Saving funds
-
పన్ను ఆదాకు చక్కని పథకం
పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల నుంచి పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్ పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్ పథకాల్లో చేసే పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఆ లోపు వాటిని వెనక్కి తీసుకు నే అవకాశం ఉండదు. దీర్ఘకాల లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం ఈ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. రాబడులు..: ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు మెరుగైన రాబడులనే ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 13.1 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 200 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్) రాబడులు ఏడాదిలో కేవలం 9 శాతంగా, మూడేళ్లలో వార్షికంగా 14.1 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రారంభించిన రోజు నుంచి చూస్తే ఇప్పటి వరకు సగటున వార్షికంగా 18.69 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి రూ.1.65 లక్షలు సమకూరేది. 2016, 2017లో పన్ను ఆదా విభాగం సగటు రాబడులను మించి పనితీరు చూపించిన ఈ పథకం, 2018 మార్కెట్ కరెక్షన్ సమయంలో నష్టాలను పరిమితం చేసింది. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో నష్టాలు సగటున 6 శాతంగా ఉండగా, మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకంలో నష్టాలు 2.3 శాతానికే పరిమితమయ్యాయి. పెట్టుబడుల విధానం..: 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 99 శాతం పెట్టుబడులకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ ఉంది. నగదు నిల్వలు కేవలం ఒక శాతం లోపునే ఉన్నాయి. ఈ పథకం బ్యాంకింగ్ రంగానికి పెద్ద పీట వేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలోని స్టాక్స్‌లో 37 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 12 శాతం మేర ఎనర్జీ రంగంలో, ఎఫ్ఎంసీజీలో 10 శాతం, హెల్త్‌కేర్‌లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. కన్స్ట్రక్షన్, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ విలువ పరంగా ఎటువంటి స్టాక్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈఎల్ఎస్ఎస్ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 54 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారీ లార్జ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 70% వరకు పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్‌క్యాప్ 25%, స్మాల్ క్యాప్‌నకు 5 శాతం వరకు పెట్టుబడులు కేటాయించింది. -
యాక్సిస్ మ్యూచువల్ నుంచి రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యాలకు తగ్గట్లుగా మూడు వేర్వేరు ప్లాన్స్ (అగ్రెసివ్, డైనమిక్, కన్జర్వేటివ్) ఇందులో ఉంటాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్)కు కట్టే వాయిదాల పరిమాణాన్ని బట్టి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐప్లస్ సిప్ ఇన్సూరెన్స్ పేరిట బీమా సదుపాయం కూడా లభిస్తుందని సంస్థ సీఈవో చంద్రేశ్ కుమార్ నిగమ్ తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ అన్ని కాలాల్లోనూ స్థిరమైన రాబడి!
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు దీర్ఘకాలం కోసం ఉద్దేశించినవని సాధారణంగా చెప్పుకుంటాం. స్వల్పకాలంలో అస్థిరతల కారణంగా నష్టాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక. కొందరు ఈ విధమైన రిస్క్ తీసుకునేందుకు సుముఖంగా ఉండరు. కొందరు స్వల్పకాలం కోసమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటారు. ఈ తరహా వ్యక్తులు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ పథకాలను పరిశీలించొచ్చు. హెచ్డీఎఫ్సీ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ కూడా ఇదే కోవకు చెందుతుంది. 2–3 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆర్బీఐ చాలా నెలలుగా కీలక రేట్లలో ఏ విధమైన మార్పులు చేయడం లేదు. ఇంత కాలం క్రమంగా తగ్గుతూ వచ్చిన రేట్లు ఆర్బీఐ మారిన విధానంతో అక్కడే ఆగిపోయాయి. త్వరలోనే కీలక రేట్లు పెరిగేందుకు ఇది సంకేతమని విశ్లేషకుల అంచనా. బాండ్ మార్కెట్ దీన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకుంది. వడ్డీరేట్ల పరంగా రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లకు హెచ్డీఎఫ్సీ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ తరహా షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫండ్స్ ఈ దశలో అనువైనవి. ఇవి 3–4 ఏళ్లలో కాల వ్యవధి ముగిసే డెట్ సెక్యూరిటీల్లో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తాయి. దీర్ఘకాలిక సాధనాలకు స్వల్ప మొత్తం, మధ్య కాలిక సాధనాలకు కూడా అధిక నిధులు కేటాయిస్తాయి. హెచ్డీఎఫ్సీ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ ఈ తరహా పథకమే. అన్నిరకాల రేట్లలోనూ స్థిరమైన రాబడులను అందిస్తోంది. రాబడులు 2002లో ఈ పథకం మొదలు కాగా, ఏటా 8 శాతం చొప్పున రాబడులను అందించిన చరిత్ర ఉంది. 16ఏళ్ల కాలంలో స్థిరమైన, ఈ విభాగంలో మెరుగైన లాభాలను అందిస్తున్న పథకంగా హెచ్డీఎఫ్సీ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్‌ను చెప్పుకోవచ్చు. ఐదు, ఏడు, పదేళ్ల రాబడులు 8.8 – 8.9 శాతం మధ్య ఉండడం ఈ విభాగంలో మెరుగైన పనితీరుకు నిదర్శనం. వడ్డీ రేట్ల పరంగా రిస్క్ ఉండని షార్ట్ టర్మ్ బాండ్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం స్థిరమైన రాబడులకు సాయపడుతోంది. మార్కెట్లు నిరుత్సాహంగా ఉన్న 2012, 2015లోనూ ఈ పథకం 7–9 శాతం మధ్యలో రాబడులను ఇవ్వడం విశేషం. స్వల్ప కాలంలో మార్కెట్లు అస్థిరంగా ఉంటే బాండ్లు లబ్ది పొందుతాయి. వడ్డీ రేట్ల క్షీణ దశలో మాత్రం వీటి రాబడులు పడిపోతాయి. 2014, 2016 ర్యాలీల్లో షార్ట్ టర్మ్ బాండ్ల రాబడులు తగ్గితే, దీర్ఘకాలిక గిల్ట్ ఫండ్స్ 16–17 శాతం స్థాయిలో అదిరిపోయే రాబడులను ఇచ్చాయి. హెచ్డీఎఫ్సీ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ మాత్రం 10–11 శాతం రాబడులను అందించింది. ప్రస్తుతం వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. ఈ సమయంలో స్వల్పకాల బాండ్లలో ఇన్వెస్ట్ చేసే ఈ పథకం ఆకర్షణీయమైనదే. పెట్టుబడులు ప్రస్తుతం సగటున 1.8 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన బాండ్లలో ఈ పథకం పెట్టుబడులు ఉన్నాయి. ఏఏఏ రేటెట్ బాండ్లలో 27 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఏఏ రేటెడ్ బాండ్లలో 54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఏ రేటెడ్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లో 12 శాతం పెట్టుబడులు ఉన్నాయి. జనవరి 31నాటి పెట్టుబడుల విలువ రూ.5,433 కోట్లు. ఎందులో ఎంతెంత..? సాధనం పెట్టుబడుల శాతం ఏఏ+, తక్కువ రేటింగ్ ఉన్నవి 66.5 ఏఏఏ రేటెడ్ బాండ్లు 27.4 నగదు 4.3 సావరీన్ 1.4 -
ఈక్విటీలు యువజనులకేనా...?
మా నాన్నగారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా మార్గాల కోసం ఆయన చూస్తున్నారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పీఎస్‌యూ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశారు. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వగలరు. - అనిరుధ్, హైదరాబాద్ పన్ను ఆదా చేయడం కోసం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదనే అపోహ చాలా ప్రబలంగా ఉంది. ఈక్విటీల్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి కాబట్టి, ఇవి యువజనులకు మాత్రమే అనువైనవని, వృద్ధులకు తగినవి కావని చాలా మంది భావిస్తారు. కానీ ఇది సరైనది కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు స్వల్పకాలానికే రిస్క్ అని చెప్పవచ్చు. మూడు నుంచి ఐదేళ్ల కాలానికి, లేదా అంతకు మించిన కాలానికి ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. రిస్క్ తక్కువగా, రాబడులు ఎక్కువగా ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి స్వల్పమే. ఈఎల్ఎస్ఎస్ల్లో వచ్చే రాబడులపై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. అదే ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే వచ్చే రాబడిపై పన్ను ఉంటుంది. అంతే కాకుండా మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్)కూడా ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ల్లో లిక్విడిటీ కూడా ఎక్కువ. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లు. కాగా, పన్ను ఆదా ఎఫ్‌డీల్లో లాకిన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లలో లిక్విడిటీ ఏమాత్రం ఉండదు. వీటిని ముందుగా తీసుకోవడానికి లేదు. అంతేకాకుండా వీటిపై రుణం కూడా తీసుకునే వీలు లేదు. ఇతర ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లాగానే ఈఎల్ఎస్ఎస్లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఏడేళ్ల క్రితం నేను మూడు పన్ను ఆదా ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. వాటిని ఎలా విక్రయించాలి? - కృష్ణవేణి, నిజామాబాద్ సాధారణంగా పన్ను ఆదా ఫండ్స్‌కు లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీరు ఈ పన్ను ఆదా ఫండ్స్‌లో ఏడేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఎప్పుడైనా మీరు వీటిని ఉపసంహరించుకోవచ్చు. వీటిని ఉపసంహరించుకోవడం చాలా సులువు. మీకు వచ్చే అకౌంట్ స్టేట్మెంట్ దిగువ భాగంలో ఉండే రిడంప్షన్ ఫారమ్‌ను పూర్తి చేసి, సంతకం పెట్టి సదరు ఫండ్ సంస్థకు గానీ, సంస్థ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి గానీ పంపించాలి. ఇలా పంపించిన మూడు రోజుల తర్వాత మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేస్తే మంచి రాబడులు పొందుతారని మీరు తరచుగా చెబుతుంటారు. ఎలా డైవర్సిఫై చేయాలి? - వికాస్, నెల్లూరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విభిన్న రకాలుగా డైవర్సిఫై చేసుకోవచ్చు. డైవర్సిఫైడ్ ఫండ్ల నుంచి ఏదో ఒక ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. విభిన్న రంగాలపై దృష్టిసారించిన ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, ఇన్వెస్ట్మెంట్ కాలం, మీరు భరించగలిగే రిస్క్... మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. రిస్క్ తట్టుకోలేని వారైతే లార్జ్ అండ్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయగల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని కనీసం రెండు రకాలైన విభిన్న రంగాల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. వీటిల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.