సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? | Investing in Sectoral Funds? | Sakshi
Sakshi News home page

సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?

Published Mon, Sep 3 2018 2:06 AM | Last Updated on Mon, Sep 3 2018 2:06 AM

Investing in Sectoral Funds? - Sakshi

నేను స్వల్పకాల అవసరాల నిమిత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. రెండు మంచి  ఫండ్స్‌ సూచించండి.     – కిరణ్, విజయవాడ  
సాధారణంగా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మీకు మంచి రాబడులు వస్తాయి. అయితే స్వల్పకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం కూడా కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. స్వల్ప కాలానికే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు పెద్దగా రిస్క్‌ తీసుకోవలసిన అవసరం లేదు. దీని కోసం లిక్విడ్, ఆల్ట్రా షార్ట్‌–టర్మ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మీరు 1–2 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేద్దామనుకంటే, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ జోలికి వెళ్లవద్దు.

వడ్డీ రేట్ల విషయంలో రిస్క్‌ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ పరిస్థితుల్లో ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉన్న, డైరెక్ట్‌ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. డైరెక్ట్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, వ్యయాలు తక్కువగా ఉండటమే కాకుండా రాబడులు కూడా మంచిగా వస్తాయి. పిల్లల పైచదువులు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు వంటి ఆర్థిక లక్ష్యాల సాధన కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తేనే మంచిది.

ఇక మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, మీరు ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌కు వర్తించే పన్ను నియమాలే  ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌కు కూడా వర్తిస్తాయి. ఈ ఫండ్స్‌ తమ మొత్తం నిధుల్లో మూడో వంతును పూర్తిగా ఈక్విటీలోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. అయితే ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌లో మీరు 2–3 ఏళ్ల పాటే ఇన్వెస్ట్‌ చేస్తే, మీకు లాభాల కంటే నష్టాలే వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ కేటగిరిలో మీరు రెండు ఫండ్స్‌–యాక్సిస్‌ ఈక్విటీ సేవర్, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌ను పరిశీలించవచ్చు.  

నేను ఐటీ టెక్నాలజీ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఇన్వెస్ట్‌  చేయాలనుకుంటున్నాను. దీని కోసం టాటా ఇండియా డిజిటల్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకున్నాను.  నా ఎంపిక సరైనదేనా? భవిష్యత్తులో ఈ ఫండ్‌ బాగోగులు ఎలా ఉండబోతున్నాయి?           – సలీమ్, విశాఖపట్టణం  
మీరు ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. ఆ ఫండ్‌ తన నిధుల్లో అత్యధిక మొత్తాన్ని ఏ రంగానికి చెందిన కంపెనీల్లో అయినా ఇన్వెస్ట్‌ చేసే వీలు, వెసులుబాటు ఉండాలి. కానీ సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఆ వెసులు బాటు ఉండదు. ఉదాహరణకు మీరు ఫార్మా లేదా ఐటీ లేదా ఇన్‌ఫ్రా వంటి సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. ఈ సçదరు సెక్టోరియల్‌ ఫండ్‌ తన నిధుల్లో అత్యధిక భాగాన్ని సంబంధిత రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

అంటే ఐటీ ఫండ్‌  అయితే ఐటీ కంపెనీల్లో, ఫార్మా ఫండ్‌ అయితే ఫార్మా కంపెనీల్లో. అయితే మార్కెట్‌ చక్రీయం అని మీరు మరచిపోవద్దు. కొన్ని సంవత్సరాల్లో ఐటీ కంపెనీల హవా నడవవచ్చు. మరి కొన్నేళ్లు ఈ కంపెనీల షేర్లు స్తబ్ధుగా కదలాడవచ్చు. పనితీరు మందగించినప్పటికీ, వృద్ధి అవకాశాలు అంతగా లేనప్పటికీ, సదరు సెక్టోరియల్‌ ఫండ్‌ మేనేజర్లు ఆయా రంగాల కంపెనీల షేర్లలోనే బలవంతంగా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంది. ఇది మీ రాబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనిని అధిగమించాలంటే డైవర్సిఫికేషన్‌ అవసరం. అందుకని సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదని చెప్పవచ్చు.  

నేను గత కొంత కాలంగా నెలకు రూ.10,000 చొప్పున హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉన్నాను. ఈ రెండు ఫండ్స్‌లో మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.4.5 లక్షలకు చేరాయి. నా కూతురి ఉన్నత విద్యావసరాల కోసం నాకు మరో రెండేళ్లలో రూ.7–8 లక్షల వరకూ డబ్బులు అవసరమవుతాయి.  ఈ ఫండ్స్‌లో సిప్‌లను రూ.20,000కు పెంచమంటారా ? – రాబర్ట్, సికింద్రాబాద్‌  
ముందుగా మీకు కచ్చితంగా ఎంత మొత్తం అవసరమో లెక్కలేయండి. వచ్చే ఏడాది మీ కూతురి ఉన్నత విద్యావసరాల కోసం మీకు రూ. 8 లక్షలు అవసరమవుతాయని అంటున్నారు.  మొదటి ఏడాదిలోనే అంత మొత్తం డబ్బులు అవసరమా? కాదా అనేది చెక్‌ చేసుకోండి. లేకుంటే మొత్తం కోర్సు పూర్తయ్యేవరకూ ఈ మొత్తం అవసరమా లేదా అనే విషయాన్ని ఒకసారి మదింపు చేయండి.

ఒక వేళ ఈ మొత్తం డబ్బులు 3–4 సంవత్సరాల కాలానికి అవసరమనుకుందాం. మీకు మొదటి ఏడాది రూ. 2 లక్షల వరకూ డబ్బులు అవసరమవుతాయి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి నెలకు కొంత చొప్పున 12 నెలల వ్యవధిలో రూ.2  లక్షలు విత్‌డ్రా చేసుకోండి. రెండో సంవత్సరంలో మీకు మరో రూ.2 లక్షలు అవసరమవుతాయి. దీని కోసం మీరు రికరింగ్‌ డిపాజిట్,  లేదా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. ఏడాది కాలంలో మీరు రూ.2 లక్షల వరకూ ఆదా చేయగలుగుతారు. ఇది వచ్చే ఏడాది మీ పాప ఉన్నత విద్యావసరాలకు సరిపోతాయి. దీంతో ప్రస్తుత ఇన్వెస్ట్‌మెంట్‌ నిధులను మీరు వాడుకోవలసిన అవసరం లేదు.  ఈ తర్వాత మీకు ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ భారీ నిధిగా మారుతుంది.   


- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement