మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఒకే సంస్థకు చెందిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా ? – సంతోష్, విజయవాడ
డైవర్సిఫికేషన్ ప్రయోజనాల దృష్ట్యా చూస్తే, ఒకే సంస్థకు చెందిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. ఒకటికి మించిన సంస్థల మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. చాలా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు వివిధ ఫండ్స్‌కు ఒకే ఫండ్ మేనేజర్‌తోనూ,, ఒకే రీసెర్చ్ టీమ్‌తోనూ కార్యకలాపాలను కొనసాగిస్తాయి. ఒకవేళ వీరి అంచనాలు తప్పయితే, అది మీ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబడులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
మరోవైపు ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి కీలకమైన ఫండ్ మేనేజర్ వైదొలిగారనుకోండి. ఇది కూడా ఆ సంస్థ ఫండ్స్ అన్నింటిపై తీవ్రంగానూ ప్రభావం చూపుతుంది. అందుకని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండ్స్ విషయంలోనే కాకుండా, మ్యూచువల్ ఫండ్ సంస్థల విషయంలోనూ వైవిధ్యం తప్పనిసరిగా చూపించాల్సిందే. ఈ రోజుల్లో వివిధ కేటగిరి ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి వివిధ సంస్థల నుంచి మంచి ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.
అందుకని కనీసం రెండు లేదా మూడు మ్యూచువల్ ఫండ్ సంస్థలకు చెందిన విభిన్న కేటగిరీల ఫండ్స్– బ్యాలన్స్‌డ్, ఈక్విటీ, మల్టీక్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందుతారు.
నేను పన్నెండేళ్లుగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం ఎస్‌బీఐ బ్లూచిప్, ఐసీఐసీఐ ప్రు ఫోకస్‌డ్ బ్లూచిప్ ఈక్విటీ, ఎల్ అండ్ టీ ఈక్విటీ ఫండ్, కోటక్ సెలెక్ట్ ఫోకస్, ఐసీఐసీఐ ప్రు డైనమిక్ ఫండ్, ఐసీఐసీఐ ప్రు ఎక్స్‌పోర్ట్స్ అండ్ అదర్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ ఫండ్స్ సంఖ్యను తగ్గించుకోవాలనుకుంటున్నాను. వేటి నుంచి వైదొలగాలో తగిన సలహా ఇవ్వండి. – యాదగిరి, హైదరాబాద్
మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫండ్స్ అన్నీ ఒకటి, అరా మినహా మిగిలినవన్నీ చాలా మంచి ఫండ్స్. ఇక ఈ ఫండ్స్ అన్నీ విభిన్నంగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని మల్టీ–క్యాప్, కొన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ సరైన పనితీరు కనబరచకపోయినా, మల్టీ క్యాప్ ఫండ్స్ ఆదుకుంటాయి. ఇలా కాకుండా రెండు మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా సగటున ఒక్కో ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 30 నుంచి 40 వరకూ స్టాక్స్ ఉంటాయి.
మీరు దాదాపు 6 ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటిల్లోని మొత్తం స్టాక్స్ సంఖ్య 200 నుంచి 250గా ఉన్నాయి. ఏ ఫండ్స్‌ను కొనసాగించాలో నిర్ణయం తీసుకోవడానికి మీరు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకే స్టాక్స్ ఉన్న ఫండ్స్‌ను గుర్తించండి. మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫండ్స్ అన్నింటిలోనూ కామన్‌గా ఉన్న స్టాక్స్ దాదాపు 60గా ఉన్నాయి. ఎస్‌బీఐ బ్లూ చిప్, ఐసీఐసీఐ ప్రు ఫోకస్‌డ్ బ్లూచిప్ ఫండ్ల పోర్ట్‌ఫోలియోల్లో 40–45 దాకా స్టాక్స్ ఉన్నాయి.
వీటితో పాటు ఐసీఐసీఐ ప్రు డైనమిక్, ఎల్ అండ్ టీ ఈక్విటీ ఫండ్స్‌లో ఉన్న స్టాక్స్ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఎల్ అండ్ టీ ఈక్విటీ, ఐసీఐసీఐ డైనమిక్ ఫండ్స్ దాదాపు ఒకే రకమైనవే. మరోవైపు ఒక ప్రత్యేకమైన రంగానికే పరిమితమైన ఫండ్స్‌లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయవద్దు. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రు ఎక్స్‌పోర్ట్స్ అండ్ అదర్ సర్వీసెస్. ఈ ఫండ్‌ను నిర్వహించే ఫండ్ మేనేజర్‌కు మీరు పూర్తి మేనేజ్‌మెంట్ ఫీజు చెల్లిస్తున్నారు. కానీ, పరిమితమైన ఒక్క రంగానికే చెందిన సేవలను పొందుతున్నారు. ఒక ఫండ్ మేనేజర్ సేవలు పూర్తిగా వినియోగించుకునేలా మీ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే బాగుంటుంది. ఒకే రకమైన స్టాక్స్ ఉన్న ఫండ్స్ నుంచి, ఒకే రంగానికి పరిమితమైన ఫండ్ నుంచి వైదొలగవచ్చు.
నాకు ఒక పాప వుంది. నేను సింగిల్ పేరెంట్‌ను. పాపకు మంచి విద్యనందించడం కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి డైరెక్ట్‌ప్లాన్‌లను ఎంచుకోవాలా ? రెగ్యులర్ ప్లాన్‌లను ఎంచుకోవాలా? – నవీన, విశాఖపట్టణం
మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెడితే... పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చు. ఇక డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్‌ల విషయానికొస్తే, డైరెక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్‌ల్లో ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ కమీషన్లు ఉండవు. ఈ రెండు ప్లాన్‌ల్లో వ్యయాల తేడా కనీసం 1% ఉంటుంది. అయితే ఇన్వెస్ట్‌మెంట్‌పై తగిన అవగాహన ఉండి, సొంతంగా ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలు తీసుకోగలిగిన వారికి డైరెక్ట్ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి.
ఇక మీరు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం తొలిసారి కాబట్టి ముందుగా రెగ్యులర్ ప్లాన్‌తో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రారంభించడం మంచిది. రెగ్యులర్ ప్లాన్‌ల కోసం మీరు చెల్లించే ఎక్స్‌స్ట్రా వ్యయం, మీరు పొందే అనుభవంతో పోల్చితే తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఒక ఏడాది పాటు రెగ్యులర్ ప్లాన్‌లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మీకు తగిన అనుభవం వస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్ ప్లాన్‌లకు మారిపోవచ్చు.
- ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment