పెట్టుబడికి పెద్ద మొత్తం ఉంటే... | Investment, Equity Linked Savings Scheme | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి పెద్ద మొత్తం ఉంటే...

Published Mon, Oct 3 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

పెట్టుబడికి పెద్ద మొత్తం ఉంటే...

పెట్టుబడికి పెద్ద మొత్తం ఉంటే...

నా వయస్సు 22 సంవత్సరాలు. ఇటీవలే చిన్న ఉద్యోగంలో చేరాను. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తం పొదుపు చేద్దామనుకుంటున్నాను.  ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేయమని, కొందరు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేయమని మరికొందరు మిత్రులు చెబుతున్నారు. దీర్ఘకాలానికి ఈ రెండింటిలో ఏది  మంచి రాబడులనిస్తుంది ? నన్ను పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేయమంటారా ? తగిన సూచనలివ్వండి.                  
- సుధీర్, హైదరాబాద్
 
దీర్ఘకాలిక సంపదను సృష్టించడానికి ఈక్విటీ ముఖ్యమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)కంటే కూడా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) మంచి ఇన్వెస్ట్‌మెంట్ సాధనమని చెప్పవచ్చు. స్వల్పకాలానికి ఈక్విటీల్లో కొంత రిస్క్ ఉంటుంది. కానీ ఐదేళ్లు అంతకు మించిన దీర్ఘ కాలానికి మంచి రాబడులు వస్తాయి.  పీపీఎఫ్‌కు ఉన్న ఒకే ఒక ఆకర్షణ. గ్యారంటీగా వచ్చే రిటర్న్‌లు.  అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ రాబడులు ఏమంత సంతృప్తికరంగా ఉండవని చెప్పవచ్చు. ఇక ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
 
రెండేళ్ల క్రితం పది లక్షల బీమాకు గాను ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. 16 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఈ పాలసీకి ఏడాది ప్రీమియమ్ రూ.68వేలు. ఇప్పటివరకూ రెండేళ్ల ప్రీమియమ్‌లు చెల్లించాను. ఈ పాలసీని కొనసాగించడం కష్టంగా వుంది. ఇప్పుడు వైదొలిగితే ఎంత నష్టం వస్తుంది.                                      
- ప్రకాశ్, విశాఖపట్టణం
 
బీమా కవర్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం.  తక్కువ ప్రీమియమ్‌కే ఎక్కువ బీమా రక్షణ పొందవచ్చు. ఇక మదుపు విషయానికొస్తే, మంచి రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. మీరు పాలసీ తీసుకొని రెండేళ్లే అయినందున ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. ఈ తరహా పాలసీలను సరెండర్ చేస్తే తొలి మూడేళ్లలో ఎలాంటి డబ్బులు వెనక్కి రావు. మీరు ఇప్పటికే రెండేళ్ల ప్రీమియమ్ రూ.1,36,000 చెల్లించారు. ఈ డబ్బులు వెనక్కిరావు. నష్టాలు వచ్చినా సరే, ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం.

మూడేళ్ల తర్వాత సరెండర్ చేస్తే కొంతైనా డబ్బులు వెనక్కి వస్తాయనే ఉద్దేశంతో మరో ఏడాది కూడా ఆగితే, మీ నష్టాలు మరింతగా పెరుగుతాయే కానీ తగ్గవు. ఉదాహరణకు మీరు చెల్లించే ప్రీమియమ్ మూడేళ్లకు రూ.2,04,000 అవుతుంది. దీంట్లో మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియమ్‌ను మినహాయించుకొని మిగిలిన ప్రీమియమ్‌లో 30% గ్యారంటీడ్ సరెండర్ వేల్యూ(జీఎస్‌వీ)గా రూ.40,800 మీకు చెల్లిస్తారు. అంటే మీకు నికరంగా రూ.1,63,200 నష్టపోతారన్నమాట.
 
ఈ మధ్యే నాకు ఇద్దరు కవలలు పుట్టారు. వారి ఉన్నత విద్యాభ్యాసం కోసం మదుపు చేయాలనుకుంటున్నాను. కాగా రెండేళ్ల క్రితం మా నాన్నగారు రిటైరయ్యారు. నేను ఒక్కడినే కొడుకును కాబట్టి రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ నాకు ఇచ్చి మనవల చదువుల కోసం ఖర్చు చేయమని చెప్పారు. నా పిల్లల చదువు కోసం బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో పెద్ద మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా ? లేక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయమంటారా ? ఏది సరైన విధానం ? వివరించండి.
- సంపత్, విజయవాడ
 
పిల్లల ఉన్నత చదువు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.  ఈక్విటీ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట ప్లాన్ (సిప్)విధానమే మేలు. అయితే పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు అందుబాటులో ఉంటే, వాటిని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ముందుగా ఇన్వెస్ట్ చేయండి. తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) విధానంలో బ్యాలెన్స్‌డ్ ఫండ్‌కు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయండి.
 
సూపర్ టాప్-అప్ మెడిక్లెయిమ్ పాలసీలను ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చా? కొన్ని మంచి ఆన్‌లైన్ సూపర్ టాప్ -అప్ మెడిక్లెయిమ్ పాలసీలను సూచిస్తారా ?                                     
- కుమార్, బెంగళూరు


సూపర్ టాప్-అప్ మెడిక్లెయిమ్ పాలసీలను ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. యునెటైడ్ ఇండియా సూపర్ టాప్ అప్ పాలసీ, రెలిగేర్ ఎన్‌హాన్స్ సూపర్-టాప్, అపోలో మ్యునిక్ ఆప్టిమా సూపర్...ఈ పాలసీలను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆరోగ్య బీమా కవరేజ్‌ను మరింతగా పెంచుకోవడానికి సూపర్ టాప్-అప్ పాలసీలు మంచి మార్గం. ప్రీమియమ్‌లో స్వల్ప పెరుగుదలతోనే ఆరోగ్య బీమా రక్షణను మరింతగా పెంచుకోవచ్చు.

ఉదాహరణకు ఒక వ్యక్తి  రూ.3 లక్షలకు ఆరోగ్య బీమా పాలసీ, రూ.10 లక్షలకు సూపర్ టాప్-అప్ పాలసీ కూడా తీసుకున్నాడనుకుందాం.  అ వ్యక్తి రూ.5 లక్షలకు క్లెయిమ్ చేస్తే, రెగ్యులర్ ఆరోగ్య బీమా పాలసీ రూ. 3లక్షలు, సూపర్ టాప్-అప్ ఆరోగ్య బీమా రూ. 2 లక్షలు చొప్పున చెల్లిస్తాయి.  అయితే ఈ పాలసీలను తీసుకునేటప్పుడు పాలసీ డాక్యుమెంట్‌ను, పాలసీ బ్రోచర్‌ను క్షుణ్నంగా పరిశీలించడం మాత్రం మరచిపోవద్దు. మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్ వంటి అంశాలను తప్పనిసరిగా గమనించండి.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement