Team Lease Report
-
అగ్రిటెక్ రంగంలో భారీగా కొలువులు
ముంబై: అగ్రిటెక్ రంగంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 60–80 వేల పైచిలుకు కొలువులు రాగలవని టీమ్‌లీజ్ సర్విసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (సీఎస్‌వో) సుబ్బురత్నం తెలిపారు. ఏఐ డెవలప్మెంట్, టెక్నాలజీ, పర్యావరణహిత వ్యవసాయ సొల్యూషన్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉండగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా అగ్రిటెక్ రంగంలో సాంకేతిక నిపుణులు, ఆపరేషన్స్ సిబ్బంది, మేనేజర్లు మొదలైన హోదాల్లో 1 లక్ష పైగా ఉద్యోగులు ఉన్నట్లు సుబ్బురత్నం వివరించారు. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉండగలవన్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు, పుణె, గురుగ్రామ్లాంటి నగరాలు అగ్రిటెక్ స్టార్టప్‌లకు కీలక కేంద్రాలుగా మారగలవని సుబ్బురత్నం చెప్పారు. హైబ్రిడ్ ఉద్యోగాలు.. అగ్రిటెక్ రంగం ప్రధానంగా సాంకేతిక ఆవిష్కరణలు, అనలిటిక్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉండవని పేర్కొన్నారు. సీజన్లో నాట్లు వేయడం నుంచి కోతల వరకు వివిధ రకాల పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది .. ఆఫ్–సీజన్లో డేటా విశ్లేషణ, పరికరాల నిర్వహణ మొదలైన వాటిపై పని చేస్తారని చెప్పారు. సాధారణంగా అగ్రిటెక్ ఉద్యోగాలు హైబ్రిడ్ విధానంలో ఉంటాయన్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, పర్యవేక్షణ బాధ్యతలను ఎక్కడి నుంచైనా నిర్వర్తించవచ్చని .. కానీ మెషిన్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వారు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుందని సుబ్బురత్నం చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా వ్యవసాయంలో కేవలం 1.5 శాతమే టెక్నాలజీ వినియోగం ఉంటోందని, ఈ నేపథ్యంలో అగ్రిటెక్ కంపెనీలకు 24 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రకారం 2022 నాటికి భారత్‌లో సుమారు 450 అగ్రిటెక్ స్టార్టప్‌లు ఉన్నట్లు వివరించారు. -
ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో (2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు) ఉపాధి అవకాశాలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ఈ కాలంలో సిబ్బందిని పెంచుకోనున్నట్టు 59 శాతం సంస్థలు తెలిపాయి. దీంతో ద్వితీయ ఆరు నెలల్లో 7.1 శాతం మేర సిబ్బంది పెరగనున్నట్టు టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలోనే సిబ్బంది సంఖ్యను కొనసాగించనున్నట్టు టీమ్‌లీజ్ సర్వేలో 22 శాతం కంపెనీలు తెలిపాయి. 23 రంగాల్లోని 1,307 కంపెనీల అభిప్రాయాలను టీమ్‌లీజ్ సర్వేలో భాగంగా తెలుసుకుంది. లాజిస్టిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), ఈవీ సదుపాయాలు, వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్, ఈ–కామర్స్ రంగాల నుంచే ప్రధానంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు రానున్నాయని, ఇవి మౌలిక వసతులు, ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా వ్యయం చేస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. రంగాల వారీగా..లాజిస్టిక్స్ రంగంలో 14 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఉద్యోగులను పెంచుకోనున్నట్టు 69 శాతం లాజిస్టిక్స్ కంపెనీలు వెల్లడించాయి. ఆ తర్వాత అధికంగా ఈవీ, ఈవీ ఇన్ఫ్రా కంపెనీలు 12 శాతం మేర సిబ్బందిని పెంచుకోనున్నాయి. వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్ కంపెనీల్లో 10.5 శాతం మేర, ఈ–కామర్స్ రంగంలో 9 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఆటోమోటివ్ రంగంలో 8.5 శాతం, రిటైల్ రంగంలో 8.2 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా ఏర్పడనున్నాయి.ఇదీ చదవండి: 30 లక్షల యూనిట్లు ఎగుమతి!ప్రాంతాల వారీగా..కోయింబత్తూర్, గురుగ్రామ్ ఉపాధి కల్పన కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. అత్యధికంగా బెంగళూరు 53.1 శాతం, ముంబై 50.2 శాతం, హైదరాబాద్ 48.2 శాతంతో ఉపాధి కల్పన పరంగా ముందున్నాయి. ఉపాధి కోరుకుంటున్న వారికి చిన్న పట్టణాలు ప్రత్యామ్నాయ కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) టెక్నాలజీ, ఆర్అండ్డీలో అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు తెలిపింది. జాతీయ పారిశ్రామిక నడవాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి కల్పించనుండడం, సెమీకండక్టర్ పాలసీ ద్వారా 2025 నాటికి 80,000 ఉద్యోగాల కల్పన తదితర కీలక విధానాలను ప్రస్తావించింది. -
ఫైబర్ టెక్‌లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్‌సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు. -
‘ఇన్ఫ్రా’లో కోటి కొలువులు!
మౌలిక రంగం భారీ ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కోటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడతాయని ఉద్యోగ నియామక సేవలు అందించే ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ అంచనా వేసింది. కేంద్రంలో మూడోసారి కొలువు దీరిన మోదీ సర్కారు రహదారులు, రైళ్లు, విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితోపాటు, స్వల్ప నైపుణ్యాలు, పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ అంచనా. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 98 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది. ‘కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి. వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతోపాటు, అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కలి్పస్తాయి’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి. సుబ్రమణియమ్ తెలిపారు. రవాణా రంగంపైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్యను 220కి పెంచడం, 2025 చివరికి జాతీయ రహదారుల నిడివిని 2 లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే, 2030 నాటికి 23 జల రవాణా మార్గాల అభివృద్ధితోపాటు, 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారీగా వ్యయాలు.. ‘మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు. మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి. ఈ రంగంలో రైల్వే, రహదారులు, నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్‌లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది. మౌలిక రంగం, సామాజికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం.. పట్టణీకరణ పెరగడం, రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు. పెద్ద, భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎల్అండ్టీ గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సి.జయకుమార్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలు.. విమానాశ్రయాల విస్తరణ.. 2202025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం 2,00,000 కిలోమీటర్లు2030 నాటికి జలరవాణా మార్గాల ఏర్పాటు 23 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ 35 పార్క్‌ల నిర్మాణం -
లేఆఫ్స్ వేళ.. ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్!
హైదరాబాద్: ఫ్రెషర్లకు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. కంపెనీలలో ఫ్రెషర్ల నియామకాల ధోరణి 6 శాతం పెరిగినట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. 2023 మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాల ధోరణి 62 శాతంగా ఉంటే, 2024 మొదటి ఆరు నెలలకు సంబంధించి 68 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఇక క్రితం ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంతో పోలిస్తే 3 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలలకు సంబంధించి కెరీర్ అవుట్‌లుక్ నివేదికను టీమ్‌లీజ్ ఎడ్టెక్ విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో ఉద్యోగుల నియామకాల ఉద్దేశ్యం ప్రస్తుత ఏడాది జనవరి–జూన్ కాలానికి స్వల్పంగా పెరిగి 79.3 శాతానికి చేరింది. ఈ స్థిరమైన వృద్ధి రానున్న నెలల్లో ఫ్రెషర్ల నియామకాలకు సంబంధించి సానుకూలతను సూచిస్తున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ నివేదిక తెలిపింది. ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే విషయంలో ఈ–కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లు (55 శాతం), ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (53 శాతం), టెలికమ్యూనికేషన్స్ (50 శాతం) కంపెనీల్లో ఉద్దేశ్యం వ్యక్తమైంది. ఇక ఐటీ రంగంలో మాత్రం గతేడాది మొదటి ఆరు నెలలో పోలిస్తే, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్లను తీసుకునే ఉద్దేశ్యం తగ్గుముఖం పట్టింది. 49 శాతం నుంచి 42 శాతానికి తగ్గింది. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో 3 శాతం, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీలో 4 శాతం చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలలకు సంబంధించి నియామకాల ధోరణి తగ్గింది. వీరికి డిమాండ్.. గ్రాఫిక్ డిజైనర్, లీగల్ అసోసియేట్, కెమికల్ ఇంజనీర్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించి ఫ్రెషర్లకు డిమాండ్ నెలకొంది. ఎన్ఎల్పీ, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఐవోటీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, మెటావర్స్ ప్రముఖ డొమైన్ నైపుణ్యాలుగా ఉన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. బెంగళూరులో ఫ్రెషర్లకు (69 శాతం) ఎక్కువగా అవకాశాలు రానున్నాయి. ఆ తర్వాత ముంబైలో 58 శాతం, చెన్నైలో 51 శాతం, ఢిల్లీలో 51 శాతం చొప్పున ఫ్రెషర్లను తీసుకునే విషయంలో కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. జెనరేషన్ ఏఐ ప్రభావం ఫ్రెషర్ల నియామకాలపై ఏ మేరకు ఉంటుందన్న దానిపైనా ఈ నివేదిక దృష్టి సారించింది. సాఫ్ట్వేర్ డెవలపర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్ డిజైనర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, టెక్నికల్ రైటర్లు, లీగల్ అసిస్టెంట్ల ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని గుర్తించింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, వాటిని అమలు చేయడం అన్నవి ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలను పెంచుతాయని తెలిపింది. కనుక ఫ్రెషర్లు తమ నైపుణ్యాలను పెంచుకోవడమే కాకుండా, జెనరేషన్ ఏఐతో కలసి పనిచేసే విధంగా ఉండాలని సూచించింది. 18 రంగాల నుంచి 526 చిన్న, మధ్య, భారీ కంపెనీలను విచారించిన టీమ్‌లీజ్ ఎడ్టెక్ ఈ వివరాలను నివేదికలో పొందుపరిచింది. -
ఐటీ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారా? కొత్త ఉద్యోగాలపై కీలక రిపోర్ట్!
కొత్త ఏడాదిలో ఐటీ రంగంలో నియామకాలు తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.55 లక్షల మంది ఫ్రెషర్స్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అంచనా నెలకొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల మంది ఫ్రెషర్ నియమించుకోగా.. ఆ సంఖ్య మరింత తగ్గిపోవడం జాబ్ మార్కెట్లో ఆందోళన కనపిస్తుంది. ప్రస్తుత జాబ్ మార్కెట్లో 1.5 మిలియన్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు అనుగుణంగా అభ్యర్ధుల్లో స్కిల్స్ లేని కారణంగా నియామకాల్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగం మినహాయిస్తే ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా పెరిగనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 40శాతం మందిలో స్కిల్స్ టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. ప్రాజెక్ట్‌కు కావాల్సిన అన్నీ అర్హతలు కేవలం 45 శాతం మంది దగ్గర ఉండటం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ), కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ, రిటైల్ కన్స్యూమర్ బిజినెస్, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎనర్జీ వంటి నాన్-టెక్ సెక్టార్లతో గణనీయంగా నియామకాలు పెరగే అవకాశం ఉండగా.. వాటిల్లో అధిక శాతం ఫ్రెషర్లనే ఎంపిక చేసుకోనున్నాయి. సీనియర్లు, ఫ్రెషర్స్ అయినా.. ఈ స్కిల్ ఉంటే ఈ సందర్భంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభ్యర్ధులు ఆయా టెక్నాలజీలలో నిష్ణాతులైతే చాలు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో టెక్నికల్ నైపుణ్యం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి హార్డ్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్, సమస్యకు పరిష్కారం, టీమ్‌వర్క్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో సహా సాఫ్ట్ స్కిల్స్ ఉన్న సీనియర్లు, ఫ్రెషర్స్ కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఈ సర్టిఫికేట్ కోర్స్లున్నాయా? టీమ్‌లీజ్ డిజిటల్సైతం అభ్యర్ధులు జాబ్ సంపాదించుకునేందుకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలనే అంశంపై కొన్ని సలహాలు ఇచ్చింది. కంపెనీలకు తగ్గట్లు కావాల్సిన స్కిల్స్‌లో ప్రావీణ్యం పొందాలని సూచించింది. వాటిల్లో ప్రధానంగా ఆర్ సర్టిఫికేషన్‌తో కూడిన డేటా సైన్స్, ఎస్‌క్యూఎల్, సర్టిఫికేషన్ ట్రైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, సైబర్‌సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, అలాగే బ్లాక్‌చెయిన్ వెబ్ డిజైన్ సర్టిఫికేషన్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్స్ తో పాటు కావాల్సిన అన్నీ అర్హతలు ఉంటే కోరుకున్న ఉద్యోగం మీదేనని టీమ్ లీజ్ తెలిపింది. -
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్: రానున్న ఆరు నెలల్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఫ్రెషర్లకు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఫ్రెషర్లను నియమించుకోవాలని అనుకుంటున్నట్టు ఎక్కువ కంపెనీలు సర్వేలో వెల్లడించినట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ సంస్థ ఓ నివేదిక రూపంలో తెలిపింది. తొలి ఆరు నెలలకు సంబంధించి కెరీర్ అవుట్‌లుక్‌పై నివేదిక విడుదల చేసింది. బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు వచ్చే ఆరు నెలల్లో ఇతర రంగాల కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకుంటాయని స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ గురువారం ప్రచురించిన కొత్త నివేదిక తెలిపింది. భారత కంపెనీల ఫ్రెషర్ల నియామకాల ఉద్దేశ్యం 3 శాతం పెరిగి 62 శాతానికి చేరింది. 2022 జూలై-డిసెంబర్ కాలానికి ఇది 59 శాతంగా ఉంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ 874 భారీ, మధ్య, చిన్న తరహా కంపెనీల అభిప్రాయాలను 2022 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సమీకరించి ఈ వివరాలను వెల్లడించింది. ప్రెషర్లను నియమించుకోనున్నట్టు ఐటీ కంపెనీల్లో అత్యధికంగా 67 శాతం చెప్పాయి. ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లలో ఇది 52 శాతంగా ఉంటే, టెలికమ్యూనికేషన్స్‌లో 51 శాతంగా ఉంది. ఫ్రెషర్ల నియామకాల పరంగా 75 శాతంతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై 56 శాతం, ఢిల్లీ 47 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటికి డిమాండ్... ‘‘అంతర్జాతీయంగా నియామకాల పట్ల స్తబ్ధత నెలకొన్నప్పటికీ.. భారత కంపెనీల్లో అధిక శాతం ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు చెప్పాయి. కొన్ని దీర్ఘకాల మానవ వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ప్రస్తుతం భారంగా మారిన మానవ వనరుల స్థానంలో తాజా శిక్షణ పొందిన నైపుణ్యాలను (తక్కువ వేతనాలపై) సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నాయి’’అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతనురూజ్ తెలిపారు. క్లౌడ్ డెవలపర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అసోసియేట్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, మార్కెటింగ్ అనలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, కంటెంట్ రైటర్, కాంపెయిన్ అసోసియేట్, మైక్రోబయాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్‌లకు ఫ్రెషర్ల నియామకాల్లో డిమాండ్ నెలకొంది. ‘‘నియామకాల పట్ల ఆశావహంగా ఉన్న రంగాలను గుర్తించి, భవిష్యత్తులో డిమాండ్ ఉండే నైపుణ్యాల పట్ల ఉద్యోగార్థులు దృష్టి సారించాలి. ప్రస్తుత మార్కెట్ ధోరణలను అర్థం చేసుకుని, సరైన నైపుణ్యాలను నేర్చుకోవడంపై, తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే వాటిపై దృష్టి పెట్టాలి’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెంట్ నీతి శర్మ సూచించారు. కార్పొరేట్ ఫైనాన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రాజెక్ట్‌మేనేజ్‌మెంట్ నైపుణ్యాలకు సైతం డిమాండ్ ఉన్నట్టు టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉంటే జాబ్ నైపుణ్యాల ధ్రువీకరణ సర్టిఫికేషన్ ఉంటే ఉద్యోగాల్లో రాణించొచ్చని 91 శాతం మంది భారత విద్యార్థులు భావిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉద్యోగం సంపాదించేందుకు ఈ సర్టిఫికేషన్ సాయ పడుతుందని 96 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్ ఫామ్ ‘కోర్సెరా’ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో కంపెనీలు ఉద్యోగుల నియామకాల సమయంలో ప్రొఫెషనల్ సర్టిఫికేషకు ఎక్కువ విలువ ఇస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉద్యోగార్థుల అర్హతలను పెంచుతుందని భారత్‌లో 92 శాతం కంపెనీలు తెలిపాయి. -
తయారీ రంగంలో ఉద్యోగాల జోరు!
ముంబై: తయారీ రంగంలోని అధిక శాతం కంపెనీలు ఈ ఏడాది(2022–23) చివరి త్రైమాసికంలో ఉద్యోగ కల్పనా ప్రణాళికల్లో ఉన్నట్లు ఒక సర్వే పేర్కొంది. జనవరి–మార్చి(క్యూ4)లో మరింత మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ పేరిట టీమ్‌లీజ్ విడుదల చేసిన సర్వే తెలియజేసింది. భారీస్థాయి కంపెనీలు 69 శాతం, మధ్యస్థాయి సంస్థలు 44 శాతం, చిన్నతరహా బిజినెస్‌లు 39 శాతం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వివరించింది. సర్వేకు దేశవ్యాప్తంగా 14 నగరాల నుంచి తయారీ రంగంలోని 301 కంపెనీలను పరిగణించినట్లు తెలియజేసింది. 60 శాతానికిపైగా యాజమాన్యాలు తమ మానవ వనరులను విస్తరించే యోచనలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇక తయారీ, సర్వీసుల రంగాల ఉపాధి ప్రణాళికలు సంయుక్తంగా 68 శాతానికి బలపడినట్లు తెలియజేసింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో ఇది 65 శాతమేనని ప్రస్తావించింది. ఉపాధి కల్పనా ప్రణాళికల జాబితాలో ముంబై(97 శాతం), బెంగళూరు(94 శాతం), చెన్నై(89 శాతం), ఢిల్లీ(84 శాతం), పుణే(73 శాతం) ముందున్నట్లు పేర్కొంది. -
కొత్త ఏడాదిలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. ఏ రంగంలో ఎక్కువంటే?
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కొత్త కొలువులు పలకరించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరుగుతున్నా భారత్‌లో మాత్రం వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు టీమ్‌లీజ్ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా సేవల రంగం (సర్వీస్ సెక్టార్)లో జనవరి–మార్చి మధ్య కొత్తగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయని.. దేశంలోని 79 శాతం సంస్థలు కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు టీమ్‌లీజ్ సంస్థ తమ ‘ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్’ను తాజాగా విడుదల చేసింది. దేశంలోని 14 నగరాలు, 14 సేవారంగాలకు చెందిన 573 చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. పెద్ద నగరాల్లో.. కొత్తవారికి, ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు అవకాశాల కల్పనలో పెద్ద నగరాలు ముందువరసలో ఉన్నట్టు టీమ్‌లీజ్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగావకాశాల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మెట్రోసిటీలు అగ్రభాగాన నిలుస్తున్నట్టు తెలిపింది. సేవల రంగంలో ముఖ్యంగా ఈ–కామర్స్ (98 శాతం), టెలీకమ్యూనికేషన్స్ (94 శాతం), ఎడ్యుకేషనల్ (93 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (88 శాతం), రిటైల్ (85 శాతం), లాజిస్టిక్స్ కంపెనీల్లో (81 «శాతం) స్థిరమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సర్వీసెస్ సెక్టార్లో భారత్ ‘గ్లోబల్ లీడర్’గా ఉద్భవించే దిశలో సాగుతోందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మయూర్ టాడే పేర్కొన్నారు. ‘‘దేశంలోని పలు నగరాల్లో 5జీ టెలికం సర్వీసులు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు, సంస్థలు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరుస్తూ అప్ స్కిల్లింగ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్ సర్వీసులపై సానుకూల ప్రభావానికి కారణమయ్యాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అజోయ్ థామస్ పేర్కొన్నారు. -
ఉద్యోగులకు బంపరాఫర్.. రండి బాబు రండి మీకు భారీ ప్యాకేజీలిస్తాం!
ముంబై: నియామకాల పరంగా జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి బెంగళూరు అగ్ర స్థానంలో ఉన్నట్టు టీమ్‌లీజ్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ తెలిపింది. ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు 95 శాతం బెంగళూరు కంపెనీలు తెలిపాయి. ఆ తర్వాత చెన్నై, ముంబై నగరాలు ఉన్నాయి. చెన్నైలో 87 శాతం కంపెనీలు ఇదే ధోరణితో ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నియామకాల ఉద్దేశ్యం 91 శాతంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంపై మరింత ఆశావహ వాతావరణం ఉన్నట్టు టీమ్‌లీజ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను నియమించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు 61 శాతం కంపెనీలు తెలిపాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 7 శాతం అధికంగా నమోదైంది. బెంగళూరులో తయారీ, సేవల కంపెనీలు మరింత సానుకూల నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. తయారీలో ఎఫ్ఎంసీజీ (48 శాతం) హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌లో (38 శాతం), విద్యుత్, ఇంధన రంగంలో(34 శాతం), వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్ రంగంలో 30 శాతం కంపెనీలు నియామకాల ఉద్దేశ్యాన్ని ప్రకటించాయి. సేవల రంగంలో ఐటీ రంగ కంపెనీలు 97 శాతం నియామకాల పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శించాయి. ఆ తర్వాత ఈ కామర్స్, వాటి అనుబంధ స్టార్టప్‌లలో 85 శాతం, విద్యా సేవల్లో 70 శాతం, టెలికమ్యూనికేషన్స్‌లో 60 శాతం, రిటైల్‌లో 64 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 55 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలతను వ్యక్తం చేశాయి. మరింత పెరుగుతాయి ‘‘మరిన్ని సంస్థలు తమ మానవ వనరులను పెంచుకోవడానికి, అధిక వేతనాలు చెల్లించేందుకు ఆసక్తిగా ఉన్నాయి. రానున్న త్రైమాసికాల్లో కంపెనీల్లో ఉద్యోగుల నియామకాల ధోరణి మరింత పెరిగి 97 శాతానికి చేరుకుంటుంది’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ భట్ తెలిపారు. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో 23 రంగాలకు చెందిన 865 కంపెనీల అభిప్రాయాలను టీమ్‌లీజ్ సర్వే పరిగణనలోకి తీసుకుంది. -
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్: కోటి ఉద్యోగాలున్నాయ్!
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ముప్పు మళ్లీ ముంచుకొస్తోందన్న ఆందోళనల మధ్య తాజా రిపోర్టు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు,ఐటీ నిపుణులకు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా వార్, అంతర్జాతీయంగా చమురు ధరల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకుంటున్నాయన్న ఆందోళన నేపథ్యంలో టీమ్ లీజ్ నివేదిక వారికి భారీ ఊరటనిస్తోంది. ఐటీ, బీపీఎం(బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయని "డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్"లో పేర్కొంది. మూడు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనతో దేశీయ ఐటీ, బీపీఎం ఉద్యోగాలు 2023లో 7 శాతం వృద్ది నమోదుకానుందని సోమవారంతెలిపింది. అంతేకాదు మొత్తంమీద భారతదేశ ఐటీ ఉద్యోగాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 మిలియన్ల నుండి 10 మిలియన్లకు (కోటి) పెరగనుందని అంచనావేసింది. ఇండియాలో ఐటీ,బీపీఎం పరిశ్రమల వృద్ధి కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ రంగంలో సుమారు 3.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది, అలాగే దేశ జీడీపీలో 8 శాతానికి పైగా తోడ్పడుతోందని టీమ్ లీజ్ తెలిపింది. గ్లోబల్ అవుట్సోర్సింగ్ మార్కెట్లో 55 శాతం వాటాను సొంతం చేసుకుందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ వెల్లడించారు. తాజా రిపోర్టు ప్రకారం 2022 చివరి నాటికి డిజిటల్ నైపుణ్యాల డిమాండ్ 8.4 శాతం పుంజుకోనుంది. హెడ్‌కౌంట్ 5.1 మిలియన్ల నుంచి 5.45 మిలియన్లకు పెరుగుతుందని టీమ్‌లీజ్ తన ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్‌లో పేర్కొంది. అలాగే ఈ ఇండస్ట్రీలో అట్రిషన్ తదుపరి త్రైమాసికాల్లో కూడా అత్యధికంగానే ఉంటుంది, 2023లో కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు కనీసం 49 శాతం నుండి 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అయితే లింగ సమానత్వం మెరుగుపడుతోంది. ప్రస్తుతం 20 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరానికి 25 శాతానికి పెరగబోతోందని తెలిపింది. పెట్టుబడులు, కంపెనీలు కొత్త టెక్నాలజీలను ఇన్స్టాలింగ్తో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 21 శాతం పెరుగుతుందని అంచనా. ఐటీ సేవల కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCC), ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు ఈ ట్రెండ్‌లో 70 శాతానికి పైగా దోహదపడుతున్నాయని నివేదించింది. 2023లో టాప్-10 ఐటీ కంపెనీలు డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించి చిన్న నగరాల అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయట. మార్కెటింగ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డిమాండ్ వరుసగా 5 -7 శాతం, 4-6 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. అంతేకాదు ఉద్యోగాలు వెతుక్కోవడానికి ఐటీ మేధావులు నగరాలకు వెళ్లాల్సిన రోజులు పోయాయని పేర్కొంది. ముఖ్యంగా వర్క్‌ఫ్రం హోం విధానం, డిజిటల్ నైపుణ్యాలున్న వారు మెట్రోయేతర నగరాల్లో లభిస్తున్న తరుణంలో కంపెనీలే ఉద్యోగాలను వారి వద్దకే తీసుకువెళుతున్నాయని సునీల్ వెల్లడించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఊపందుకున్నప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 33 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు.. ఇందులో 35 శాతం గ్రాడ్యుయేట్లు టాప్ 500 నగరాల నుంచే వస్తున్నారని టీమ్ లీజ్ నివేదించింది. -
ఫ్రెషర్లకు కొలువుల పండగ!
న్యూఢిల్లీ: కాలేజీల నుంచి పట్టాలు పుచ్చుకుని కొలువుల కోసం చూస్తున్న ఫ్రెషర్లకు తీపికబురు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో కంపెనీలు ఫ్రెషర్లను అధికంగా తీసుకోనున్నాయి. టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ‘కెరీర్ అవుట్‌లుక్ రిపోర్ట్’ ఈ వివరాలు వెల్లడించింది. క్రితం ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది అర్ధ భాగంలో ఫ్రెషర్లను నియమించుకోవాలన్న ఉద్దేశం కంపెనీల్లో 30 శాతం ఎక్కువగా కనిపించినట్టు వివరించింది. 47 శాతానికి పైగా కంపెనీలు జూన్‌లోపు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు తెలిపాయి. గతేడాది ఇది 17 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకం పట్ల సానుకూలత పెరగడం సంతోషాన్నిస్తోంది’’ అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీఈవో శంతనురూజ్ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వృద్ధిపై దృష్టి సారించడం ఈ సానుకూల ధోరణికి కారణాలుగా తెలిపారు. ఫ్రెషర్లతోపాటు అన్ని రకాల ఉద్యోగాలకు కలిపి చూస్తే నియామకాల ఉద్దేశం 50 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఫ్రెషర్లకు ఐటీ, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో అధిక కొలువులు రానున్నట్టు పేర్కొంది. వీటికి అధిక డిమాండ్ ‘‘డేటా అనలైటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్/వీఆర్, కంటెంట్ రైటింగ్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టిíఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, టెక్నికల్ రైటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సప్లయ్ చైన్ అనలిస్ట్ ఉద్యోగాలకూ డిమాండ్ ఉంటుంది. ఫ్రెషర్ల విషయానికొస్తే విశ్లేషణా సామర్థ్యాలు, ఇన్నోవేషన్, ఒత్తిడిని నియంత్రించుకోగలగడం, సమాచార నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి’’ అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెండ్, సహ వ్యవస్థాపకుడు నీతి శర్మ తెలిపారు. ఐటీలో 3.6 లక్షల కొలువులు ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 3.6 లక్షల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పిస్తుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అన్ఎర్త్ ఇన్సైట్’ సంస్థ పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 22.3%గా ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 19.5% నుంచి పెరిగినట్టు పేర్కొంది. జనవరి–మార్చి త్రైమాసికంలో 24%కి పెరగొచ్చని.. వచ్చే ఏడాది (2022–23)లో ఇది 16–18%కి తగ్గుతుందని అంచనా వేసింది. -
మహిళకు గుర్తింపేదీ..?
♦ పని కేంద్రాల్లో పురుషుల ఆధిపత్యమే ఎక్కువ ♦ లింగ వివక్ష బాధితుల్లో 72 శాతం మహిళలు ♦ సామాజిక, సంస్థాగత స్థాయి రెండిట్లోనూ ఇదే తీరు ♦ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన టీమ్‌లీజ్ నివేదిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అని పదే పదే మహిళల్ని ఆకాశానికి ఎత్తేసే సమాజం.. ఆచరణలోకి వచ్చే సరికి ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందట. దేశంలో నేటికీ మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటుండమే ఇందుకు ఉదాహరణ అని బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న హెచ్ఆర్ సంస్థ టీమ్‌లీజ్ గురువారం ఒక నివేదికలో పేర్కొంది. పలు ఆసక్తికర విషయాలు లీమ్లీజ్ సహా-వ్యవస్థాపకురాలు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రీతూపర్నా చక్రబోర్తి మాటల్లోనే.. దేశంలో నేటికీ మహిళలను శ్రామికశక్తిగా గుర్తించటం లేదు. పని కేంద్రాల్లో మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. సమానత్వమనేది రాతలకే పరిమితమైంది. వాస్తవరూపంలోకి వచ్చే సరికి దేశంలోని 72% మహిళలు పనికేంద్రాల్లో వివిధ రూపాల్లో లింగ వివక్ష బారిన పడుతున్నారు. పట్టణ ప్రాంత మహిళ లతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంత మహిళల విషయంలో ఇది ఎక్కువ. సామాజిక, సంస్థాగత స్థాయి రెండింట్లోనూ మహిళల కంటే పురుషులకే అదనపు హక్కులున్నాయి. విధానాలు, పద్ధతులు కూడా వారికి అనుకూలంగానే ఉన్నాయి. వ్యవస్థలో పురుషుల ఆధిపత్యం కారణంగా మహిళల అభివృద్ధి తిరోగమనంలో, పురుషుల వృద్ధి పురోగమనంలో ఉంది. {పస్తుత పరిస్థితికి కారణం మహిళలు ఉన్నత విద్య ను ఎంచుకోకపోవడమేనని చెప్పాలి. దేశంలో 61% కంటే ఎక్కువ మహిళలు నాన్-ప్రొఫెషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. దీంతో అత్యుత్తమ ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారు. మహిళా కార్మిక శక్తి గణాంకాలను పరిశీలిస్తే... పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మిక శక్తి 20 శాతంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతంగా ఉంది. వివిధ రంగాల్లో కింది నుంచి పై స్థాయి వరకు మహిళా ప్రాతినిధ్యం చూస్తే.. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో 6 శాతం, సాఫ్ట్వేర్ రంగంలో 5 శాతం ఉన్నారు. తయారీ, ఇంజనీరింగ్ మరియు ఆటో విభాగాల్లో అయితే పరిస్థితి ఇంకా తీసికట్టు. సంస్థాగతంగా, వ్యవస్థాగతంగా మహిళల వృద్ధి విధానపరమైన నిర్ణయాలు, కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుంది. మహిళలు కోరుకుంటున్న విధానాలు, కార్యక్రమాలు, కార్పొరేట్ కంపెనీలు చేసే కార్యక్రమాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. అసలు మహిళలు కోరుకుంటున్నదేంటంటే.. సరళమైన సమయం, నాయకత్వ శిక్షణ, లైంగిక వేధింపుల పాలసీ వంటివి. కార్పొరేట్ మహిళా ఉద్యోగుల్లో వేతనాల విషయాల్లోనూ అధ్యయనం జరపాల్సిన అవసరం ఉంది.