ఇండస్‌ఇండ్ బ్యాంక్ బోణీ బాగుంది
క్యూ3లో లాభం 29 శాతం వృద్ధి
ముంబై: గతేడాది అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూలతలను తట్టుకుని మరీ ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్ బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం 29 శాతం అధికంగా రూ.750.64కోట్లు నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.581 కోట్లే. డీమానిటైజేషన్ ప్రభావం అంతగా లేదని బ్యాంకు తెలిపింది.
ఎన్‌ఐఐ జూమ్: నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) విభాగంలో లాభం 35 శాతం అధికంగా రూ.1,578 కోట్లు వచ్చిందని... నిధుల వ్యయాలు తగ్గడమే దీనికి కారణమని ఇండస్ ఇండ్ బ్యాంకు ఎండీ రమేశ్ సోబ్తి తెలిపారు. నగదు నిల్వల నిష్పత్తి విషయంలో ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల ఎన్‌ఐఐ రూ.40 కోట్లు అధికంగా వచ్చినట్టు చెప్పారు.
కలిసొచ్చిన డిపాజిట్లు: ఇక బ్యాంకు డిపాజిట్లు 35 శాతం పెరిగాయి. వీటిలో 56 శాతం సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలే. వీటిపై వ్యయాలు తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.
రుణాలు: రుణాల జారీలోనూ ఇండస్ ఇండ్ బ్యాంకు మెరుగైన గణాంకాలను ప్రకటించింది. ఇవి 25 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమ సగటు కంటే ఐదు రెట్లు అధికమని సోబ్తి పేర్కొన్నారు. రుణాలకు డిమాండ్ కూడా తగ్గలేదన్నారు.
చెల్లని నోట్లు: రూ.11,400 కోట్ల విలువైన చెల్లని పెద్ద నోట్లను డిపాజిట్లుగా బ్యాంకు స్వీకరించింది. నవంబర్ 8 తర్వాత రూ.200, రూ.1,000 నోట్ల రూపంలో భారీ స్థాయిలో నగదు జమలు వచ్చినప్పటికీ సీఆర్‌ఆర్ రూపంలో పక్కన పెట్టినట్టు బ్యాంకు తెలిపింది