న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.723.50 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన లాభం రూ.690.41 కోట్లతో పోలిస్తే ఇది 4.8 శాతం అధికంగా ఉంది. టర్నోవర్ 17.68% పెరిగి రూ.15,972.55 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్యూ3లో రూ.13,572.47 కోట్లుగా ఉంది.
వార్షిక ప్రాతిపదికన పీఏటీ మార్జిన్ 4.5% నుంచి 5.1 శాతానికి చేరింది. మొత్తం వ్యయాలు 18.52 శాతం ఎగసి రూ.15,002 కోట్లకు చేరాయి. ఆన్‌లైన్ ఆర్డరింగ్ సర్వీసెస్ తొలి 9 నెలల్లో 21.5% వృద్ధి సాధించింది. ఎఫ్‌ఎంసీజీ విభాగంలో అధిక డిస్కౌంట్లు టర్నోవర్‌పై ప్రభావాన్ని చూపాయని అవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈవో నెవీల్ నోరాన్హా తెలిపారు. కంపెనీకి దేశవ్యాప్తంగా మొత్తంగా 2024 డిసెంబర్ 31 నాటికి 387 స్టోర్లను కలిగి ఉంది.
డీమార్ట్‌కు కొత్త సీఈవో అన్షుల్ అసావా
డీమార్ట్ తన ఉన్నత స్థాయి యాజమాన్య పదవుల్లో మార్పులు చేపట్టింది. కొత్త సీఈవోగా అన్షుల్ అసావాను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో డీమార్ట్‌లో చేరతారు. 2026 ఫిబ్రవరి 1న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అంత వరకు అన్షుల్‌కు ప్రస్తుత ఎండీ, సీఈవో నెవీల్ నోరాన్హా సహకారం అందిస్తారు. అన్షుల్‌కు యూనిలీవర్‌లో 30 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం థాయిలాండ్ యూనిలీవర్ అధిపతిగా, గ్రేటర్ ఆసియా గృహ సంరక్షణ వ్యాపార విభాగానికి జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా డీమార్ట్‌కు సేవలు అందిస్తున్న నెవీల్ నోరాన్హా పదవీ కాలం 2026 జనవరితో ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment