రూ. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా?
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చా ? ఏజెంట్లు, బ్రోకరేజ్ చార్జీలు వంటి బాదరబందీలేమీ లేకుండా ఇలా నేరుగా ఇన్వెస్ట్ చేసే అవకాశముందా? వివరించండి?
- మార్కండేయ, విశాఖపట్టణం
మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ డెరైక్ట్ ప్లాన్‌లను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి 2013, జనవరిలో అందుబాటులోకి తెచ్చింది. ఈ డెరైక్ట్ ప్లాన్స్‌లో ఏజెంట్లు, దళారీల ప్రమేయం లేకుండా మీరు నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫలితంగా ఏజెంట్లకు చెల్లించే కమీషన్ ఆదా అవుతుంది. దీంతో ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉండి ఇన్వెస్టర్లకు ఎక్కువ రాబడులు వస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.
ఎస్‌బీఐ ఫార్మా ఫండ్‌లో నెలకు రూ.10,000 చొప్పున ఏడాది పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను సొంతంగా ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రయోజనకరం?
- మందాకిని, హైదరాబాద్
నెలకు నిర్ణీత మొత్తం-మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసినా, లేకుంటే సిప్ విధానంలో(ప్రతి నెలా ఒక నిర్ణీత తేదీన) ఇన్వెస్ట్ చేసినా.. ఏ విధంగా ఇన్వెస్ట్ చేసినా మీకు దక్కే ప్రయోజనాలు దాదాపు ఒక్కటే. మార్కెట్ స్థితిగతులను బట్టి నెలలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించేంత తీరిక, ఓపిక సాధారణ ఇన్వెస్టర్లకు ఉండవు. అలా కాకుండా మీకు ఆసక్తి ఉండి, నెల మొత్తంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే మొదటి విధానం మంచిదే. అయితే అది కొంచెం కష్టసాధ్యమైన విషయమే. ఈ బాదరబందీలేమీ లేకుండా సిప్ విధానాన్నీ ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏజెంట్ల కమీషన్ ఖర్చు ఉండదు. తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో కారణంగా ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలుంటాయి.
నెలకు రూ.5,000 చొప్పున ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫ్రాంక్లిన్ ట్యాక్స్‌షీల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలాగే ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే కూడా పన్ను మినహాయింపులు లభిస్తాయా?
- శశి, హైదరాబాద్
ఫ్రాంక్లిన్ ఇన్ఫోటెక్ ఫండ్ అనేది టెక్నాలజీ (ఐటీ) స్కీమ్. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభించవు. ఫ్రాంక్లిన్ ట్యాక్స్‌షీల్డ్ అనేది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్). ఇది ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కిందకు వస్తుంది. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను మినహాయింపులు పొందవచ్చు. అయితే ఈ తరహా ట్యాక్స్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లకు మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.
నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాను. నా వయ స్సు 35 సంవత్సరాలు. 32 సంవత్సరాల నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. మాకు రెండేళ్ల పాప ఉంది. నాకు, నా కుటుంబానికి రూ.5 లక్షల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను తీసుకుందామనుకుంటున్నాను. ఈ బీమా కవర్ సరిపోతుందా? నా అవసరాలకు తగిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను సూచించండి?
- శరత్ చంద్ర, చిత్తూరు
మీలాంటి యువ కుటుంబాలు లైఫ్‌టైమ్ రెన్యువల్ ఆప్షన్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. దీంట్లో సబ్-లిమిట్స్, కో పేమెంట్ క్లాజ్ ఉండకూడదు. ఇక మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే, అపోలో మ్యూనిక్ ఈజీ హెల్త్ పాలసీ, ఐసీఐసీఐ లాంబార్డ్ ఐహెల్త్.. పాలసీలను పరిశీలించవచ్చు. మీ కుటుంబంలో పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న చరిత్ర ఉంటే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ తప్పకుండా తీసుకోవాలి. మీరు చెప్పిన రూ.5 లక్షల కవర్ ఇప్పటికి సరిపోతుంది.
మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, వ్యాధులకు సంబంధించి మీ కుటుంబ చరిత్ర, మీ ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత మొత్తానికి బీమా కవర్ కావాలో మీరే సొంతంగా నిర్ణయించుకోవాలి. బీమా కవర్ పెంచుకోవాలనుకున్నప్పుడల్లా, సూపర్ టాప్ అప్ ప్లాన్‌ను ఎంచుకోండి. అపోలో మ్యూనిక్ ఈజీ హెల్త్ పాలసీకి ఏడాది ప్రీమియం రూ.10,523, ఐసీఐసీఐ లాంబార్డ్ ఐహెల్త్ పాలసీకి ప్రీమియం రూ.11,719గా ఉన్నాయి. రెండేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే కొంత డిస్కౌంట్‌ను రెండు పాలసీలు ఆఫర్ చేస్తున్నాయి.