అత్యవసర నిధికి ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలి? | Where is the emergency fund, how much to invest? | Sakshi
Sakshi News home page

అత్యవసర నిధికి ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలి?

Published Mon, Sep 12 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

అత్యవసర నిధికి ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలి?

అత్యవసర నిధికి ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలి?

నేను 2010 నుంచి బీఎస్‌ఎల్‌ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఇప్పటివరకూ రూ.3,95,000 పెట్టుబడులు పెట్టాను. వీటి ప్రస్తుత విలువ రూ.4,10,000గా ఉంది. ఆరేళ్లలో వచ్చిన రాబడులు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా? వైదొలగమంటారా ?
- రాఘవ, విజయవాడ

 
బీఎస్‌ఎల్‌ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్.. యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్) కిందకు వస్తుంది. ఈ యులిప్‌లు మనకు తగిన బీమా రక్షణను ఇవ్వలేవు. అలాగే ద్రవ్యోల్బణాన్ని ధీటుగా తట్టుకునే రాబడులను ఇవ్వలేవు. పైగా ఈ తరహా ప్లాన్‌లో చార్జీల భారం అధికంగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసే దాంట్లోంచి ఈ చార్జీలను మినహాయించుకొని మదుపు చేస్తారు. ఈ పాలసీ మీకు ఏడాదికి కనీసం 1 శాతం కంటే తక్కువ రాబడినే ఇచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసినా ఇంతకంటే ఎక్కువ రాబడులే వచ్చేవి. అందుకని ఈ ప్లాన్ నుంచి వైదొలగడమే ఉత్తమం.

ఈ ప్లాన్‌నుంచి వైదొలగి, తగిన బీమా,  తక్కువ ప్రీమియమ్ ఉండే టర్మ్ బీమా పాలసీ తీసుకోండి.  ఇక మీరు ఈ పాలసీ తీసుకొని ఐదేళ్లు పూర్తయింది కాబట్టి, ఈ పాలసీని సరెండర్‌చేస్తే ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడం ద్వారా మీరు పొందిన మొత్తాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మూడు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.
 
అత్యవసరాల కోసం ఎంత మొత్తాన్ని కేటాయించాలి? ఇలా కేటాయించే సొమ్ములను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? దీని కోసం బ్యాంక్ సేవింగ్స్ ఖాతా తెరిస్తే సరిపోతుందా?
 - విజయ్, రాజమండ్రి

అంచనా వేయలేని దుర్ఘటన కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మనల్ని సంరక్షించేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మూడు నుంచి ఆరు నెలల ఇంటి ఖర్చులకు సరిపడేలా ఈ అత్యవసర నిధిని తయారు చేసుకోవాలి. తక్షణం సొమ్ము చేసుకునేలా ఈ నిధి ఉండాలి. బ్యాంక్ డిపాజిట్లు, స్వీప్ ఇన్ సౌకర్యమున్న సేవింగ్స్ ఖాతాలో ఇన్వెస్ట్ చేయడం లేదా లిక్విడ్ ఫండ్స్‌లో మదుపు చేయడం.. అత్యవసర నిధి ఏర్పాటు కోసం పరిశీలించదగ్గ మార్గాలు. మీ మొత్తం పెట్టుబడిలో కొంత మొత్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా స్వీప్ ఇన్ సౌకర్యంగా ఉంచుకోవాలి.  మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక్క రోజు నోటీసు ద్వారా ఈ లిక్విడ్ ఫండ్ నుంచి మీ సొమ్ములు తీసుకోవచ్చు.
 
నా కోడలు సాధారణ గృహిణి, అందువల్ల ఆమెకు టర్మ్ బీమా పాలసీకి అర్హత లేదు. కొన్ని బీమా కంపెనీలు ఈ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వాటికి ప్రీమియమ్ అధికంగా ఉంది. ఎందుకు ఈ విచక్షణ?
- కామేశ్వరరావు, వరంగల్
 
చాలా కంపెనీలు గృహిణులకు టర్మ్ బీమా పాలసీలు ఆఫర్ చేయడం లేదు. గృహిణులు ఎలాంటి ఉద్యోగాలు చేయకపోయినా సరే, కుటుంబానికి సంబంధించి ఎన్నో బరువు బాధ్యతలు మోస్తుంటారు. ఈ బాధ్యతల ఆర్థిక విలువ ఎంతగానో ఉంటుంది. సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆర్థిక భరోసా కల్పించడమే బీమా ఉద్దేశమని బీమా కంపెనీల వాదన. గృహిణులకు ఎలాంటి ఆదాయం లేనందున సాంకేతికంగా టర్మ్ బీమా పాలసీలకు గృహిణులు అనర్హులని పలు బీమా కంపెనీలు భావిస్తున్నాయి.

ఏగాన్ లైఫ్ వంటి  కొన్ని బీమా సంస్థలు గృహిణులకు కూడా టర్మ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఆ గృహిణి బీమాను భర్త బీమా రక్షణతో అనుసంధానం చేసిన పాలసీలనే ఈ సంస్థ ఆఫర్‌చేస్తోంది. పలు కంపెనీలు బీమా, పెట్టుబడి కలగలపిన ఎండోమెంట్ ప్లాన్‌లు, యులిప్‌లను గృహిణులకు ఆఫర్ చేస్తున్నాయి.  ఈ యులిప్, ఎండోమెంట్ ప్లాన్‌లు స్వల్పమైన బీమాను మాత్రమే కవర్ చేస్తాయి. పెపైచ్చు వీటిపై వచ్చే రాబడులు అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
 
నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాను. నెలకు రూ.10,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. మా పాప ఉన్నత విద్య అవసరాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీంట్లో డివిడెండ్, గ్రోత్.. రెండు ఆప్షన్లు ఉన్నాయి. డివిడెండ్లపై ఎలాంటి పన్నులు లేనందున, డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుందామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా?                                         
- రజని, హైదరాబాద్
 

మీ నిర్ణయం సరైనది కాదు. నెల లేదా మూడు నెలలకొకసారి మీకు సొమ్ము అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు రిటైరైన తర్వాత ఇంటి ఖర్చులకు, వైద్య అవసరాలకు మీకు నెలవారీ కొంత మొత్తం అవసరమవుతుంది. ఇలాంటి అవసరాలున్నప్పుడు మాత్రమే డివిడెండ్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు మీ పాప ఉన్నత విద్య అవసరాల కోసం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారు. ఇది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక అవసరాల కోసం గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫలితంగా మీకు చక్రవడ్డీ ప్రయోజనాలు లభిస్తాయి.

ఒక వేళ మీరు డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారనుకుందాం. మీకు వచ్చే డివిడెండ్ ఆదాయం మీకు తెలియకుండానే ఖర్చు చేసేస్తారు. లేదా అనుదుత్పాదక అవసరాల కోసం వినియోగిస్తారు. ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లో వచ్చే డివిడెండ్లపై ఎలాంటి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన డివిడెండ్ లేదా గ్రోత్.. ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను భారం ఉండదు. (ఏడాది తర్వాత) అందుకని పన్ను భారం లేదన్న కారణంగా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement