డివిడెండ్-గ్రోత్... ఏ ఆప్షన్ బెటర్? | Which better option for Dividend-growth ...? | Sakshi
Sakshi News home page

డివిడెండ్-గ్రోత్... ఏ ఆప్షన్ బెటర్?

Published Mon, Jun 13 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

డివిడెండ్-గ్రోత్... ఏ ఆప్షన్ బెటర్?

డివిడెండ్-గ్రోత్... ఏ ఆప్షన్ బెటర్?

నేను అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడిని. నేను భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను.  అయితే ఇక్కడి కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించడం లేదు. దీనికి కాణమేమిటి?
 - మహేందర్, కాలిఫోర్నియా(ఈ మెయిల్ ద్వారా)

 
అమెరికా, కెనడాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల నుంచి దరఖాస్తులను పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంగీకరించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైనన్స్ యాక్ట్(ఫ్యాట్‌కా) కారణంగానే పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎన్నారైల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించడం లేదు. ఈ చట్టం ప్రకారం అమెరికా జాతీయుల, అమెరికాలో స్థిరపడిన విదేశీయుల అన్ని లావాదేవీలను ప్రపంచంలోని ఆర్థిక సంస్థలు అమెరికా ప్రభుత్వానికి నివేదించాలి. అయితే ఎల్ అండ్ టీ, యూటీఐ, పీపీఎఫ్‌ఏఎస్, సుందరం, కెనరా రొబెకొ.. ఈ సంస్థలు ఎన్నారైల నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరిస్తున్నాయి. త్వరలో మరిన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఎన్నారైల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించే అవకాశాలున్నాయి.
 
నేను 2015, జూలైలో ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్‌ను తీసుకున్నాను. ఒక ప్రీమియమ్‌ను చెల్లించాను. ఈ ఏడాది వార్షిక ప్రీమియమ్‌గా రూ.14,711 చెల్లించాల్సి ఉంది. ఈ ప్లాన్‌కు బీమా కవరేజ్ రూ.3,75,000గానూ, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రూ.3,75,000 గానూ ఉంది. అయితే నేను ఇప్పటికే టాటా ఏఐఏ సంస్థ నుంచి రూ.50 లక్షలకు టర్మ్ ప్లాన్ తీసుకున్నాను. దీనిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్ పాలసీని కొనసాగించడం సమంజసమేనా? లేకుంటే ఈ ప్లాన్ నుంచి వైదొలగమంటారా?
- లోకేశ్, విశాఖపట్టణం
 
ఎండోమెంట్ ప్లాన్‌ల విషయంలో పలు సంస్థలు వ్యయాలు విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్....దీనికి మినహాయింపు కాదు. మీకు నష్టాలు వచ్చినప్పటికీ, తగిన రాబడులనివ్వలేని ప్లాన్‌ల్లో కొనసాగడం సరికాదు. ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేయడం సముచితమని భావిస్తున్నాం. తొలి ఏడాది కట్టిన ప్రీమియమ్‌ను మర్చిపోండి. ఈ ప్లాన్ తీసుకొని మూడేళ్లు పూర్తికాలేదు కాబట్టి మీకు సరెండర్ ఆప్షన్ కూడా లభించదు.

ఇలాంటి బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన ప్లాన్‌లు తగిన రాబడులను ఇవ్వలేవు. అలాగే సరిఅయిన బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. అందుకని భవిష్యత్తులో ఇలాంటి బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. బీమా కవరేజ్‌కి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. వీటికి ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయి. బీమా కవరేజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతమున్న మీ టర్మ్ ప్లాన్.. మీకు తగిన బీమా కవరేజ్ ఇస్తుందో లేదో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి.
 
నా వయస్సు 59 సంవత్సరాలు. వచ్చే ఏడాది జనవరిలో రిటైరవుతున్నాను. రిటైర్మెంట్ ప్రయోజనాలు రూ.60 లక్షలు వస్తాయి. కుటుంబ పెన్షన్ కింద నెలకు రూ.12,000 వస్తాయి. నేను పెట్టిన పెట్టుబడులు ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం, షేర్లలో రూ.18 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.13 లక్షలుగా ఉన్నాయి. రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా రూ.5 లక్షల బ్యాంక్ ఆఫ్ బరోడా వారి హెల్త్ ప్లాన్ ఉంది. నేను తీర్చాల్సిన అప్పులేమీ లేవు. నేను సొంత ఇంట్లోనే ఉంటున్నాను. పెన్షన్ ఆదాయం కాకుండా నెలకు రూ.60,000 వరకూ ఆదాయం వచ్చేట్లుగా ఈ డబ్బులను ఎలా ఇన్వెస్ట్ చేయాలో సూచించండి?
 - నారాయణరావు, హైదరాబాద్

 
ముందుగా మీరు ఏం చేస్తారంటే, స్వీప్ ఇన్ సౌకర్యం ఉన్న సేవింగ్స్ ఖాతాలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయండి. మీ నెలవారీ ఖర్చులను లెక్కించి, ఏడాదికి సరిపడేలా మొత్తాన్ని ఈ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్ చేయండి. ఇక క్రమం తప్పని ఆదాయం కోసం సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయండి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు క్రమం తప్పని ఆదాయం లభిస్తుంది. అంతే కాకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ సురక్షితంగా కూడా ఉంటాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద మీరు గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు.  ఈ స్కీమ్‌లో మీకు 8.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకు మీకు రూ.64,500 (నెలకు రూ.21,500) వస్తాయి.

ఇక పోస్ట్ ఆఫీస్ మంథ్లీఇన్‌కమ్ స్కీమ్‌లో రూ.9 లక్షలు (జాయింట్ అకౌంట్)లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై  7.8 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. నెలకు రూ.5,850 ఆదాయం లభిస్తుంది. ఈ రెండు సాధనాల్లో వచ్చే ఆదాయంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండింటిపై వచ్చే ఆదాయాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు.

ఇక వీటికి అనుబంధంగా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. అంతేకాకుండా ఏడాది తర్వాత వీటిని విక్రయిస్తే ఎలాంటి పన్ను పోటు ఉండదు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు వస్తాయి. అంతేకాకుండా మీ నెలవారీ ఆదాయ అవసరాలు కూడా తీర్చుకోవచ్చు.
 
నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలో, గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలో తెలియక తికమకపడుతున్నాను. తగిన సూచనలివ్వండి.

- లక్ష్మణ్, వరంగల్
 
రెగ్యులర్‌గా డబ్బులు అవసరమైన పక్షంలో మాత్రమే డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిటైరైన తర్వాత మీకు రెగ్యులర్‌గా డబ్బులు అవసరమవుతాయి. కాబట్టి అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే మీరు గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకుంటేనే మంచిది. చక్రగతి వృద్ధి కారణంగా మంచి రాబడులు మీరు పొందవచ్చు.

డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీకు వచ్చే డివిడెండ్‌లను మీరు ఖర్చు పెట్టేయడమో, లేదా తక్కువ రాబడులు వచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. మీరు గ్రోత్ ఆప్షన్ ఎంచుకున్నా, డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్నా, మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏడాది దాటితే  మీరు ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement