
ప్రైవేటు రంగానికి చెందిన ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో బయటపడిన అవకతవకలు.. వాటి చుట్టూ అల్లుకున్న ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పందించింది. ప్రస్తుతం ఆ బ్యాంకు పరిస్థితి ఏంటి..? డిపాజిటర్లు, ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా..? అనే దానిపై ఆర్బీఐ తాజాగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
భయపడాల్సిన పని లేదు
ఇండస్ ఇండ్ బ్యాంక్ పరిస్థితి గురించి భయపడాల్సిన పని లేదంటూ ఆర్బీఐ డిపాజిటర్లు, ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చింది. స్పెక్యులేటివ్ రిపోర్టులపై స్పందించవద్దని సెంట్రల్ బ్యాంక్ కోరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ తెలిపింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ మంచి క్యాపిటలైజేషన్ కలిగి ఉందని, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపింది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ ఆడిటర్ సమీక్షించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. బ్యాంక్ సౌకర్యవంతమైన క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.46 శాతం, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 70.20 శాతంగా ఉంది. 2025 మార్చి 9 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్సిఆర్) 113 శాతంగా ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
ఇండస్ ఇండ్ బ్యాంక్ తన ప్రస్తుత వ్యవస్థలను సమీక్షించడానికి, అకౌంటింగ్ తప్పిదం వాస్తవ ప్రభావాన్ని త్వరగా అంచనా వేయడానికి, లెక్కించడానికి ఇప్పటికే ఒక బాహ్య ఆడిట్ బృందాన్ని నియమించింది. వాటాదారులందరికీ అవసరమైన వివరాలను వెల్లడించిన తర్వాత ప్రస్తుత త్రైమాసికంలో అంటే 2025 ఆర్థిక సంవత్సరం క్యూ4 నాటికి నివారణ చర్యలను పూర్తి చేయాలని బ్యాంకు బోర్డు, యాజమాన్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.
రూ.2,100 కోట్ల అకౌంటింగ్ తప్పిదం
ఇండస్ఇండ్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియోలోని ఆస్తులు, అప్పుల ఖాతాలకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్షలో కొన్ని "లోపాలు" కనిపించాయని మార్చి 2025 మార్చి 10న వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువలో ఈ లోపం ప్రతికూల ప్రభావం సుమారు 2.35% ఉంటుందని అంతర్గత సమీక్ష అంచనా వేసింది. పన్ను అనంతరం దాదాపు రూ.1,600 కోట్లు, పన్నుకు ముందు రూ.2,100 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment