న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 95 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీ రికవరీ, గతంలో అతి తక్కువగా నమోదైన లాభాలు కారణమయ్యాయి.
మొత్తం ఆదాయం సైతం 94 శాతం జంప్‌చేసి రూ. 10,038 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ1లో రూ. 5,183 కోట్ల అమ్మకాలు మాత్రమే సాధించింది. అమ్మకాలలో భారీ రికవరీ నమోదైనప్పటికీ గత క్యూ1లో కోవిడ్–19 రెండో దశ ప్రభావంచూపడంతో ఫలితాలను పోల్చిచూడతగదని ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోనా తెలియజేశారు. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు 81 శాతం పెరిగి రూ. 9,192 కోట్లకు చేరాయి.
మూడేళ్లలో 110 స్టోర్లు
గత మూడేళ్లలో కంపెనీ 110 స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు నెవిల్లే ప్రస్తావించారు. ఈ ఏడాది క్యూ1లో 10 స్టోర్లను తెరిచినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి తదుపరి తొలిసారి ఎలాంటి అవాంతరాలూ ఎదురుకాని తొలి త్రైమాసికంగా క్యూ1ను పేర్కొన్నారు. ఈకామర్స్ బిజినెస్ 12 నగరాలకు విస్తరించినట్లు తెలియజేశారు. ఇకపై మరిన్ని నగరాలలో ఈకామర్స్ సేవలు విస్తరించనున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment