ఈ ఏడాది తొలి స్థానంలో దమానీ
ఏడాదిలో 44 శాతం పెరిగిన విలువ
పదో స్థానంలో నైకా ఫాల్గుణి నాయర్
ఐడీఎఫ్‌సీ ప్రైవేట్, హరూన్ నివేదిక
ముంబై: స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఈ ఏడాదీ ‘డీమార్ట్’ రాధాకిషన్ దమానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ‘డీమార్ట్’ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన రిటైల్ చైన్ చక్కని ఆదరణ పొందుతుండడం తెలిసిందే. డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ రూ.3.4 లక్షల కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో 44 శాతం పెరిగింది.
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన జొమాటో విలువ ఏడాది కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.2,51,900 కోట్లకు చేరింది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి నెలకొల్పిన స్విగ్గీకి మూడో స్థానం దక్కింది. కంపెనీ విలువ ఏడాది కాలంలో 52 శాతం పెరిగి రూ.1,01,300 కోట్లుగా ఉంది. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీలతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి.
గతేడాది హరూన్ జాబితాలోనూ డీమార్ట్ మొదటి స్థానంలో ఉండగా, ఫ్లిప్‌కార్ట్, జొమాటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జాబితాలో టాప్–10లో ఉన్న ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, క్రెడ్ ఈ సారి టాప్–10లో చోటు కోల్పోయాయి. ముఖ్యంగా స్వయంకృషితో ఎదిగిన మహిళా అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఫాల్గుణి నాయర్‌కు పదో స్థానం దక్కడం గమనార్హం. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన టాప్–200లో 66 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉంటే, 36 కంపెనీలకు ముంబై, 31 కంపెనీలకు గురుగ్రామ్ చిరునామాగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment