IndusInd Bank
-
ఇండస్ఇండ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22 శాతం ఎగసి రూ. 2,202 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,805 కోట్లు ఆర్జించింది. మొండిబకాయిలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,719 కోట్ల నుంచి రూ. 13,530 కోట్లకు జంప్ చేసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 5,077 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 4.24 శాతం నుంచి 4.29 శాతానికి స్వల్పంగా మెరుగుపడ్డాయి. ఇతర ఆదాయం రూ. 2,011 కోట్ల నుంచి రూ. 2,282 కోట్లకు బలపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.11 శాతం నుంచి 1.93 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.61 శాతం నుంచి 0.57 శాతానికి నీరసించాయి. ప్రొవిజన్లు రూ. 1,141 కోట్ల నుంచి రూ. 974 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.21 శాతంగా నమోదైంది. ఈ కాలంలో 3,500 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు 1% నష్టంతో రూ. 1,421 వద్ద ముగిసింది. -
మొబైల్ బ్యాంకింగ్ కొత్త యాప్.. రూ.5 లక్షల వరకు లోన్!
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు 'ఇండస్ఇండ్' (IndusInd) 'ఇండీ' (INDIE) పేరుతో ఓ కొత్త యాప్ పరిచయం చేసింది. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీని ఉపయోగమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండస్ఇండ్ బ్యాంక్ పరిచయం చేసిన ఈ కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్ కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా అద్భుతమైన డిజిటల్ అనుభవం పొందవచ్చు. బ్యాంక్ డిజిటల్ స్ట్రాటజీ 2.0ని వేగవంతం చేసే దిశగా INDIE ప్రారంభమైంది. ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ బ్యాంకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ ఇండీ మొబైల్ యాప్ గురించి తెలుసుకోవలసిన అంశాలు.. ఇండీ యాప్ అనేది కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా రూ. 5 లక్షల వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకోవడానికి కూడా పెద్దగా సమయం పట్టదు, కావున వినియోగదారుడు తన అవసరానికి కావాల్సిన మొత్తంలో లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న లోన్ ఆధారంగా వడ్డీ కూడా ఉంటుంది. ఈ యాప్ అత్యంత పారదర్శకమైన రివార్డ్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది, కస్టమర్లు టాప్ ఈ కామర్స్ బ్రాండ్ల నుంచి తమకు ఇష్టమైన బ్రాండ్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇండీ యాప్ ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ అందించే అన్ని సర్వీసులను పొందవచ్చు. అకౌంట్ నెంబర్ ఎంచుకోవడం, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి సర్వీసులను పొందవచ్చు. కస్టమర్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్లను సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసుకోవచ్చు. కావున కస్టమర్ల వద్ద సేవింగ్స్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్‌తో చెల్లించవచ్చు. ఈ యాప్ చాలా సెక్యూరిటీ అందిస్తుంది. దీని ద్వారా నంబర్‌లెస్ డెబిట్ కార్డ్‌లు పొందవచ్చు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం జూమ్.. భారీగా పెరిగిన ఆదాయం
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 2,124 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,631 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం సహకరించాయి. మొత్తం ఆదాయం రూ. 10,113 కోట్ల నుంచి రూ. 12,939 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 4,867 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా మెరుగుపడి 4.29 శాతానికి చేరాయి. ఇతర ఆదాయం 14 శాతం వృద్ధితో రూ. 2,210 కోట్లుగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 1,251 కోట్ల నుంచి రూ. 991 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.35 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు నామ మాత్రంగా తగ్గి రూ. 1,390 వద్ద క్లోజైంది. -
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు.. నిధుల వేటలో ‘ఇండస్ఇండ్’
ముంబై: ప్రతిపాదిత రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) కొనుగోలు కోసం ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) 1.5 బిలియన్ డాలర్లు సమీకరించనుంది. అలాగే సంస్థలో వాటాలను ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు కూడా ఈ నిధులను వినియోగించనుంది. 1.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరణతో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు అప రిమితమైన అవకాశాలు లభించగలవని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి హిందుజా ఒక ప్రకటనలో తెలిపారు. -
జీ, ఇండస్ఇండ్ మధ్య సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంకుతో అన్ని రకాల వివాదాలనూ పరిష్కరించుకున్నట్లు మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) తాజాగా వెల్లడించింది. రెండు పార్టీలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. జీల్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా చర్యలపై ఫిబ్రవరి 24న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిలిపివేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అన్ని రకాల వివాదాలకూ తెరదించే బాటలో సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు జీల్ పేర్కొంది. కాగా.. రూ. 83 కోట్ల రుణ చెల్లింపులలో విఫలంకావడంతో జీల్‌పై దివాలా చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తూ గతేడాది ఫిబ్రవరిలో ఇండస్ఇండ్.. ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌ను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన ఎన్సీఎల్టీ.. సంజీవ్ కుమార్ జలాన్‌ను తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా ఎంపిక చేసింది. (అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) తదుపరి ఎన్సీఎల్టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ఎన్సీఎల్ఏటీలో ఫిర్యాదు చేశారు. ఆపై ఎన్సీఎల్ఏటీ ఈ అంశాలపై స్టే ఇచ్చింది. ఎస్సెల్ గ్రూప్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ సిటీ నెట్వర్క్స్ తీసుకున్న రుణాల వైఫల్యం దీనికి నేపథ్యంకాగా.. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. (హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) -
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్!
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం... ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై సాధారణ ప్రజలకు 3.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మూడు నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ సాధారణ ప్రజలకు 7.75 శాతం, అదే సీనియర్ సిటిజన్లకైతే 8.25 శాతం ఉంటుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పెరిగిన వడ్డీరేట్లు మార్చి 18 నుంచి అమలులోకి వస్తాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా.. 7 నుంచి 30 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.5 శాతం, 31 నుంచి 45 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం, 46 నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.5 శాతం, 61 నుంచి 90 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.60 శాతం వడ్డీ ఉంటుంది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! 91 నుంచి 120 రోజుల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 4.75 శాతం, 121 నుంచి 180 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5 శాతం, 181 నుంచి 210 రోజులలో మెచ్యూర్ అయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. అలాగే 211 నుంచి 269 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5.80 శాతం, 270 నుంచి 354 రోజుల వ్యవధి డిపాజిట్లపై 6 శాతం, 355 నుంచి 364 రోజుల వ్యవధితో చేసిన డిపాజిట్లపై 6.25 శాతం అందిస్తుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్! -
ఇండస్ఇండ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 1,964 కోట్లను తాకింది. రుణాల నాణ్యత మెరుగుపడటం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 4,495 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.17 శాతం మెరుగై 4.27 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం సైతం రూ. 1,877 కోట్ల నుంచి రూ. 2,076 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,654 కోట్ల నుంచి రూ. 1,065 కోట్లకు క్షీణించాయి. క్యూ2 (జూలె–సెప్టెంబర్)తో పోలిస్తే తాజా స్లిప్పేజీలు రూ. 1,572 కోట్ల నుంచి రూ. 1,467 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.11 శాతం నుంచి 2.06 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.01 శాతానికి చేరింది. ఈ కాలంలో 1,800 మందికి ఉపాధి కల్పించినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా తెలియజేశారు. తొలి 9 నెలల్లో 8,500 మందిని జత చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్ మొత్తం సిబ్బంది సంఖ్య 37,870కు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు బీఎస్ఈలో 0.7% క్షీణించి రూ. 1,222 వద్ద ముగిసింది. చదవండి: కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్! -
ఇండస్ ఇండ్ ఫలితాలు ఆకర్షణీయం!
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. నికర లాభం 61 శాతం పెరిగి రూ.1,631 కోట్లుగా నమోదైంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయి. బ్యాంకు ఆదాయం సైతం రూ.10,113 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,016 కోట్లు, ఆదాయం రూ.9,298 కోట్లుగా ఉన్నాయి. వడ్డీ ఆదాయం 9.5 శాతం పెరిగి రూ.8,182 కోట్లకు చేరింది. స్థూల నినర్థక ఆస్తులు (ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 2.35 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి ఉన్న 2.88 శాతంతో చూస్తే కొంచెం తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.84 శాతం (రూ.1,760 కోట్లు) నుంచి 0.67 శాతానికి (రూ.1,661 కోట్లు) క్షీణించాయి. మార్చి త్రైమాసికం చివరికి ఉన్న నికర ఎన్పీఏలు 0.64 శాతం (రూ.1,530 కోట్లు)తో పోల్చి చూస్తే స్వల్పంగా పెరిగాయి. ప్రొవిజన్లు, కంటెంజెన్సీలకు చేసిన కేటాయింపులు తగ్గినట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో రూ.1,251 కోట్లను కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,779 కోట్లను కేటాయించడం గమనించాలి. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కేటాయింపులు రూ.1,461 కోట్లుగా బీఎస్ఈలో బ్యాంకు షేరు ఒక శాతం లాభంతో రూ.879 వద్ద క్లోజయింది. -
తప్పు చేస్తే వేటే..ఉద్యోగులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్నింగ్!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహిస్తున్న అక్రమ రెమిటెన్స్‌ల కేసు విచారణలో తమ ఉద్యోగులెవరైనా దోషులుగా తేలిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ పాత కేసు గురించి మీడియాలో వార్తలు రావడంతో తాజా వివరణ ఇస్తున్నట్లు పేర్కొంది. 2011–2014 మధ్యలో దిగుమతి లావాదేవీలకు సంబంధించిన రెమిటెన్సుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలకు సంబంధించి కొన్ని సంస్థలపై ఈడీ విచారణ జరుపుతోందని వివరించింది. విచారణ వార్తలతో బీఎస్ఈలో బుధవారం ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 3.42% క్షీణించి రూ. 817.75 వద్ద క్లోజయ్యింది. చదవండి: మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా! -
కోటక్, ఇండస్ ఇండ్ బ్యాంకులకు ఆర్బీఐ షాక్!
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడం దీనికి కారణమని పేర్కొంది. నాలుగు సహకార బ్యాంకులపై కూడా జరిమానాను విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే కస్టమర్ ప్రొటెక్షన్ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ. 1.05 కోట్ల పెనాల్టీ విధించినట్లు ప్రకటన పేర్కొంది. నిర్దిష్ట నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించనందుకు ఇండస్ఇండ్ బ్యాంక్‌పై రూ. 1 కోటి జరిమానా విధించినట్లు వివరించింది. నవ్ జీవన్ కో–ఆపరేటివ్ బ్యాంక్, బలంగీర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ధాకురియా కోఆపరేటివ్ బ్యాంక్ (కోల్‌కతా), ది పళని కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌పై రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ జరిమానా విధించినట్లు తెలిపింది. -
‘జీ’పై ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్
న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్ కేసులో మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)పై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఇండస్ఇండ్ బ్యాంక్ ఆశ్రయించింది. జీఎల్ రూ. 83.08 కోట్లు డిఫాల్ట్ అయినట్లు పేర్కొంది. దీనిపై ముంబైలోని ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్ దరఖాస్తు సమర్పించినట్లు జీల్ వెల్లడించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ సిటీ నెట్వర్క్స్ పొందిన రుణానికి సంబంధించి బ్యాంకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు చర్యలు ప్రారంభించిందని జీల్ పేర్కొంది. దీనిపై న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని వివరించింది. దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్ 7 ప్రకారం రూ. 1 కోటికి పైగా రుణాలను ఎగవేసిన సంస్థలపై సీఐఆర్‌పీ కింద చర్యలు తీసుకోవాలంటూ రుణదాతలు .. కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. గతేడాది డిసెంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్తో జీల్ విలీనమైన సంగతి తెలిసిందే. -
ఎన్నారైలకు శుభవార్త ! రెమిటెన్సులు ఇకపై సులభం
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న తమ వారి నుంచి భారతీయులు ఇక మరింత సులభంగా డబ్బును అందుకునే (రెమిటెన్సులు) వెసులుబాటు ఏర్పడింది. లబ్ధిదారుల యూపీఐ ఐడీలను ఉపయోగించడం ద్వారా సరిహద్దు నగదు బదిలీని సులభతరం చేయడానికి ఉద్దేశించి ఎన్పీసీఐతో (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇండస్ఇండ్ బ్యాంక్ అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన చేసింది. తాజా చొరవతో రెమిటెన్సులు లేదా ఎన్ఆర్ఐ చెల్లింపుల కోసం యూపీఐ ఐడీని వినియోగంలోకి తీసుకువస్తున్న తొలి భారతీయ బ్యాంక్‌గా ఇండస్ఇండ్ నిలవనుందని ప్రకటన వివరించింది. ఈ విధానం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఆపరేటర్లు (ఎంటీఓ).. ఎన్పీసీఐ యూపీఐ చెల్లింపు వ్యవస్థలో అనుసంధానం కావడానికి, లబ్దిదారుల ఖాతాల్లోకి రెమిటెన్సుల చెల్లింపులకు ఇండస్ఇండ్ బ్యాంక్ చానెల్ని వినియోగించుకుంటారు. థాయ్‌లాండ్‌తో ప్రారంభం థాయ్‌లాండ్‌తో తన తాజా రెమిటెన్సుల విధానాన్ని బ్యాంక్ ప్రారంభించింది. ఇందుకుగాను థాయ్‌లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ సేవల సంస్థ– ‘డీమనీ’ సేవలను బ్యాంక్ వినియోగించుకోనుంది. నగదు బదిలీ, విదేశీ కరెన్సీ మార్పిడికి సంబంధించి డీమనీ అత్యుత్తమ సేవలను అందిస్తోంది. డీమనీ వెబ్సైట్లో భారతదేశంలోని లబ్ధిదారుల యూపీఐ ఐడీలను జోడించి, విదేశాల్లోని భారతీయులు ఎవరైనా సులభంగా నిధులను బదిలీ చేయవచ్చు. డీమనీ తరహాలోనే వివిధ దేశాల్లోని అత్యుత్తమ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. భారత్దేశంలోని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ల వివరాలతో పనిలేకుండా కేవలం వారి యూపీఐ ఐడీలను యాడ్ (జోడించడం) చేసుకోవడం ద్వారా ఎన్ఆర్ఐలు తేలిగ్గా నిధుల బదలాయింపు జరపడంలో తమ చొరవ కీలకమైనదని ప్రకటనలో బ్యాంక్ హెడ్ (కన్జూమర్ బ్యాంకింగ్, మార్కెటింగ్) సౌమిత్ర సేన్ పేర్కొన్నారు. యూపీఐ వినియోగించే అంతర్జాతీయ పర్యాటకులకు తాజా ఏర్పాట్లు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీన్ రాయ్ పేర్కొన్నారు. యూపీఐ ద్వారా రెమిటెన్సులకు సంబంధించి తాజా చొరవ గొప్ప ముందడుగని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: విదేశాల్లో ఉద్యోగానికి సై.. ఐటీదే ఆధిపత్యం -
భారత్ ఫైనాన్షియల్ ఎండీ, ఈడీల రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భాగమైన భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (బీఎఫ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో శలభ్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సీఎఫ్‌వో ఆశీష్ దమానీ తమ పదవులకు రాజీనామా చేశారు. పోటీ కంపెనీ అయిన సూక్ష్మ రుణాల సంస్థ స్పందన స్ఫూర్తిలో (ఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్) వారు చేరనున్నట్లు సమాచారం. సక్సేనా, దమానీ నవంబర్ 25న తమ తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఎక్సే్చంజీలకు బీఎఫ్ఐఎల్ సోమవారం తెలియజేసింది. తాత్కాలికంగా ఈడీ హోదాలో జే శ్రీధరన్‌ను, రోజు వారీ కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీనివాస్ బోనం ను నియమించినట్లు పేర్కొంది. సక్సేనా, దమానీల విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. సక్సేనాను ఎండీ–సీఈవోగా, దమానీని ప్రెసిడెంట్–సీఎఫ్‌వోగా నియమించినట్లు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ఎల్ నవంబర్ 22న ప్రకటించింది. అయితే, వారు తమ సంస్థలో రాజీనామా చెయ్యలేదంటూ ఆ మరుసటి రోజైన నవంబర్ 23న బీఎఫ్ఐఎల్ తెలిపింది. ఒకవేళ చేస్తే.. నిర్దిష్ట షరతులకు అనుగుణం గా వారు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు పీరియడ్, పోటీ సంస్థలో చేరకూడదు వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటికైతే మాత్రం వారిద్దరూ తమ సంస్థలోనే కొనసాగుతున్నారని బీఎఫ్ఐఎల్ స్పష్టం చేసింది. కస్టమర్ల సమ్మతి లేకుండా సాంకేతిక లోపం వల్ల 84,000 రుణాలు మంజూరైన అంశంపై సమీక్షలో సహకరిస్తామంటూ వారు చెప్పినట్లు పేర్కొంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సక్సేనా, దమానీకి వర్తింపచేసే నిబంధనల అమలుపై బీఎఫ్ఐఎల్ వివరణ ఇవ్వలేదు. -
ఇండస్ఇండ్.. రయ్ లాభం 73 శాతం జూమ్
ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంకు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్‌గా నికర లాభం 73 శాతం పెరిగింది. రూ.663 కోట్ల లాభాన్ని బ్యాంకు ప్రకటించింది. రుణాల్లో వృద్ధికితోడు, ఎన్పీఏలకు (వసూలు కాని మొండి రుణాలు) కేటాయింపులు తగ్గడం లాభం పెరిగేందుకు దోహదపడింది. సూక్ష్మ, వాహన రుణ విభాగం లో ఒత్తిళ్లు ఉన్నట్టు బ్యాంకు ప్రకటించింది. ► నికర వడ్డీ ఆదాయం 12 శాతం పెరిగి రూ.3,658 కోట్లకు చేరింది. ► నికర వడ్డీ మార్జిన్ 4.07 శాతంగా ఉంది. ► ఫీజుల రూపంలో ఆదాయం రూ.1,554 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగింది. ► సెప్టెంబర్ త్రైమాసింకలో రూ.2,658 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ► స్థూల ఎన్పీఏలు 2.77 శాతానికి చేరాయి. ఇవి అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 2.21శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరికి 2.88 శాతంగా ఉన్నాయి. ► కేటాయింపులు రూ.1,703 కోట్లకు తగ్గాయి. -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల కొనుగోలుదారులకు ఇండస్ఇండ్ బ్యాంకు తరఫున రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇండస్ఇండ్ బ్యాంకు భాగస్వామ్యంతో స్టెపప్ పథకాన్ని అందిస్తున్నట్టు.. ఇందులో భాగంగా మొదటి 3-6 నెలల పాటు తక్కువ ఈఎంఐను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో ఏ వాహనానికైనా ఈ సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. ముఖ్యంగా టియాగో, నెక్సాన్ లేదా ఆల్ట్రోజ్ వంటి తక్కువ ఖరీదైన వాహనాల కొనుగోలులో ఎక్స్-షోరూమ్ ధరపై 90 శాతం దాకా ఎల్‌టివికి అందుబాటులో ఉంచింది. అలాగే హారియర్, సఫారి, టైగోర్ వంటి ఖరీదైన వాహనాల కొనుగోలులో 85 శాతం వరకు (ఎల్టివి) రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేసేందుకు ఇండస్ ఇండ్ భాగస్వామ్యంతో ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను తీసుకురావడం సంతోషంగా ఉందని ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ హెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ రమేష్ డోరైరాజన్ అన్నారు. అలాగేఈ వినూత్న ఆర్థిక పథకాల ద్వారా కస్టమర్‌పై భారాన్ని తగ్గించడమే కాకుండా సురక్షితమైన, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ పథకాల నిమిత్తం టాటా మోటార్స్‌తో చేతులు కలపడం తమకు గర్వకారణమని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్యాసింజర్ వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టీఏ రాజగోప్పలన్ తెలిపారు. -
కార్వీ స్కామ్, తీసుకున్న రుణాలు ఎగ్గొట్టేందుకు కుట్ర.?!
ప్రముఖ స్టాక్ మార్కెట్ సంస్థ కార్వీపై షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకుందని హెచ్డీఎఫ్సీ,ఇండస్ ఇండ్ బ్యాంక్‌లు ఫిర్యాదు చేశాయి. కార్వీపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. షేర్లను ఉంచుకొని రుణాలు మంజూరు చేయాలని ధరఖాస్తు చేసుకొని తరువాత అసలు,వడ్డీ చెల్లించకుండా మోసం చేసిందని హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ లు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. రూ.329.16 కోట్ల షేర్లను తనఖా పెట్టి హెచ్డీఎఫ్సి వద్ద రుణం తీసుకుంటే.. ఇండస్ ఇండ్ బ్యాంక్ లో రూ. 137కోట్ల రుణం తీసుకొని ఎగవేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రుణం తీసుకున్న తర్వాత కొద్దినెలలు వాయిదాలు చెల్లించి రుణాల్ని ఎగవేయడంలో వెన్నతో పెట్టిన విద్య అని బ్యాంక్‌లు అంటున్నాయి. 2019 సెప్టెంబరులో కార్వీసంస్థపై ఫిర్యాదుతో రావడంతో సెబీ విచారణ జరిపి లావాదేవీలపై నిషేదం విధించింది. వినియోగదారుల షేర్లను కార్వీసంస్థ అక్రమంగా సొంత లాభానికే వాడుకుంటుందంటూ సెబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక సమర్పించింది. వందల కొద్ది షేర్లు నకిలీవి ఉన్నాయంటూ నివేదికలో తెలిపింది. దీంతో కార్వీ సంస్థ బ్యాంకుల్లో ఉంచిన షేర్ల లావాదేవీలు ఒక్కసారిగా స్తంభించాయి. మరోవైపు తాము ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు అవసరమైన పత్రాల్ని సమర్పించాలంటూ కార్వీ డైరెక్టర్లకు హెచ్డీఎఫ్ అధికారులు నోటీసులు పంపారు. అయితే నెలలు గడుస్తున్నా పత్రాలు ఇవ్వలేదని బ్యాంక్ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే రుణాల్ని ఎగవేత వేయడంతో పాటూ బ్యాంకుల్ని దారుణంగా వంచించారని, ప్రజల డబ్బుకు రక్షణగా ఉన్న తమపట్ల అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ కార్వీ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ రెండు బ్యాంకులు కోరాయి. చదవండి : అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?! -
ఇండస్‌ఇండ్‌కు తాజా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంకుకు తాజాగా రూ. 2,201 కోట్ల పెట్టుబడులు లభించాయి. హిందుజా గ్రూప్‌నకు చెందిన బ్యాంక్ ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్ వారంట్లను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ నిధులను అందించారు. 2019 జూలైలో భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో ప్రమోటర్లకు బ్యాంకు వారంట్లను జారీ చేసింది. విలీన సమయంలో ప్రమోటర్లు వారంట్లపై తొలిదశలో రూ. 673 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 2021 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు బ్యాంక్ పేర్కొంది. వారంట్లను షేరుకి రూ. 1,709 ధరలో ఈక్విటీగా మార్పిడి చేసుకున్నట్లు వెల్లడించింది. బుధవారం షేరు ముగింపు ధర రూ. 1033తో పోలిస్తే మార్పి డి ధర 65 శాతం ప్రీమియంకావడం గమనార్హం! 2019లో..: ప్రమోటర్ సంస్థలు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్, ఇండస్ఇండ్ లిమిటెడ్‌కు దాదాపు 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఫైనాన్స్ కమిటీ అనుమతించింది. 2019 జూలై 6న ప్రమోటర్ సంస్థలకు బ్యాంకు ఇదే స్థాయిలో వారంట్లను జారీ చేసింది. వీటి విలువ రూ. 2,695 కోట్లు. ఈ సమయంలో 25% సొమ్ము (రూ.674 కోట్లు)ను ప్రమోటర్లు చెల్లించారు. కాగా.. తాజా పెట్టుబడుల నేపథ్యంలో కనీస మూలధన నిష్పత్తి 17.68 శాతానికి బలపడినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 1 శాతం లాభంతో రూ. 1,043 వద్ద ముగిసింది. -
ఇండస్‌ఇండ్‌పై కోటక్ కన్ను!
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో చాలాకాలం తర్వాత ఓ భారీ డీల్ కుదరవచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకును దిగ్గజ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంకు (కేఎంబీ) కొనుగోలు చేయొచ్చన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది పూర్తి స్టాక్ డీల్‌గా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ వార్తలను ఇండస్ఇండ్ బ్యాంక్, దాని ప్రమోటర్లు ఖండించారు. ‘ఇవన్నీ వదంతులే. ఇవి నిరాధారమైనవి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) ప్రమోటర్లుగా వీటిని ఖండిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్‌నకు ఎల్లవేళలా తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశీ ఎకానమీ, ఆర్థిక సంస్థలకు ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తాము సానుకూలంగా స్పందించామని, బ్యాంకును నిలబెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. హిందుజా గ్రూప్ ఆధ్వర్యంలో ఐఐహెచ్ఎల్ నడుస్తోంది. ఒకవేళ ఈ డీల్ గానీ కుదిరితే.. 2014లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను కోటక్ మహీంద్రా బ్యాంక్ విలీనం చేసుకున్న ఒప్పందం తర్వాత ప్రైవేట్ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్ కానుంది. కేఎంబీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 2.75 లక్షల కోట్లు కాగా, ఇండస్ఇండ్ బ్యాంక్ది సుమారు రూ. 50,000 కోట్లుగా ఉంది. అవకాశాలు పరిశీలిస్తుంటాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ కొనుగోలు వార్తలపై వ్యాఖ్యానించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ నిరాకరించింది. అయితే, ఇటీవలే నిధులు సమీకరించిన నేపథ్యంలో కంపెనీలు, అసెట్ల కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామని పేర్కొంది. గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైమిన్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా గ్రూప్ రూ. 7,000 కోట్లు సమీకరించింది. ‘క్యూ1లో ఈ నిధులను సమీకరించినప్పుడే మేం .. అసెట్స్, కంపెనీల్లాంటివి కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పాం. కాబట్టి అలాంటి అవకాశాలేమైనా వస్తే కచ్చితంగా పరిశీలిస్తాం. కాకపోతే దీనిపై (ఇండస్ఇండ్) వ్యాఖ్యానించడానికేమీ లేదు‘ అని భట్ చెప్పారు. డీల్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కేఎంబీ షేరు 2.36 శాతం పెరిగి రూ. 1,416 వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ. 616 వద్ద క్లోజయ్యింది. -
ఇండస్‌ఇండ్‌పై కొటక్ మహీంద్రా కన్ను?!
హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్‌పై ప్రయవేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ దృష్టి సారించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆల్ స్టాక్ డీల్(షేర్ల మార్పిడి) ద్వారా ఒప్పందం కుదుర్చుకునే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. సంయుక్త సంస్థలో ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్లు హిందుజా గ్రూప్ కొంతమేర వాటాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై వ్యాఖ్యలు చేయబోమంటూ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రతినిధి స్పందించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇక మరోపక్క.. ఇవి వట్టి పుకార్లు మాత్రమేనని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో సుమంత్ కథప్లియా కొట్టిపారేశారు. బ్యాంక్ యాజమాన్యం ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని, ఈ వార్తలు నిరాధారమని వివరించారు. డీల్ జరిగితే.. ఇటీవల ఆస్తుల(రుణ) నాణ్యతపై ఆందోళనలతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు డీలాపడుతూ వస్తోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండస్ఇండ్ షేరు 64 శాతం పతనమైంది. దీంతో బ్యాంక్ మార్కెట్ విలువలో 60 శాతం కోత పడినట్లు నిపుణులు తెలియజేశారు. ఒకవేళ ఇండస్‌ఇండ్‌ను కొటక్ మహీంద్రా బ్యాంక్ టేకోవర్ చేస్తే.. సంయుక్త సంస్థ ప్రయివేట్ రంగంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా ఆవిర్భవించే వీలున్నట్లు వివరించారు. బ్యాంక్ ఆస్తులు 83 శాతం పెరిగే అవకాశమున్నట్లు తెలియజేశారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇంతక్రితం 2014లో ఐఎన్జీ గ్రూప్‌ను 2 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇండస్ఇండ్ ప్రమోటర్లు హిందుజా గ్రూప్‌తో కొటక్ మహీంద్రా గ్రూప్ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. 11.2 బిలియన్ డాలర్ల విలువైన హిందుజా గ్రూప్‌లోని నలుగురు సోదరుల మధ్య విభేధాల నేపథ్యంలో బ్యాంక్ విక్రయానికి చర్చలు ప్రారంభమైనట్లు భావిస్తున్నాయి. హిందుజా సోదరులు ఇండస్‌ఇండ్‌లో వాటా పెంచుకునేందుకు చేసిన ప్రతిపాదనను ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ తిరస్కరించినట్లు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. షేర్ల తీరిలా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 1,382 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,399 వద్ద గరిష్టాన్ని, రూ. 1,372 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 2.4 శాతం జంప్‌చేసి రూ. 623 వద్ద కదులుతోంది. తొలుత గరిష్టంగా రూ. 633ను అధిగమించగా.. ఒక దశలో రూ. 617 వద్ద కనిష్టాన్ని చేరింది. -
టాటా కాఫీ- ఇండస్ఇండ్.. అదరహో!
విదేశీ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. మరోవైపు ఇదే కాలంలో పటిష్ట పనితీరు చూపడంతో పానీయాల దిగ్గజం టాటా కాఫీ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం 68 శాతం క్షీణించింది రూ. 461 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 8681 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 72 శాతం పడిపోయి రూ. 602 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.45 శాతం నుంచి 2.53 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం జంప్‌చేసి రూ. 549 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 565 వరకూ ఎగసింది. టాటా కాఫీ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన టాటా కాఫీ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 36 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 26 శాతం పుంజుకుని రూ. 588 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 65 శాతం వృద్ధితో రూ. 79 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో టాటా కాఫీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 97 వరకూ ఎగసింది. -
ఇండస్ఇండ్- యస్ బ్యాంక్.. జోరు
ప్రపంచ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 36 పాయింట్లు క్షీణించి 36,638కు చేరగా.. నిఫ్టీ 7 పాయింట్లు తక్కువగా 10,793 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల ప్రభావంతో ప్రయివేట్ రంగ సంస్థలు ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో యూఎస్ హెడ్జ్ ఫండ్.. రూట్ వన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాటాను పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 5.25 శాతం జంప్‌చేసి రూ. 554 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వరకూ ఎగసింది. గత 7 ట్రేడింగ్ సెషన్లలోనూ ఈ షేరు 15 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! బ్యాలన్స్‌షీట్‌ను పటిష్ట పరచుకోవడంతోపాటు నిధుల సమీకరణ ప్రణాళికల్లో భాగంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటీవల పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇండస్‌ఇండ్‌లో రూట్ వన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ప్రస్తుతం 5.41 శాతం వాటా ఉంది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈ వాటాను 9.9 శాతానికి పెంచుకునే యోచనలో రూట్ వన్ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందుకు బ్యాంక్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వవలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మరోవైపు బ్యాంక్ ప్రమోటర్లు సైతం తమ వాటాను ప్రస్తుత 14.34 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలతో ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం బలపడి రూ. 26.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 27 వరకూ పెరిగింది. బ్యాంక్ బోర్డుకి చెందిన పెట్టుబడుల పెంపు కమిటీ(సీఆర్సీ) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధుల సమీకరణకు అనుమతించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఈ నెల 10న నిర్వహించనున్న సమావేశంలో సీఆర్సీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలియజేసింది. -
ఇండస్ఇండ్- రామ్‌కో సిస్టమ్స్.. దూకుడు
కోవిడ్-19 ప్రభావంతో ఈ ఏడాది అమెరికా జీడీపీ 6.5 శాతం క్షీణించనున్నట్లు ఫెడ్ వేసిన అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో దేశీయంగానూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 340 పాయింట్లు పతనమై 33,907ను తాకింది. తద్వారా 34,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ 90 పాయింట్లు క్షీణించి 10,026 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ సెకండరీ మార్కెట్ ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రమోటర్లు పేర్కొనడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.3 శాతం జంప్‌చేసి రూ. 526 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం ఎగసి గరిష్టంగా రూ. 541కు చేరింది. వెరసి వరుసగా ఐదో రోజు లాభాలతో కదులుతోంది. గత వారం రోజుల్లో ఈ షేరు 30 శాతం దూసుకెళ్లడం విశేషం! అయితే గతేడాది ఆగస్ట్‌లో నమోదైన చరిత్రాత్మక గరిష్టం రూ. 2038తో పోలిస్తే ఇప్పటికీ 73 శాతం పతనంలో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మార్చి 24న రూ. 236 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ స్థాయి నుంచి చూస్తే రెట్టింపునకుపైగా ఎగసింది. కాగా.. ప్రస్తుతం ఇండస్‌ఇండ్‌లో ప్రమోటర్లకు 14.68 శాతం వాటా ఉంది. ఈ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతించమంటూ ఏప్రిల్‌లోనే ప్రమోటర్లు ఆర్బీఐకు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. రామ్‌కో సిస్టమ్స్ సుప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కిషన్‌లాల్ కేడియా ఈ నెల 10న రామ్‌కో సిస్టమ్స్ ఈక్విటీలో 1.1 శాతం వాటాకు సమానమైన దాదాపు 3.4 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. ఐటీ కన్సల్టింగ్ కంపెనీ రామ్‌కో సిస్టమ్స్‌లో వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా షేరుకి రూ. 87.82 ధరలో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేడియా సెక్యూరిటీస్ ద్వారా విజయ్ కేడియా రెప్రో ఇండియా, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, సుదర్శన్ కెమికల్స్, సెరా శానిటరీ తదితర స్మాల్ క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రామ్‌కో సిస్టమ్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి వరుసగా రెండో రోజు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో రూ. 18.4 ఎగసి రూ. 110 వద్ద ఫ్రీజయ్యింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కలిపి ఇప్పటివరకూ 7 లక్షల షేర్లకుపైగా చేతులు మారినట్లు నిపుణులు వెల్లడించారు. మంగళవారం ఈ షేరు రూ. 77 సమీపంలో ముగిసింది. -
ఎస్బీఐ- ఇండస్ఇండ్.. పరుగు
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ప్రమోటర్లు అదనపు వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఎస్బీఐ షేరు తొలుత 6 శాతం జంప్‌చేసింది. రూ. 198 సమీపానికి చేరింది. ప్రస్తుతం 4 శాతం ఎగసి రూ. 195 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు తొలుత 8 శాతం దూసుకెళ్లి రూ. 456ను తాకింది. ప్రస్తుతం 6.5 శాతం లాభపడి రూ. 450 వద్ద ట్రేడవుతోంది. ఇతర వివరాలు చూద్దాం.. లాభాలు అప్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ. 3581 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఇది రికార్డ్‌కాగా.. ఇందుకు అనుబంధ విభాగం ఎస్బీఐ కార్డ్స్‌లో వాటా విక్రయం ద్వారా సమకూరిన రూ. 2731 కోట అదనపు ఆదాయం సహకరించింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22766 కోట్లకు పరిమితంకాగా.. స్థూల, నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.15 శాతం, 2.23 శాతానికి చేరాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఓపెన్ మార్కెట్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ అదనపు షేర్లను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్లకు 14.68 శాతం వాటా ఉంది. ఈ వాటాను 26 శాతం వరకూ పెంచుకునేందుకు అనుమతించమంటూ ఏప్రిల్‌లో ప్రమోటర్లు రిజర్వ్ బ్యాంక్‌నకు దరఖాస్తు చేసుకున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్ శాక్స్ సింగపూర్ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ(ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్) ప్రయివేటు రంగ దిగ్గజబ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్‌లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు సగటున రూ.430 చొప్పున మొత్తం 4.1 మిలియన్ (41 లక్షల) షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 176 కోట్ల రూపాయలు. గోల్డ్‌మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ జోరుమీదుంది. గురువారం ప్రారంభలో షేర్ ధర 4శాతానికి పైగా లాభపడింది. గత 3 రోజుల్లో షేర్ 8.47 శాతం పెరగడం విశేషం. ఓపెన్ మార్కెట్లో గోల్డ్‌మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంక్ 4శాతం పైగా లాభపడింది. గత నెల 20న ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి రూ.235.55కుపడిపోయిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ తర్వాత కోలుకుంది. కనిష్ట స్థాయి వద్ద లభించిన కొనుగోళ్ళ మద్దతుతో ఇండస్ఇండ్ బ్యాంక్ 87శాతం లాభపడింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో అనేక రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం , దాని ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రూ .30 కోట్ల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరణ, తదితర పరిణామాలను, అవసరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది. -
‘సంపద’కు కేరాఫ్.. రిలయన్స్
న్యూఢిల్లీ: గడిచిన ఐదు సంవత్సరాల్లో... అంటే 2014–19 మధ్య వాటాదారులకు అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. ఈ కాలంలో ఈ కంపెనీ రూ.5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు ‘మోతీలాల్ ఓస్వాల్ వార్షిక సంపద సృష్టి అధ్యయనం 2019’ తేల్చింది. అధికంగా సంపద తెచ్చిపెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు కలసి 2014–19 కాలంలో సమకూర్చిన సంపద రూ.49 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2014–19 కాలంలో రూ.5.6 లక్షల కోట్ల విలువను సమకూర్చి అత్యధిక సంపద సృష్టికర్తగా అవతరించింది. చరిత్రలో ఇప్పటి దాకా ఇదే అత్యధిక రికార్డు’’ అని బుధవారం విడుదలైన ఈ నివేదిక పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా, అత్యంత వేగంగా, నిలకడగా సంపద సమకూర్చిన టాప్ 3 కంపెనీలుగా ఆర్ఐఎల్, ఇండియా బుల్స్ వెంచర్స్, ఇండస్ఇండ్ బ్యాంకు నిలవగా... వేగంగా సంపద తెచ్చిపెట్టిన వాటిల్లో ఇండియాబుల్స్ వెంచర్స్ వరుసగా రెండోసారి మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. ఈ షేరు గత ఐదేళ్లలో వార్షికంగా 78 శాతం కాంపౌండెడ్ రాబడులను తెచ్చిపెట్టింది. టాప్–10 సంపద సృష్టికర్తల్లో బజాజ్ ఫైనాన్స్ స్థానం ప్రత్యేకమని ఈ నివేదిక తెలిపింది. ఇండస్ ఇండ్ బ్యాంకు 2009–19 కాలంలో కాంపౌండెడ్‌గా 49 శాతం చొప్పున స్థిరంగా సంపదను సృష్టించింది. ఇక 2014–19 కాలంలో సెన్సెక్స్ కాంపౌండెడ్ వార్షిక రాబడి 12 శాతంగా ఉంది. అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ కంపెనీలు సంపదను తెచ్చిపెట్టినట్టు నివేదిక తెలియజేసింది. ఫైనాన్షియల్ రంగం ముందంజ... ఫైనాన్షియల్ రంగం 2014–19 మధ్య కాలంలో అత్యంత సంపదను తెచ్చిపెట్టిన రంగంగా వరుసగా మూడో ఏడాది అగ్ర పథాన నిలిచింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలే ఈ రంగాన్ని నడిపించాయి. కాకపోతే, ఇదే విభాగంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వాటాదారుల సంపదకు నష్టం చేకూర్చాయి. టాప్ 100 సంపద సృష్టికర్తల్లో ప్రభుత్వరంగ సంస్థలు కేవలం తొమ్మిదే చోటు సంపాదించాయి. అవి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎల్ఐసీ హౌసింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్బీసీసీ. 2014–19 మధ్య కాలంలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మార్పుల ఆధారంగా ఈ గణాంకాలను మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రూపొందించింది. శ్రీమంతుల సగటు సంపద రూ.3.6 కోట్లే విశ్రాంత జీవనానికి నెలకు రూ.93,000 స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో సంపన్నుల సగటు ఐశ్వర్యం రూ.3.6 కోట్లేనని, విశ్రాంత జీవన కాలంలో ప్రతి నెలా వెచ్చించేందుకు వారికి రూ.93,000 మాత్రమే ఉంటున్నదని స్టాండర్డ్ చార్టర్డ్ ‘సంపద అంచనా నివేదిక 2019’ తెలియజేసింది. ఇందులో వర్ధమాన సంపన్నుల వద్ద సగటున రూ.1.3 కోట్లు, సంపన్నుల వద్ద రూ.2.6 కోట్లు, అధిక సంపన్నుల(హెచ్ఎన్డబ్ల్యూఐ) వద్ద రూ.6.9 కోట్ల మేర వారి రిటైర్మెంట్ నాటికి ఉంటుందని అంచనా వేసింది. ఈ లెక్కన ఒక్కో సంపన్నుని వద్ద రిటైర్మెంట్ సమయంలో ప్రతీ నెలా వ్యయం చేసేందుకు రూ.93,000 ఉంటుందని పేర్కొంది. ఈ నిధిని వారి కోరిక మేరకు సగటున నెలవారీగా వ్యయం చేస్తూ వెళితే మాత్రం వర్ధమాన సంపన్నులకు ఆరేళ్ల పాటు, సంపన్నులకు తొమ్మిదేళ్లు, హెచ్ఎన్డబ్ల్యూఐలకు ఐదేళ్ల పాటే సరిపోతుందని నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లు తదితర అంశాలతో ఎంత సంపదను సమకూర్చుకోగలరు? రిటైర్మెంట్ సమయంలో ప్రతినెలా ఎంత మొత్తంతో వారు జీవించగలరు? అనే గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది.