
2023–24లో 4 శాతం వృద్ధి
కొత్తగా 1.86 లక్షల విక్రేతలు
మొత్తం 88 లక్షలకు చేరిక
న్యూఢిల్లీ: డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ స్థిరమైన వృద్ధిని చూస్తోంది. పరిశ్రమ విలువ 2024 మార్చి నాటికి రూ.22,150 కోట్లకు చేరుకున్నట్టు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్‌ఏ) ప్రకటించింది. ఈ రంగంలో 470 వరకు చిన్న, పెద్ద సంస్థలు దేశంలో సేవలు అందిస్తుండగా, వీటి పరిధిలో కొత్తగా 1.86 లక్షల మంది ప్రత్యక్ష విక్రేతలు (డైరెక్ట్ సెల్లర్స్) 2023–24లో నమోదైనట్టు తెలిపింది.
గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24) డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ఏటా 7.15 శాతం చొప్పున వృద్ధి చెందుతూ.. రూ.16,800 కోట్ల నుంచి రూ.22,142 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది.
ఈ రంగంలో ఆరోగ్య సంరక్షణ, పోషకాహార ఉత్పత్తులు అధిక అమ్మకాలతో 64.15 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐడీఎస్‌ఏ వార్షిక నివేదిక తెలిపింది. కాస్మెటిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాల వాటా 23.75 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ రెండు విభాగాల వాటా 2023–24 మొత్తం అమ్మకాల్లో 87.9 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో ఉత్తరాది 29.8 శాతం వాటాతో ముఖ్య పాత్ర పోషిస్తోంది.
తూర్పు భారత్ నుంచి 24.2 శాతం అమ్మకాలు కొనసాగగా, ఇందులో పశ్చిమబెంగాల్ నుంచే 11.3 శాతం సమకూరింది. పశ్చిమ భారత్‌లో అమ్మకాలు 22.4 శాతంగా ఉంటే, దక్షిణాదిన 15.3 శాతం అమ్మకాలు కొనసాగాయి. ఎనిమిది రాష్ట్రాలతో కూడిన ఈశాన్య భారత్‌లో అమ్మకాలు 8.3 శాతంగా ఉన్నాయి.
మహారాష్ట్ర ప్రధాన మార్కెట్..
13 శాతం వాటాతో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో (2023–24) మహారాష్ట్ర అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, యూపీ, బీహార్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, ఢిల్లీ, అసోం, గుజరాత్ టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70 శాతం ఈ రాష్ట్రాల నుంచే వచి్చంది. 2023 మార్చి నాటికి మొత్తం డైరెక్ట్ సెల్లర్స్ 88.06 లక్షలుగా ఉంటే, 2024 మార్చి నాటికి 86.2 లక్షలకు పెరిగారు. చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే ప్రత్యక్ష విక్రేతల్లో 56 శాతం మంది పురుషులు కాగా, 44 శాతం మహిళలు ఉన్నారు.
మొత్తం విక్రేతల్లో 73.2 శాతం 25–54 ఏళ్ల వయసులోని వారు కావడం గమనార్హం. అంతేకాదు విక్రేతల్లో అత్యధికులకు ఉన్నత విద్యార్హతలున్నాయి. 52 శాతం మంది గ్రాడ్యుయేషన్, 26 శాతం మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారే. ప్రత్యక్ష విక్రయాల్లో ఇళ్ల నుంచి చేసేవి అధికంగా ఉన్నాయి. డిజిటల్ ఛానళ్ల ద్వారా అమ్మకాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. 17 శాతం విక్రేతలు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర వాటి సాయంతో అమ్మకాలు పెంచుకుంటుంటే, 15 శాతం మంది వాట్సాప్, మెస్సేజింగ్ యాప్స్ సాయం తీసుకుంటున్నారు.