ఫండ్స్ రాబడులపై పన్నులు ఎంత? | Funds returns On How much in taxes? | Sakshi
Sakshi News home page

ఫండ్స్ రాబడులపై పన్నులు ఎంత?

Published Mon, May 9 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

ఫండ్స్ రాబడులపై పన్నులు ఎంత?

ఫండ్స్ రాబడులపై పన్నులు ఎంత?

మ్యూచువల్ ఫండ్స్, షేర్ల రాబడులకు సంబంధించి ప్రస్తుత పన్ను నిబంధనలు ఎలా ఉన్నాయి? మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌కు సంబంధించి దీర్ఘకాల, స్వల్పకాల  లాభాల పన్నును ఎలా నిర్ణయిస్తారు ?
- మాన్విత, సికింద్రాబాద్

 
మీరు కొనుగోలు చేసిన షేర్లు/మ్యూచువల్ ఫండ్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే, వాటిపై వచ్చిన రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.  ప్రస్తుతం షేర్లు/మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధించడం లేదు. అలా కాకుండా మీరు కొనుగోలు చేసిన షేర్లు/మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఏడాదిలోపే విక్రయిస్తే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు.

15 శాతం చొప్పున పన్ను విధిస్తారు. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తేనే వాటిపై వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తారు. ఈ లాభాలపై   20 శాతం(ఇండెక్సేషన్ ప్రయోజనంతో) పన్ను విధిస్తారు. ఇక ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను మూడేళ్లలోపే విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
నేను గత నాలుగేళ్లుగా  ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్) ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎంత కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్ నుంచి రుణం తీసుకోవచ్చు? వడ్డీరేట్లు ఎంత ఉంటుంది?
- నిరంజన్, విశాఖ పట్టణం


ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)..ప్రారంభించిన 15 ఆర్థిక సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది.  ఈ ఖాతాను ప్రారంభించిన మూడేళ్ల తర్వాత మీరు రుణం పొందవచ్చు. ఈ రుణ సౌకర్యం పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన మూడు నుంచి ఆరేళ్లలోపే ఉంటుంది. ఖాతాలో ఉన్న మొత్తంలో 25 శాతం వరకూ రుణం పొందవచ్చు. మీరు పీపీఎఫ్ ఖాతాపై పొందే వడ్డీ కంటే 2 శాతం అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న రుణాన్ని మూడేళ్లలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించలేకపోతే, మీరు చెల్లించాల్సిన వడ్డీరేటు మీరు పొందే వడ్డీరేటుకన్నా 6 శాతం అధికంగా ఉంటుంది. మీ ఖాతా ప్రారంభమై ఏడేళ్లు దాటితే, మీరు పాక్షికంగా సొమ్ములను తీసుకోవచ్చు.
 
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో 25 శాతం పాక్షిక మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది కదా. దీనిపై పన్నులు ఎలా ఉంటాయి?                       
- నారాయణ రావు, కరీంనగర్

 
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రారంభించిన పదేళ్ల తర్వాత మీరు 25 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో అప్పటివరకూ ఉన్న మొత్తంలో 25 శాతం కాకుండా, మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 25 శాతాన్నే విత్‌డ్రా చేసుకోవాలి. పిల్లల ఉన్నత విద్యావసరాలు, లేదా వివాహం(చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది), మొదటి ఇల్లు కొనుగోలు/నిర్మాణం, భార్య/పిల్లలు/ తల్లిదండ్రులకు 13 క్లిష్టమైన రుగ్మతలకు చికిత్స వంటి నిర్దేశిత అవసరాలకే 25 శాతం సొమ్ము విత్‌డ్రాకు అనుమతిస్తారు.

ఒక్కో విత్‌డ్రాయల్‌కు ఐదేళ్ల విరామంతో మూడు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. క్లిష్టమైన జబ్బులకు  ఐదేళ్ల విరామం నిబంధన వర్తించదు. ఇక ఈ పాక్షిక విత్‌డ్రాయల్స్‌పై పన్ను విషయాల గురించి ప్రస్తావన కొత్త నియమనిబంధనల్లో లేదు. మీరు విత్‌డ్రా చేసుకునే మొత్తాన్ని మీ ఆదాయపు పన్ను స్లాబ్‌కు కలిపి పన్ను చెల్లించాల్సి రావచ్చు.
 
నేను 2011లో ఎల్‌ఐసీ జీవన్ తరంగ్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీని సరెండర్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి.
- మోహన్,  ఈ మెయిల్ ద్వారా

 
జీవన్ తరంగ్ అనేది  హోల్ లైఫ్ ప్లాన్.  ఈ పాలసీని సరెండర్ చేస్తే మీకు నష్టాలు బాగానే వస్తాయి.  మీకు వచ్చే గ్యారంటీడ్ సరెండర్ విలువ ఎంత ఉంటుందంటే ... మీరు చెల్లించిన మొత్తం ప్రీమియంల్లో తొలి ఏడాది ప్రీమియంను మినహాయించిన మొత్తంలో 30 శాతంగా ఉంటుంది.  ఎల్‌ఐసీ స్పెషల్ సరెండర్ విలువను మీకు చెల్లించవచ్చు.

ఇది గ్యారంటీడ్ సరెండర్ విలువ కంటే అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీ తీసుకొని మూడేళ్లు అయినందున ఈ పాలసీని మీరు సరెండర్ చేయవచ్చు.  జీవిత బీమా పాలసీ తీసుకోవాలంటే టర్మ్  బీమా ప్లాన్ తీసుకోవడమే ఉత్తమం. టర్మ్ ప్లాన్‌లకు పెద్ద మొత్తం బీమాకు తక్కువ ప్రీమియం చెల్లించవచ్చు. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.  
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement