ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో (2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు) ఉపాధి అవకాశాలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ఈ కాలంలో సిబ్బందిని పెంచుకోనున్నట్టు 59 శాతం సంస్థలు తెలిపాయి. దీంతో ద్వితీయ ఆరు నెలల్లో 7.1 శాతం మేర సిబ్బంది పెరగనున్నట్టు టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలోనే సిబ్బంది సంఖ్యను కొనసాగించనున్నట్టు టీమ్‌లీజ్ సర్వేలో 22 శాతం కంపెనీలు తెలిపాయి. 23 రంగాల్లోని 1,307 కంపెనీల అభిప్రాయాలను టీమ్‌లీజ్ సర్వేలో భాగంగా తెలుసుకుంది. లాజిస్టిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), ఈవీ సదుపాయాలు, వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్, ఈ–కామర్స్ రంగాల నుంచే ప్రధానంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు రానున్నాయని, ఇవి మౌలిక వసతులు, ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా వ్యయం చేస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది.
రంగాల వారీగా..
లాజిస్టిక్స్ రంగంలో 14 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఉద్యోగులను పెంచుకోనున్నట్టు 69 శాతం లాజిస్టిక్స్ కంపెనీలు వెల్లడించాయి. ఆ తర్వాత అధికంగా ఈవీ, ఈవీ ఇన్‌ఫ్రా కంపెనీలు 12 శాతం మేర సిబ్బందిని పెంచుకోనున్నాయి. వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్ కంపెనీల్లో 10.5 శాతం మేర, ఈ–కామర్స్ రంగంలో 9 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఆటోమోటివ్ రంగంలో 8.5 శాతం, రిటైల్ రంగంలో 8.2 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా ఏర్పడనున్నాయి.
ఇదీ చదవండి: 30 లక్షల యూనిట్లు ఎగుమతి!
ప్రాంతాల వారీగా..
కోయింబత్తూర్, గురుగ్రామ్ ఉపాధి కల్పన కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. అత్యధికంగా బెంగళూరు 53.1 శాతం, ముంబై 50.2 శాతం, హైదరాబాద్ 48.2 శాతంతో ఉపాధి కల్పన పరంగా ముందున్నాయి. ఉపాధి కోరుకుంటున్న వారికి చిన్న పట్టణాలు ప్రత్యామ్నాయ కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) టెక్నాలజీ, ఆర్‌అండ్‌డీలో అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు తెలిపింది. జాతీయ పారిశ్రామిక నడవాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి కల్పించనుండడం, సెమీకండక్టర్ పాలసీ ద్వారా 2025 నాటికి 80,000 ఉద్యోగాల కల్పన తదితర కీలక విధానాలను ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment