
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ సంస్థలకు 2024–25 సంవత్సరం మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. ఆదాయం సగటున 5 శాతం వృద్ధి చెందినట్టు కంపెనీలు తెలిపాయి. అదే సమయంలో మార్జిన్లలో ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గానే ఉండడం గమనార్హం. గోద్రేజ్ కన్జ్యూమర్, ఇమామీ మినహా మిగిలిన కంపెనీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఆదాయం అంచనాలను బీఎన్‌పీ పారిబా తగ్గించింది.
ముడి చమురు ధరలు తగ్గడం, గ్రామీణ వృద్ధి కోలుకోవడం వంటి సానుకూలతలతో 2025–26లో సానుకూల బేస్ ఏర్పడుతుందని పేర్కొంది. 2024–25 క్యూ4లో (మార్చి త్రైమాసికం) అధిక శాతం కమోడిటీల ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నట్టు బీఎన్‌పీ పారిబా నివేదిక వెల్లడించింది. ఇది కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. పామాయిల్, టీ ధరలు మాత్రం తగ్గినట్టు తెలిపింది. స్టాపుల్స్ (నిత్యావసరాలు) విక్రయాలకు క్యూ4 బలహీన క్వార్టర్‌గా ఉంటుందని పేర్కొంది.
10 ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు గాను 9 కంపెనీల స్థూల మార్జిన్లు బలహీనంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అగ్రి ముడి పదార్థాల ధరల ఒత్తిళ్లు వీ టిపై ఉన్నట్టు వివరించింది. టైటాన్, జుబిలెంట్ ఫు డ్స్ వంటి విచక్షణా రహిత వినియోగ ఆధారిత కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొంది.
1–8 శాతం మద్య వృద్ధి..
‘‘2025–26 ఆర్థిక సంత్సరంలో మేము అధ్యయనానికి పరిగణనలోకి తీసుకున్న 10 కంపెనీలకు గాను 8 కంపెనీలకు ఆదాయం వృద్ధి 1–8 శాతం మధ్యే ఉంటుంది. గోద్రేజ్ కన్జ్యూమర్, ఇమామీ కంపెనీలకు వృద్ధి కాస్త మెరుగ్గా ఉండొచ్చు’’అని బీఎన్‌పీ పారిబా నివేదిక తెలిపింది. ఈ సంస్థ పరిగణనలోకి తీసుకున్న మిగిలిన కంపెనీల్లో హెచ్‌యూఎల్, బ్రిటానియా, డాబర్, ఐటీసీ, మారికో, నెస్లే ఇండియా, జుబిలెంట్ ఫుడ్స్, టైటాన్ ఉన్నాయి.