
షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ బెటరా..?
ఇల్లు కొందామని రూ.4 లక్షలు పోగేశాను. కానీ దానిని ఏడాది పాటు వాయిదా వేశాను...
ఇల్లు కొందామని రూ.4 లక్షలు పోగేశాను. కానీ దానిని ఏడాది పాటు వాయిదా వేశాను. ఈ సొమ్మును బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో వేద్దామనుకుంటున్నాను. కానీ మిత్రుడొకరు ఆల్ట్రా షార్ట్‌టర్మ్ డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచించాడు. సేవింగ్స్ ఖాతాలో అయితే 4 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని, ఈ డెట్‌ఫండ్స్‌లో అయితే అంతకంటే ఎక్కువే రాబడి వస్తుందని పేర్కొన్నాడు. అతడు చెప్పింది నిజమేనా?
ఈ డెట్‌ఫండ్స్‌కు సంబంధించి ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? వివరించగలరు.
-ముక్తేశ్వర రావు, నిజామాబాద్.
మీ మిత్రుడు చెప్పింది నిజమే. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కంటే ఆల్ట్రా షార్ట్‌టర్మ్ డెట్‌ఫండ్స్‌లో మంచి రాబడులే వస్తాయి. స్వల్పకాలిక వడ్డీరేట్ల ప్రయోజనాలను వినియోగించుకోవడం వల్ల ఇవి మంచి రాబడులనిస్తాయి. కార్పొరేట్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే వీటికి కొంత రిస్క్ లేకపోలేదు. వడ్డీరేట్లు అధికంగా ఉన్నందున గత ఏడాది కాలంలో ఈ ఫండ్స్ చెప్పుకోదగ్గ రాబడుల (9 శాతానికి పైగా)నిచ్చాయి. వడ్డీరేట్లు తగ్గితే ఈ రాబడులు తగ్గుతాయి. అయితే బ్యాంక్ సేవింగ్స్ ఖాతా రాబడుల(4 శాతం) కంటే అధికంగానే వస్తాయని చెప్పవచ్చు.
ఇక పన్ను విషయానికొస్తే, సేవింగ్స్ ఖాతా నుంచి ఆర్జించిన వడ్డీలో రూ.10,000 వరకూ ఎలాంటి పన్ను బాధ్యత ఉండదు. అయితే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడు సంవత్సరాల లోపు ఉపసంహరించుకుంటే ఈ ఫండ్స్ రాబడులపై పన్ను మీ ఆదాయపు పన్ను స్లాబ్(10/20/30 శాతంగా)ననుసరించి ఉంటుంది. గ్రోత్ ఆప్షన్ తీసుకుంటే ఈ స్థాయి పన్ను మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే అదనంగా 28.33 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) కూడా చెల్లించాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఖాతాపై వడ్డీరేటు 4 శాతం, ఆల్ట్రాషార్ట్ టర్మ్ డెట్ ఫండ్ రాబడి 8 శాతంగా భావించి ఏడాది కాలానికి ఈ రెండు మార్గాల్లో వచ్చే రాబడుల వివరాలను కింది పట్టికలో పొందుపరిచాము. ఆదాయపు పన్ను స్లాబ్ 20 శాతంగా పరిగణించాం.
నేను ఒకేసారి పెద్ద మొత్తాన్ని యాక్సిస్ ఈక్విటీ, యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రు ఫోకస్‌డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఏజెంట్‌కు ఎంత మొత్తం కమీకషన్ చెల్లించాల్సి ఉంటుంది. కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి పెట్టే మార్గాలేమైనా ఉన్నాయా? ఒకవేళ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)విధానాన్ని అనుసరిస్తే కంపెనీకి గానీ, ఏజెంట్‌కు గానీ ట్రయల్ కమీషన్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందా?
- మనోరమ, విజయవాడ
మీరు పేర్కొన్న స్కీమ్‌లకు సంబంధించి డెరైక్ట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏజెంట్లకు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సి ఉండదు. ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా సిప్ విధానంలో గానీ ఇన్వెస్ట్ చేసినా ఇది వర్తిస్తుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్ ద్వారా కానీ, మ్యూచువల్ ఫండ్ హౌస్ బ్రాంచ్ ఆఫీస్ ద్వారా గానీ ఈ డెరైక్ట్ ప్లాన్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్లకు మ్యూచువల్ ఫండ్ సంస్థల నుంచి రెండు రకాలైన కమీషన్‌లు లభిస్తాయి. ఒకటి అప్‌ఫ్రంట్ కమిషన్. దీనిని మ్యూచువల్ ఫండ్ సంస్థ చెల్లిస్తుంది. ఇంకొకటి ట్రయల్ కమీషన్(ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియోలోనే ఇది ఉంటుంది).. మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో కొనసాగినంత కాలం ఇది ఏజెంట్‌కు చెల్లిస్తారు. మీరు కనుక డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి, ఎలాంటి కమీషన్‌లు చెల్లించాల్సి ఉండదు.
ఎఫ్‌ఎంపీ(ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్)ల ఇన్వెస్ట్‌మెంట్స్ ఏడాదికి మించితేనే దీర్ఘకాల మూలధన లాభాల పన్నును గతంలో చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ కాలాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచారు. అంటే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు పొందాలంటే ఎఫ్‌ఎంపీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది కాలం కాక మూడేళ్లపాటు కొనసాగించాలి. అయితే బడ్జెట్‌కు ముందు మెచ్యూర్ అయ్యే వాటికి పాత నిబంధనలే వర్తిస్తాయని ఆర్థిక మంత్రి గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నా ఎఫ్‌ఎంపీ ఇన్వెస్ట్‌మెంట్స్ 2014, జూలై తర్వాత మెచ్యూర్ అయ్యాయి. నేను దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేక స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను.. ఏది చెల్లించాలి?
-భవానీ శంకర్, హైదరాబాద్
2014, జూలై 10కు ముందు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌ఎంపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పాత పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం ఏడాది కాలానికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. 2014, జూలై 10 తర్వాత మెచ్యూర్ అయ్యే డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లపాటు కొనసాగిస్తేనే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.