Employment Outlook
-
తయారీలో అధిక నియామకాలు
ముంబై: తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయి. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు చెప్పాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. తయారీ, సేవల రంగ కంపెనీల్లో నియామకాల పట్ల ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే, ఇది 70 శాతం దాటుతుందని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా తర్వాత అంతర్జాతీయంగా ఉపాధి కల్పన 2.7 శాతం మేర కోలుకుంది. ఇది 2022 ద్వితీయ ఆరు నెలల కాలానికి బలంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ధోరణి కంపెనీల్లో, ముఖ్యంగా తయారీలో ఎంతో బలంగా ఉంది. పరిశ్రమల్లో ఆశావాదం పుంజుకోవడం, పండుగల సందర్భంగా వినియోగ డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్రోత్సాహకాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్ భట్ తెలిపారు. ప్రోత్సహకాలు కీలకం.. ‘‘ఉపాధి అవకాశాలను పెంచేందుకు, పర్యాటకం, ఏవియేషన్, నిర్మాణ రంగం, గృహ నిర్మాణానికి నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ఉద్దీపనల ప్యాకేజీ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడంలో సాయంగా నిలుస్తోంది’’అని టీమ్‌లీజ్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లోని 311 తయారీ కంపెనీలను టీమ్‌లీజ్ సర్వే చేసింది. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని తయారీ కంపెనీల్లో 91 శాతం నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని కంపెనీల్లో ఇది 69 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 39 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని కంపెనీల్లో 21 శాతం మేర నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ఈ పట్టణాల్లో మెరుగు.. ముంబైలో అత్యధికంగా 93 శాతం కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నాయి. ఆ తర్వాత బెంగళూరులో 90 శాతం, చెన్నైలో 83 శాతం, ఢిల్లీలో 79 శాతం, పుణెలో 67 శాతం, హైదరాబాద్‌లో 61 శాతం, అహ్మదాబాద్‌లో 61 శాతం మేర కంపెనీలు నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. బెంగళూరులో ఎఫ్ఎంసీజీ.. ముంబైలో తయారీ, ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చెన్నైలో ఆగ్రోకెమికల్స్ కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో ఉపాధి కల్పించనున్నాయి. -
ఉద్యోగులకు బంపరాఫర్.. రండి బాబు రండి మీకు భారీ ప్యాకేజీలిస్తాం!
ముంబై: నియామకాల పరంగా జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి బెంగళూరు అగ్ర స్థానంలో ఉన్నట్టు టీమ్‌లీజ్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ తెలిపింది. ఎక్కువ మందిని నియమించుకోనున్నట్టు 95 శాతం బెంగళూరు కంపెనీలు తెలిపాయి. ఆ తర్వాత చెన్నై, ముంబై నగరాలు ఉన్నాయి. చెన్నైలో 87 శాతం కంపెనీలు ఇదే ధోరణితో ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నియామకాల ఉద్దేశ్యం 91 శాతంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంపై మరింత ఆశావహ వాతావరణం ఉన్నట్టు టీమ్‌లీజ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను నియమించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు 61 శాతం కంపెనీలు తెలిపాయి. జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 7 శాతం అధికంగా నమోదైంది. బెంగళూరులో తయారీ, సేవల కంపెనీలు మరింత సానుకూల నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. తయారీలో ఎఫ్ఎంసీజీ (48 శాతం) హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌లో (38 శాతం), విద్యుత్, ఇంధన రంగంలో(34 శాతం), వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్ రంగంలో 30 శాతం కంపెనీలు నియామకాల ఉద్దేశ్యాన్ని ప్రకటించాయి. సేవల రంగంలో ఐటీ రంగ కంపెనీలు 97 శాతం నియామకాల పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శించాయి. ఆ తర్వాత ఈ కామర్స్, వాటి అనుబంధ స్టార్టప్‌లలో 85 శాతం, విద్యా సేవల్లో 70 శాతం, టెలికమ్యూనికేషన్స్‌లో 60 శాతం, రిటైల్‌లో 64 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 55 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలతను వ్యక్తం చేశాయి. మరింత పెరుగుతాయి ‘‘మరిన్ని సంస్థలు తమ మానవ వనరులను పెంచుకోవడానికి, అధిక వేతనాలు చెల్లించేందుకు ఆసక్తిగా ఉన్నాయి. రానున్న త్రైమాసికాల్లో కంపెనీల్లో ఉద్యోగుల నియామకాల ధోరణి మరింత పెరిగి 97 శాతానికి చేరుకుంటుంది’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ భట్ తెలిపారు. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లో 23 రంగాలకు చెందిన 865 కంపెనీల అభిప్రాయాలను టీమ్‌లీజ్ సర్వే పరిగణనలోకి తీసుకుంది. -
ఈ ఏడాది ఉద్యోగాలు అంతంతే: టీమ్‌లీజ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధ భాగంలో ఉపాధి అంచనాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఏప్రిల్–సెప్టెంబర్‌కు సంబంధించి నియామకాల సెంటిమెంట్ 6 పాయింట్ల మేర క్షీణించింది. చిన్న కంపెనీల సెంటిమెంట్ దిగువ స్థాయిలో ఉంది. ఇక పెద్ద సంస్థలు నియామకాల వైపు చూస్తున్నాయి. ఈ విషయాలు టీమ్‌లీజ్ రూపొందించిన ‘ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ 2017–18’ నివేదికలో వెల్లడయ్యాయి. ప్రారంభ, మధ్య స్థాయి నియామకాలు వరుసగా 8 పాయింట్లు, 5 పాయింట్లమేర క్షీణించాయని నివేదిక పేర్కొంటోంది. ఇదే సమయంలో సీనియర్ స్థాయి నియామకాలు మాత్రం 5 పాయింట్లమేర పెరిగాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వపు డిజిటైజేషన్ కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకుంటే.. చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలకు సంబంధించి నియామకాల అంచనాలు వచ్చే అర్ధభాగంలో మెరుగుపడొచ్చని టీమ్‌లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకుడు రితుపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఫిన్‌టెక్, మొబైల్ వాలెట్ సంస్థలు నియామకాలపై ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. కేవోపీ పరిశ్రమలో బలమైన వృద్ధి నమోదవుతోందని, ఇక్కడ వచ్చే ఆర్థిక సంవత్సరంలో అధిక ఉద్యోగాలు రావొచ్చని పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ కారణంగా నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలు బాగా ప్రతికూల ప్రభావానికి లోనయ్యాయని, దీంతో ఈ రంగాల్లో నియామకాల సెంటిమెంట్ పడిపోయిందని తెలిపారు. ఇక ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీడీ, బీపీవో/ఐటీఈఎస్, పవర్–ఎనర్జీ, ట్రావెల్–హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌లలో నియామకాలు నెమ్మదించాయని వివరించారు.