
నేను నా ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్–పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) ఖాతాను రెండు సార్లు పొడిగించాను. ఇలా పొడిగించిన పీపీఎఫ్ ఖాతాలపై వచ్చే రాబడులపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? లేక పన్ను మినహాయింపులు లభిస్తాయా ? – కృష్ణ, విజయవాడ
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) ఖాతాను రెండు సార్లు పొడిగించినప్పటికీ, ఈ ఖాతా రాబడులపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. పీపీఎఫ్‌ను పన్ను విషయంలో ‘ట్రిపుల్ ఈ’(ఎగ్జెంప్ట్, ఎగ్జెంప్ట్, ఎగ్జెంప్ట్) గా పరిగణిస్తారు. అంటే అన్ని దశల్లో పీపీఎఫ్ ఖాతాకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ దశలోనూ, అది పెట్టుబడి కాలంలోనూ, విత్‌డ్రాయల్ సమయంలోనూ పన్ను మినహాయింపులు పొందవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇక పెట్టుబడి కాలంలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మరోవైపు పీపీఎఫ్ ఖాతా మెచ్యురై, ఆ సామ్ములను మీరు ఉపసంహరించుకునేటప్పుడు కూడా మీరు నయాపైసా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. రెగ్యులర్ ఖాతాలకే కాకుండా, పొడిగించబడిన పీపీఎఫ్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుంది.
నేను కొంత మొత్తాన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? తగిన సలహా ఇవ్వగలరు. – జాన్సన్, వరంగల్
మంచి రాబడుల కోసం ఇన్వెస్ట్‌చేయడానికి ఉన్న ఉత్తమ సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లు ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడులు రావడమే కాకుండా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అత్యుత్తమ ఇన్వెస్ట్‌మెంట్ విధానం. ఇదే ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు కూడా వర్తిస్తుంది.
మీరు నెలకు కొంత మొత్తం సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తేనే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చు. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ తర్వాత మార్కెట్ పతనమైతే మీకు భారీ నష్టాలు వచ్చే అవకాశాలుంటాయి. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు.
మీ దగ్గర పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయదగ్గ సొమ్ములుంటే వాటిని కనీసం 6–12 భాగాలుగా విభజించి నెలకు కొంత మొత్తం చొప్పున సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. చాలా మంది కేవలం పన్ను ఆదా కోసమే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ, సంపద సృష్టికి ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మంచి మార్గమని చెప్పవచ్చు. వీటికి లాక్–ఇన్ పీరియడ్ ఉండటం ప్రయోజనకరమే. ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో కనీసం 5–7 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.
నేను షేర్లు, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరంలో షేర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మూలధన నష్టాలు వచ్చాయి. అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో స్వల్పకాలిక లాభాలు వచ్చాయి. షేర్లలో వచ్చిన నష్టాలను, మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చిన లాభాలతో భర్తీ చేసుకోవచ్చా?
– మౌనిక, హైదరాబాద్
షేర్లలో వచ్చిన స్వల్పకాలిక మూలధన నష్టాలను, డెట్ ఫండ్స్‌లో వచ్చిన స్వల్పకాలిక మూలధన లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలతో కూడా భర్తీ చేసుకోవచ్చు.
అయితే ఈ నష్టాల భర్తీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరగదు, ఈ నష్టాలను తర్వాతి ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వార్డ్ చేసి, స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాలతో భర్తీ చేసుకోవచ్చు. ఎనిమిదేళ్ల పాటు ఇలా నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. కానైతే మీరు సకాలంలో ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. మా అమ్మకు బంగారు గాజులు చేయిద్దామనుకుంటున్నాను. అలా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్(ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్)ల్లో పెట్టుబడులు పెట్టమని మిత్రులు కొందరు సలహా ఇస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టవచ్చా ? మంచి రాబడులు వస్తాయా ? – రోహిత్, విశాఖపట్టణం
భారతీయులకు బంగారం అంటే మోజు. అందుకే బంగారు అభరణాలు కొనుగోలు చేస్తుంటారు. మనం వాడుకోవడం కోసం పుత్తడి ఆభరణాలు కొంటాం కానీ, ఇదొక ఇన్వెస్ట్‌మెంట్ అని కూడా అంటూ ఉంటాం. నా దృష్టిలో బంగారం అనేది అనుత్పాదక ఆస్తి. మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్ట్ ఫండ్... ఇలా ఏ రూపంలో ఇన్వెస్ట్ చేసినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు.
కీలకమైన ఆర్థికపరమైన ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఈక్విటీ, లేదా స్థిరాదాయం ఇచ్చే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలే. సావరిన్ గోల్డ్ బాండ్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిని పెట్టుబడులకు పరిశీలించవచ్చు. ఒక పెట్టుబడిగా పుత్తడిని ఎప్పుడూ పరిగణించవద్దు. అలాకాక మీ అమ్మగారికో, భార్యకో, తోబుట్టువుకో, లేక మీ చిన్నారికో వినియోగం కోసం అయితే బంగారం కొనుగోలు చేయండి. అంతేగాని దీనిని ఎప్పుడూ ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడకండి.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment