December quarter results
-
డీమార్ట్ క్యూ3 లాభం రూ.723 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.723.50 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో నమోదైన లాభం రూ.690.41 కోట్లతో పోలిస్తే ఇది 4.8 శాతం అధికంగా ఉంది. టర్నోవర్ 17.68% పెరిగి రూ.15,972.55 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్యూ3లో రూ.13,572.47 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన పీఏటీ మార్జిన్ 4.5% నుంచి 5.1 శాతానికి చేరింది. మొత్తం వ్యయాలు 18.52 శాతం ఎగసి రూ.15,002 కోట్లకు చేరాయి. ఆన్లైన్ ఆర్డరింగ్ సర్వీసెస్ తొలి 9 నెలల్లో 21.5% వృద్ధి సాధించింది. ఎఫ్ఎంసీజీ విభాగంలో అధిక డిస్కౌంట్లు టర్నోవర్‌పై ప్రభావాన్ని చూపాయని అవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈవో నెవీల్ నోరాన్హా తెలిపారు. కంపెనీకి దేశవ్యాప్తంగా మొత్తంగా 2024 డిసెంబర్ 31 నాటికి 387 స్టోర్లను కలిగి ఉంది.డీమార్ట్‌కు కొత్త సీఈవో అన్షుల్ అసావాడీమార్ట్ తన ఉన్నత స్థాయి యాజమాన్య పదవుల్లో మార్పులు చేపట్టింది. కొత్త సీఈవోగా అన్షుల్ అసావాను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో డీమార్ట్‌లో చేరతారు. 2026 ఫిబ్రవరి 1న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అంత వరకు అన్షుల్‌కు ప్రస్తుత ఎండీ, సీఈవో నెవీల్ నోరాన్హా సహకారం అందిస్తారు. అన్షుల్‌కు యూనిలీవర్లో 30 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం థాయిలాండ్ యూనిలీవర్ అధిపతిగా, గ్రేటర్ ఆసియా గృహ సంరక్షణ వ్యాపార విభాగానికి జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా డీమార్ట్‌కు సేవలు అందిస్తున్న నెవీల్ నోరాన్హా పదవీ కాలం 2026 జనవరితో ముగియనుంది. -
మూడింతలైన నాట్కో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్కో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడురెట్లకుపైగా అధికమై రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.513 కోట్ల నుంచి రూ.795 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.432 కోట్ల నుంచి రూ.539 కోట్లకు పెరిగాయి. ఫార్ములేషన్స్ ఎగుమతుల ద్వారా ఆదాయం రూ.334 కోట్ల నుంచి రూ.605 కోట్లను తాకింది. దేశీయంగా ఫార్ములేషన్స్ అమ్మకాల ద్వారా ఆదాయం రూ.101 కోట్ల నుంచి రూ.99 కోట్లకు వచ్చి చేరింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మూడవ మధ్యంతర డివిడెండ్ రూ.1.25 చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. నాట్కో ఫార్మా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో బుధవారం 3.10 శాతం ఎగసి రూ.883.85 వద్ద స్థిరపడింది. -
ఐఐపీ, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ముంబై: కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, బాండ్లపై రాబడులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నారు. ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ బ్యాంకులు సమీప కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లడంతో గత వారంలో సూచీలు అరశాతం నష్టపోయాయి. ఫైనాన్సియల్, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 490 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘ అమెరికాతో పాటు బ్రిటన్, భారత్ దేశాల ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించవచ్చు. యూఎస్ పదేళ్ల బాండ్లపై రాబడులు క్రమంగా పెరుగుతున్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన మద్దతు 21,800 స్థాయిని కోల్పోయింది. అమ్మకాలు కొనసాగితే దిగువున 21,690 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,500 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు ఉంది. రికవరీ జరిగి అప్‌ట్రెండ్ మూమెంటమ్ కొనసాగితే ఎగువున 21,800 వద్ద నిరోధం చేధించాల్సి ఉంటుంది’’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు రూపక్ దే తెలిపారు. నేడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా నేడు (సోమవారం) జనవరి నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ డేటా, డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) విడుదల కానున్నాయి. మరుసటి మంగళవారం(ఫిబ్రవరి 13న) అమెరికా సీఐపీ ద్రవ్యోల్బణం వెల్లడి కానుంది. ఫిబ్రవరి 14న(బుధవారం) భారత్‌తో పాటు బ్రిటన్ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా రిటైల్ అమ్మకాల గురువారం విడుదల కానున్నాయి. వీటితో పాటు పలు దేశాలు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, పారిశ్రాకోత్పత్తి డేటాను వెల్లడించనున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక డేటా వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. చివరి దశకు క్యూ3 ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాల ఘట్టం చివరి దశకు చేరింది. మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఐషర్ మోటార్స్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, మజగాన్ డాక్ షిప్‌యార్డ్స్, ఫోనిక్స్ మిల్స్‌తో సహా సుమారు 1000కి పైగా కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనుపమ్ రసాయన్, కోల్ ఇండియా, సెయిల్, సంర్ధన్ మదర్సన్, హిందాల్కో, ఐఆర్సీటీసీ, భెల్, గ్లాండ్ ఫార్మా, ముత్తూట్ ఫైన్సాన్లూ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. 4 లిస్టింగులు, 2 పబ్లిక్ ఇష్యూలు ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ షేర్లు నేడు(ఫిబ్రవరి 12న) లిస్టింగ్ కానున్నాయి. ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ (మంగళవారం) ముగిస్తుంది. రాశి పెరిఫెరల్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు (ఫిబ్రవరి 14న) బుధవారం లిస్టింగ్ కానున్నాయి. వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ గురువారం ముగియనుంది. డెట్ మార్కెట్లో రూ.15 వేల కోట్లు పెట్టుబడులు డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఐలు ఫిబ్రవరిలో ఇప్పటి వరకు (ఫిబ్రవరి 09 నాటికి) దేశీయ డెట్ మార్కెట్లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం పాటు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులు జనవరిలో రూ.19వేల కోట్లుగా ఉన్నాయి. ఇక ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం నెల(జనవరి)లో రూ.25,743 కోట్లు వెనక్కి తీసుకోగా ఈ ఫిబ్రవరి 09 నాటికి రూ.3,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్లపై రాబడులు, భారతీయ ఈక్విటీ మార్కెట్ వాల్యూయేషన్లు పెరగడంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో భిన్న ట్రెండ్ దారితీసింది’’ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
ఎల్ఐసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ మరోసారి పటిష్ట పనితీరు ప్రదర్శించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్ పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫిబ్రవరి 21 రికార్డు తేదీగా ప్రకటించింది. 30 రోజుల్లోపు డివిడెండ్ పంపిణీ చేస్తామని తెలిపింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి)లో ఎల్ఐసీ ఇప్పటికీ జీవిత బీమా మార్కెట్లో 58.90 శాతం వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎల్ఐసీ నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.22,969 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ధర 6.50% ఎగసి రూ.1,112 వద్ద ముగిసింది. -
బీవోబీ లాభం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.4,579 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.3,853 కోట్ల కంటే ఇది 19 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.27,092 కోట్ల నుంచి రూ.31,416 కోట్లకు వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ లాభం రూ.4,306 కోట్ల నుంచి రూ.4,789 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.23,540 కోట్ల నుంచి రూ.28,605 కోట్లకు దూసుకుపోయింది. నికర వడ్డీ ఆదాయం కేవలం 2.6 శాతం పెరిగి రూ.11,101 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లపై వ్యయాలు 4.01 శాతం నుంచి 4.96 శాతానికి పెరిగాయి. బ్యాంక్ రుణ ఆస్తుల నాణ్యత మరింత బలపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 3.08 శాతానికి (రూ.32,318 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి ఇవి 4.53 శాతంగా ఉంటే, 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 3.32 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 0.99 శాతంగా ఉంటే, 2023 సెపె్టంబర్ చివరికి 0.76 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ అడ్వాన్స్‌లు (రుణాలు) 13.6 శాతం పెరిగి రూ.10,49,327 కోట్లకు చేరాయి. డిపాజిట్లు 8.3 శాతం వృద్ధితో రూ.12,45,300 కోట్లుగా ఉన్నాయి. రిటైల్ రుణాల్లో 22 శాతం వృద్ధి కనిపించింది. వ్యవసాయ రుణాలు 12.6 శాతం, బంగారం రుణాలు 28 శాతం పెరిగి రూ.45,074 కోట్లకు చేరాయి. ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)లో ఎక్స్పోజర్కు సంబంధించి రూ.50 కోట్లను పక్కన పెట్టింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5 శాతం ఎగసి రూ.248 వద్ద క్లోజ్ అయింది. -
టాటా టెక్నాలజీస్ ఫర్వాలేదు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ టాటా టెక్నాలజీస్ డిసెంబర్‌తో అంతమైన త్రైమాసికంలో రూ.170 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.148 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం ఇదే కాలంలో 15 శాతం వృద్ధితో రూ.1,289 కోట్లకు చేరింది. ‘‘డిసెంబర్ క్వార్టర్లో ఐదు పెద్ద ఆర్డర్లను సొంతం చేసుకున్నాం. ఇందులో ఒక డీల్ మొత్తం విలువ 50 మిలియన్ డాలర్లకు (రూ.415 కోట్లు) పైనే ఉంది. మరొక డీల్ విలువ 25 మిలియన్ డాలర్లు. ఆటోమోటివ్ విభాగంలో కస్టమర్ల వ్యయాల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఎందుకంటే ఓఈఎంలు ఎలక్ట్రిఫికేషన్ వైపు, ఇతర ప్రత్యామ్నాయ ప్రొపల్షన్ సిస్టమ్లవైపు దృష్టి సారిస్తున్నాయి. ఏరోస్పేస్ పరిశ్రమ కూడా ఉత్సాహంగా కనిపిస్తోంది. మా సామర్థ్యాలను భారీగా నిర్మించుకోవడంపై పెట్టుబడులు పెడుతున్నాం. కనుక దీర్ఘకాలానికి మా వ్యాపార మూలాల పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నాం’’ అని టాటా టెక్నాలజీస్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ ప్రకటించారు. డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 172 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12,623కు పెరిగింది. -
సైయంట్ లాభం రూ.173 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో సైయంట్ లాభం 11.5 శాతం పెరిగి రూ.173 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.239 కోట్లు, ఎబిటా మార్జిన్ 16 శాతం నమోదైంది. ఆర్డర్ల రాక 21.9 శాతం పెరిగింది. టర్నోవర్ 8 శాతం ఎగసి రూ.1,491 కోట్లకు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే సైయంట్ షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.39 శాతం క్షీణించి రూ.2,018.95 వద్ద స్థిరపడింది. -
డీఎల్ఎఫ్ పనితీరు ఫర్వాలేదు
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ డిసెంబర్ త్రైమాసికానికి మెరుగైన పనితీరును నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 27 శాతం వృద్ధితో రూ.666 కోట్లుగా నమోదైంది. ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.1,643 కోట్లకు చేరింది. వ్యయాలు మాత్రం రూ.1,152 కోట్ల నుంచి రూ.1,132 కోట్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.518 కోట్లు, ఆదాయం రూ.1,560 కోట్ల చొప్పున ఉన్నాయి. ఢిల్లీలోని కంపెనీ కార్యాలయ భవనం ‘డీఎల్ఎఫ్ సెంటర్’ను గ్రూపు సంస్థ డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ (డీసీసీడీఎల్)కు రూ.825 కోట్లకు విక్రయించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది. ‘‘రెంటల్ వ్యాపారాన్ని (అద్దె ఆదాయాన్నిచ్చే ఆస్తులు) స్థిరీకరించే వ్యూహంలో భాగంగా డీఎల్ఎఫ్ సెంటర్ విక్రయ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సంస్థ వివరణ ఇచి్చంది. డీసీసీడీఎల్ అనేది డీఎల్ఎఫ్, సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ జీఐఎస్ జాయింట్ వెంచరీ కావడం గమనార్హం. ఇందులో డీఎల్ఎఫ్కు 67 శాతం వాటా ఉంది. ఒక త్రైమాసికంలో అత్యధిక విక్రయాలు (బుకింగ్‌లు) రూ,9,407 కోట్లు నమోదైనట్టు డీఎల్ఎఫ్ ప్రకటించింది. గురుగ్రామ్‌లో కొత్త ప్రాజెక్టు ఆరంభించిన మూడు రోజుల్లోనే 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు రూ.7,200 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలిపింది. బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు ఒక శాతం లాభంతో రూ.747 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ 671 పాయింట్లు క్రాష్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పాటు దేశీయ కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాల ప్రకటనకు ముందు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సోమవారం దేశీయ మార్కెట్లు దాదాపు ఒకశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 671 పాయింట్లు పతనమై 71,355 వద్ద నిలిచింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 21,513 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 725 పాయింట్లు నష్టపోయి 71,301 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు పతనమైన 21,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.87% నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.16.03 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ► అమెరికాలో డిసెంబర్‌కు సంబంధించి వ్యవసాయేతర రంగాల్లో 2.16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పేరోల్ డేటా అంచనాలకు మించి నమోదవడంతో ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఊహాగాహాలు తెరపైకి వచ్చాయి. చైనా ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు డేటాతో సహా ఆయా దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు అప్రమత్తత చోటు చేసుకోవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ► మెక్వైర్ ఈక్విటీస్ రీసెర్చ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులపై రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేయడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎస్బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 1.51% నష్టపోయాయి. ► బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.2.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.366 లక్షల కోట్లకు దిగివచి్చంది. ► నష్టాల మార్కెట్లో కొన్ని చిన్న రంగాల షేర్లు రాణించాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేరు ఇంట్రాడేలో 2.50% పెరిగి రూ.1182 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదించినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. షేరుకి రూ. 10,000 ధర మించకుండా 40,00,000 షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 4,000 కోట్లు వెచి్చంచనుంది. -
జొమాటోకు వ్యయాల సెగ
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కన్సాలిడెటెడ్ నష్టాలు డిసెంబర్ త్రైమాసికంలో రూ.346 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఏడాడి ఇదే కాలానికి సంస్థ నష్టం కేవలం రూ.67 కోట్లుగానే ఉంది. అధిక వ్యయాలు, ఆన్లైన్ ఫుడ్ వ్యాపారం నిదానించడం, బ్లింకిట్ నుంచి పెరిగిపోయిన నష్టాలు ఈ పరిస్థితికి దారితీశాయి. కార్యకలాపాల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,112 కోట్ల నుంచి రూ.1,948 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ.1,642 కోట్ల నుంచి రూ.2,485 కోట్లకు చేరాయి. ‘‘పరిశ్రమ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ వ్యాపారం గతేడాది అక్టోబర్ (దీపావళి తర్వాత) నుంచి తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, ముఖ్యంగా టాప్ 8 పట్టణాల్లో మరింత అధికంగా ఉంది’’అని జొమాటో సీఎఫ్‌వో అక్షత్ గోయల్ తెలిపారు. ఫుడ్ డెలివరీ వ్యాపారం డిమాండ్ వాతావరణం సవాలుగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. ‘‘ఇటీవలి వారాల్లో డిమాండ్ పరంగా తిరిగి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. కనుక గడ్డు పరిస్థితి ముగిసినట్టేనని భావిస్తున్నాం’’అని గోయల్ పేర్కొన్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా 225 చిన్న పట్టణాల్లో తాము కార్యకలాపాలు నిలిపివేసినట్టు చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో ఈ పట్టణాల నుంచి వచ్చిన ఆదాయం మొత్తం ఆదాయంలో 0.3 శాతమే ఉన్నట్టు తెలిపారు. దీర్ఘకాలంలో ఫుడ్ డెలివరీ వృద్ధి అవకాశాల పరంగా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో వృద్ధి తగ్గడం అన్నది మధ్యస్థాయి మార్కెట్ విభాగంలో మందగమనం, ప్రీమియం విభాగంలో బయటకు వెళ్లి ఆహారం తీసుకోవడం, ప్రీమియం పర్యాటక యాత్రలు తదితర పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ఎబిట్డా స్థాయిలో లాభ, నష్టాలు లేని స్థాయికి 2023–24 రెండో త్రైమాసికంలో చేరుకునే విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సంస్థ రూ.265 కోట్ల నిర్వహణ నష్టాలు ప్రకటించగా, ఇందులో బ్లింకిట్‌ను మినహాయిస్తే నిర్వహణ నష్టం కేవలం రూ.38 కోట్లుగానే ఉంది. -
ఏయూ స్మాల్ బ్యాంక్ లాభం రూ.393 కోట్లు
ముంబై: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 30 శాతం పెరిగి రూ.393 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడ డం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల వృద్ధికి కలిసొచ్చింది. మొ త్తం ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,413 కోట్లు గా నమోదైంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయం 41 శాతం జంప్ చేసి రూ.1,153 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 6.3 శాతంగా నమోదైంది. ఆస్తుల నాణ్యత మెరుగు మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.1,019 కోట్లు) ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.60 శాతం (రూ.1,058 కోట్లుగా) ఉండడం గమనార్హం. నికర ఎన్పీఏలు 1.29 శాతం (రూ.520 కోట్లు) నుంచి 0.51 శాతానికి (రూ.285 కోట్లు) పరిమితమయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో రూ.176 కోట్ల కేటాయింపులు చేసింది. రుణ వ్యాపారంలో బలహీన వృద్ధిని చూపించింది. పరిశ్రమ వ్యాప్తంగా రుణాల మంజూరు జోరుగా ఉంటే, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిసెంబర్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం రుణాలు రూ.56,335 కోట్లుగా, డిపాజిట్లు 5 శాతం పెరిగి రూ.61,101 కోట్ల చొప్పున ఉన్నాయి. కాసా రేషియో 38 శాతానికి చేరింది. నిధులపై వ్యయాలు 6 శాతంగా ఉన్నాయి. మొత్తం రుణాల్లో 90 శాతం రిటైల్ విభాగంలో ఉంటే, 93 శాతం రుణాలు సెక్యూర్డ్‌గా బ్యాంక్ తెలిపింది. -
తయారీలో అధిక నియామకాలు
ముంబై: తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయి. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు చెప్పాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. తయారీ, సేవల రంగ కంపెనీల్లో నియామకాల పట్ల ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే, ఇది 70 శాతం దాటుతుందని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా తర్వాత అంతర్జాతీయంగా ఉపాధి కల్పన 2.7 శాతం మేర కోలుకుంది. ఇది 2022 ద్వితీయ ఆరు నెలల కాలానికి బలంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ధోరణి కంపెనీల్లో, ముఖ్యంగా తయారీలో ఎంతో బలంగా ఉంది. పరిశ్రమల్లో ఆశావాదం పుంజుకోవడం, పండుగల సందర్భంగా వినియోగ డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్రోత్సాహకాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్ భట్ తెలిపారు. ప్రోత్సహకాలు కీలకం.. ‘‘ఉపాధి అవకాశాలను పెంచేందుకు, పర్యాటకం, ఏవియేషన్, నిర్మాణ రంగం, గృహ నిర్మాణానికి నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ఉద్దీపనల ప్యాకేజీ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడంలో సాయంగా నిలుస్తోంది’’అని టీమ్‌లీజ్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లోని 311 తయారీ కంపెనీలను టీమ్‌లీజ్ సర్వే చేసింది. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని తయారీ కంపెనీల్లో 91 శాతం నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని కంపెనీల్లో ఇది 69 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 39 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని కంపెనీల్లో 21 శాతం మేర నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ఈ పట్టణాల్లో మెరుగు.. ముంబైలో అత్యధికంగా 93 శాతం కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నాయి. ఆ తర్వాత బెంగళూరులో 90 శాతం, చెన్నైలో 83 శాతం, ఢిల్లీలో 79 శాతం, పుణెలో 67 శాతం, హైదరాబాద్‌లో 61 శాతం, అహ్మదాబాద్‌లో 61 శాతం మేర కంపెనీలు నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. బెంగళూరులో ఎఫ్ఎంసీజీ.. ముంబైలో తయారీ, ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చెన్నైలో ఆగ్రోకెమికల్స్ కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో ఉపాధి కల్పించనున్నాయి. -
ఐడియా నష్టాలు 6,439 కోట్లు
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో నష్టాలు మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.5,005 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.6,439 కోట్లకు చేరాయి. ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి)కు సంబంధించిన వడ్డీ వ్యయాలు, ఆస్తులకు సంబంధించిన అధిక తరుగుదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్ చెప్పారు. మరిన్ని వివరాలు..... 30 శాతం పెరిగిన వడ్డీ వ్యయాలు... గత క్యూ3లో రూ.11,983 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం పతనమై రూ.11,381 కోట్లకు తగ్గింది. వడ్డీ వ్యయాలు 30 శాతం ఎగసి రూ.3,722 కోట్లకు, తరుగుదల వ్యయాలు 23 శాతం వృద్ధితో రూ.5,877 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ కంపెనీ నష్టాలు తగ్గాయి. గత క్యూ2లో రూ.50,922 కోట్ల నికర నష్టాలను కంపెనీ ప్రకటించింది. ఏజీఆర్ బకాయిల కేటాయింపుల కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. టారిఫ్‌ల పెంపుతో మెరుగుపడుతున్న ఆదాయం.... ఏజీఆర్‌కు సంబంధించిన ఊరటనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని రవీందర్ టక్కర్ పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కెపాసిటీ విస్తరణ, 4జీ కవరేజ్, నెట్వర్క్ ఇంటిగ్రేషన్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఇటీవల టారిఫ్‌లను పెంచడం వల్ల సెప్టెంబర్ నుంచి ఆదాయం పుంజుకుంటోందని పేర్కొన్నారు. గత డిసెంబర్లో టారిఫ్‌లను మరింతగా పెంచడం వల్ల ఆదాయం మరింతగా మెరుగుపడగలదని వివరించారు. కాగా వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.53,000 కోట్ల మేర ఉన్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్ 0.6 శాతం నష్టంతో రూ.4.48 వద్ద ముగిసింది. -
జీఎంఆర్ ఇన్ఫ్రాకు విద్యుత్ షాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రా మూడో త్రైమాసికంలో రూ.441 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలానికి నష్టం రూ.217కోట్లుగా ఉంది. ఇంధన సరఫరా లేక విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయకపోవడం, కొత్తగా రెండు విద్యుత్ ప్రాజెక్టులు ఈ త్రైమాసికంలోనే ఉత్పత్తి ప్రారంభించడం నష్టాలు పెరగడానికి కారణంగా జీఎంఆర్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం ఒక్క విద్యుత్ రంగం నుంచే రూ.333 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇదే సమయంలో ఎయిర్పోర్ట్ విభాగం రూ.50 కోట్ల లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలానికి ఎయిర్పోర్ట్ విభాగం కోటి రూపాయల నష్టాలను నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఆదాయం 9 శాతం వృద్థితో రూ.2,382 కోట్ల నుంచి రూ.2,638 కోట్లకు పెరిగినట్లు జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జి.ఎం.రావు ప్రకటనలో తెలిపారు. ఆస్తుల విక్రయం: అసెట్ లైట్, అసెట్ రైట్ కార్యక్రమంలో భాగంగా ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాలను విక్రయించడం జరిగిందని, ఇదే సమయంలో ఉలందూర్‌పేట్ ఎక్స్‌ప్రెస్ హైవేలో 74 శాతం వాటా విక్రయానికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా పేర్కొంది. బుధవారం బీఎస్ఈలో జీఎంఆర్ ఇన్ఫ్రాషేరు స్వల్ప లాభాలతో రూ.19.90 వద్ద ముగిసింది.