
ప్రజారుణంతో ఏకంగా రూ.1.03 లక్షల కోట్ల అప్పులు
భారీగా మార్కెట్ అప్పులు, కేంద్ర రుణాలు, పన్నులు, పన్నేతర వాతలు
జనం జేబులను గుల్ల చేయడమే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలు
రెవెన్యూ వ్యయం రూ.2.51 లక్షల కోట్లు
మూలధన వ్యయం రూ.40,635 కోట్లు
రెవెన్యూ లోటు 33,185 కోట్లు
ద్రవ్య లోటు రూ.79,926 కోట్లు
సాక్షి, అమరావతి: భారీగా మార్కెట్ అప్పులు, కేంద్రం నుంచి రుణాలతో ప్రజలపై పెనుభారం మోపడమే లక్ష్యంగా 2025–26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం శాసనసభకు సమర్పించారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్‌లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రజారుణం కింద ఏకంగా రూ.1.03 లక్షల కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్‌లో స్పష్టం చేశారు.
పన్నుల ఆదాయం రూపంలో వచ్చే ఆర్థిక ఏడాది అదనంగా రూ.15 వేల కోట్లు వస్తాయని, పన్నేతర ఆదాయం ద్వారా అదనంగా రూ.12 వేల కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. 2024–25 రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.94,966 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో సొంత పన్నుల ఆదాయం రూ.1,09,006 కోట్లుగా అంచనా వేశారు.
పన్నేతర ఆదాయం 2024–25లో రూ.7,018 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో ఏకంగా రూ.19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే పన్నులు, పన్నేతర రూపంలో ప్రజల జేబులను ఖాళీ చేయడమే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలున్నట్లు వెల్లడవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.81,956.50 కోట్ల అప్పులు, కేంద్రం నుంచి రూ.21,700 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్‌లో స్పష్టం చేశారు. అంటే మొత్తం ప్రజా రుణం కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,03,656.50 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు బడ్జెట్‌లో ఆ ఊసే లేకుండా చేశారు.
ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. పైగా భారీ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు బడా సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కోసం బడ్జెట్‌లో ఏకంగా రూ.2000 కోట్లు కేటాయించడం గమనార్హం. మొత్తం మీద పన్నుల రూపంలో ఇటు భారీ ఆదాయం, అటు భారీ అప్పులతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.51 లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు.
రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్‌డీపీలో 1.82 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్‌డీపీలో 4.38 శాతమని చెప్పారు. మద్యం ద్వారా 2025–26లో రూ.27,097 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.13,150 కోట్లు ఆదాయం రానుందని అంచనా వేశారు.

Comments
Please login to add a commentAdd a comment