ఫండ్‌ పనితీరు సరిగ్గా లేకపోతే....? | If the fund performance is not correct? | Sakshi
Sakshi News home page

ఫండ్‌ పనితీరు సరిగ్గా లేకపోతే....?

Published Mon, Jun 18 2018 1:51 AM | Last Updated on Mon, Jun 18 2018 1:51 AM

If the fund performance is not correct? - Sakshi

నేను గత కొంతకాలంగా మ్యూచువల్‌ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇటీవలే నా వేతనం రూ.5,000 వరకూ పెరిగింది. దీంట్లో రూ.3,000 వరకూ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇప్పటికే నా పోర్ట్‌ఫోలియోలో ఎనిమిది మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఈ ఫండ్స్‌ సిప్‌లను పెంచమంటారా ? లేకుంటే కొత్తగా మ్యూచువల్‌  ఫండ్స్‌లో సిప్‌లను ప్రారంభించమంటారా ? – విక్రమ్‌ రెడ్డి, విజయవాడ  
మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణంగా డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందాలంటే గరిష్టంగా ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోతుంది. ఇక మీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఎనిమిది మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎక్కువ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఫండ్స్‌ సంఖ్య ఎక్కువైతే, డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పెద్దగా రావు.

ఎందుకంటే ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియో స్టాక్స్, మరో ఫండ్‌ పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ ఒకే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఆరంభంలో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభిస్తారు. సరైన అవగాహన లేకుండా వాటిని అలాగే కొనసాగిస్తారు. నాలుగు కంటే ఎక్కువ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఇన్వెస్టర్లు ముఖ్యంగా రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.

మొదటిది అన్ని రంగాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ఫండ్స్‌ను ఎంచుకోవాలి. మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల దీనిని దాదాపు సాధించవచ్చు. ఇక రెండోది పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌కు సంబంధించిన ఫండ్‌ మేనేజర్లు కూడా వేర్వేరుగా  ఉండాలి. ఉదాహరణకు మీ పోర్ట్‌ఫోలియోలో ఒకే సంస్థ అందించే మ్యూచువల్‌ ఫండ్స్‌ నాలుగు ఉన్నాయనుకోండి. వీటన్నింటి ఇన్వెస్ట్‌మెంట్‌ స్టైల్‌ ఒకే విధంగా ఉంటాయి. ఇలా కాకుండా చూసుకోవాలి. సాధారణంగా ఒక్కో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ నుంచి ఒక్కో కేటగిరీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదేనని చెప్పవచ్చు.  

నేను వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. 10–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడానికి కొత్త సిప్‌ను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏదైనా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? లేక మరేదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? ఈ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏ ఫండ్‌ను ఎంచుకోవాలో సూచించండి ?     
    – రాగిణి, హైదరాబాద్‌  
స్టాక్‌ మార్కెట్‌తో సంబంధం ఉన్న ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంలోనైనా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, సదరు ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంపై అప్పుడప్పుడూ సమీక్ష తప్పనిసరి. ఈ సుదీర్ఘకాలంలో ఫండ్స్‌ను నిర్వహించే ఫండ్‌ మేనేజర్లు మారుతూ ఉంటారు. ఫండ్‌ మేనేజర్ల మార్పు ఆ ఫండ్‌ పనితీరుపై బాగానే ప్రభావం చూపుతుంది. అందుకని కనీసం రెండు–మూడేళ్లకొకసారైనా ఫండ్‌ సమీక్ష తప్పనిసరి. 10–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడానికి బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ను ఎంచుకోవడం మంచిదే.

మొదటి సారి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవాళ్లు బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌నే ఎంచుకోవాలి.  అయితే మీరు ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తీరుతెన్నులపై మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ను కాకుండా మల్టీక్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి. మీరు కొంచెం రిస్క్‌ తీసుకోగలిగితే, మీ ఇన్వెస్ట్‌మెంట్‌లో కొంత భాగాన్ని మిడ్‌ క్యాప్‌ లేదా స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌కు కూడా కేటాయించండి. అయితే ఈ ఫండ్స్‌లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందవచ్చు.  

నేను ఇటీవలే రిటైరయ్యాను. అద్దెల ద్వారా నెలకు రూ.50,000 వరకూ ఆదాయం వస్తోంది. ఈ మొత్తాన్ని ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌  ఈక్విటీ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్‌ మల్టీక్యాప్, కోటక్‌ సెలెక్ట్‌ ఫోకస్, ఎల్‌ అండ్‌  టీ ఎమర్జింగ్‌ బిజినెసెస్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లూచిప్‌లు ఉన్నాయి. వీటిల్లో గత ఆరు నెలల కాలంలో రెండు ఫండ్స్‌ పనితీరు నేను ఆశించిన స్థాయిలో లేదు. ఆ ఫండ్స్‌ నుంచి వైదొలగి వేరే కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? – చంద్రశేఖర్, విశాఖపట్టణం  
మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫండ్స్‌ అన్నీ మంచి ఫండ్సే. ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. కేవలం ఆరు నెలల పనితీరు ఆధారంగా ఫండ్స్‌ పనితీరుపై ఒక అంచనాకు రాకూడదు. కనీసం ఐదు అంతకు మించిన సంవత్సరాల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.

స్వల్ప కాలంలో ఈక్విటీ ఫండ్స్‌ అంతంత మాత్రం రాబడులు ఇచ్చినా, దీర్ఘకాలంలో మంచి లాభాలనే అందిస్తాయి. ఒక వేళ ఫండ్స్‌ తక్కువ పనితీరు చూపించినా, సిప్‌ విధానంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించారనుకోండి. మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. అందుకని ఆరు నెలల్లో మీరు ఆశించిన రాబడులు రాలేదని సదరు ఫండ్స్‌ నుంచి వైదొలగడం సరైన నిర్ణయం కాదు. కనీసం రెండేళ్ల పాటు పరిశీలించి తగిన రాబడులు రాకపోతే అప్పుడు వైదొలగాలి. మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు.  

- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement