మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఎన్నికల ప్రభావం ఎంత? | How Much Electoral Impact on Mutual Funds? | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఎన్నికల ప్రభావం ఎంత?

Published Mon, Mar 11 2019 1:00 AM | Last Updated on Mon, Mar 11 2019 1:00 AM

How Much Electoral Impact on Mutual Funds? - Sakshi

త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని మిత్రులంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రానున్న మూడేళ్లలో స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఎలా ఉండబోతోంది ?   –సాగర్, హైదరాబాద్‌  
ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే.. స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఒక పూర్తి కాలపు మార్కెట్‌ సైకిల్‌లో మంచి రాబడులే సాధిస్తాయి. మార్కెట్‌ పతన సమయాల్లో మాత్రం తీవ్రమైన నిరాశకు గురి చేస్తాయి. దీర్ఘకాలం దృష్ట్యా చూస్తే, స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులేనిస్తాయి. భారత్‌ లాంటి దేశంలో చిన్న, మద్య తరహా కంపెనీలు ఎదగడానికి, లాభాలు ఆర్జించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే రిస్క్‌ కూడా అధికంగానే ఉంటుంది. త్వరలో ఎన్నికలు రానుండడం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు, రానున్న మూడేళ్లలో ఎలా ఉంటాయి అనే అంశాలను పక్కన పెట్టండి. సాధారణంగా ఒక మార్కెట్‌ ఫుల్‌ సైకిల్‌ మూడు నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది.  ఈ పూర్తి మార్కెట్‌ సైకిల్‌లో స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులే ఇస్తాయి. కాబట్టి ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయగలిగి, ఒడిదుడుకులను ఎదుర్కొనగలిగితే స్మాల్, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయోచ్చు.   

నేను గత ఏడాది నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అసలు ఏ కేటగిరీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? ఈ విషయంలో గమనంలోకి తీసుకోవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా ?   
–ప్రియ దర్శిని, విశాఖపట్టణం  

ఏ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనేది కొన్ని కీలకమైన విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలు ఏంటి ?, మీరు ఎంత మేర పెట్టుబడులు పెట్టగలరు?, ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు ?, మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయంలో మీకున్న అనుభవం.. ఇలాంటి విషయాలను బట్టి ఎలాంటి కేటగిరీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలో నిర్ణయించుకోవచ్చు. మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, పన్ను ఆదా మీ ఆర్థిక లక్ష్యాల్లో ఒకటైతే, మీరు ట్యాక్స్‌ సేవింగ్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి. మీరు స్వల్పకాలమే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే,  లిక్విడ్‌ ఫండ్స్‌ను గాని ఆల్ట్రా–షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి.  మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదటిసారైతే, మొదటగా అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌తో మొదలు పెట్టాలి. మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, మార్కెట్‌ పట్ల కొంచెం అవగాహన ఉండి ఉంటే, మల్టీక్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.  

నా వయస్సు 28 సంవత్సరాలు. పన్ను మినహాయింపులకు సంబంధించి సెక్షన్‌ 80సీ పరిమితి అయిపోయింది. అదనపు పన్ను ప్రయోజనాల కోసం నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌(ఎన్‌పీఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? లేకుంటే  దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కేటాయించే సొమ్ములను రెగ్యులర్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? తగిన సలహా ఇవ్వండి.  – యూనస్, విజయవాడ  
అదనపు పన్ను ప్రయోజనాల కోసం ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే మంచిది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ మీ ట్యాక్స్‌ స్లాబ్‌ను తగ్గించగలిగేటట్లు ఉంటే, ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసే నిర్ణయమే సరైనదే. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 సి కింద రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఎన్‌పీఎస్‌లో రూ.50,000 వరకూ ఇన్వెస్ట్‌ చేస్తే  సెక్షన్‌ 80 సీసీడీ(1బీ) కింద అదనంగా ఈ మొత్తానికి పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. గతంలో కంటే ఇప్పుడు ఎన్‌పీఎస్‌ మరింత ఆకర్షణీయంగా మారింది. రానున్న కాలంలో మరింత ఆకర్షణీయంగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) విధించడంతో ఈక్విటీల ఆకర్షణ ఒకింత తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు ఎన్‌పీఎస్‌ రెండు అంశాల్లో మెరుగుపడింది. మొదటిది మీరు రిటైరైన తర్వాత ఎన్‌పీఎస్‌లో పోగుపడిన మొత్తంలో మీరు విత్‌డ్రా చేసుకునే 60 శాతం మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. రెండోది ఈక్విటీ కేటాయింపులకు సంబంధించిన గరిష్ట పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచడం, ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, మీరు ఎన్‌పీఎస్‌లోనే ఇన్వెస్ట్‌ చేయండి.  

ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో పదికి పైగా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఈ సంఖ్యను 5కు తగ్గిద్దామనుకుంటున్నాను. పాత  ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొత్తగా ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకొని, వాటికి బదిలీ చేద్దామనుకుంటున్నాను. ఒకేసారి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయమంటారా? లేక సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌
(సిప్‌)ను అనుసరించమంటారా?   – జాన్సన్, నెల్లూరు  

సాధారణంగా ఒక ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో ఐదు నుంచి ఏడు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉంటే సరిపోతుంది. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాల కోసం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, మల్టీక్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ సమ్మేళనంగా మీ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. పోర్ట్‌ఫోలియో పునర్వ్యస్థీకరణలో భాగంగా పాత ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొత్త ఫండ్స్‌లోకి బదిలీ చేయడం కంటే, మీ పోర్ట్‌ఫోలియోలోనే సర్దుబాటు చేసే అవకాశాన్నీ పరిశీలించండి. మంచి రాబడులు లేని ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మంచి రాబడలు వచ్చే ఫండ్స్‌కు మళ్లించండి. ఒక వేళ మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌అన్ని సంతృప్తికరమైన రాబడులు ఇవ్వలేని పక్షంలో అన్ని కొత్త ఫండ్స్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయండి. దీనికి సిస్టమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌(ఎస్‌టీపీ) విధానాన్ని అనుసరించండి.
ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement