
వచ్చే ఏడాదిలో టీమ్‌లీజ్ సర్విసెస్ అంచనా
హబ్‌లుగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ
ముంబై: వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ క్విక్–కామర్స్ రంగం త్వరలో 5 బిలియన్ డాలర్లకు చేరనున్న నేపథ్యంలో వచ్చే ఏడాదిలో ఈ విభాగంలో సిబ్బంది సంఖ్య 5 – 5.5 లక్షల మందికి చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం క్యూ–కామర్స్ రంగంలో 2.5 – 3 లక్షల మంది ఔట్‌డోర్ డెలివరీ పార్ట్‌నర్స్, 70,000–75,000 మంది ఉద్యోగులు (క్లరికల్, ఆఫీస్ వర్కర్లు మొదలైనవారు) ఉన్నారు.
టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘భారతీయ క్యూ–కామర్స్ మార్కెట్ అసాధారణమైన వేగంతో వృద్ధి చెందుతోంది. వార్షికంగా 10–15 శాతం వృద్ధి రేటుతో 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరనుంది. వివిధ రకాల ఉత్పత్తులు, నగరాల సంఖ్యతో పాటు అమ్మకాల పరిమాణం పెరుగుతుండటంతో లాస్ట్ మైల్ డెలివరీ, డార్క్ స్టోర్స్, వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ మొదలైన విభాగాల సిబ్బందికి డిమాండ్ నెలకొంది’ అని టీమ్‌లీజ్ సర్విసెస్ సీనియర్ వీపీ బాలసుబ్రమణియన్ తెలిపారు.
అట్రిషన్ అధికం..
అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు చాలా అధికంగా ఉన్నందున, సిబ్బందికి నైపుణ్యాలు కల్పించడంపైన, ఉద్యోగులను అట్టేపెట్టుకోవడానికి తగిన వ్యూహాలపైన, ఏఐ ఆధారిత సిబ్బంది నిర్వహణ మొదలైన వాటికి వ్యాపార సంస్థలు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. 2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 19,000 మంది పైచిలుకు టీమ్‌లీజ్ అసోసియేట్స్ సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.
దీని ప్రకారం క్యూ–కామర్స్ ఉద్యోగాలకు కర్ణాటక (20 శాతం), మహారాష్ట్ర (19 శాతం), తెలంగాణ (13 శాతం) పెద్ద హబ్‌లుగా ఉంటున్నాయి. పరిశ్రమలో ఎంట్రీ లెవెల్ సిబ్బంది ఎక్కువగా ఉండగా, వీరిలో 71 శాతం మందికి 10 లేదా 12వ గ్రేడ్ విద్యార్హతలు ఉంటున్నాయి. తీవ్రమైన పోటీ, తరచుగా ఉద్యోగాలు మారిపోవడం వంటి అంశాల కారణంగా అట్రిషన్ రేటు అత్యధికంగా ఉండటం వల్ల పరిశ్రమ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోందని నివేదిక వివరించింది. దీన్ని అధిగమించడానికి పరిశ్రమ తమ సిబ్బందికి శిక్షణనివ్వడంపై, ఉద్యోగులు వెళ్లిపోకుండా అట్టేపెట్టుకునే వ్యూహాలపై కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment