ఈక్విటీలు యువజనులకేనా...? | Equity for only youth? | Sakshi
Sakshi News home page

ఈక్విటీలు యువజనులకేనా...?

Published Mon, Feb 9 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

ఈక్విటీలు యువజనులకేనా...?

ఈక్విటీలు యువజనులకేనా...?

మా నాన్నగారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా మార్గాల కోసం ఆయన చూస్తున్నారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పీఎస్‌యూ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశారు. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వగలరు.
   - అనిరుధ్, హైదరాబాద్

పన్ను ఆదా చేయడం కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్‌లకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదనే అపోహ చాలా ప్రబలంగా ఉంది. ఈక్విటీల్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి కాబట్టి, ఇవి యువజనులకు మాత్రమే అనువైనవని, వృద్ధులకు తగినవి కావని చాలా మంది భావిస్తారు. కానీ ఇది సరైనది కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు స్వల్పకాలానికే రిస్క్ అని చెప్పవచ్చు. మూడు నుంచి ఐదేళ్ల కాలానికి, లేదా అంతకు మించిన కాలానికి ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. రిస్క్ తక్కువగా, రాబడులు ఎక్కువగా ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి స్వల్పమే.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో వచ్చే రాబడులపై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వచ్చే రాబడిపై పన్ను ఉంటుంది. అంతే కాకుండా మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్)కూడా ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో లిక్విడిటీ కూడా ఎక్కువ. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లు. కాగా, పన్ను ఆదా ఎఫ్‌డీల్లో లాకిన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది.  పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లిక్విడిటీ ఏమాత్రం ఉండదు.  వీటిని ముందుగా తీసుకోవడానికి లేదు. అంతేకాకుండా వీటిపై రుణం కూడా తీసుకునే వీలు లేదు. ఇతర ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లాగానే ఈఎల్‌ఎస్‌ఎస్‌లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
 
ఏడేళ్ల క్రితం నేను మూడు పన్ను ఆదా ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. వాటిని ఎలా విక్రయించాలి?
 - కృష్ణవేణి, నిజామాబాద్

సాధారణంగా పన్ను ఆదా ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీరు ఈ పన్ను ఆదా ఫండ్స్‌లో ఏడేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఎప్పుడైనా మీరు వీటిని ఉపసంహరించుకోవచ్చు. వీటిని ఉపసంహరించుకోవడం చాలా సులువు. మీకు వచ్చే అకౌంట్ స్టేట్‌మెంట్ దిగువ భాగంలో ఉండే రిడంప్షన్ ఫారమ్‌ను పూర్తి చేసి, సంతకం పెట్టి సదరు ఫండ్ సంస్థకు గానీ, సంస్థ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి గానీ పంపించాలి. ఇలా పంపించిన మూడు రోజుల తర్వాత మీ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేస్తాయి.

ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేస్తే మంచి రాబడులు పొందుతారని మీరు తరచుగా చెబుతుంటారు.  ఎలా డైవర్సిఫై చేయాలి?            - వికాస్, నెల్లూరు
మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభిన్న రకాలుగా డైవర్సిఫై చేసుకోవచ్చు. డైవర్సిఫైడ్ ఫండ్‌ల నుంచి ఏదో ఒక ఫండ్‌ను ఎంపిక  చేసుకోవచ్చు. విభిన్న రంగాలపై దృష్టిసారించిన ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, ఇన్వెస్ట్‌మెంట్ కాలం, మీరు భరించగలిగే రిస్క్... మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. రిస్క్ తట్టుకోలేని వారైతే లార్జ్ అండ్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయగల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని కనీసం రెండు రకాలైన విభిన్న రంగాల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. వీటిల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్  చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement