ఈ ఏడాది ఉద్యోగాలు అంతంతే: టీమ్‌లీజ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధ భాగంలో ఉపాధి అంచనాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఏప్రిల్–సెప్టెంబర్‌కు సంబంధించి నియామకాల సెంటిమెంట్ 6 పాయింట్ల మేర క్షీణించింది. చిన్న కంపెనీల సెంటిమెంట్ దిగువ స్థాయిలో ఉంది. ఇక పెద్ద సంస్థలు నియామకాల వైపు చూస్తున్నాయి. ఈ విషయాలు టీమ్‌లీజ్ రూపొందించిన ‘ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ 2017–18’ నివేదికలో వెల్లడయ్యాయి. ప్రారంభ, మధ్య స్థాయి నియామకాలు వరుసగా 8 పాయింట్లు, 5 పాయింట్లమేర క్షీణించాయని నివేదిక పేర్కొంటోంది.
ఇదే సమయంలో సీనియర్ స్థాయి నియామకాలు మాత్రం 5 పాయింట్లమేర పెరిగాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వపు డిజిటైజేషన్ కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకుంటే.. చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు సంబంధించి నియామకాల అంచనాలు వచ్చే అర్ధభాగంలో మెరుగుపడొచ్చని టీమ్‌లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకుడు రితుపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఫిన్‌టెక్, మొబైల్ వాలెట్ సంస్థలు నియామకాలపై ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు.
కేవోపీ పరిశ్రమలో బలమైన వృద్ధి నమోదవుతోందని, ఇక్కడ వచ్చే ఆర్థిక సంవత్సరంలో అధిక ఉద్యోగాలు రావొచ్చని పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ కారణంగా నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలు బాగా ప్రతికూల ప్రభావానికి లోనయ్యాయని, దీంతో ఈ రంగాల్లో నియామకాల సెంటిమెంట్ పడిపోయిందని తెలిపారు. ఇక ఎఫ్‌ఎంసీజీ, ఎఫ్‌ఎంసీడీ, బీపీవో/ఐటీఈఎస్, పవర్–ఎనర్జీ, ట్రావెల్–హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌లలో నియామకాలు నెమ్మదించాయని వివరించారు.