ముంబై: తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయి. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు చెప్పాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. తయారీ, సేవల రంగ కంపెనీల్లో నియామకాల పట్ల ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే, ఇది 70 శాతం దాటుతుందని ఈ నివేదిక వెల్లడించింది.
‘‘కరోనా తర్వాత అంతర్జాతీయంగా ఉపాధి కల్పన 2.7 శాతం మేర కోలుకుంది. ఇది 2022 ద్వితీయ ఆరు నెలల కాలానికి బలంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ధోరణి కంపెనీల్లో, ముఖ్యంగా తయారీలో ఎంతో బలంగా ఉంది. పరిశ్రమల్లో ఆశావాదం పుంజుకోవడం, పండుగల సందర్భంగా వినియోగ డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్రోత్సాహకాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్ భట్ తెలిపారు.
ప్రోత్సహకాలు కీలకం..
‘‘ఉపాధి అవకాశాలను పెంచేందుకు, పర్యాటకం, ఏవియేషన్, నిర్మాణ రంగం, గృహ నిర్మాణానికి నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ఉద్దీపనల ప్యాకేజీ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడంలో సాయంగా నిలుస్తోంది’’అని టీమ్‌లీజ్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లోని 311 తయారీ కంపెనీలను టీమ్‌లీజ్ సర్వే చేసింది. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని తయారీ కంపెనీల్లో 91 శాతం నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని కంపెనీల్లో ఇది 69 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 39 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని కంపెనీల్లో 21 శాతం మేర నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి.
ఈ పట్టణాల్లో మెరుగు..
ముంబైలో అత్యధికంగా 93 శాతం కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నాయి. ఆ తర్వాత బెంగళూరులో 90 శాతం, చెన్నైలో 83 శాతం, ఢిల్లీలో 79 శాతం, పుణెలో 67 శాతం, హైదరాబాద్‌లో 61 శాతం, అహ్మదాబాద్‌లో 61 శాతం మేర కంపెనీలు నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. బెంగళూరులో ఎఫ్‌ఎంసీజీ.. ముంబైలో తయారీ, ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, చెన్నైలో ఆగ్రోకెమికల్స్ కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో ఉపాధి కల్పించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment