డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌లలో ఏది బెటరు..?
నేను ప్రైవేట్‌రంగంలో పనిచేస్తున్నాను. నా నెల జీతం రూ.25,000. నెలకు రూ.5,000-8,000 వరకూ ఇన్వెస్ట్ చేయగలను. 15 ఏళ్ల తర్వాత రూ.50-60 లక్షల నిధిని ఏర్పాటు చేసుకోవడం నా లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారు ?
- ఖాదర్, హైదరాబాద్
నెలకు రూ.5,000-8,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, 12 శాతం వార్షిక రాబడుల చొప్పున మీరు రూ.25-40 లక్షల నిధిని ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు దీర్ఘకాలం(15 ఏళ్లపాటు) ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది. దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీలు ఇచ్చినంత స్థాయిలో రాబడులను మరే ఇన్వెస్ట్‌మెంట్ సాధనం ఇవ్వలేదు. మంచి రేటింగ్ ఉన్న డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి.
మీ జీతం పెరిగినప్పుడల్లా మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని పెంచండి. ఇలా చేయడం వల్ల మీరు కావాలనుకుంటున్న నిధిని సులభంగా, త్వరగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు... బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, బీఎన్‌పీ పారిబా డివిడెండ్ ఈల్డ్‌ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్, మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, టాటా ఇథికల్ ఫండ్.
ఏదైనా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌ల ఎక్స్‌పెన్స్ రేషియోలో చాలా తేడా ఉంటోంది. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ రెగ్యులర్ ప్లాన్ ఎక్స్‌పెన్స్ రేషియో 2.31 శాతంగా ఉండగా, అదే ఫండ్ డెరైక్ట్ ప్లాన్ ఎక్స్‌పెన్స్ రేషియో 0.82 శాతంగా ఉంది. ఈ రెండు ప్లాన్‌ల మధ్య తేడా 1.49 శాతం. చక్రగతి వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే, తేడా దీర్ఘకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది కదా ! అసలు డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌ల మధ్య ఎక్స్‌పెన్స్ రేషియో విషయంలో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు ఉంటుంది?
- రఘురామ్, విజయవాడ
మ్యూచువల్ ఫండ్ సంస్థలు 2013 నుంచి డెరైక్ట్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ డెరైక్ట్ ప్లాన్‌లలో ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫలితంగా కమీషన్లు, ప్రమోషన్ల వ్యయాలు ఆదా అవుతాయి. ఈ వ్యయాలేమీ లేనందున మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ ప్లాన్‌ల ఎక్స్‌పెన్స్ రేషియో కన్నా డెరైక్ట్ ప్లాన్‌ల ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై సొంతంగా రీసెర్చ్ చేసి, నిర్ణయాలు తీసుకోగలిగిన ఇన్వెస్టర్లు మాత్రమే డెరైక్ట్ ప్లాన్‌లలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా కుదరని పక్షంలో రెగ్యులర్ ప్లాన్‌లలో ఇన్వెస్ట్ చేయాలి.
మరో రెండేళ్లలో రిటైరవుతున్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి, నెలవారీ పెన్షన్ రూ.50,000 వరకూ వస్తుంది. వైద్యపరంగా తగిన కవర్ ఉంటుంది. ఇతర ఖర్చుల కోసం నెలవారీ కొంత ఆదాయం కావాలి. దీని కోసం ఏయే స్కీముల్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది?
- శంకర్, ఆనంతపురం
మీకు నెలవారీ రూ.50,000 వరకూ పెన్షన్ వస్తుంది. ఇక నెలకు ఎంత మొత్తం ఇతర ఖర్చుల కోసం కావాలో నిర్ణయించుకోండి. దాన్ని బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుస్తుంది. ఇక నెలవారీ ఆదాయం కోసం ప్రభుత్వ రంగ సంస్థల పన్ను రహిత బాండ్లు, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్), పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇవి సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు. పన్ను రహిత బాండ్లు మినహా మిగిలిన రెండు సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్నుపోటు తప్పదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా పరిశీలించవచ్చు. పన్ను అంశాల దృష్ట్యా వీటిని ఈక్విటీ ఫండ్స్ గానే పరిగణిస్తారు. వీటిల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్లను ఏడాదికి పైగా కొనసాగిస్తే, ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదు. మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేయగలరు, మీరు భరించగలిగే రిస్క్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏ ఏ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోండి.
నా దగ్గర ప్రస్తుతం రూ.2 లక్షలున్నాయి. వీటిని 15 రోజుల కోసం ఏదైనా లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. 15 రోజుల కాలానికి లిక్విడ్ ఫం డ్ నుంచి ఎంత రాబడులు వస్తాయి. మంచి లిక్విడ్ ఫండ్‌ను సూచించండి? - వెంకట్, ప్రొద్దుటూరు
లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడులు వస్తాయనేది కచ్చితంగా చెప్పలేము. ఈ రాబడులు మార్కెట్ పనితీరును బట్టి ఉంటాయి. ఈ కేటగిరి ఫండ్స్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే, ఈ ఫండ్స్ 8 శాతం వరకూ వార్షిక రాబడులను ఇస్తున్నాయి. గత ఏడు రోజుల్లో 7.3 శాతం, నెల రోజుల్లో 7.05 శాతం చొప్పున రాబడులనిచ్చాయి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఐదేళ్ల తర్వాత పాక్షికంగా లాభాలను స్వీకరించవచ్చా? లేకుంటే పదేళ్ల వరకూ ఎలాంటి లాభాలు స్వీకరించకుండానే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా? అంతర్జాతీయంగా కానీ, దేశీయంగా కానీ ఏవైనా ఆర్థిక విపత్కర పరిస్థితులు తలెత్తితే, ఎలా?
- శశాంక్, గుంటూరు
ప్రస్తుత మార్కెట్ పరస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ పెట్టుబడి వ్యూహాలను నిర్ణయించుకోకూడదు. మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి పెట్టుబడి వ్యూహాలు ఉండాలి. మీ విషయం తీసుకుంటే, మీరు పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఐదేళ్ల తర్వాత ఏదో జరుగుతుందన్న ఆందోళనను పక్కన పెట్టండి. దానికి బదులుగా క్రమం తప్పకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మదింపు చేస్తూ ఉండండి.
మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పనితీరు అదే కేటగిరిలోని ఇతర ఫండ్స్‌తో పోల్చితే సరైన పనితీరు కనబరచకపోతే (ఏడాది కాలంలో) దానికి కారణమేమిటో శోధించండి. పనితీరు సరిగ్గా లేకపోతే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌లోకి మార్చండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ కాలం పదేళ్లు కాబట్టి, ఎనిమిదేళ్లు, లేదా తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాంక్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్ తదితర సురక్షిత సాధనాల్లోకి మార్చుకోండి. ఇలా చేస్తే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉంటే ఆ ప్రభావం మీ ఇన్వెస్ట్‌మెంట్లపై ఉండదు.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్