని ఈ ఫండ్‌ను ఎంపిక చేశాను. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? నా దగ్గర ప్రస్తుతం రూ. లక్ష ఉన్నాయి. ఈ లక్ష రూపాయలను ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. –నరేంద్ర, విజయవాడ మీరు ఎంచుకున్న కెనరా రొబెకొ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్ మంచిదే. ఈ కేటగిరీ ఫండ్స్‌లో మంచి రాబడులు అందిస్తున్న కొన్ని ఫండ్స్‌లో ఇది కూడా ఒకటి. అయితే ఏడాది నుంచి రెండేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. స్టాక్ మార్కెట్ ఉత్థాన, పతనాలు ఈక్విటీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపుతాయి. ఈ ఫండ్ కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రస్తుతం ఈ ఫండ్ రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు. ఎనిమిది నుంచి పదేళ్ల కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ ఫండ్ మీకు మంచి రాబడులనే అందించగలుగుతుంది. మార్కెట్లో తీవ్రమైన ఒడిదుకులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మరింతగా మేలు కలుగుతుందనే చెప్పవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తాల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. మీ దగ్గర ఉన్న రూ. లక్షను కనీసం ఆరు నుంచి పన్నెండు సమభాగాలుగా విభజించి, నెలకు కొంత మొత్తం చొప్పున సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా ఇన్వెస్ట్ చేయండి. నేను 2013లో క్వాంటమ్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. 2016లో ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రిడీమ్ చేసుకున్నాను. మంచి రాబడులే వచ్చాయి. ఇప్పుడు చూస్తే, ఆ ఫండ్ రాబడులు ఏమంత సంతృప్తికరంగా లేవు. ఎందుకిలా ? –శివరాం, నల్లగొండ రాబడులు కాలాన్ని బట్టి, స్టాక్ మార్కెట్ గమనాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 2016లో మంచి రాబడులు ఇచ్చిన క్యాంటమ్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఇప్పుడు అంతంత మాత్రం రాబడులిస్తోంది. మరో మూడేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. మూడేళ్ల కాలానికే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవద్దు. కనీసం ఐదేళ్లు, అంతకు మించిన కాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. -ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్స్‌లో ఏ ప్లాన్ ఎంచుకోవాలి?
నాకు రెండేళ్ల కూతురు ఉంది. తనను మంచి చదువులు చదివించాలన్న ఆలోచనతో స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇది సరైన నిర్ణయమేనా? –అనిత, విశాఖపట్టణం మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదు. ఆరంభంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. దీంతో మొదటిసారిగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు బెంబేలు పడతారు. ఫండ్సంటే భయపడేలా నష్టాలూ రావచ్చు. మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి కనీసం రెండేళ్లు అయితే, వాటి పనితీరుపై మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉండాలి. అందుకని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. మార్కెట్ పతన బాటలో ఉన్నా, ఈ సమయంలో వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నా, కొండొకచో నష్టాలు వచ్చినా అధైర్యపడకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఏదైనా హైబ్రిడ్ లేదా మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందలేరు. అందుకని స్మాల్ క్యాప్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్లంతా సదా అప్రమత్తంగా ఉండాలి. స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు ఇప్పడున్నట్లుగానే మరో రెండేళ్ల తర్వాతో, మూడేళ్ల తర్వాతో అలాగే ఉంటుందనుకోకూడదు. స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరు బాగా ఉంది కదాని చాలా మంది ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. అప్పుడు ఈ ఫండ్‌లోకి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వచ్చి చేరడం మొదలవుతుంది. అప్పుడు ఈ స్మాల్‌క్యాప్ ఫండ్ మేనేజర్‌కు ఈ నిధులను మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఆశించిన స్థాయిలో ఫండ్స్ పనితీరు ఉండకపోవచ్చు. మొత్తం మీద స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేసే ఇన్వెస్టర్లు రెండు ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది మార్కెట్ ఎలా ఉన్నా, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం. ఇక రెండవది కనీసం, ఆరు నెలల కొకసారైనా, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును జాగ్రత్తగా మదింపు చేయడం. ఇక డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందడం కోసం మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం ఒక్క మల్టీ క్యాప్ ఫండ్‌నైనా చేర్చుకోండి. నేను మ్యూచువల్ ఫండ్స్‌ల్లో నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే వీటిల్లో మూడు రకాలైన ప్లాన్లు ఉంటాయని తెలిసింది. డివిడెండ్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్, గ్రోత్ ప్లాన్లు–ఈ మూడింటితో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? –అన్వర్ పాషా, కరీంనగర్ ఈ మూడు ప్లాన్‌ల్లో గ్రోత్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఒక ఇన్వెస్టర్‌కు డివిడెండ్, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు సరైనవి కావని చెప్పవచ్చు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌పై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) విధించినప్పటి నుంచి చూస్తే, గ్రోత్ ప్లాన్లే మిగిలిన రెండు ప్లాన్ల కన్నా మెరుగైనవి అని చెప్పవచ్చు. డెట్ ఫండ్స్ విషయంలోనూ గ్రోత్ ప్లాన్లనే ఎంచుకోవడం మంచిది. వీటిల్లో ఇన్వెస్ట్ చేసి, కొంత కాలం తర్వాత సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. పైగా ఎస్‌డబ్ల్యూపీని పాటించడం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇక ఈక్విటీ ఫండ్స్ విషయానికొస్తే, గ్రోత్ ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల, మీపై డీడీటీ భారం ఏమాత్రం పడదు. నా వయస్సు 42 సంవత్సరాలు. నాకు ఐదేళ్ల పాప ఉంది. తన ఉన్నత చదువుల నిమిత్తం రూ.60 లక్షలు అవసరమవుతాయని అంచనా. తనకు 18 ఏళ్ల వచ్చేటప్పటి నుంచి ఈ డబ్బులు అవసరం అవుతాయి. నా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎలా ఉండాలి? –సుధీర్, హైదరాబాద్ ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే, పిల్లల ఉన్నత చదువుల కోసం కనిష్టంగా రూ.20 లక్షలు, గరిష్టంగా రూ.20 కోట్లు అవసరమవుతాయని అంచనా. మీ పాప ఉన్నత చదువుల కోసం రూ.60 లక్షల మేర అవసరమవుతాయని మీరు అంచనా వేయడం సరైనదే. ఈ డబ్బులు పొందడానికి మీకు 13 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి మీరు మదుపు చేయడానికి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఎంత వీలైతే అంత ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. గత 15–20 ఏళ్లలో చదువులకు సబంధించిన ఖర్చులు బాగా పెరిగాయి. రానున్న 10–15 ఏళ్లలో ఈ వ్యయాలు ఈ స్థాయిలో పెరగకపోయినా, బాగానే పెరిగే అవకాశాలున్నాయి. ఈక్విటీ ఫండ్స్ వార్షిక రాబడులు గత కొంత కాలంగా 18–20 శాతం రేంజ్లో ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే 12 శాతం రాబడిని ఆశించడం సమంజసమేనని చెప్పవచ్చు. అందుకని ఈక్విటీ ఫండ్స్‌లో ఎంత వీలైతే అంత ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. మీకు మరో పదమూడేళ్ల తర్వాత ఈ సొమ్ములు అవసరం కాబట్టి, పదేళ్ల తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ల్లో మదుపు చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత భాగాన్ని స్థిరాదాయ సాధనాల్లోకి బదిలీ చేయండి. ఇలా చేయడం వల్ల అప్పటి(మీరు మీ మదుపును విత్‌డ్రా చేసేకునే సమయం నాటి) మార్కెట్ స్థితిగతుల ప్రభావం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వేల్యూ ఫండ్స్‌ను కొనసాగించవచ్చా?
నేను సీనియర్ సిటిజెన్‌ను. గత ఏడాది కాలం నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)మార్గంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో టాటా డిజిటల్ ఇండియా ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫండ్, యాక్సిస్ బ్లూచిప్ ఫండ్లు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొనసాగించదగ్గ ఫండ్స్ ఏవి? –రవీందర్, కాకినాడ మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మొత్తం ఐదు ఫండ్స్‌ల్లో నాలుగు ఫండ్స్ టెక్నాలజీ ఫండ్సే ఉన్నాయి. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందాలంటే పోర్ట్‌ఫోలియోలో ఒక టెక్నాలజీ ఫండ్ ఉంటే సరిపోతుంది. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో ఏకంగా నాలుగు టెక్నాలజీ ఫండ్స్ ఉన్నాయి. ఇది సరైన ఇన్వెస్ట్మెంట్ వ్యూహం కాదు. ముఖ్యంగా మీలాంటి సీనియర్ సిటిజన్‌కు ఇది పూర్తిగా సరైనది కాదు. మీలాంటి వాళ్లకు నిలకడైన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. దీని కోసం హైబ్రిడ్ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్ ఫండ్‌ను గానీ ఎంచుకోవాలి. అయితే గత రెండేళ్లుగా టెక్నాలజీ/డిజిటల్ ఫండ్స్ మంచి రాబడులను ఇచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇతర ఫండ్స్‌తో పోల్చితే టెక్నాలజీ ఫండ్సే మెరుగని అనిపిస్తూ ఉండొచ్చు. ఈ విషయంలో ఇప్పుడు మీరు అదృష్టవంతులు. అలాగని ఎప్పుడూ ఇదే అదృష్టం కొనసాగుతుందని చెప్పలేం. అందుకని నాలుగు టెక్నాలజీ ఫండ్స్‌ను ఒకటికి తగ్గించుకోండి. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్‌ను కొనసాగించవచ్చు. మరో హైబ్రిడ్ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్ ఫండ్‌ను గానీ మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోండి. నేను రిటైరవ్వడానికి మరో 13 ఏళ్ల సమయం ఉంది. రిటైర్మెంట్ అవసరాల కోసం కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో ఐదు మల్టీ–క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రెండు వేల్యూ ఫండ్స్–క్వాంటమ్ ఇండియా వేల్యూ ఫండ్, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్స్ కూడా ఉన్నాయి. మల్టీ క్యాప్ ఫండ్స్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నా, ఈ వేల్యూ ఫండ్స్ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించవచ్చా ? –సుచిత్ర, హైదరాబాద్ మీరు రిటైరవ్వడానికి మరో 13 సంవత్సరాల సమయం ఉంది. అంటే మీరు మరో 13 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలరు. కాబట్టి ఈ వేల్యూ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించవచ్చు. ఈ ఫండ్స్ పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉండొచ్చు కానీ మరీ తీసికట్టుగా ఏమీ లేదనే చెప్పవచ్చు. ఈ ఫండ్స్‌ల్లో 13 ఏళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తే, కనీసం రెండు మార్కెట్ సైకిల్స్‌ను ఈ ఫండ్స్ చూస్తాయి. ఈ కాలంలో ఈ ఫండ్స్ పనితీరు మెరుగు పడే అవకాశాలే చాలా అధికంగా ఉన్నాయి. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఫండ్స్ మరీ అంతగా నష్టపోకుండా ఉండటం, మీ పోర్ట్‌ఫోలియోకు ఒకింత స్థిరత్వం ఇచ్చి ఉండటం మీరు గమనించే ఉండాలి. మల్టీ క్యాప్ ఫండ్స్‌తో పాటు వేల్యూ ఫండ్స్ ఉండటం వల్ల మీ పోర్ట్‌ఫోలియో.. డైవర్సిఫికేషన్ పరంగా చూస్తే, మంచి స్థితిలోనే ఉందని చెప్పవచ్చు. ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు ఒకింత నిరాశమయంగా ఉన్నప్పటికీ, 13 ఏళ్ల కాలంలో ఈ ఫండ్ పుంజుకొని మంచి రాబడులు ఇచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మరోవైపు ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో పటిష్టంగానే ఉంది. నాణ్యత గల షేర్లే ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ వేల్యూ ఫండ్స్‌ల్లో మీ సిప్‌లను కొనసాగించండి. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కదా ! వివిధ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ యా రంగాల్లోని రిస్క్‌లు ఆయా కంపెనీలపై బాగానే ప్రభావం చూపుతాయి కదా! అలాంటప్పుడు ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా ? అసలు ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి? –జావేద్, విజయవాడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే ఒక ఫండ్ ఏ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిందనే విషయం ప్రధానాంశంగా ఫండ్స్‌కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో ఒక ఫండ్ పనితీరు ఎలా ఉంది అనే విషయాన్నే పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్ పెరుగుతున్నప్పుడు, అలాగే మార్కెట్ పతన బాటలో ఉన్నప్పుడూ సదరు ఫండ్ పనితీరు ఎలా ఉంది అనే విషయం కీలకం. అలాగే సదరు ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? దీర్ఘకాలం పాటు అతని పనితీరు సవ్యంగానే ఉందా ?అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా ఈక్విటీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలు దాదాపు ఒకేలాగా ఉన్నప్పటికీ, వాటి రాబడుల్లో మాత్రం తేడా ఉండొచ్చు. అందుకని ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సదరు ఫండ్ పోర్ట్‌ఫోలియోనే కీలకంగా చూడకూడదు. ఆ ఫండ్ పనితీరును కూడా మదింపు చేయాలి. -
నష్టాలొస్తున్నాయి.. సిప్‌లు ఆపేయాలా?
నేను 2017 నుంచి కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో సుందరమ్ రూరల్ అండ్ కంజప్షన్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్–క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా వేల్యూ ఫండ్, టాటా ఈక్విటీ పీఈ ఫండ్లు ఉన్నాయి. ఈ ఫండ్స్‌లో 2017 నుంచి సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లు ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్ నష్టాలు చూపడంతో 2018లో సిప్‌లు ఆపేశాను. ఈ ఏడాది కూడా ఈ ఫండ్స్ నష్టాల్లోనే ఉన్నాయి. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా ? లేకుంటే నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌కు మళ్లించమంటారా ? –కళ్యాణి, విజయవాడ మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నవన్నీ మంచి ఫండ్సే, పైగా ఇది మంచి కాంబినేషన్ కూడా. ఒక్కొక్క ఫండ్ది ఒక్కొక్క ప్రత్యేకమైన థీమ్. సుందరమ్ రూరల్ అండ్ కంజప్షన్ ఫండ్.. ప్రామిసింగ్ సెక్టోరియల్ ఫండ్. సాధారణంగా సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవద్దని చెప్తుంటాను. కానీ సుందరమ్ ఫండ్ దానికి మినహాయింపు. 2017లో మార్కెట్ మంచి స్థాయిలో ఉంది. ఇలాంటప్పుడు ఫండ్స్ పనితీరు బాగా ఉంటుంది. 2018లో మార్కెట్ అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా దాదాపు ఫండ్స్ అన్నీ ఆశించిన స్థాయి పనితీరు కనబరచలేకపోయాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. మీరు ఎంచుకున్న ఫండ్స్ బాగా ఉన్నాయి. వీటన్నింటి పనితీరు పూర్తిగా మార్కెట్ పనితీరును బట్టే ఉంటుంది. అందుకే ఇప్పుడు నష్టాలు కనిపిస్తున్నాయి. నష్టాలు వస్తున్నా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిప్ల రూపంలో కొనసాగించండి. మార్కెట్లో పరిస్థితులు కుదుటపడితే, ఈ ఫండ్స్ మీకు లాభాలను చూపిస్తాయి. అసలు సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న పరమార్థం కూడా ఇదే. మార్కెట్ పెరుగుతున్నప్పుడే కాకుండా మార్కెట్ పతనబాటలో ఉన్నప్పుడు కూడా అధైర్యపడకుండా ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందగలరు. ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లిక్విడ్ ఫండ్స్‌కు మధ్య తేడా ఏమిటి? వేటిల్లో రాబడులు అధికంగా వస్తాయి.? –దామోదర్, విశాఖపట్టణం ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లిక్విడ్ ఫండ్స్‌లు రెండు వేర్వేరు రకాలు. వీటి మధ్య చాలా సన్నని విభజన రేఖ మాత్రమే ఉంటుంది. చట్ట ప్రకారం, లిక్విడ్ ఫండ్... 91 రోజుల మెచ్యురిటీ ఉండే మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది లిక్విడ్ ఫండ్ మేనేజర్లు 55 రోజుల నుంచి 60 రోజుల మెచ్యురిటీ ఉండే మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు మూడు నుంచి ఆరు వారాల మెచ్యూరిటీ ఉండే సాధనాల్లో ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక తాజా సెబీ నిబంధనల ప్రకారం, లిక్విడ్ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 20 శాతం వరకూ నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల వంటి లిక్విడ్ అసెట్స్ల్లో ఇన్వెస్ట్ చేయాలి. డిజైన్ పరంగా చూస్తే, ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ కంటే లిక్విడ్ ఫండ్స్ ఒకింత సురక్షితమనైవని చెప్పవచ్చు. తాజా సెబీ నిబంధనల కారణంగా లిక్విడ్ ఫండ్స్ మరింత సురక్షితంగా మారాయి. ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్‌తో పోల్చితే లిక్విడ్ ఫండ్స్ రాబడులు ఒకింత తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మదుపు మొదలు పెట్టడానికి ముందుగా మ్యూచువల్ ఫండ్స్‌నే పరిగణించాలా? నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేయకూడదా? –అబ్దుల్లా, హైదరాబాద్ మదుపు మొదలు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాలంలో ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయి. ఇక నేరుగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయి. తగిన అనుభవం, అవగాహన లేకపోతే నష్టాలు వస్తాయి. ఇన్వెస్ట్ చేయడానికి ఏ షేర్‌ను ఎంచుకోవాలి ? ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ? తదితర అంశాలపై సాధారణ ఇన్వెస్టర్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌కు అధిక అవగాహన ఉంటుంది. మార్కెట్ సంబంధిత సాధనాల్లో గతంలో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేకుంటే, ముందుగా మ్యూచువల్ ఫండ్స్‌నే ఇన్వెస్ట్మెంట్స్ కోసం పరిగణించండి. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే, ముఖ్యంగా రెండు ప్రయోజనాలు లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. ఫండ్ మేనేజర్లు ప్రొఫెషనల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారి అనుభవం మంచి ఫలితాలనిస్తుంది. ఇక రెండవది...మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేసే వీలుంటుంది. మీరు కనీసం నెలకు రూ.1,000తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మొదలు పెట్టవచ్చు. కనీసం ఐదు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్‌కు మించిన ఇన్వెస్ట్మెంట్ సాధనం మరొకటి లేదు. ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. మీకు జీతం పెరిగినా, ఇంక్రిమెంట్ వచ్చినా ఈ పెరిగిన మొత్తంలో కొంత మొత్తాన్ని సిప్‌లకు జత చేయండి. ఒకవేళ మీరు స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేస్తున్నట్లయితే, ఏడాదికి సిప్ మొత్తాన్ని కనీసం 5–10 శాతం చొప్పున పెంచండి. కనీసం ఏడాదికొకసారైనా మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్ల పనితీరును సమీక్షించి, వాటి పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. -
డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి మూలధన లాభాలపై పన్నులు ఎలా ఉంటాయో కొంత వరకూ అవగాహన ఉంది. అయితే పాక్షికంగా విత్‌డ్రాయల్స్ విషయంలో పన్నులు ఎలా ఉంటాయి ? – అనురాధ, హైదరాబాద్ మీరు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసి కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేశారు. దీంట్లో కొంత భాగాన్ని విక్రయించారనుకుందాం. మీరు యూనిట్లు కొనుగోలు చేసిన తేదీ, యూనిట్లను విక్రయించిన తేదీలను పరిగణనలోకి తీసుకొని మీకు వచ్చిన లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాలా ? స్వల్ప కాలిక మూలధన లాభాలా అనే విషయాన్ని నిర్దారిస్తారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్(ఎఫ్‌ఐఎఫ్‌ఓ) సూత్రాన్ని ఇక్కడ అన్వయిస్తారు. మొదటగా కొనుగోలు చేసిన దాన్ని మొదటగా రిడీమ్ చేసినట్లుగా భావిస్తారు. ఉదాహరణకు మీరు ఒక ఈక్విటీ ఫండ్‌లో రూ.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఈ ఫండ్‌లో కొన్నేళ్లుగా ఇన్వెస్ట్ చేశారనుకుందాం. దీంట్లోంచి రూ. లక్ష మేర యూనిట్లను విక్రయించాలనుకున్నారనుకుందాం. వెయ్యి యూనిట్లను విక్రయించి రూ. లక్ష రిడీమ్ చేశారనుకుందాం. అన్నింటి కంటే ముందుగా కొన్న యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ముందు కొన్న యూనిట్లను ముందుగా రిడీమ్(విక్రయించినట్లుగా) చేసినట్లుగా భావిస్తారు. మీరు విక్రయించిన యూనిట్లలో ఏడాది క్రితం కొన్నవి కొన్ని, ఏడాది లోపల కొన్నవి కొన్ని ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి రావచ్చు. ప్ర: నేను మరో ఐదేళ్లలో రిటైర్ కాబోతున్నాను. రిటైర్మెంట్ అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాను. రిటైరైన తర్వాత మొదటి ఐదేళ్ల ఖర్చుల నిమిత్తం ఈ రిటైర్మెంట్ నిధి నుంచి కొంత మొత్తాన్ని డెట్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇటీవలి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎపిసోడ్ నేపథ్యంలో డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమేనా ? ఇప్పుడు నేను ఏం చేయాలి ? –ఈశ్వర్, విశాఖపట్టణం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎపిసోడ్ నేపథ్యంలో డెట్ ఫండ్స్ పట్ల మీకే కాదు చాలా మందికి సంశయాలు ఏర్పడ్డ విషయం వాస్తవమే. అయితే ఈ భయాల నుంచి వీలైనంత త్వరగా బైటకు రండి. అలా చేయకపోతే, మీరు డెట్ ఫండ్స్ అందించే మంచి ప్రయోజనాలు మిస్ చేసుకున్నవారవుతారు. కొత్తగా వచ్చిన సైడ్–పాకెటింగ్ రూల్స్(మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన ఏవైనా కంపెనీలు చెల్లింపుల్లో విఫలమైనా, ఆ తర్వాత రికవరీ చేసుకొని, ఆ రికవరీని ఇన్వెస్టర్లకు అందించడం(ఈ ఇన్వెస్టర్లు యూనిట్లను విక్రయించినా సరే, భవిష్యత్తులో వారికి ఆ మొత్తాన్ని అందించే వెసులుబాటు ఈ సైడ్ పాకెటింగ్ రూల్స్‌లో ఉన్నాయి) కారణంగా జరగరానిది ఏదైనా జరిగినా, మీ డబ్బులు పూర్తిగా రికవరీ అయ్యే అవకాశాలున్నాయి. డెట్ ఫండ్స్ పట్ల మీకు ఇప్పుడు సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఒక విభిన్నమైన వ్యూహాన్ని సూచిస్తున్నాను. మీరు రిటైరైన తర్వాత మూడున్నరేళ్లకు కావలసిన మొత్తం ఖర్చులు ఎంతో లెక్కేయ్యండి. ఈ మొత్తాన్ని సేవింగ్స్ లింక్డ్ డిపాజిట్ ఖాతాలో డిపాజిట్ చేయండి. బాండ్ల ఫండ్ల కన్నా ఈ ఖాతాలో రెండు నుంచి రెండున్నర శాతం తక్కువ రాబడులు వస్తాయి. అయితే మీరు ఈ సొమ్ములను ఎప్పుడు అవసరమైతే, అప్పుడు సులభంగా తీసుకోవచ్చు. ఆ తర్వాతి నాలుగేళ్ల కాలానికి అవసరమైన సొమ్ములను మంచి క్వాలిటీ ఉన్న డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇక మిగిలిన మొత్తాన్ని ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ప్ర: నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపి రూ. కోటి దాటాయి. ఈ మొత్తాన్ని సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో రిడీమ్ చేసుకుందామనుకుంటున్నాను. ఎంత కాలంలో నేను ఈ డబ్బులను వెనక్కి తీసుకోవాలి ? ఈ విషయంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. –రాజేశ్, విజయవాడ ఏదైనా ఆర్థిక లక్ష్యం(ఇల్లు కొనుగోలు చేయడం, పిల్లల ఉన్నత చదువులు, తదితరాలు) కోసం మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే, ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఉపసంహరణ ప్రణాళిక (విత్‌డ్రాయల్ ప్లాన్)ఉండాలి. అలా కాకుండా కోటి రూపాయల నిధి ఏర్పాటు చేసుకోవడమే మీ లక్ష్యమైతే, మీ అవసరాలకు అనుగుణంగా విత్‌డ్రాయల్ ప్లాన్ ఉండాలి. ఈ డబ్బులు మీకు తక్షణం అవసరం లేని పక్షంలో ఈ మొత్తాన్ని ఫిక్స్డ్–ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే 30–50 శాతం మొత్తాన్ని ఫిక్స్డ్–ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తన్నా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా కొనుగోలు నిమిత్తమో, లేదా వినియోగం నిమిత్తమే ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేశారనుకోండి. దానికి తగ్గట్లుగా మీ ఉపసంహరణ ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు మీ పాప/ బాబు ఉన్నత విద్యావసరాలకు రూ.50 లక్షలు అవసరమవుతాయనుకుందాం. మొదటి ఏడాది రూ.12.5 లక్షలు అవసరమనుకోండి. ఈ సొమ్ములు అవసరమయ్యే ఒక ఏడాదికి ముందే రూ.50 లక్షల మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన రూ.50 లక్షల మొత్తాన్ని 12–18 నెలల కాలంలో సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)రూపంలో బదిలీ చేయండి. దీంతో మీ కోటి రూపాÆయలకు మార్కెట్ రిస్క్ ఉండదు. ఒకవేళ ఇప్పట్లో మీకు ఈ డబ్బులు అవసరం లేని పక్షంలో ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మరిన్ని రాబడులు వస్తాయి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మ్యూచువల్ ఫండ్స్‌పై ఎన్నికల ప్రభావం ఎంత?
త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని మిత్రులంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రానున్న మూడేళ్లలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ పనితీరు ఎలా ఉండబోతోంది ? –సాగర్, హైదరాబాద్ ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే.. స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఒక పూర్తి కాలపు మార్కెట్ సైకిల్లో మంచి రాబడులే సాధిస్తాయి. మార్కెట్ పతన సమయాల్లో మాత్రం తీవ్రమైన నిరాశకు గురి చేస్తాయి. దీర్ఘకాలం దృష్ట్యా చూస్తే, స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ మంచి రాబడులేనిస్తాయి. భారత్ లాంటి దేశంలో చిన్న, మద్య తరహా కంపెనీలు ఎదగడానికి, లాభాలు ఆర్జించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే రిస్క్ కూడా అధికంగానే ఉంటుంది. త్వరలో ఎన్నికలు రానుండడం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు, రానున్న మూడేళ్లలో ఎలా ఉంటాయి అనే అంశాలను పక్కన పెట్టండి. సాధారణంగా ఒక మార్కెట్ ఫుల్ సైకిల్ మూడు నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. ఈ పూర్తి మార్కెట్ సైకిల్లో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్ మంచి రాబడులే ఇస్తాయి. కాబట్టి ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలిగి, ఒడిదుడుకులను ఎదుర్కొనగలిగితే స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయోచ్చు. నేను గత ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఏ కేటగిరీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి ? ఈ విషయంలో గమనంలోకి తీసుకోవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా ? –ప్రియ దర్శిని, విశాఖపట్టణం ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనేది కొన్ని కీలకమైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలు ఏంటి ?, మీరు ఎంత మేర పెట్టుబడులు పెట్టగలరు?, ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ?, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీకున్న అనుభవం.. ఇలాంటి విషయాలను బట్టి ఎలాంటి కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవచ్చు. మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, పన్ను ఆదా మీ ఆర్థిక లక్ష్యాల్లో ఒకటైతే, మీరు ట్యాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి. మీరు స్వల్పకాలమే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, లిక్విడ్ ఫండ్స్‌ను గాని ఆల్ట్రా–షార్ట్ డ్యురేషన్ ఫండ్‌ను ఎంచుకోవాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదటిసారైతే, మొదటగా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్‌తో మొదలు పెట్టాలి. మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మార్కెట్ పట్ల కొంచెం అవగాహన ఉండి ఉంటే, మల్టీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 28 సంవత్సరాలు. పన్ను మినహాయింపులకు సంబంధించి సెక్షన్ 80సీ పరిమితి అయిపోయింది. అదనపు పన్ను ప్రయోజనాల కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేకుంటే దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కేటాయించే సొమ్ములను రెగ్యులర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సలహా ఇవ్వండి. – యూనస్, విజయవాడ అదనపు పన్ను ప్రయోజనాల కోసం ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. ఈ ఇన్వెస్ట్మెంట్ మీ ట్యాక్స్ స్లాబ్‌ను తగ్గించగలిగేటట్లు ఉంటే, ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే నిర్ణయమే సరైనదే. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఎన్‌పీఎస్‌లో రూ.50,000 వరకూ ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద అదనంగా ఈ మొత్తానికి పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. గతంలో కంటే ఇప్పుడు ఎన్పీఎస్ మరింత ఆకర్షణీయంగా మారింది. రానున్న కాలంలో మరింత ఆకర్షణీయంగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) విధించడంతో ఈక్విటీల ఆకర్షణ ఒకింత తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు ఎన్పీఎస్ రెండు అంశాల్లో మెరుగుపడింది. మొదటిది మీరు రిటైరైన తర్వాత ఎన్‌పీఎస్‌లో పోగుపడిన మొత్తంలో మీరు విత్‌డ్రా చేసుకునే 60 శాతం మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. రెండోది ఈక్విటీ కేటాయింపులకు సంబంధించిన గరిష్ట పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచడం, ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, మీరు ఎన్‌పీఎస్‌లోనే ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో పదికి పైగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ సంఖ్యను 5కు తగ్గిద్దామనుకుంటున్నాను. పాత ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొత్తగా ఐదు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని, వాటికి బదిలీ చేద్దామనుకుంటున్నాను. ఒకేసారి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయమంటారా? లేక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను అనుసరించమంటారా? – జాన్సన్, నెల్లూరు సాధారణంగా ఒక ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో ఐదు నుంచి ఏడు మ్యూచువల్ ఫండ్స్ ఉంటే సరిపోతుంది. డైవర్సిఫికేషన్ ప్రయోజనాల కోసం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, మల్టీక్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ సమ్మేళనంగా మీ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. పోర్ట్‌ఫోలియో పునర్వ్యస్థీకరణలో భాగంగా పాత ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొత్త ఫండ్స్‌లోకి బదిలీ చేయడం కంటే, మీ పోర్ట్‌ఫోలియోలోనే సర్దుబాటు చేసే అవకాశాన్నీ పరిశీలించండి. మంచి రాబడులు లేని ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మంచి రాబడలు వచ్చే ఫండ్స్‌కు మళ్లించండి. ఒక వేళ మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్అన్ని సంతృప్తికరమైన రాబడులు ఇవ్వలేని పక్షంలో అన్ని కొత్త ఫండ్స్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయండి. దీనికి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) విధానాన్ని అనుసరించండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అమెరికాను బట్టి అంచనా వేయొద్దు!
బాండ్ ఫండ్స్ పనితీరు గత ఏడాది కాలంలో సంతృప్తికరంగా లేదు. బాండ్ల రాబడులు పెరగడం వల్ల ఈ బాండ్ ఫండ్స్ ఎలాంటి రాబడులనివ్వలేదు. కొన్నైతే నష్టాలనూ ఇచ్చాయి. ఇప్పుడైతే అమెరికాలో బాండ్ల రాబడులు స్థిరంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో భారత్‌లో కూడా బాండ్ల రాబడులు స్థిరత్వాన్ని పొందుతాయా? ఇప్పుడు బాండ్ల ఫండ్లు మంచి రాబడులనిచ్చే అవకాశాలున్నాయా? – వినయ్, హైదరాబాద్ సాధారణంగా ఇన్వెస్టర్లు ఆదాయం ఖచ్చితంగా వస్తుందనే అంచనాలుంటేనే బాండ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక ఈ ఏడాది అన్ని బాండ్ల ఫండ్లు నెగిటివ్ రాబడులిచ్చాయనేది నిజం కాదు. దీర్ఘకాల బాండ్ ఫండ్స్ మాత్రమే నష్టాలనిచ్చాయి. వడ్డీరేట్లు తగ్గుతాయేమోనని అందరూ అంచనాలు వేశారు. కానీ ఈ అంచనాలకు భిన్నంగా వడ్డీ రేట్లు పెరిగాయి. బాండ్ ఫండ్ల రాబడులు వడ్డీరేట్లకు విలోమంగా ఉంటాయి. అంటే వడ్డీరేట్లు తగ్గితే బాండ్ ఫండ్ల రాబడులు పెరుగుతాయి. వడ్డీరేట్లు పెరిగితే బాండ్ ఫండ్ల రాబడులు తగ్గుతాయి. అమెరికాలో బాండ్ల రాబడులు స్థిరంగా ఉన్నాయని, మన మార్కెట్లోనూ అలాంటి పరిస్థితే ఉంటుందని అంచనా వేయకూడదు. విదేశీ మార్కెట్ల ప్రభావం మనపై పెద్దగా ఉండదు. ద్రవ్యోల్బణం, నగదు సరఫరా తదితర అంశాలపై బాండ్ ఫండ్ల రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆర్బీఐ తీసుకునే నిర్ణయాన్ని బట్టి బాండ్ ఫండ్స్ రాబడులను అంచనా వేయొచ్చు. ఆ దృష్ట్యా చూస్తే, బాండ్ ఫండ్ల విషయంలో ఒక తటస్థ పరిస్థితి ఉత్పన్నమవ్వగలదని తెలుస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలున్నాయి. దీంతో బాండ్ల ఫండ్లకు ప్రయోజనం చేకూరుతుంది. బాండ్ల ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు స్థిరత్వం కలుగుతుంది. ఒకవేళ నష్టాలు రావడం సంభవించినా, మన పెట్టుబడి పెద్ద స్థాయిలో హరించుకుపోయే ప్రమాదం ఉండకపోవచ్చు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీల వల్ల తలెత్తిన సంక్షోభం కారణంగా ఇటీవల కొన్ని లిక్విడ్, బాండ్ ఫండ్లకు నష్టాలు వచ్చాయి. ఇది తాత్కాలికమే. ఇది వడ్డీరేట్లపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. నా పోర్ట్‌ఫోలియోలో 10–15 వరకూ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఏ ఫండ్ ఏ రేంజ్లో ఎంత రాబడులు ఇచ్చిందో నాకు అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి ? –ఖదీర్, విజయవాడ దీనికి ఒకటే పరిష్కారం. మీ పోర్ట్‌ఫోలియోను ప్రక్షాళన చేయండి. మీ పోర్ట్‌ఫోలియోలో 4–5 మంచి ఫండ్స్‌ను మాత్రమే ఉంచుకోండి. మీ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏడాది దాటితే, ఆ ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, వాటికి ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇలా ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండని, పనితీరు సరిగ్గా లేని, అంతంత మాత్రం పనితీరు ఉన్న ఫండ్స్‌ను, ఒకే పోర్ట్‌ఫోలియో ఉన్న ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోండి. మీ పోర్ట్‌ఫోలియోలో 4–5 మంచి మల్టీక్యాప్ ఫండ్స్ ఉండేలా చూసుకోండి. ఈ 4–5 మల్టీ క్యాప్ ఫండ్స్ డైవర్సిఫైడ్‌గా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న కోరికను అదుపులో పెట్టుకోండి. నేను సీనియర్ సిటిజన్‌ను. అమెరికా షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చా? లేక అమెరికా, యూరప్ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే భారత మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే, అలాంటి వాటిల్లో కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి? – ఆనంద రావు, విశాఖపట్టణం విదేశీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భారతీయులకు రెండు, మూడు మార్గాలున్నాయి. భారతీయులెవరైనా సరే 2 లక్షల డాలర్ల వరకూ అమెరికా షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. అమెరికా షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి సలహా, సహకారాలు అందించే స్టాక్ బ్రోకర్లు ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా విదేశీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా మీరు ఇన్వెస్ట్ చేయడానికి మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ ఫండ్‌ను పరిశీలించవచ్చు. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ 20 శాతం వరకూ రాబ డినిచ్చింది. ఈ ఫండ్ ఆరంభమై... ఏడేళ్లు. ఈ ఏడేళ్లలో కూడా ఈ ఫండ్ మంచి రాబడులనే ఇచ్చింది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి మరికొన్ని ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. అవి ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, రిలయన్స్ యూఎస్ ఈక్విటీ అపర్చునిటీస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్. కొన్ని ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో 65 శాతం వరకూ భారత షేర్లలో, మిగిలిన 35 శాతం వరకూ ఇతర దేశాల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇలాంటి ఫండ్లలో పరాగ్ పరిఖ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్ తన నిధుల్లో 30 శాతం వరకూ అమెరికా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. ఒక పూర్తి మార్కెట్ సైకిల్ కాలంలో ఈ ఫండ్ మంచి రాబడులనే ఇచ్చింది. ఈ ఫండ్‌లో డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు బాగా ఉన్నాయి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
బైక్ కోసం... ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి ?
నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్ ఫండ్స్‌లో 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మల్టీక్యాప్ ఫండ్‌ను ఎంచుకోవాలా ? స్మాల్ క్యాప్ ఫండ్నా లేక మిడ్‌క్యాప్ ఫండ్‌ను ఎంచుకోవాలా ? 25 ఏళ్ల కాలంలో మల్టీ క్యాఫ్ ఫండ్ కంటే స్మాల్‌క్యాప్ ఫండ్ అధిక రాబడులనిస్తుందా ? ఏ ఫండ్‌ను ఎంచుకోమంటారు ? –ఉమాదేవి, విశాఖ పట్టణం భారత్‌లాంటి దేశాల్లో 25 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్ అధిక రాబడులనిస్తుంది. స్మాల్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ ఫండ్‌లో తక్కువ రాబడులు వస్తాయి. మిడ్ క్యాప్ కంటే మల్టీ క్యాప్‌లో ఇంకా తక్కువగా రాబడులు వస్తాయి. మల్టీ క్యాప్ ఫండ్స్.. స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. కాలం గడుస్తున్న కొద్దీ మల్టీ క్యాప్ మరింత విస్తరిస్తాయి. అవి పెరుగుతున్న కొద్దీ స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం.. మల్టీ క్యాప్ ఫండ్స్‌కు కొంచెం సమస్యాత్మకంగానే పరిణమిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ మారుతున్న తీరు, పరిణామం చెందుతున్న రీతిని బట్టి చూస్తే.. స్మాల్ క్యాప్ కంపెనీలే మంచి వృద్ధిని సాధిస్తాయి. భవిష్యత్తులో పెద్ద కంపెనీగా మారే చిన్న కంపెనీని ఇప్పుడే మనం గుర్తించగలిగి, ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు పొందవచ్చు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచిది అనిపిస్తుంది. అయితే స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్‌తో కూడిన పని. ఒక్కోసారి భారీ నష్టాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అయితే 25 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మల్టీ క్యాప్ ఫండ్స్ కంటే మిడ్ క్యాప్ ఫండ్స్ అధిక రాబడులను, మిడ్ క్యాప్ ఫండ్స్ కంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ మరింత అధిక రాబడులను ఇస్తాయి. అధిక రిస్క్ భరించలేని పక్షంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రెండు సమాన భాగాలు చేసి, ఒక భాగాన్ని స్మాల్ క్యాప్ ఫండ్‌లో, మిగిలిన దానిని మరో రెండు భాగాలు చేసి, ఒక భాగాన్ని మల్టీ క్యాప్ ఫండ్‌లోనూ, మరో భాగాన్ని మిడ్‌క్యాప్ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 22 సంవత్సరాలు. క్యాంపస్ సెలక్షన్స్‌లోనే ఉద్యోగం వచ్చేసింది. మూడేళ్లలో ఒక బైక్‌ను, పదిహేనేళ్లలో ఒక ఇంటిని కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, నా లక్ష్యాలు నెరవేరతాయి? నెలకు రూ.3,000 వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నెలకు రూ.3,000 సరిపోతాయా ? –భార్గవ, హైదరాబాద్ నెలకు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలన్నది మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న బైక్, ఇంటి ధరలను బట్టి ఉంటుంది. నెలకు రూ.3,000 ఇన్వెస్ట్ చేయడం సరిపోవచ్చు. లేదా సరిపోకపోవచ్చు. అయితే 22 ఏళ్ల వయస్సులోనే కొన్ని ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, నెలకు ఎంతో కొంత మొత్తం పొదుపు చేయాలనుకోవడం చాలా మంచి విషయం. కొన్ని ఆర్థిక లక్ష్యాలకు నిర్దిష్టమైన కాలపరిమితి ఉంటుంది. కొన్నింటికి ఉండదు. ఉదాహరణకు పిల్లల ఉన్నత చదువుల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకోండి. కచ్చితంగా వాళ్లు ఉన్నత విద్యాభ్యాస అవసరాలకు ఆ సొమ్ములు అంది తీరాలి. ఇక మీ రెండు ఆర్థిక లక్ష్యాలకు కాలపరిమితి కొంచెం అటూ, ఇటూ అయినా పర్లేదు. అంటే మీరు మూడేళ్లలో బైక్ కొనాలనుకుంటున్నారు. మీరు అనుకున్న మొత్తం రెండున్నరేళ్లకే సమకూరితే సంతోషమే కదా! లేదా మూడేన్నరేళ్లు పట్టినా ఓకే కదా! పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. అలా కాకుండా మీ లక్ష్యాలకు కాలపరిమతిని ఒక ఆరు నెలలు అటూ, ఇటూ అయినా పర్లేదు. ఇక ఈ లక్ష్యం (మూడేళ్లలో బైక్ కొనుగోలు)కోసం ఏదైనా మంచి బ్యాలన్స్డ్ ఫండ్(అగ్రెసివ్ హైబ్రిడ్)లో ఇన్వెస్ట్ చేయండి. దీని వల్ల ఇన్వెస్ట్ చేసే అలవాటు మీకు అలవడుతుంది. మార్కెట్ ఒడిదుడుకులకు గురైనా ఆ ప్రభావం ఈ బ్యాలన్స్డ్ ఫండ్‌పై పెద్దగా ఉండదు. ఈ బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, మీకు కావలసిన మొత్తం రాగానే ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకొని మీకు కావలసిన బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. బైక్ కొనుగోలు చేయడానికి ఎప్పుడూ అప్పు చేయకండి. ఉదాహరణకు మీరు రూ.60,000–70,000 రేంజ్లో ఉండే బైక్ కొనాలనుకున్నారనుకుందాం. నెలకు రూ.3,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోయారనుకోండి. ఒకటిన్నర లేదా రెండేళ్లలోనే మీరు బైక్ కొనుక్కోగలరు. ఇదే ప్రణాళికను ఇంటి కొనుగోలు లక్ష్యం కోసం 15 ఏళ్లపాటు కొనసాగించండి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇంటికి కావలసిన మొత్తంలో కనీసం సగమైనా సమకూరవచ్చు. మిగిలిన మొత్తాన్ని రుణంగా తీసుకొని ఇంటిని కొనుగోలు చేయండి. అత్యవసరాలు, ఇంటి కొనుగోలు కోసం అప్పు చేయవచ్చు. కానీ వినియోగ వస్తువుల కోసం కాదనేది నా అభిప్రాయం. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు కదా ! ఈ మూడేళ్ల లాక్–ఇన్ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈఎల్ఎస్ఎస్ల్లో సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేకుంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా ? –రాకేష్, ఈమెయిల్ మంచి రాబడులు పొందడానికి, పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్లు మంచి మదుపు సాధనాలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ఎలా మంచి ఫలితాలనిస్తుందో, ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా అలాంటి మంచి ఫలితాలనే ఇస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న పెద్ద మొత్తాన్ని కనీసం 12 సమాన భాగాలుగా చేసి, నెలకు ఒక్కో భాగాన్ని సిప్ విధానంలో ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల మీరు మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందగలుగుతారు. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గృహ రుణం ముందే తీరిస్తే లాభమేనా ?
నేను ఏడాది క్రితం డీఎస్పీ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో రూ. 2 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇతర స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్ నుంచి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని కెనరా రెబొకో లేదా రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. లేదంటే డీఎస్పీ స్మాల్ క్యాప్‌ఫండ్ నుంచి వెనక్కి తీసుకున్న మొత్తాన్ని రెండు సమాన భాగాలుగా చేసి, ఈ రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? ఈ విషయమై తగిన సలహా ఇవ్వండి. –రంజాన్, విశాఖపట్టణం డీఎస్పీ స్మాల్‌క్యాప్ ఫండ్ గతంలో మైక్రో ఫండ్‌గా మంచి పనితీరు కనబరిచింది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ పనితీరు బాగా లేదంటున్నారు. కానీ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ పనితీరును అంచనా వేయడానికి ఏడాది కాలం సరైన ప్రాతిపదిక కాదు. అసలు ఒకటి లేదా రెండేళ్ల పనితీరును బట్టి స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరును అంచనా వేయకూడదు. ఎలాంటి అంతరాయాలు లేకుండా కనీసం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో మీరు ఎదుర్కొం టున్న సమస్యలే.. అంటే.. ఏడాది, రెండేళ్ల కాలంలో పనితీరు అంతంతమాత్రంగానే ఉండటం, అశించిన స్థాయిలో రాబడులు ఇవ్వలేకపోవడం వంటి సమస్యలే ఉంటాయి. వీటన్నింటికీ సిద్ధపడే స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మరోవైపు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న కెనరా రొబొకో లేదా రిలయన్స్ స్మాల్‌క్యాప్ వంటి ఫండ్స్‌కు ఇలాంటి సమస్య లే ఉండొచ్చు. పైగా గతంలో ఈ రెండు ఫండ్స్ ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. ఏ స్మాల్ క్యాప్ ఫండ్ౖMðనా ఇలాంటి ఇబ్బందులు తప్పవు. అందుకని ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో వచ్చే ఇలాంటి సమస్యలను, ఒడిదుడుకులను మీరు తట్టుకోలేకపోతే, ఈ ఫండ్ నుంచి వైదొలగండి. మంచి బ్యాలన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి. పనితీరుతో పనిలేకుండా కనీసం మూడేళ్ల పాటు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. నేను గృహరుణం తీసుకొని ఇల్లు కొనుక్కున్నాను. ఈ గృహరుణంపై వడ్డీ రేట్లు 8.9%గా ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో నాకు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా గృహ రుణాన్ని ముందుగానే తీర్చివేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? –కిరణ్, ఖమ్మం మీ నిర్ణయం దాదాపు సరైనది కాదు అనుకుంటున్నాను. దీర్ఘకాలం(కనీసం 8–10 ఏళ్లు మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే) దృష్ట్యా చూస్తే, మీ నిర్ణయం ఒక్క శాతం కూడా కరెక్ట్ కాదు. మీకు నెలవారీ వచ్చే క్రమబద్ధమైన ఆదాయం ద్వారా మీరు గృహ రుణాన్ని చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు గృహ రుణాన్ని ముందుగానే చెల్లించాలన్న ఆలోచనను మానేయండి. అన్ని రుణాలతో(వ్యక్తిగత, వాహన, క్రెడిట్ కార్డ్ తదితర) పోల్చితే ఒక వ్యక్తి తక్కువ వడ్డీకి తీసుకోదగ్గ ఏకైక రుణం.. గృహ రుణమే. ఈ రుణం ద్వారా ఒక ఆస్తిని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా, ఆ ఆస్తి విలువ కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. మీరు కనుక ఆ ఇంట్లో నివసిస్తున్నట్లయితే, ఇది నా సొంత ఇల్లు, ఇది నా కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు అన్న భావనకు మించినది మరేదీ ఉండదు. మీ గృహరుణం కాలపరిమితి ఐదేళ్లకు మించి ఉన్నప్పుడు, గృహ రుణాన్ని ముందస్తుగానే చెల్లించడం సరైనది కాదు. పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే, ఇప్పుడు వచ్చే రాబడుల కంటే అధికంగానే రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. నేను లాయర్‌గా పనిచేస్తున్నాను. పన్ను ప్రయోజనాల కోసం నేను పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్)ల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. దేంట్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ? ఇక ఈఎల్ఎస్ఎస్ల విషయానికొస్తే, ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం కన్నా, రెండు ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కదా ! –జగన్నాధ్ నండూరి, హైదరాబాద్ దీర్ఘకాలం పాటు చూస్తే, ఈక్విటీ మంచి రాబడులనిచ్చే అసెట్ అని చెప్పవచ్చు. సంపద సృష్టి విషయంలో ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్) కన్నా, ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్) చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. స్వల్ప కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లో నష్టభయం ఎక్కువ. పైగా ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఒక్కోసారి నష్టాలు రావచ్చు కూడా. ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి మంచి రాబడులనే ఇస్తాయి. ఇక పీపీఎఫ్ విషయానికొస్తే, వీటి రాబడులు గ్యారంటీగా ఉంటాయి. అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే, ఎంత మొత్తం రాబడులు వస్తాయో ముందుగానే మనకు ఒక అంచనా ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా చెప్పుకోదగిన రాబడులను ఇవ్వలేవని చెప్పవచ్చు. మీరు రెండు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఇన్వెస్ట్ చేస్తే, మీరు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాక్–ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మూడేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే మీరు రెండు ఫండ్స్‌ను ఎంచుకోవాలి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
బ్యాలన్స్డ్ ఫండ్ ప్రయోజనాలేమిటి?
ఏ ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో అయినా కనీసం ఒక బ్యాలన్స్డ్ ఫండ్ ఉంటే మంచిదని చాలా మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. అసలు బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ? బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరా ? –శ్రీహరి, విశాఖపట్టణం సాధారణంగా రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మొదటిది.. పోర్ట్‌ఫోలియోను ఆటోమేటిక్‌గా రీబ్యాలన్స్ చేయడం. మీరు కొన్ని ఆర్థిక లక్ష్యాల కోసం కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటిల్లో కొన్ని పనితీరు అధ్వానంగా ఉండవచ్చు. కొన్ని ఫండ్స్ పనితీరు మెరుగ్గా ఉండవచ్చు. పనితీరు బాగాలేని ఫండ్స్ నుంచి వేరే ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయాలి. దీనినే పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్గా పరిగణిస్తారు. ఇది కొంచెం శ్రమతో కూడుకున్న పని. మార్కెట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలను కూడా పరిశీలిస్తూ ఉండాలి. కనీసం ఏడాదికొకసారైనా, పోర్ట్‌ఫోలియో మదింపు తప్పనిసరి. అలా కాకుండా మీ పోర్ట్‌ఫోలియోలో ఒక బ్యాలన్స్డ్ ఫండ్ ఉందనుకోండి. మీ పోర్ట్‌ఫోలియో ఆటోమేటిక్‌గా రీ బ్యాలన్స్ అవుతుంది. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో బ్యాలన్స్డ్ ఫండ్ ఉన్నా సరే కనీసం ఏడాదికి ఒకసారైనా మీ పోర్ట్‌ఫోలియోను మదింపు చేయడం మాత్రం మరచిపోవద్దు. ఇక రెండో విషయం.. పన్ను ప్రయోజనాలు... బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పన్ను అంశాల పరంగా బ్యాలన్స్డ్ ఫండ్‌ను ఈక్విటీ ఫండ్‌గా పరిగణిస్తారు. బ్యాలన్స్డ్ ఫండ్ తన మొత్తం నిధుల్లో 35 శాతం వరకూ స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ, ఈ 35 శాతం ఆదాయంపై ఎలాంటి పన్ను భారం పడదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు తేడా ఏమిటి ? –పల్లవి, హైదరాబాద్ జ: ఈ రెండు ఫండ్స్‌కు చాలా తేడా ఉంది. ఆర్బిట్రేజ్ ఫండ్స్.. లిక్విడ్ ఫండ్స్ లానే రాబడులనిస్తాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే వీటి రాబడులు తక్కువ స్థాయిల్లోనే ఉంటాయి. ఇక పన్ను అంశాల పరంగా చూస్తే, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ను లిక్విడ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఇక ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ విషయానికొస్తే, ఈ ఫండ్స్ తన మొత్తం నిధుల్లో మూడో వంతు ఈక్విటీలోనూ, మరో మూడు వంతు లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే సాధనాల్లో, మరో మూడో వంతు స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకని దీర్ఘకాలం రాబడుల పరంగా చూస్తే, బ్యాలన్స్డ్ ఫండ్స్ కంటే తక్కువ రాబడులే వస్తాయి. అయితే ఈ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు స్థిరత్వం ఎక్కువ. ఇక పన్ను అంశాల పరంగా చూసినా కూడా, ఈ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, రాబడులు తక్కువగా ఉన్నా, స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లో కాకుండా ప్రస్తుతమున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయమని చాలా మంది ఎనలిస్ట్‌లు సలహా ఇస్తుంటారు కదా ! ఎన్ఎఫ్ఓల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? –కిరణ్, విజయవాడ తెలియని దారిలో వెళ్లడం కన్నా తెలిసిన దారిలో వెళ్లడమే సులువు. అందుకని న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)లో ఇన్వెస్ట్ చేయడం కన్నా ప్రస్తుతమున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. ప్రస్తుతమున్న ఫండ్స్ పోర్ట్‌ఫోలియో గురించి మీకు ఒక అవగాహన ఉంటుంది. ఈ ఫండ్ ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుందో మీకు తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో ఈ ఫండ్ పనితీరు ఎలా ఉంది...మార్కెట్ పెరిగినప్పుడు ఎలా ఉంది. మార్కెట్ పతన సమయాల్లో రాబడులు ఎంత ఇచ్చింది తదితర విషయాల గురించి మీరు ఒక అవగాహన ఉంటుంది. కానీ కొత్త ఫండ్ గురించి ఈ విషయాలేవీ మీకు తెలియవు. కొత్త ఫండ్ ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడుతుంది. సాధారణంగా ఒక ఫండ్ భవిష్యత్తు పనితీరును ఆ ఫండ్ గత ట్రాక్ రికార్డ్ ఆధారంగా అంచనా వేస్తారు. కొత్త ఫండ్ భవిష్యత్తు పనితీరు అంచనాలకు అలాంటి ట్రాక్ రికార్డ్ ఉండదు. మరోవైపు ఫండ్ మొదలైనప్పుడే కొనుగోలు చేస్తే, చౌకగా కొనుగోలు చేసినట్లవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అసలు విషయమే కాదు. ఒక కంపెనీ ఐపీఓ(పబ్లిక్ ఆఫర్)కు వచ్చినప్పుడు ఉండే ధర, ఎన్ఎఫ్ఓ ఆరంభమైనప్పుడు ఫండ్ ధర ఒకలాంటివేనని చాలా మంది అపోహ పడుతుంటారు. కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడు ఆ కంపెనీ పరిమిత సంఖ్యలోనే షేర్లను ఆఫర్ చేస్తుంది. దీంతో లిస్టింగ్ గెయిన్స్‌కు అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం ఎన్‌ఎఫ్‌ఓకు ఉండదు. ఈ ఫండ్ ఎన్‌ఏవీపై ఈ ఫండ్‌కు ఉండే డిమాండ్ ఏమీ ప్రభావం చూపించదు. కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు గతంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒకే విధంగా(పోర్ట్‌ఫోలియో పరంగా) ఉండే ఎన్ఎఫ్ఓలను ఎక్కువగా ఆఫర్ చేసేవి. ఈ విషయంలో సెబి కఠినమైన నిబంధనలు రూపొందించడంతో ఎన్ఎఫ్ఓల జోరు తగ్గింది. ఏ రకంగా చూసినా, ఎన్ఎఫ్ఓల కంటే ప్రస్తుతమున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
నేను స్వల్పకాల అవసరాల నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. రెండు మంచి ఫండ్స్ సూచించండి. – కిరణ్, విజయవాడ సాధారణంగా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు మంచి రాబడులు వస్తాయి. అయితే స్వల్పకాలిక ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. స్వల్ప కాలానికే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు పెద్దగా రిస్క్ తీసుకోవలసిన అవసరం లేదు. దీని కోసం లిక్విడ్, ఆల్ట్రా షార్ట్–టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు 1–2 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకంటే, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ జోలికి వెళ్లవద్దు. వడ్డీ రేట్ల విషయంలో రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ పరిస్థితుల్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న, డైరెక్ట్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. డైరెక్ట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే, వ్యయాలు తక్కువగా ఉండటమే కాకుండా రాబడులు కూడా మంచిగా వస్తాయి. పిల్లల పైచదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు వంటి ఆర్థిక లక్ష్యాల సాధన కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది. ఇక మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీరు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌కు వర్తించే పన్ను నియమాలే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు కూడా వర్తిస్తాయి. ఈ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో మూడో వంతును పూర్తిగా ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో మీరు 2–3 ఏళ్ల పాటే ఇన్వెస్ట్ చేస్తే, మీకు లాభాల కంటే నష్టాలే వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ కేటగిరిలో మీరు రెండు ఫండ్స్–యాక్సిస్ ఈక్విటీ సేవర్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌ను పరిశీలించవచ్చు. నేను ఐటీ టెక్నాలజీ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దీని కోసం టాటా ఇండియా డిజిటల్ ఫండ్‌ను ఎంపిక చేసుకున్నాను. నా ఎంపిక సరైనదేనా? భవిష్యత్తులో ఈ ఫండ్ బాగోగులు ఎలా ఉండబోతున్నాయి? – సలీమ్, విశాఖపట్టణం మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఆ ఫండ్ తన నిధుల్లో అత్యధిక మొత్తాన్ని ఏ రంగానికి చెందిన కంపెనీల్లో అయినా ఇన్వెస్ట్ చేసే వీలు, వెసులుబాటు ఉండాలి. కానీ సెక్టోరియల్ ఫండ్స్‌లో ఆ వెసులు బాటు ఉండదు. ఉదాహరణకు మీరు ఫార్మా లేదా ఐటీ లేదా ఇన్ఫ్రా వంటి సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఈ సçదరు సెక్టోరియల్ ఫండ్ తన నిధుల్లో అత్యధిక భాగాన్ని సంబంధిత రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఐటీ ఫండ్ అయితే ఐటీ కంపెనీల్లో, ఫార్మా ఫండ్ అయితే ఫార్మా కంపెనీల్లో. అయితే మార్కెట్ చక్రీయం అని మీరు మరచిపోవద్దు. కొన్ని సంవత్సరాల్లో ఐటీ కంపెనీల హవా నడవవచ్చు. మరి కొన్నేళ్లు ఈ కంపెనీల షేర్లు స్తబ్ధుగా కదలాడవచ్చు. పనితీరు మందగించినప్పటికీ, వృద్ధి అవకాశాలు అంతగా లేనప్పటికీ, సదరు సెక్టోరియల్ ఫండ్ మేనేజర్లు ఆయా రంగాల కంపెనీల షేర్లలోనే బలవంతంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. ఇది మీ రాబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనిని అధిగమించాలంటే డైవర్సిఫికేషన్ అవసరం. అందుకని సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదని చెప్పవచ్చు. నేను గత కొంత కాలంగా నెలకు రూ.10,000 చొప్పున హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్, హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ రెండు ఫండ్స్‌లో మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ రూ.4.5 లక్షలకు చేరాయి. నా కూతురి ఉన్నత విద్యావసరాల కోసం నాకు మరో రెండేళ్లలో రూ.7–8 లక్షల వరకూ డబ్బులు అవసరమవుతాయి. ఈ ఫండ్స్‌లో సిప్‌లను రూ.20,000కు పెంచమంటారా ? – రాబర్ట్, సికింద్రాబాద్ ముందుగా మీకు కచ్చితంగా ఎంత మొత్తం అవసరమో లెక్కలేయండి. వచ్చే ఏడాది మీ కూతురి ఉన్నత విద్యావసరాల కోసం మీకు రూ. 8 లక్షలు అవసరమవుతాయని అంటున్నారు. మొదటి ఏడాదిలోనే అంత మొత్తం డబ్బులు అవసరమా? కాదా అనేది చెక్ చేసుకోండి. లేకుంటే మొత్తం కోర్సు పూర్తయ్యేవరకూ ఈ మొత్తం అవసరమా లేదా అనే విషయాన్ని ఒకసారి మదింపు చేయండి. ఒక వేళ ఈ మొత్తం డబ్బులు 3–4 సంవత్సరాల కాలానికి అవసరమనుకుందాం. మీకు మొదటి ఏడాది రూ. 2 లక్షల వరకూ డబ్బులు అవసరమవుతాయి. మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి నెలకు కొంత చొప్పున 12 నెలల వ్యవధిలో రూ.2 లక్షలు విత్‌డ్రా చేసుకోండి. రెండో సంవత్సరంలో మీకు మరో రూ.2 లక్షలు అవసరమవుతాయి. దీని కోసం మీరు రికరింగ్ డిపాజిట్, లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఏడాది కాలంలో మీరు రూ.2 లక్షల వరకూ ఆదా చేయగలుగుతారు. ఇది వచ్చే ఏడాది మీ పాప ఉన్నత విద్యావసరాలకు సరిపోతాయి. దీంతో ప్రస్తుత ఇన్వెస్ట్మెంట్ నిధులను మీరు వాడుకోవలసిన అవసరం లేదు. ఈ తర్వాత మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ భారీ నిధిగా మారుతుంది. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మల్టీ క్యాప్ ఫండ్స్ మంచివేనా?
మల్టీక్యాప్ ఫండ్స్ మంచివేనా? కాంట్రా, వేల్యూ ఫండ్స్‌తో పోల్చితే మల్టీక్యాప్ ఫండ్స్ ఏ విధంగా భిన్నమైనవి. ఈ మూడు రకాల ఫండ్స్‌లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి? ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తే తగిన రాబడులు పొందవచ్చు? – సుమ, హైదరాబాద్ మల్టీక్యాప్, కాంట్రా, వేల్యూ– ఈ మూడు రకాల ఫండ్స్ మంచివే. ఈ ఫండ్స్‌లో కనీసం 5–6 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈ ఫండ్స్ అన్నీ ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కానీ, ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల విషయంలో తేడాలు ఉంటాయి. మల్టీ క్యాప్ ఫండ్స్ అన్నీ వృద్ధి చెందగల సత్తా ఉన్న కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ షేర్లు తక్కువ ధరల్లో కాకుండా అధిక ధరల్లో ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక వేల్యూ ఫండ్స్.. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేని, తక్కువ ధరల్లో ట్రేడవుతున్న కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. సాధారణంగా ఈ కంపెనీల షేర్ల ధరలు చాలా చౌకగా ఉంటాయనే చెప్పవచ్చు. ఇక కాంట్రా ఫండ్ల విషయానికొస్తే, ఇప్పుడు పరిస్థితులు బాగా లేని కంపెనీలు, భవిష్యత్తులో టర్న్ అరౌండ్ కాగల కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెడతాయి. ఈ మూడు రకాల ఫండ్ మేనేజర్లు విభిన్నమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలను అనుసరిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక సగటు ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో ఈ మూడు రకాల ఫండ్స్ ఉంటేనే మంచిది. పెట్టుబడుల డైవర్సిఫికేషన్‌లో ఈ మూడు రకాల ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మార్గం. మీ దగ్గర పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయదగ్గ డబ్బులు ఉంటే రెండు మల్టీ క్యాప్ ఫండ్స్‌ను, ఒక వేల్యూ ఫండ్‌ను, మరో కాంట్రా ఫండ్‌ను ఎంచుకోండి. నా కూతురును ఎమ్‌బీబీఎస్ చదివించడం కోసం కొంతకాలంగా కొంత మొత్తాన్ని సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను. మరో రెండేళ్లకు ఈ డబ్బులు నాకు అవసరమవుతాయి. అప్పటివరకూ ఈ మొత్తాన్ని నేను ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్‌లోనే కొనసాగించమంటారా ? లేక లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి మళ్లించమంటారా ? – వీరేందర్, విజయవాడ ఈ రెండు మార్గాలు సరైనవి కావు. మీ పాపను ఎమ్‌బీబీఎస్ చదివించడం కోసం మీకు తప్పనిసరిగా రెండేళ్లలో డబ్బులు అవసరమవుతాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ నుంచి దశలవారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోండి. కనీసం 18 నెలలు లేదా 24 నెలల వాయిదాల రూపంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లోకి బదిలీ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)ను అనుసరించినట్లుగానే, విత్‌డ్రా చేసేటప్పుడు సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ని అనుసరించాలి. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లోకి మార్చిన తర్వాత దాని విలువ పెద్దగా పడిపోదు. అలాగే పెద్దగా వృద్ధి కూడా ఉండదు. ఫండ్ మేనేజర్లు మొత్తం నిధులను ఇన్వెస్ట్ చేయరని, మార్కెట్ పరిస్థితులను బట్టి కొంత సొమ్మును ఇన్వెస్ట్ చేయకుండానే ఉంచేస్తారని విన్నాను. ఇది నిజమేనా? ఒక వేళ ఇది నిజమైన పక్షంలో ఇన్వెస్ట్ చేయని డబ్బులను బ్యాంక్‌ల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? నగదుగానే ఉంచుతారా? వివరించండి. – మోహిసిన్, విశాఖపట్టణం ఫండ్ మేనేజర్లు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం నిధులను ఇన్వెస్ట్ చేయకపోవడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఫండ్ మేనేజర్లు మొత్తం నిధుల్లో 10 శాతం లేదా 20 శాతం, లేదా 30 శాతం వరకూ పెట్టుబడులు చేయకుండా వదిలివేయవచ్చు. ఈ వెసులుబాట, విచక్షణ ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. ఈ మొత్తాన్ని స్వల్ప కాలిక బాండ్ల రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా రాబడుల కోసం కాక పతనం నుంచి రక్షణ నిమిత్తం, మంచి అవకాశం కోసం ఎదురు చూడటం కోసం ఈ మార్గాన్ని ఫండ్ మేనేజర్లు ఎంచుకుంటారు. మార్కెట్ పరిస్థితులు స్తబ్దుగా ఉన్నా, వాళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న కంపెనీల షేర్లు వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా లేకపోయినా, మార్కెట్ కరెక్షన్ కోసం ఎదురు చూస్తారు. మార్కెట్ పతనమై వాళ్ల అంచనాల మేరకు కంపెనీల షేర్లు దిగొస్తే, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. నాకు తెలిసిన చాలా మంది ఫండ్ మేనేజర్లు సదరు ఫండ్ మొత్తం నిధుల్లో మూడో వంతు వరకూ నగదుగానో లేక డెట్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేసేవాళ్లు. ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో కూడా విభిన్నమైన వ్యూహాన్ని ఫండ్ మేనేజర్లు అనుసరిస్తారు. హైబ్రిడ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహంతో పోల్చితే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయనుకోండి. ఫండ్స్ నిధుల మొత్తాన్ని ఫండ్ మేనేజర్లు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో కానీ, ఈక్విటీ సాధనాల్లో గానీ ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్ పరిస్థితులను బట్టి వారు ఈ నిర్ణయం తీసుకుంటారు. అన్ని ఈక్విటీ ఫండ్స్ మేనేజర్లకు ఈ వెసులుబాటు ఉంటుంది. చాలా సందర్భాల్లో ఫండ్ మేనేజర్లు దీనిని పాటిస్తారు కూడా. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో అన్నీ చిన్న షేర్లే ఉండవా?
స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో వంద శాతం స్మాల్ క్యాప్ షేర్లు ఉండవని, కొన్ని లిక్విడ్ షేర్లను కూడా ఫండ్ మేనేజర్లు కొనుగోలు చేస్తారని విన్నాను. అది నిజమేనా ? ఎందుకలా చేస్తారు. ఫండ్ మేనేజర్లు తమ ఫండ్స్‌కు సంబంధించి లిక్విడిటీని ప్రతికూల పరిస్థితుల్లో ఎలా మేనేజ్ చేస్తారు? – శ్రీకాంత్, విజయవాడ లిక్విడిటీ నిర్వహణకు వివిధ రకాలైన పద్ధతులను ఫండ్ మేనేజర్లు అనుసరిస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానమైనది లిక్విడ్(అమ్మకాలు, కొనుగోళ్లు అధికంగా ఉండే) స్టాక్స్‌పై ఆధారపడటం. ఉదాహరణకు స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయనుకుందాం. ఈ ఫండ్ తన నిధుల్లో వంద శాతాన్నీ స్మాల్ క్యాప్ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయదు. మొత్తం నిధుల్లో 65 శాతం వరకే స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన నిధులను ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి ఇతర సాధనాల్లో లిక్విడ్ స్టాక్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఫండ్స్‌కు ఉండే మరో వెసులుబాటు... 5–10% నిధులను నగదు రూపంలో ఉంచుకోవడం. ఈ నగదును స్వల్పకాలిక రుణ, ఓవర్‌నైట్ కాల్–మనీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక నగదు రూపంలో కూడా ఎంతో కొంత రాబడిని ఫండ్ మేనేజర్లు సాధిస్తారు. సాధారణంగా ఫండ్స్ లిక్విడిటీ మొత్తం ఆయా ఫండ్స్‌లో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్‌పైననే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఓపెన్–ఎండెడ్ ఫండ్స్‌ల్లో ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. కొద్ది మంది మాత్రమే తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉంటారు. ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకునే పెట్టుబడుల కంటే కూడా ఇన్వెస్ట్ చేసే నిధులే అధికంగా ఉంటాయి. ఇలా కాకుండా వచ్చే పెట్టుబడుల కంటే వెనక్కి తీసుకునే పెట్టుబడులే అధికంగా ఉంటే అప్పుడు ఫండ్ మేనేజర్లు ఆందోళన చెందుతారు. ఇలాంటి సందర్భాలు అరుదుగా ఉంటాయి. కానీ అసలు ఉండవని చెప్పలేము. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు ఫండ్ మేనేజర్లు నగదును కానీ, స్వల్ప కాలిక రుణ సాధనాలపై కానీ, లిక్విడ్ స్టాక్స్‌పై కానీ ఆధారపడతారు. ఇలాంటి ఏర్పాటు లేకపోతే, ఫండ్ మేనేజర్లు ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను అయినకాడికి తెగనమ్మాల్సి వస్తుంది. మార్కెట్ రోజూ పతనమవుతున్నప్పుడు, ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై ఫండ్స్ నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటారు. అప్పుడు ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను అమ్మక తప్పదు. దీంతో మార్కెట్ మరింతగా పతనమవుతుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించడానికి లిక్విడ్ స్టాక్స్‌లోనూ, స్వల్పకాలిక రుణ సాధనాల్లోనూ ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్ చేస్తారు. ఏడాది క్రితం నేను ఒక క్లోజ్డ్–ఎండ్–మ్యూచువల్ ఫండ్‌లో రూ.3 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేశాను. అయితే నా సోదరి చదువు కోసం నాకు ఇప్పుడు అత్యవసరంగా కొంత సొమ్ములు అవసరమయ్యాయి. ఈ క్లోజ్డ్–ఎండ్ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా వెనక్కి తీసుకోవాలి? – విష్ణువర్థన్, విశాఖపట్టణం ఒక క్లోజ్డ్–ఎండ్ ఫండ్‌లో ఆ ఫండ్ మెచ్యూరిటీ పూర్తయ్యే వరకూ మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వీలు లేదు. అయితే అవి స్టాక్ మార్కెట్లో లిస్టై, షేర్ల మాదిరి ట్రేడవుతాయి. కాబట్టి మీ ఫండ్ యూనిట్లను విక్రయించుకోవచ్చు. అయితే ఇలాంటి క్లోజ్డ్ ఎండ్ ఫండ్ యూనిట్ల ట్రేడింగ్ పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసే కొనుగోలు దారులు దొరకడం కష్టసాధ్యమైన పనే. ఒక వేళ కొనుగోలుదారులు ఉన్నా, ఫండ్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) కన్నా తక్కువ ధరకే అవి ట్రేడవుతుంటాయి. అందుకని తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తుంది. అందుకని మీకు నష్టాలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకని క్లోజ్డ్–ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవడమనే విషయాన్ని మరచిపోండి. ఇప్పుడు పలు బ్యాంక్‌లు తక్కువ వడ్డీరేట్లకే విద్యారుణాలు ఇస్తున్నాయి. వాటిని ప్రయత్నించండి. షేర్లను తక్కువ ధరలో కొని ఎక్కువ ధరకు అమ్మడం మంచి ఇన్వెస్ట్మెంట్ విధానమంటున్నారు. అసలు షేర్ కనిష్ట ధరకు చేరిందని, గరిష్ట స్థాయికి చేరిందనీ ఎలా అంచనా వేయవచ్చు? – మాధురి, హైదరాబాద్ షేర్లను తక్కువ ధరలో కొని, అధిక ధరలకు అమ్మడం మంచి ఇన్వెస్ట్మెంట్ విధానమే. కానీ ఒక షేర్ కనిష్ట, అలాగే గరిష్ట ధరలను మీరే కాదు, కొమ్ములు తిరిగిన ఫండ్ మేనేజర్లూ అంచనా వేయలేరు. పడిపోతున్న షేర్ కనిష్ట ధరను అంచనా వేయడమంటే... పడిపోతున్న కత్తిని పట్టుకోవడానికి ప్రయత్నించడం. అలా ప్రయత్నించినప్పుడు, మీరు సురక్షితంగా ఆ కత్తిని క్యాచ్ చేయవచ్చు. లేదా కత్తిని పట్టుకునే ప్రయత్నంలో మీకు స్వల్ప గాయాలు కావచ్చు లేదా భారీ గాయాలే కావచ్చు. ఒక షేర్ కనిష్ట ధరను అంచనా వేయడం కూడా ఇలాంటిదే. ఒక్కోసారి మీ అంచనా కరెక్ట్ కావచ్చు. లేదా మీ అంచనాలకు మించి మరింత పడిపోవచ్చు. చాలా సార్లు ఇది చాలా ఫండ్ మేనేజర్ల విషయంలో రుజువైంది. అయితే పీఈ, పీబీ నిష్పత్తులను పరిగణనలోకి తీసుకొని అప్పటి షేర్ మార్కెట్ ధర ఆకర్షణీయంగా ఉంటే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకు మించి మరింతగా పతనమైతే, ఆ షేర్‌పై మీకు నమ్మకం ఉంటే మరింతగా కొనుగోలు చేయవచ్చు. ఇక షేర్ గరిష్ట ధరలనూ అంచనా వేయడం కష్టమే. ఉదాహరణకు ఒక షేర్‌ను రూ.100కు కొనుగోలు చేశారనుకుందాం. అది రూ.150, రూ.200, రూ.250 ఇలా పెరుగుతూ పోయిందనుకుందాం. ఎంత వరకూ పోతుందో మనం అంచనా వేయలేం. కానీ చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు రూ.వందకు కొనుగోలు చేసిన షేర్ రూ.150కు చేరగానే అమ్మేస్తారు. అది మరింతగా పెరుగుతూ ఉన్నప్పుడు తక్కువ ధరకు అమ్మేశామే అని బాధపడుతూ ఉంటారు. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
లాభాలు వచ్చాయి, ఫండ్ నుంచి వైదొలగవచ్చా?
నేను గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇన్వెస్ట్ చేసిన కొన్ని ఫండ్స్ ఏడాదిలో 30 శాతానికి పైగా రాబడులనిచ్చాయి. మంచి రాబడులు వచ్చాయి. కాబట్టి ఈ ఫండ్స్ నుంచి నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చా? – సరళ, హైదరాబాద్ ఈ డబ్బులతో వేరే ముఖ్యమైన పనులు నిర్వహించాలనుకున్న పక్షంలో.. ఏడాదిలో 30 శాతానికి పైగా రాబడులనిచ్చిన ఫండ్స్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. ప్రయోజనకరమైన పనులకు మాత్రమే ఇలాంటి లాభాలను వినియోగించాలి. అంతేకానీ, లాభాలు భారీగా వచ్చాయి కదాని మిత్రులకు, బంధువులకు భారీగా పార్టీ ఇవ్వడానికే, ఇతరత్రా వృథా ఖర్చులకు వినియోగించకూడదు. 30 శాతానికి పైగా లాభాలు వచ్చాయి కదాని ముఖ్యమైన అవసరాలు లేకపోయినా, మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నారనుకుందాం. తర్వాతి ఏడాది వచ్చే లాభాలను మీరు కోల్పోతారు కదా ! చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమే మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఆ ఆర్థిక లక్ష్యాలు సాకారమయ్యేంత వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తేనే మేలు. మరోవైపు ఇన్వెస్టర్లు రీ బ్యాలెన్సింగ్ ప్లాన్‌ను తప్పనిసరిగా అనుసరించాలి. రీ బ్యాలెన్సింగ్ ప్లాన్ అంటే..ఈక్విటీ, డెట్ సాధనాల్లో నిర్దిష్టమైన నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈక్విటీ సాధనాల్లో పెట్టుబడులను పెంచాలి. మార్కెట్ పడిపోతున్నప్పుడు డెట్ సాధనాల్లో పెట్టుబడులను పెంచాలి. ఇలా మార్కెట్ స్థితిగతులను అనుసరించి ఇన్వెస్ట్మెంట్స్ వ్యూహాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఉండాలి. నేను డీఎస్పీ బ్లాక్‌రాక్ ట్యాక్స్ సేవర్, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీల్లో గత ఏడాది కాలం నుంచి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. డీఎస్పీ ట్యాక్స్ సేవర్ పనితీరు సంతృప్తికరంగా లేదు. దీని నుంచి వైదొలగమంటారా ?లేక సిప్‌లను కొనసాగించమంటారా? అంతేకాకుండా నేను మరికొంత మొత్తాన్ని రెండు మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్ చేయడానికి రెండు మల్టీక్యాప్ ఫండ్స్‌ను సూచించండి. -నిరంజన్, విశాఖపట్టణం పన్ను ఆదా చేసే చాలా ఫండ్స్ సాధారణంగా మల్టీక్యాప్ ఫండ్స్ అయి ఉంటాయి. కేవలం ఏడాది స్వల్ప కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఫండ్ పనితీరును అంచనా వేసి సరైన రాబడులనివ్వడం లేదంటూ ఆ ఫండ్ నుంచి వైదొలగడం సరైన నిర్ణయం కాదు. మూడు నెలలకో, ఆర్నెల్లకో, ఏడాది కాలాన్నో పరిగణనలోకి తీసుకొని పెట్టుబడుల వ్యూహాన్ని, నిర్ణయాలను మార్చుకోవడం సరైన విధానం కాదు. పనితీరు బాగా లేని ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకొని, పనితీరు బాగా ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం.. సరైన పెట్టుబడి వ్యూహం కాదు. నిరంతరం మంచి రాబడులనివ్వడమనేది ఏ ఫండ్‌కు సాధ్యం కాదు. మీరు ఇన్వెస్ట్ చేసిన రెండు ఫండ్స్ విషయానికొస్తే, పన్ను ఆదా ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు ఫండ్స్ మంచివే. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో అధిక లాభాలు ఆర్జించే కంపెనీల షేర్లు ఉన్నాయి. పన్ను ఆదా ఫండ్‌కు సాధారణంగా లాక్–ఇన్–పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. అంటే మీ డీఎస్పీ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్ల దాకా వెనక్కి తీసుకునే వీలు లేదు. మీరు సిప్‌లు ప్రారంభించి ఏడాది దాటింది. కాబట్టి మరో రెండేళ్ల దాకా మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోలేరు. సమీప కాలంలోనే డీఎస్పీ ట్యాక్స్ సేవర్ కోలుకొని మంచి రాబడులనే ఇస్తుందని నేను భావిస్తున్నాను. అందుకని మీరు నిరభ్యంతరంగా ఈ ఫండ్‌లో సిప్‌లను కొనసాగించవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెండు మల్టీ క్యాప్‌లు–మిరా అసెట్ ఇండియా ఈక్విటీ, మోతీలాల్ ఓస్వాల్ మల్టీక్యాప్ 35 ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. గత కొన్ని నెలలుగా మోతీలాల్ ఓస్వాల్ మల్టీక్యాప్ 35 ఫండ్ పనితీరు బలహీనంగా ఉన్నా, భవిష్యత్తులో ఇది మంచి రాబడులనే ఇవ్వగలదని అంచనాలున్నాయి. ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్‌ను కూడా పరిశీలించవచ్చు. కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీ క్యాప్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. షేర్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి పనితీరు ఉన్న కంపెనీ షేర్లను ఎంచుకోమని చెబుతారు కదా ! ఒక కంపెనీ నిర్వహణ బాగా ఉందని ఎలా తెలుసుకోవాలి? – రియాజ్, విజయవాడ ఒక సామాన్య ఇన్వెస్టర్‌గా మీరు కంపెనీ యాజమాన్యాన్ని కలిసి, వారితో మాట్లాడే అవకాశం ఉండదు. ఒక కంపెనీ నిర్వహణ బాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక చక్కని మార్గం... ఆ యాజమాన్యం చరిత్రను తెలుసుకోవడమే. ఇంటర్నెట్ విస్తృతంగా అమల్లోకి వచ్చాక, మీరు గూగుల్, వికీ పీడియా ద్వారా కంపెనీ యాజమాన్యంలోని కీలక వ్యక్తుల సమాచారం తెలుసుకోవచ్చు. కంపెనీ యాజమాన్యంలోని కీలక వ్యక్తులు గతంలో ఏవైనా వివాదాల్లో చిక్కుకున్నా, లేదా వారి చుట్టూ ఏవైనా వివాదాలు ముసురుకున్నా, కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు జరిగినా, కంపెనీ ఆడిటర్లు తరచుగా మారుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. వెంటనే మంచో, చెడో అన్న నిర్ణయానికి రావద్దు. కొంత కాలం ఎదురు చూసి, మరింత సమాచారం సేకరించి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్స్‌పై పన్ను భారం తగ్గించుకోవాలంటే..?
నా ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతా మెచ్యూరిటీ దగ్గరకు వచ్చింది. దీన్ని మరో ఐదేళ్లు పొడిగించమంటారా? లేక ఈ పీపీఎఫ్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? – స్టీఫెన్సన్, హైదరాబాద్ పీపీఎఫ్ అనేది స్థిరాదాయ సాధనంలో ఇన్వెస్ట్ చేసే 15 ఏళ్ల సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) అని చెప్పవచ్చు. మీరు ఉద్యోగంలో చేరగానే మీ పెద్దవాళ్లు, మిత్రులు మొదటగా ఇచ్చే సలహా.. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయమనే. ఇది సురక్షితమూ, రిస్క్ పెద్దగా లేని ఇన్వెస్ట్మెంట్ అని వారి అభిప్రాయం. పదిహేనేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... ఈ మొత్తాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వచ్చిన రాబడుల కంటే అధిక రాబడులే వస్తాయి. ఓ మోస్తరు మ్యూచువల్ ఫండ్‌లో కూడా ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్‌లో వచ్చే రాబడుల కంటే కనీసం ఒకటిన్నర మొత్తం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఈక్విటీలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తే, నష్టభయం తగ్గడమే కాకుండా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితం అవుతాయి. కనీసం పదిహేనేళ్లపాటు ఈక్విటీల్లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తే, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ కాదని చెప్పవచ్చు. మీలాగా పదిహేనేళ్ల పాటు పీపీఎఫ్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసినట్లుగా, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, మీరు నష్టపోయే ప్రశ్నే లేదు. పీపీఎఫ్ ఖాతాను మరో ఐదేళ్లు పొడిగించడం కంటే కూడా ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. అయితే పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ మొత్తాన్ని కనీసం 12 నుంచి 18 సమాన భాగాలుగా విభజించి ఆ మొత్తాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ప్రతి ఏడాది రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు దీనికి బదులుగా పన్ను ఆదా చేసే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పదిహేనేళ్లపాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే, పీపీఎఫ్‌లో వచ్చే రాబడుల కంటే మీకు కనీసం ఒకటిన్నర లేదా రెండు రెట్లు అధిక రాబడులు వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తే పన్ను భారం తప్పించుకోవచ్చు? – హుస్సేన్, విజయవాడ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఎప్పుడు విక్రయించినా, వాటిపై వచ్చే లాభాలపై ఆదాయం పన్ను చెల్లించాల్సిందే. ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను తీసుకుంటే, ఈ ఫండ్స్‌ను మీరు కొనుగోలు చేసిన ఏడాది తర్వాత విక్రయించారనుకుందాం. ఈ విక్రయాలపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా(ఎల్టీసీజీ–లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్)గా పరిగణిస్తారు. పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలపై వచ్చే మూలధన లాభాలపై పన్నుకు రూ.లక్ష వరకూ మినహాయింపు ఉంటుంది. ఈక్విటీలపై వచ్చే మూలధన లాభాలు రూ. లక్ష దాటితేనే మీరు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ ఫండ్స్ యూనిట్లను ఏడాదిలోపే విక్రయించారనుకుందాం. ఈ విక్రయాలపై వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్లు ఇచ్చిందనుకుందాం. 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను సర్‌చార్జీని, సెస్‌ను కూడా కలుపుకొని, ఈ మొత్తాన్ని మినహాయించుకొని ఆ తర్వాతనే మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లిస్తారు. ఇక ఈక్విటీ యేతర మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, మీరు కొనుగోలు చేసిన ఈ ఫండ్స్‌ను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. 20 శాతం పన్ను (ఇండెక్సేషన్ ప్రయోజనంతో) చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోపే విక్రయిస్తే, వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీ ఆదాయానికి కలపి మీకు వర్తించే ఆదాయపు పన్ను శ్లాబ్‌ను అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ఫండ్స్పై వచ్చే డివిడెండ్లపై 25 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌కు సర్‌చార్జీ, సెస్‌లను కూడా కలిపి ముందుగానే మినహాయించుకొని, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ డివిడెండ్ ఆదాయం రూ.10 లక్షలకు మించితే అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఫండ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. దీంట్లో సిప్‌లు ఆపేద్దామనుకుంటున్నాను. ఈ ఫండ్‌లో ఇప్పటివరకూ జమ అయిన మొత్తాన్ని ఏం చేయమంటారు? – శ్రీకాంత్, విశాఖపట్టణం ఆశించిన స్థాయిలో రాబడులు లేనప్పుడు సదరు ఫండ్‌లో సిప్‌లు ఆపేయవచ్చు. ఆ ఫండ్‌లో ఇప్పటివరకూ జమ అయిన మొత్తాన్ని మరో మంచి ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. అయితే ఇలా మార్చుకునేటప్పుడు పన్ను అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసిన కాలం ఏడాదిలోపే అయితే, మీరు 15% స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్మెంట్ కాలం ఏడాది దాటితే మీరు 10% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ లాభాలు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష దాటితేనే ఈ పన్ను భారం ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన నిర్ణయం (పన్ను భారం తక్కువగా ఉండేలా) తీసుకోగలరు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎన్నికల ఏడాది.. ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించాలా ?
నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్నందున సెన్సెక్స్ 33,000–35,000 రేంజ్లో కదలాడుతుందని, స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయని అంచనా వేస్తున్నాను. ఈ కారణంగా నా ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రాబడులు ఏవిధంగా ఉంటాయి ? –రాజు, విశాఖపట్టణం ఇది చాలా ప్రాముఖ్యమైన సందేహం. అలాగే సమాధానం చెప్పడానికి అత్యంత కష్టమైన ప్రశ్న కూడా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అయితే మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు అనే విషయాన్ని బట్టి ఎన్నికల సంవత్సరం అనే అంశం నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు మీరు ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనుకుందాం. ఎన్నికలు మరో ఏడాదిలో వస్తాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయని మీరు అంచనా వేస్తున్నారు. అందుకని మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లను కొనసాగించవచ్చు. మీ అంచనాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురైతే, మీకు ప్రయోజనమే కలుగుతుంది. ఒకవేళ మీరు ఐదేళ్ల కంటే తక్కువ కాలానికే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశమే. మీరు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈక్విటీని అసలు పరిగణించాల్సిన అవసరమే లేదు. మీరు ఇప్పటికే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ ఒకే పరిస్థితి లేదా పరిస్థితులు ఒకేలా ఉండవన్న విషయం మీకు అర్థమై ఉంటుంది. మార్కెట్ చుట్లూ ఎప్పుడు టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి. ఒకసారి చమురు ధరలు, మరోసారి ద్రవ్యోల్బణ ఒత్తిడులు. ఇలా రకరకాల ఒత్తిడులు మార్కెట్‌పై ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్‌కు సంబంధించి గత 20–25 ఏళ్ల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల పాటు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, స్థిరాదాయ సాధనాల కంటే ఎక్కువ రాబడులే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి పొందవచ్చు. అంతేకాకుండా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఈక్విటీలు ఇస్తాయి. స్వల్పకాలంలో మార్కెట్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో.. కనీసం ఐదేళ్లు అంతకు మించిన కాలానికి మాత్రం ఈక్విటీల రాబడులు భేషుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. నేను ప్రతినెలా ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్(ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్)ను కొనుగోలు చేయాలనుకుంటున్నాను. ఇలా పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మంచి గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలి? –జయరామ్, నెల్లూరు మంచి గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎంచుకోవడానికి మీకు నిపుణుల సలహా అవసరం లేదు. ఎందుకంటే గోల్డ్ ఈటీఎఫ్‌ల డిజైన్ చాలా సరళంగా ఉంటుంది. పుత్తడి ధరలను బట్టే గోల్డ్ ఈటీఎఫ్‌ల ధరలను నిర్ణయిస్తారు. ఈ ధరలకు వ్యయాలు అదనం. అయితే ఈ వ్యయాలు చాలా స్వల్పంగా ఉంటాయి. అయితే మీరు పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా మరో మార్గం ఉంది. మీరు డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. దీనికి అదనంగా ప్రభుత్వం అప్పుడప్పుడు జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ)లను కొనుగోలు చేయండి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసినా, లేదా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసే గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, కొన్ని వ్యయాలు మాత్రం మీరు భరించాల్సి ఉంటుంది. అదే సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో ఇలాంటి వ్యయాల భారం ఉండదు. పైగా ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై మీకు ఏడాదికి 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ గోల్డ్ బాండ్స్‌ను అప్పటి పుత్తడి ధర ప్రకారం రిడీమ్ చేసుకోవచ్చు నా వయస్సు 53 సంవత్సరాలు. నేను 65 ఏళ్ల వరకూ పనిచేయగలను. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఇప్పటివరకూ నేను రూ.50 లక్షలు పొదుపు చేయగలిగాను. రిటైర్మెంట్ అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నెలకు రూ.40,000– 50,000 చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. నా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక ఎలా ఉండాలి ? –ఈశ్వరరావు, హైదరాబాద్ జ: మీ అత్యవసరాలకు సరిపడా మొత్తాన్ని మాత్రమే స్థిరాదాయ సాధనాల్లో ఉంచుకోవాలి. ఇలాంటి స్థిరాదాయ సాధనాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకటి. వీటిపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది. మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్) ఉంటుంది. దీనికి బదులుగా ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. మీరు మరో పన్నేండేళ్లు పనిచేస్తారు. కాబట్టి, ఈ పన్నేండేళ్లు మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. పన్నేండేళ్లు అంటే దీర్ఘకాలం కిందే లెక్క. ఈ విషయాలన్ని పరిగణనలోకి తీసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక ఎలా ఉండాలంటే..., మీ అత్యవసరాలకు సంబంధించిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. రెండు నుంచి మూడేళ్ల పాటు ఫిక్స్డ్ ఇన్కమ్, ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. రానురాను ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్ రాబడులు కంటే ఈక్విటీ ఫండ్స్ రాబడులు అధికంగా ఉంటాయనే విషయం మీకు అర్థమవుతుంది. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మల్టీ బ్యాగర్ బదులు.. మంచి ఫండ్ చూసుకోండి!
నా వయస్సు 50 సంవత్సరాలు. మరో పదేళ్లలో రిటైర్ కాబోతున్నాను. దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే మంచి రాబడులు వస్తాయని చెబుతుంటారు. అయితే ఇలా రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న నాలాంటి వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ పరంగా దీర్ఘకాలం అంటే అర్థవంతంగా ఉంటుందా ? రిటైర్మెంట్ నిధి కోసం నా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి ? –శ్రీధర్, విశాఖపట్టణం ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. అయితే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వాళ్ల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఉదాహరణకు మీ విషయమే తీసుకుంటే, మీ వయస్సు 50 సంవత్సరాలు. మీరు మరో పదేళ్లలో రిటైర్ కాబోతారు కాబట్టి, మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ, బాండ్ల కలగలుపుగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మీరు ఏడాదికి 4–5 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఉండాలి. ఇలా చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ వృద్ధి చెందే అవకాశాలున్నాయి. మనం ఇన్వెస్ట్ చేసిన షేర్ మల్టీ బ్యాగర్ అవుతుందా లేక మన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మట్టికరిపిస్తుందా ముందే మనకు తెలిసే వీలుందా ? అలా తెలుసుకోవడానికి ఏమైనా పద్ధతులున్నాయా ? –అవినాశ్, విజయవాడ అలా తెలుసుకోవడం కష్టసాధ్యమైన విషయమే. మీ ఇన్వెస్ట్మెంట్స్ మట్టికరవకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ప్రమాదం నుంచి బైటపడవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొంది దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు. ఒక సాధారణ ఇన్వెస్టర్‌గా మల్టీ బ్యాగర్‌ను అంచనా వే యడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చు. షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే దీని కంటే మరో మంచి మార్గం మంచి ఫండ్‌ను ఎంచుకోవడం. మంచి ఫండ్‌ను ఎంచుకొని, ఆ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం కొనసాగించండి. మీ ఆదాయం పెరిగినప్పుడల్లా ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కూడా పెంచండి. మ్యూచువల్ ఫండ్‌ను ఎంతో అనుభవమున్న ఫండ్ మేనేజర్ నిర్వహిస్తాడు. కాబట్టి ఒక సాధారణ ఇన్వెస్టర్ కన్నా మంచి నిర్ణయాలు తీసుకోగలడు. నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. భవిష్యత్తులో మంచి ఇల్లు కట్టుకోవాలనేది నా లక్ష్యం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని మిత్రులు చెబుతున్నారు. అందుకని నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? –ఆనంద్, హైదరాబాద్ దాదాపు రెండు వేలకు పైగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. దీర్ఘకాలం అంటే కనీసం ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. స్వల్పకాలంలో ఈక్విటీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురువుతాయి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే, ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేముందు మూడు కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిది ట్యాక్స్ ప్లానింగ్. చాలా మంది పన్ను ఆదా కోసమే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో పన్ను ఆదా ఫండ్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇక రెండోది మీరు ఎంత రిస్క్‌ను భరించగలరనే విషయం. డెట్ ఫండ్స్‌లో నష్టభయం తక్కువగా ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్‌లో రిస్క్ రకరకాలుగా ఉంటుంది. బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువగానూ, మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో రిస్క్ అధికంగానూ ఉంటుంది. మీది ఇంకా చిన్న వయస్సే, కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. చిన్న వయస్సులోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కాలం అధికంగా ఉండి చక్రగతి వృద్ధి రాబడులు పొందవచ్చు. ఇక చివరిది ఫండ్స్ పనితీరును సమీక్షించడం. కనీసం ఏడాదికొకసారైనా మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్ పనితీరును మదింపు చేయాలి. ఆశించిన స్థాయిలో పనితీరు లేని ఫండ్స్ నుంచి వైదొలగి, వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయాలి. ఊరిలో పొలం అమ్మగా నా వాటా కింద రూ. 5 లక్షలు వచ్చాయి. వీటిని ఒకేసారి హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి. –లక్ష్మీ ప్రసన్న, కాకినాడ ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో నెలకు కొంత మొత్తంలో ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈక్విటీ ఒడిదుడుకుల సమస్యను అధిగమించవచ్చు. ఒకోసారి పెద్ద మొత్తంలో సొమ్ములు సమకూరాయనుకోండి. ఆ మొత్తాన్ని బట్టి సిప్ల సంఖ్యను నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మీకు రూ. 50,000–1,00,000 వరకూ బోనస్ వచ్చిందనుకుందాం. ఈ మొతాన్ని 3–6 భాగాలుగా విభజించి సిప్ ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ మార్కెట్ సైకిల్ సాధారణంగా మూడేళ్లు ఉంటుంది కాబట్టి పొలం అమ్మగా వచ్చిన రూ.5 లక్షల మొత్తాన్ని మూడు సంవత్సరాల పాటు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. - ధీరేంద్ర కుమార్ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్ పనితీరు సరిగ్గా లేకపోతే....?
నేను గత కొంతకాలంగా మ్యూచువల్ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవలే నా వేతనం రూ.5,000 వరకూ పెరిగింది. దీంట్లో రూ.3,000 వరకూ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇప్పటికే నా పోర్ట్‌ఫోలియోలో ఎనిమిది మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ సిప్‌లను పెంచమంటారా ? లేకుంటే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌లను ప్రారంభించమంటారా ? – విక్రమ్ రెడ్డి, విజయవాడ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణంగా డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందాలంటే గరిష్టంగా ఐదు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక మీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఎనిమిది మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎక్కువ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫండ్స్ సంఖ్య ఎక్కువైతే, డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పెద్దగా రావు. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో స్టాక్స్, మరో ఫండ్ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ ఒకే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఆరంభంలో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తారు. సరైన అవగాహన లేకుండా వాటిని అలాగే కొనసాగిస్తారు. నాలుగు కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్లు ముఖ్యంగా రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది అన్ని రంగాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ఫండ్స్‌ను ఎంచుకోవాలి. మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీనిని దాదాపు సాధించవచ్చు. ఇక రెండోది పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌కు సంబంధించిన ఫండ్ మేనేజర్లు కూడా వేర్వేరుగా ఉండాలి. ఉదాహరణకు మీ పోర్ట్‌ఫోలియోలో ఒకే సంస్థ అందించే మ్యూచువల్ ఫండ్స్ నాలుగు ఉన్నాయనుకోండి. వీటన్నింటి ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఒకే విధంగా ఉంటాయి. ఇలా కాకుండా చూసుకోవాలి. సాధారణంగా ఒక్కో మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి ఒక్కో కేటగిరీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనని చెప్పవచ్చు. నేను వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 10–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడానికి కొత్త సిప్‌ను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏదైనా బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక మరేదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? ఈ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏ ఫండ్‌ను ఎంచుకోవాలో సూచించండి ? – రాగిణి, హైదరాబాద్ స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనంలోనైనా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, సదరు ఇన్వెస్ట్మెంట్ సాధనంపై అప్పుడప్పుడూ సమీక్ష తప్పనిసరి. ఈ సుదీర్ఘకాలంలో ఫండ్స్‌ను నిర్వహించే ఫండ్ మేనేజర్లు మారుతూ ఉంటారు. ఫండ్ మేనేజర్ల మార్పు ఆ ఫండ్ పనితీరుపై బాగానే ప్రభావం చూపుతుంది. అందుకని కనీసం రెండు–మూడేళ్లకొకసారైనా ఫండ్ సమీక్ష తప్పనిసరి. 10–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడానికి బ్యాలన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోవడం మంచిదే. మొదటి సారి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు బ్యాలన్స్డ్ ఫండ్స్‌నే ఎంచుకోవాలి. అయితే మీరు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ తీరుతెన్నులపై మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను కాకుండా మల్టీక్యాప్ ఫండ్‌ను ఎంచుకోవాలి. మీరు కొంచెం రిస్క్ తీసుకోగలిగితే, మీ ఇన్వెస్ట్మెంట్లో కొంత భాగాన్ని మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్‌కు కూడా కేటాయించండి. అయితే ఈ ఫండ్స్‌లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు. నేను ఇటీవలే రిటైరయ్యాను. అద్దెల ద్వారా నెలకు రూ.50,000 వరకూ ఆదాయం వస్తోంది. ఈ మొత్తాన్ని ఐదు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీక్యాప్, కోటక్ సెలెక్ట్ ఫోకస్, ఎల్ అండ్ టీ ఎమర్జింగ్ బిజినెసెస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్‌లు ఉన్నాయి. వీటిల్లో గత ఆరు నెలల కాలంలో రెండు ఫండ్స్ పనితీరు నేను ఆశించిన స్థాయిలో లేదు. ఆ ఫండ్స్ నుంచి వైదొలగి వేరే కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? – చంద్రశేఖర్, విశాఖపట్టణం మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫండ్స్ అన్నీ మంచి ఫండ్సే. ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. కేవలం ఆరు నెలల పనితీరు ఆధారంగా ఫండ్స్ పనితీరుపై ఒక అంచనాకు రాకూడదు. కనీసం ఐదు అంతకు మించిన సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. స్వల్ప కాలంలో ఈక్విటీ ఫండ్స్ అంతంత మాత్రం రాబడులు ఇచ్చినా, దీర్ఘకాలంలో మంచి లాభాలనే అందిస్తాయి. ఒక వేళ ఫండ్స్ తక్కువ పనితీరు చూపించినా, సిప్ విధానంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించారనుకోండి. మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. అందుకని ఆరు నెలల్లో మీరు ఆశించిన రాబడులు రాలేదని సదరు ఫండ్స్ నుంచి వైదొలగడం సరైన నిర్ణయం కాదు. కనీసం రెండేళ్ల పాటు పరిశీలించి తగిన రాబడులు రాకపోతే అప్పుడు వైదొలగాలి. మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్