Team lease
-
ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో (2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు) ఉపాధి అవకాశాలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ఈ కాలంలో సిబ్బందిని పెంచుకోనున్నట్టు 59 శాతం సంస్థలు తెలిపాయి. దీంతో ద్వితీయ ఆరు నెలల్లో 7.1 శాతం మేర సిబ్బంది పెరగనున్నట్టు టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలోనే సిబ్బంది సంఖ్యను కొనసాగించనున్నట్టు టీమ్‌లీజ్ సర్వేలో 22 శాతం కంపెనీలు తెలిపాయి. 23 రంగాల్లోని 1,307 కంపెనీల అభిప్రాయాలను టీమ్‌లీజ్ సర్వేలో భాగంగా తెలుసుకుంది. లాజిస్టిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), ఈవీ సదుపాయాలు, వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్, ఈ–కామర్స్ రంగాల నుంచే ప్రధానంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు రానున్నాయని, ఇవి మౌలిక వసతులు, ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా వ్యయం చేస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. రంగాల వారీగా..లాజిస్టిక్స్ రంగంలో 14 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఉద్యోగులను పెంచుకోనున్నట్టు 69 శాతం లాజిస్టిక్స్ కంపెనీలు వెల్లడించాయి. ఆ తర్వాత అధికంగా ఈవీ, ఈవీ ఇన్ఫ్రా కంపెనీలు 12 శాతం మేర సిబ్బందిని పెంచుకోనున్నాయి. వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్ కంపెనీల్లో 10.5 శాతం మేర, ఈ–కామర్స్ రంగంలో 9 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఆటోమోటివ్ రంగంలో 8.5 శాతం, రిటైల్ రంగంలో 8.2 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా ఏర్పడనున్నాయి.ఇదీ చదవండి: 30 లక్షల యూనిట్లు ఎగుమతి!ప్రాంతాల వారీగా..కోయింబత్తూర్, గురుగ్రామ్ ఉపాధి కల్పన కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది. అత్యధికంగా బెంగళూరు 53.1 శాతం, ముంబై 50.2 శాతం, హైదరాబాద్ 48.2 శాతంతో ఉపాధి కల్పన పరంగా ముందున్నాయి. ఉపాధి కోరుకుంటున్న వారికి చిన్న పట్టణాలు ప్రత్యామ్నాయ కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) టెక్నాలజీ, ఆర్అండ్డీలో అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు తెలిపింది. జాతీయ పారిశ్రామిక నడవాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి కల్పించనుండడం, సెమీకండక్టర్ పాలసీ ద్వారా 2025 నాటికి 80,000 ఉద్యోగాల కల్పన తదితర కీలక విధానాలను ప్రస్తావించింది. -
కొత్త ఏడాదిలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. ఏ రంగంలో ఎక్కువంటే?
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కొత్త కొలువులు పలకరించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరుగుతున్నా భారత్‌లో మాత్రం వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు టీమ్‌లీజ్ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా సేవల రంగం (సర్వీస్ సెక్టార్)లో జనవరి–మార్చి మధ్య కొత్తగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు లభిస్తాయని.. దేశంలోని 79 శాతం సంస్థలు కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు టీమ్‌లీజ్ సంస్థ తమ ‘ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్’ను తాజాగా విడుదల చేసింది. దేశంలోని 14 నగరాలు, 14 సేవారంగాలకు చెందిన 573 చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. పెద్ద నగరాల్లో.. కొత్తవారికి, ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు అవకాశాల కల్పనలో పెద్ద నగరాలు ముందువరసలో ఉన్నట్టు టీమ్‌లీజ్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగావకాశాల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మెట్రోసిటీలు అగ్రభాగాన నిలుస్తున్నట్టు తెలిపింది. సేవల రంగంలో ముఖ్యంగా ఈ–కామర్స్ (98 శాతం), టెలీకమ్యూనికేషన్స్ (94 శాతం), ఎడ్యుకేషనల్ (93 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (88 శాతం), రిటైల్ (85 శాతం), లాజిస్టిక్స్ కంపెనీల్లో (81 «శాతం) స్థిరమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సర్వీసెస్ సెక్టార్లో భారత్ ‘గ్లోబల్ లీడర్’గా ఉద్భవించే దిశలో సాగుతోందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మయూర్ టాడే పేర్కొన్నారు. ‘‘దేశంలోని పలు నగరాల్లో 5జీ టెలికం సర్వీసులు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు, సంస్థలు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరుస్తూ అప్ స్కిల్లింగ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, ఔట్సోర్సింగ్ సర్వీసులపై సానుకూల ప్రభావానికి కారణమయ్యాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అజోయ్ థామస్ పేర్కొన్నారు. -
ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి: టీమ్‌లీజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలను సడలించడం, వ్యాపార కార్యకలాపాలు, అమ్మకాలను పెంచడంపై దృష్టి సారించడంతో ఫ్రెషర్ల నియామకంపై సానుకూల ప్రభావం చూపుతోందని టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. 661 చిన్న, మధ్య, భారీ కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ‘ప్రస్తుత త్రైమాసికంలో ఫ్రెషర్లను నియమించే ఉద్దేశం 7 శాతం పెరిగింది. జూనియర్ స్థాయి సిబ్బందిని చేర్చుకునే అంశం కూడా సానుకూల పథంలో ఉంది. జూలై–సెప్టెంబరులో పెద్ద ఎత్తున నియామకాలు ఉండే అవకాశం ఉంది. చాలా పరిశ్రమలు సెకండ్ వేవ్ ప్రభావాన్ని అధిగమించి, వృద్ధి దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. జీఎస్టీ వసూళ్లు, ఈ–వే బిల్లులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, విద్యుత్ డిమాండ్, రైళ్ల ద్వారా సరుకు రవాణా, పెట్రోల్ వినియోగం వంటివి సెకండ్ వేవ్ ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభించాయని సూచిస్తున్నాయి. ఈ అంశాలతో నియామక సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది’ అని వివరించింది. ప్రధానంగా ఐటీ రంగంలో నియామకాల జోరు ఉంటుందని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
ఈ ఏడాది ఉద్యోగాలు అంతంతే: టీమ్‌లీజ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధ భాగంలో ఉపాధి అంచనాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఏప్రిల్–సెప్టెంబర్‌కు సంబంధించి నియామకాల సెంటిమెంట్ 6 పాయింట్ల మేర క్షీణించింది. చిన్న కంపెనీల సెంటిమెంట్ దిగువ స్థాయిలో ఉంది. ఇక పెద్ద సంస్థలు నియామకాల వైపు చూస్తున్నాయి. ఈ విషయాలు టీమ్‌లీజ్ రూపొందించిన ‘ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ 2017–18’ నివేదికలో వెల్లడయ్యాయి. ప్రారంభ, మధ్య స్థాయి నియామకాలు వరుసగా 8 పాయింట్లు, 5 పాయింట్లమేర క్షీణించాయని నివేదిక పేర్కొంటోంది. ఇదే సమయంలో సీనియర్ స్థాయి నియామకాలు మాత్రం 5 పాయింట్లమేర పెరిగాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వపు డిజిటైజేషన్ కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకుంటే.. చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు సంబంధించి నియామకాల అంచనాలు వచ్చే అర్ధభాగంలో మెరుగుపడొచ్చని టీమ్‌లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకుడు రితుపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఫిన్‌టెక్, మొబైల్ వాలెట్ సంస్థలు నియామకాలపై ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. కేవోపీ పరిశ్రమలో బలమైన వృద్ధి నమోదవుతోందని, ఇక్కడ వచ్చే ఆర్థిక సంవత్సరంలో అధిక ఉద్యోగాలు రావొచ్చని పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ కారణంగా నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలు బాగా ప్రతికూల ప్రభావానికి లోనయ్యాయని, దీంతో ఈ రంగాల్లో నియామకాల సెంటిమెంట్ పడిపోయిందని తెలిపారు. ఇక ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీడీ, బీపీవో/ఐటీఈఎస్, పవర్–ఎనర్జీ, ట్రావెల్–హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌లలో నియామకాలు నెమ్మదించాయని వివరించారు.