ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ను... వీడని ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కష్టాలు | IndusInd Bank reports marginal rise in Q3 profit | Sakshi
Sakshi News home page

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ను... వీడని ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కష్టాలు

Published Thu, Jan 10 2019 12:44 AM | Last Updated on Thu, Jan 10 2019 12:44 AM

IndusInd Bank reports marginal rise in Q3 profit - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ కష్టాలు ఇంకా వీడలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో బ్యాంక్‌ రూ.985 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.936 కోట్ల  లాభంతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. సాధారణంగా ఈ బ్యాంక్‌ ప్రతి క్వార్టర్‌లోనూ 20–25 శాతం వృద్ధిని సాధించేది. గత రెండు క్వార్టర్లలో నికర లాభం వృద్ధి తగ్గుతూ వస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఈ బ్యాంక్‌ రూ.3,000 కోట్ల మేర రుణాలివ్వడమే దీనికి ప్రధాన కారణం. 

అది మినహాయిస్తే, మామూలుగానే....
గత క్యూ3లో రూ.5,474 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 32 శాతం వృద్ధితో రూ.7,232 కోట్లకు పెరిగిందని  బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ కష్టాలను మినహాయిస్తే, తమ వ్యాపారం మామూలుగానే ఉందని వివరించారు. ఈ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగిందని రమేశ్‌ సోబ్తి చెప్పారు. కార్పొరేట్, వాహన రుణాల జోరుతో రుణ వృద్ధి 35 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. 

మిశ్రమంగా మొండి బకాయిలు..
స్థూల మొండిబకాయిలు 1.16% నుంచి 1.13%కి తగ్గాయని రమేశ్‌ సోబ్తి వెల్లడించారు. అయితే నికర మొండి బకాయిలు మాత్రం 0.46% నుంచి 0.59% కి పెరిగాయన్నారు. అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే స్థూల మొండి బకాయిలు 10% ఎగసి రూ.1,968 కోట్లకు చేరాయని, నికర మొండి బకాయిలు 31 శాతం పెరిగి రూ.1,029 కోట్లకు చేరాయని వివరించారు. కేటాయింపులు 157 శాతం పెరిగి రూ.607 కోట్లకు పెరిగాయని, సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ వృద్ధి 3% అని వివరించారు. 

తగ్గిన నికర వడ్డీ మార్జిన్‌...
నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం తగ్గిందని రమేశ్‌ సోబ్తి తెలిపారు. గత క్యూ3లో 3.99 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ3లో 3.83 శాతంగా ఉందని, ఈ క్యూ2లో 3.84 శాతమని పేర్కొన్నారు.  ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాల కోసం ఈ క్యూ3లో రూ.255 కోట్లు కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. క్యూ2లో రూ.275 కోట్లు కేటాయింపులతో కలుపుకొని మొత్తం మీద ఈ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు రూ.600 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వివరించారు.  ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలోఇండస్‌ఇండ్‌ »కê్యంక్‌ షేర్‌ 1.4 శాతం లాభపడి రూ.1,601 వద్ద ముగిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement