
ఖాతాలలో రూ. 2,100 కోట్ల తేడా..
అంతర్గత ఆడిట్ ద్వారా వెలుగులోకి
భారీ అమ్మకాలతో షేరు 27% క్రాష్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఖాతాల నిర్వహణలో రూ. 2,100 కోట్లమేర అంతరం నమోదైనట్లు తాజాగా ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే బ్యాంక్‌వద్ద తగినంత రిజర్వులు, మూలధనం ఉండటంతో కవర్ చేసుకోగలమని పేర్కొంది. అయితే యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండస్‌ఇండ్ షేరు 10% పతనమైంది. ఆపై మరింత బలహీనపడుతూ 20% సర్క్యూట్‌ను తాకింది. సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యాక మరింత దిగజారింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి 27% కుప్పకూలి రూ. 657 వద్ద నిలిచింది. ఒక దశలో రూ. 649 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది.
ఏం జరిగిందంటే?
ఖాతాలో వ్యత్యాసాన్ని గతేడాది(2024) సెప్టెంబరు– అక్టోబర్‌లో గుర్తించినట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని ఆర్‌బీఐకు గత వారమే నివేదించినట్లు తెలియజేశారు. అయితే తుది వివరాలు బయటి ఏజెన్సీతో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. నివేదిక ఏప్రిల్ మొదట్లో వెలువడనున్నట్లు తెలియజేశారు. లాభదాయకత, మూలధన పటిష్టత నేపథ్యంలో ఈ ప్రభావాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసుకోగలదన్నారు. 2024 ఏప్రిల్1కు ముందు 5–7ఏళ్లుగా డెరివేటివ్ పోర్ట్‌ఫోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందని చెప్పారు.
ఎక్స్ఛేంజీలకు సమాచారం...
డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని అంతరాలున్నట్లు సోమవారం ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. వీటి వల్ల బ్యాంక్ నెట్‌వర్త్‌పై 2.35 శాతంమేర ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు పేర్కొంది. అంతర్గత సమీక్ష ద్వారా ఈ అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. వీటిని స్వతంత్రంగా సమీక్షించి నిర్ధారించేందుకు బయటి ఏజెన్సీని ఎంపిక చేసినట్లు తెలిపింది.
కాగా.. ట్రెజరీ బిజినెస్‌లో గుర్తించిన వ్యత్యాసం అంతర్గత, చట్టబద్ధ, ఆర్‌బీఐ ఆడిట్‌లలో బయటపడకపోవడం గమనార్హం! 2024 ఏప్రిల్ 1నుంచి డెరివేటివ్స్‌లో ఇంటర్నల్ ట్రేడ్‌ను నిలిపివేస్తూ 2023 సెప్టెంబరులో జారీ అయిన ఆర్‌బీఐ సర్క్యులర్ కారణంగా అంతర్గత బుక్‌పై సమీక్షకు తెరతీసినట్లు సుమంత్ వెల్లడించారు. దీంతో బయటి ఆడిట్‌కు ఆదేశించినట్లు తెలియజేశారు. అయితే బ్యాంక్ ఎండీ, సీఈవోగా తిరిగి ఎంపిక చేయడంలో ఆర్‌బీఐపై ఈ అంశంప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు మూడేళ్ల కాలానికి ప్రతిపాదించగా.. గత వారం ఆర్‌బీఐ ఏడాది కాలానికే సుమంత్ బాధ్యతల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రూ. 19,000 కోట్లు ఆవిరి...
షేరు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఇండస్‌ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు ఒక్కరోజులోనే రూ. 19,000 కోట్లమేర చిల్లుపడింది. ఈ నెల 10న నమోదైన రూ. 70,150 కోట్ల నుంచి బ్యాంక్ మార్కెట్ విలువ తాజాగా రూ. 51,168 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ షేరు 2018 ఆగస్ట్‌లో రూ. 2038 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 8న రూ. 1,576 వద్ద నమోదైన గరిష్టం నుంచి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 649ను తాకింది. వెరసి 59 శాతం పతనమైంది.
ఫండ్స్ లబోదిబో
ఇది ఇండెక్స్ షేరు కావడంతో 2025 ఫిబ్రవరికల్లా 35 మ్యూచువల్ ఫండ్స్ 360 పథకాల ద్వారా ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశాయి. 20.88 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ విలువ రూ. 20,670 కోట్లు కాగా.. షేరు తాజా పతనంలో రూ. 6,970 కోట్లు ఆవిరైంది. దీంతో హోల్డింగ్స్ విలువ రూ. 13,700 కోట్లకు పరిమితమైంది. ఇక ప్యాసివ్ ఫండ్స్ సైతం బ్యాంక్ షేర్ల పతనంతో ప్రభావితమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment