నా ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతా మెచ్యూరిటీ దగ్గరకు వచ్చింది. దీన్ని మరో ఐదేళ్లు పొడిగించమంటారా? లేక ఈ పీపీఎఫ్ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? – స్టీఫెన్సన్, హైదరాబాద్
పీపీఎఫ్ అనేది స్థిరాదాయ సాధనంలో ఇన్వెస్ట్ చేసే 15 ఏళ్ల సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) అని చెప్పవచ్చు. మీరు ఉద్యోగంలో చేరగానే మీ పెద్దవాళ్లు, మిత్రులు మొదటగా ఇచ్చే సలహా.. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయమనే. ఇది సురక్షితమూ, రిస్క్ పెద్దగా లేని ఇన్వెస్ట్‌మెంట్ అని వారి అభిప్రాయం. పదిహేనేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... ఈ మొత్తాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వచ్చిన రాబడుల కంటే అధిక రాబడులే వస్తాయి. ఓ మోస్తరు మ్యూచువల్ ఫండ్‌లో కూడా ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్‌లో వచ్చే రాబడుల కంటే కనీసం ఒకటిన్నర మొత్తం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఈక్విటీలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తే, నష్టభయం తగ్గడమే కాకుండా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ సురక్షితం అవుతాయి. కనీసం పదిహేనేళ్లపాటు ఈక్విటీల్లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తే, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ రిస్క్ కాదని చెప్పవచ్చు. మీలాగా పదిహేనేళ్ల పాటు పీపీఎఫ్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసినట్లుగా, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, మీరు నష్టపోయే ప్రశ్నే లేదు. పీపీఎఫ్ ఖాతాను మరో ఐదేళ్లు పొడిగించడం కంటే కూడా ఈ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
అయితే పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ మొత్తాన్ని కనీసం 12 నుంచి 18 సమాన భాగాలుగా విభజించి ఆ మొత్తాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ప్రతి ఏడాది రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు దీనికి బదులుగా పన్ను ఆదా చేసే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పదిహేనేళ్లపాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే, పీపీఎఫ్‌లో వచ్చే రాబడుల కంటే మీకు కనీసం ఒకటిన్నర లేదా రెండు రెట్లు అధిక రాబడులు వస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తే పన్ను భారం తప్పించుకోవచ్చు? – హుస్సేన్, విజయవాడ
మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఎప్పుడు విక్రయించినా, వాటిపై వచ్చే లాభాలపై ఆదాయం పన్ను చెల్లించాల్సిందే. ఉదాహరణకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను తీసుకుంటే, ఈ ఫండ్స్‌ను మీరు కొనుగోలు చేసిన ఏడాది తర్వాత విక్రయించారనుకుందాం. ఈ విక్రయాలపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా(ఎల్‌టీసీజీ–లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్)గా పరిగణిస్తారు. పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలపై వచ్చే మూలధన లాభాలపై పన్నుకు రూ.లక్ష వరకూ మినహాయింపు ఉంటుంది. ఈక్విటీలపై వచ్చే మూలధన లాభాలు రూ. లక్ష దాటితేనే మీరు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ ఫండ్స్ యూనిట్లను ఏడాదిలోపే విక్రయించారనుకుందాం. ఈ విక్రయాలపై వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్‌లు ఇచ్చిందనుకుందాం. 10 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను సర్‌చార్జీని, సెస్‌ను కూడా కలుపుకొని, ఈ మొత్తాన్ని మినహాయించుకొని ఆ తర్వాతనే మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లిస్తారు.
ఇక ఈక్విటీ యేతర మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, మీరు కొనుగోలు చేసిన ఈ ఫండ్స్‌ను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. 20 శాతం పన్ను (ఇండెక్సేషన్ ప్రయోజనంతో) చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోపే విక్రయిస్తే, వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీ ఆదాయానికి కలపి మీకు వర్తించే ఆదాయపు పన్ను శ్లాబ్‌ను అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
డెట్‌ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్‌లపై 25 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌కు సర్‌చార్జీ, సెస్‌లను కూడా కలిపి ముందుగానే మినహాయించుకొని, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ డివిడెండ్ ఆదాయం రూ.10 లక్షలకు మించితే అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఫండ్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. దీంట్లో సిప్‌లు ఆపేద్దామనుకుంటున్నాను. ఈ ఫండ్‌లో ఇప్పటివరకూ జమ అయిన మొత్తాన్ని ఏం చేయమంటారు? – శ్రీకాంత్, విశాఖపట్టణం
ఆశించిన స్థాయిలో రాబడులు లేనప్పుడు సదరు ఫండ్‌లో సిప్‌లు ఆపేయవచ్చు. ఆ ఫండ్‌లో ఇప్పటివరకూ జమ అయిన మొత్తాన్ని మరో మంచి ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. అయితే ఇలా మార్చుకునేటప్పుడు పన్ను అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసిన కాలం ఏడాదిలోపే అయితే, మీరు 15% స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్ కాలం ఏడాది దాటితే మీరు 10% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ లాభాలు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష దాటితేనే ఈ పన్ను భారం ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన నిర్ణయం (పన్ను భారం తక్కువగా ఉండేలా) తీసుకోగలరు.
- ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment