Radhakishan Damani
-
సెల్ఫ్‌మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ 2023 లిస్ట్ విడుదల.. ఆయనే టాప్..
ధనవంతులుగా ఎదగాలంటే తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండాలనేది ఒకప్పటి విధానం. కానీ ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడే ఆలోచన ఉండి దాన్ని కార్యరూపం దాల్చేలా చేసి వారి మన్ననలు పొందితే అదే డబ్బు సంపాదిస్తోందని చాలా మంది నిరూపిస్తున్నారు. తామకు తాము ఎలాంటి ‘గాడ్‌ఫాదర్’ లేకుండా కుబేరులుగా ఎదుగుతున్నారు. తాజాగా దేశంలో ధనవంతులైన ‘సెల్ఫ్‌మేడ్ ఎంట్రప్రెన్యూర్స్’ లిస్ట్ విడుదలైంది. అందులో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ అగ్రస్థానంలో నిలిచారు. పేటీఎం, బొమాటో, క్రెడ్, జెరోధా, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, రాజొర్పే వంటి స్టార్ట్అప్లు స్థాపించిన యువ వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ సంస్థ ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియం 2023' లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో డీమార్ట్ కంపెనీ అవెన్యూ సూపర్మార్ట్స్తో కలిసి రూ.2,38,188 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దమానీ మొదటిస్థానంలో నిలిచారు. ఫ్లిప్‌కార్ట్(రూ.1,19,472 కోట్లు)కు చెందిన బిన్నీ-సచిన్ బన్సాల్, జొమాటో(రూ.86,835 కోట్లు) దీపిందర్ గోయల్, డ్రీమ్ 11(రూ. 66,542 కోట్లు)కు చెందిన భవిత్ షేత్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు. రోజర్‌పే వ్యవస్థాపకులు హర్షిల్ మాథుర్ & శశాంక్ కుమార్, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్-అభయ్ సోయి, పేటీఎం-విజయ్ శేఖర్ శర్మ, క్రెడ్-కునాల్ షా, జెరోధా-నితిన్ కామత్ & నిఖిల్ కామత్‌లు ఈ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఈ లిస్ట్‌లో వయసు పైబడినవారిలో వరుసగా అశోక్ సూత(80)-హ్యాపీయెస్ట్ మైండ్స్, నరేష్ ట్రెహాన్-మెదంటా(77), అశ్విన్ దేశాయ్ (72)-ఏథర్స్, జైతీర్థరావు (71)-హోమ్‌ఫస్ట్ ఉన్నారు. ఇదీ చదవండి: ‘చైనాను చూసి నేర్చుకోండి’.. మరోసారి ఇన్ఫోసిస్ మూర్తి షాకింగ్ కామెంట్స్ మరోవైపు ధనవంతుల జాబితాలో అత్యంత పిన్న వయసు కలిగినవారిలో జెప్టోకు చెందిన కైవల్య వోహ్రా(21), భారత్‌పే-నక్రానీ (25), జు పీ-దిల్షేర్ మల్హి(27), సిద్ధాంత్ సౌరభ్(28), ఓయో-రితేష్ అగర్వాల్(29) ఉన్నారు. ఈ జాబితాలో చోటుసాధించిన మహిళల్లో అతి పిన్న వయస్కుల జాబితాలో మామఎర్త్కు చెందిన గజల్ అలఘ్ (35), విన్జో-సౌమ్య సింగ్ రాథోడ్ (36), ప్రిస్టిన్ కేర్-గరిమా సాహ్నీ(37) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. -
డీమార్ట్ రాధాకిషన్ దమానీ హవా, సంపద ఎంత పెరిగిందో తెలిస్తే!
న్యూఢిల్లీ: పెట్టుబడిదారుడి నుండి వ్యాపారవేత్త వరకు ఎదిగిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ మరోసారి తన హవాను చాటుకున్నారు. ఐఎఫ్ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో 12 మంది వ్యాపారవేత్తలు ట్రిలియనీర్లుగా అవతరించారు. ముఖ్యంగా ప్రముఖ పెట్టుబడిదారుడు అవెన్యూ సూపర్‌మార్కెట్ (డీమార్ట్) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ సంపద ఏకంగా 280 శాతం లేదా 1,28,800 కోట్లు రూపాయలు పెరిగింది. ఇదీ చదవండి: Hurun India Rich List 2022: అదానీ రోజు సంపాదన ఎంతో తెలుసా? గత ఐదేళ్లలో డీమార్ట్ లాభాలతో దమానీ సంపద 1.75 లక్షల కోట్లకు పెరిగింది. తద్వారా హురున్ ఇండియా రిచెస్ట్ జాబితాలో ఐదో ప్లేస్‌లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు పైకి ఎగబాగారు. దమానీ రోజువారీ సంపాదన 57 కోట్ల రూపాయలని ఈ నివేదిక తేల్చింది. అంటే గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం జంప్ చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్‌లోఉండగా, రెండో ప్లేస్‌లో రిలయన్స్అధినేత ముఖేశ్ అంబానీ, మూడు, నాలుగు స్థానాల్లో సీరం అధినేత సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ నిలిచారు. కిరాణామొదలు ఆహారం, దుస్తుల విక్రయంతో భారతదేశం అంతటా 200కు పైగా డీమార్ట్ స్టోర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. స్టాక్‌మార్కెట్ పెట్టుబడులతో వందల మిలియన్ల డాలర్లు సంపాదించిన దమానీ 2002లో డీమార్ట్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా వ్యాపారవేత్తగా అవతరించిన సంగతి తెలిసిందే. -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!
సాక్షి,ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణం తరువాత ఆయన పెట్టుబడుల నిర్వహణ, ట్రస్ట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. అయితే మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం ఝన్‌ఝన్‌వాలా విశ్వసనీయ మిత్రుడు, గురువు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఝున్‌ఝున్‌వాలా ఎస్టేట్‌కు ప్రధాన ట్రస్టీగా వహిరిస్తారు. ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత పెట్టుబడులపై దమానీనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇతర విశ్వసనీయలు కల్‌ప్రజ్ ధరంషి అమల్ పారిఖ్ ఇతర ట్రస్టీలుగా ఉంటారు. ఝున్‌ఝున్‌వాలా తన గురువుగా ఆర్కె దమానీని ఎపుడూ ప్రశంసిస్తూ ఉండేవారు. తన తండ్రి, టాటాస్, విన్స్టన్ చర్చిల్, జార్జ్ సోరోస్, రాధాకిషన్ దమానీ ఈ ఐదుగురు తనకు రోల్ మోడల్స్ అనీ, వారినుంచి స్ఫూర్తి పొందానని పలు ఇంటర్వ్యూలలో ఝున్‌ఝున్‌వాలా గుర్తుచేసుకునేవారు. అందుకే విభిన్నమైన వ్యక్తిత్వాలతో, దలాల్ స్ట్రీట్‌లో ఈ రెండు బిగ్‌బుల్స్ మధ్య ఫ్రెండ్షిప్ని బాలీవుడ్ మూవీ'షోలే'లోని జై-వీరూలతో ఎక్కువగా పోలుస్తారు అభిమానులు. ఝున్‌ఝున్‌వాలా సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం,గత ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నందున ప్రతీ విషయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు ఆయన భార్య, వ్యాపారవేత్త రేఖా కూడా వ్యాపార కుటుంబానికి చెందినవారు, ఫైనాన్స్‌పై అపారమైన అవగాహన కూడా ఆమె సొంతం. దీంతోపాటు, రేఖా సోదరుడు సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే రేర్ ఎంటర్‌ప్రైజెస్‌ని ఉత్పల్ సేథ్ , అమిత్ గోలా ఆధ్యర్యంలోనే నడుస్తుంది. ఝున్ఝున్వాలాకా పెట్టుబడులపై సలహాలందించే ఉత్పల్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి సారించారు.ఇక అమిత్ గోలా ట్రేడింగ్ అంశాలపై ఆయనకు కుడిభుజంలాపనిచేసేవారు. అమిత్ ట్రేడింగ్ బుక్నికూడా నిర్వహిస్తున్నారు. కాగా ఆగస్ట్ 14న మరణించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లిస్టెడ్ , అన్‌లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులతో సహా కోట్లాది రూపాయల ఆస్తులను అతని భార్య ముగ్గురు పిల్లలకు వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్‌గా రాణిస్తున్న రాధాకిషన్ దమానీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు కూడా. రిటైల్ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్ పేరుతో ఎంట్రీ ఇచ్చి డి-మార్ట్ చెయిన్‌తో పెద్ద సంచలనమే క్రియేట్ చేశారు దమానీ. 2022 జూన్ నాటికి అవెన్యూలో దమానీ నికర విలువ రూ. 1,80,000 కోట్లకు పైమాటే. -
India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా?
దేశంలో లేదా ప్రపంచంలో సంపన్నుల లెక్క ఎప్పుడూ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే.. మన దేశంలో ఏ రంగం నుంచి ఎక్కువ మంది బిలియనీర్లు వస్తున్నారన్న విషయం మీకు తెలుసా? అందుకే ఈసారి కొంచెం కొత్తగా.. ఈ ఏడాది అత్యధిక సంపన్నులు ఉన్న టాప్–10 వ్యాపార రంగాల గురించి తెలుసుకుందాం.. అది కూడా ఫోర్బ్స్ జాబితా ప్రకారమే.. వీటిని చూశాక.. హెల్త్ ఈజ్ వెల్త్‌కి.. మరో అర్థమూ మనకు దొరుకుతుందేమో.. ఎందుకంటే.. అత్యధిక బిలియనీర్లు ఆరోగ్య రంగం నుంచే ఉన్నారు మరి.. 1. వైద్య రంగం బిలియనీర్ల సంఖ్య: 29 అత్యంత ధనికుడు:సైరస్ పూనావాలా కంపెనీ: సైరస్ పూనావాలా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఎండీ. కోవిడ్ టీకాలు తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ గ్రూప్ కంపెనీల్లో ఒకటి. ఆస్తుల నికర విలువ: సుమారు రూ.1.61 లక్షల కోట్లు 2. తయారీ రంగం బిలియనీర్ల సంఖ్య: 29 అత్యంత ధనికుడు: అశ్వన్ దనీ, కుటుంబం కంపెనీ: ఏసియన్ పెయింట్స్ లిమిటెడ్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 58 వేల కోట్లు 3. ఫ్యాషన్ అండ్ రిటైల్ బిలియనీర్ల సంఖ్య: 16 అత్యంత ధనికుడు: రాధాకిషన్ దమానీ, కంపెనీ: డీమార్ట్ వ్యవస్థాపకుడు ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.43 లక్షల కోట్లు 4. సాంకేతిక రంగం బిలియనీర్ల సంఖ్య: 13 అత్యంత ధనికుడు: శివ్ నాడర్ కంపెనీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.78 లక్షల కోట్లు 5. ఆర్థిక, బ్యాంకింగ్ బిలియనీర్ల సంఖ్య: 11 అత్యంత ధనికుడు: ఉదయ్ కోటక్, కంపెనీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఎండీ–సీఈవో ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 1.08 లక్షల కోట్లు 6. ఆహారం– పానీయాలు బిలియనీర్ల సంఖ్య: 10 అత్యంత ధనికుడు: రవి జైపురియా కంపెనీ: ఆర్జే కార్ప్ లిమిటెడ్ చైర్మన్. పెప్సీకి సీసాలు తయారు చేసే సంస్థ. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, కోస్టా కాఫీ వంటి సంస్థలకు ఫ్రాంచైజీ) ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 52 వేల కోట్లు 7. వాహన తయారీ రంగం బిలియనీర్ల సంఖ్య: 9 అత్యంత ధనికులు: బజాజ్ సోదరులు (నీరజ్, మధూర్, శేఖర్), కంపెనీ: బజాజ్ గ్రూప్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 54 వేల కోట్లు 8. స్థిరాస్తి రంగం బిలియనీర్ల సంఖ్య: 9 అత్యంత ధనికుడు: కుషల్పాల్ సింగ్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 66 వేల కోట్లు 9. నిర్మాణ, ఇంజనీరింగ్ రంగం బిలియనీర్ల సంఖ్య: 5 అత్యంత ధనికుడు: రవి పిళ్లై కంపెనీ: ఆర్పీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆస్తుల నికర విలువ: సుమారు రూ.20 వేల కోట్లు 10. సేవా రంగం బిలియనీర్ల సంఖ్య: 4 అత్యంత ధనికులు: కపిల్, రాహుల్ భాటియా (తండ్రీకొడుకులు) కంపెనీ: ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కపిల్ భాటియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఎండీ రాహుల్ భాటియా. ఇండిగో సంస్థ సహవ్యవస్థాపకుడు ఆస్తుల నికర విలువ: సుమారు రూ. 35 వేల కోట్లు బిజినెస్ టైకూన్లు దేశంలో వివిధ రంగాలకు తమ వ్యాపారాలను విస్తరించిన దిగ్గజ వ్యాపారవేత్తల సంఖ్య 17కు చేరుకుంది. సుమారు రూ. 9.1 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సుమారు రూ. 7 లక్షల కోట్లు సంపదతో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో ఉండగా సుమారు రూ. 1.04 లక్షల కోట్లుతో కుమార్ మంగళం బిర్లా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. -
ప్రపంచ కుబేరులలో డీమార్ట్ బాస్
ముంబై: కరోనా టైంలో అన్నివర్గాలను ఆకర్షించి.. విపరీతంగా లాభాలు ఆర్జించింది డీమార్ట్ బ్రాండ్ సూపర్ మార్కెట్. తాజాగా ఈ స్టోర్ల ప్రమోటర్ రాధాకృష్ణన్ ఎస్.దమానీ తాజాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరారు. 19.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌ను సాధించడం ద్వారా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 98వ ర్యాంకులో నిలిచారు. వెరసి టాప్–100 గ్లోబల్ కుబేరుల్లో ఒకరిగా తొలిసారి ఆవిర్భవించారు. ప్రపంచ సంపన్నులపై రోజువారీ ర్యాంకింగ్‌లను ఈ ఇండెక్స్ ప్రకటిస్తుంటుంది. డీమార్ట్ రిటైల్ చైన్ నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు ప్రమోటర్ అయిన దమానీ.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా. దేశీ కుబేరులు: టాప్–100 గ్లోబల్ జాబితాలో దమానీ కంటే ముందు వరుసలో దేశీ దిగ్గజాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గౌరవ చైర్మన్ శివ నాడార్, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ సైతం నిలిచారు. కాగా.. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా దాదాపు ప్రతీ ప్రొడక్టులు.. వాటిపై రీజనబుల్ డిస్కౌంట్ల ప్రకటన, ఎక్కువ ప్రొడక్టులతో వినియోగదారుల్ని ఆకర్షించడం, టౌన్లకు సైతం విస్తరించిన మార్ట్లు, ముఖ్యంగా కరోనా టైం నుంచి అన్ని వర్గాలను మార్ట్‌లకు రప్పించుకోవడం ద్వారా డీమార్ట్ వాల్యూను విపరీతంగా పెంచుకోగలిగారాయన. తద్వారా స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే దమానీ.. వేల్యూ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు. పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే సంపద వృద్ధికి ప్రధానంగా ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ దోహదం చేసింది. దమానీకి అధిక వాటాలున్న లిస్టెడ్ కంపెనీలలో వీఎస్టీ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెంట్‌లను పేర్కొనవచ్చు. డీమార్ట్ దూకుడు ఐపీవో ద్వారా 2017 మార్చిలో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు రేసుగుర్రంలా పరుగు తీసింది. దీంతో రూ. 39,813 కోట్ల నుంచి ప్రారంభమైన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) తాజాగా రూ. 2.36 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆరు రెట్ల వృద్ధికాగా.. దమానీ, ఆయన కుటుంబ వాటా విలువ రూ. 32,870 కోట్ల నుంచి రూ. 1.77 లక్షల కోట్లకు జంప్ చేసింది. గత ఏడాది కాలంలోనే డీమార్ట్ షేరు 62 శాతం పురోగమించడం గమనించదగ్గ అంశం!. -
World Top 100 Billionaires: బిలియనీర్ల క్లబ్లో మరో భారతీయుడు
సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో వ్యాపారం పుంజుకుంటోంది. మన వ్యాపారవేత్తలు వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. ప్రపంచ కుబేరుల సరసన నిలుస్తున్నారు. తాజాగా ఇండియా నుంచి మరోకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వంద మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. 97వ స్థానం ఇండియల్ బిగ్‌బుల్‌గా పేరొందిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గురులాంటి వ్యక్తి రాధకిషన్ దమానీ. ఏన్నె ఏళ్లుగా ఆయన స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. డీమార్ట్ నుంచే రాధాకిషన్ దమానీకి అత్యధిక సంపద తెచ్చిపెట్టిన వ్యాపారంలో ప్రథమ స్థానంలో నిలిచింది డీమార్ట్. దమానీ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న డిమార్ట్ షేర్ల విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డీమార్ట్‌లో రాధాకిషన్ దమానీకి 65.20 శాతం వాటా కలిగిని ఉన్నారు. డీమార్ట్ షేర్ వాల్యూ జనవరి 1న రూ.2,789 ఉండగా ఆగస్టు 17న ఏకంగా ఒక షేరు విలువ రూ.3,649కి చేరుకుంది. కేవలం ఎనిమిది నెలల్లో షేరు విలువ 31 శాతం పెరిగింది. దీంతో డీమార్ట్ ద్వారా దమానీ ఖాతాలో 1.54 లక్షల కోట్ల సంపద చేరింది. మిగిలినవి దమానీ సంపదలో డీమార్ట్ తర్వాత సుందర్ ఫైనాన్స్ నుంచి రూ.634 కోట్లు, ట్రెంట్గ్రూపు ద్వారా రూ.488 కోట్లు, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ నుంచి రూ.230 కోట్లు, మెట్రో పోలిస్ హెల్త్‌కేర్ ద్వారా రూ. 229 కోట్ల సంపదను ఆయన కలిగి ఉన్నారు. చదవండి: ఏడుగురు మహిళలు..రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్ -
రూ.1000 కోట్లు పెట్టి ఇల్లు కొన్న డీమార్ట్ ఓనర్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్, డీమార్ట్ సంస్థ యజమాని రాధాకిషన్ దమాని సుమారు 1,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని సంపన్న ప్రాంతాల్లో ఒకటైన మలబార్ హిల్‌లో ఆయన ఈ ఇంటిని తన సోదరుడు గోపీకిషన్ దమానితో కలిసి కొనుగోలు చేశారు. 5,752.22 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి ఖరీదు1,001 కోట్ల రూపాయలు. దీని కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కోసం దమాని మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు ఇప్పటికే రూ.30 కోట్లు చెల్లించారు. ఇక దీని మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచాన వేస్తున్నారు. ఈ ఇంటిని దమాని సౌరభ్ మెహతా, వర్షా మెహతా, జయేశ షా వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దమాని ముంబైలోని ఆల్టమౌంట్ రోడ్‌లోని పృథ్వి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిని దమాని పురచంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ, పరేష్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ, ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ ఎల్ఎల్పీ భాగస్వాముల నుంచి కొనుగోలు చేశారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, రాధాకిషన్ దమాని 14.5 బిలియన్ డాలర్ల ఆస్తితో భారతీయ సంపన్నుల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. భారతదేశంలో 209 మంది బిలియనీర్లు ఉండగా, వారిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముకేష్ అంబానీ 85 బిలియన్ డాలర్ల ఆస్తులతో భారతీయ సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. చదవండి: కరోనా వల్ల లాభపడింది ఆ ఒక్కరే -
యాంబర్ - స్పెన్సర్స్.. జూమ్
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్‌చేసి 40,330ను తాకింది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,848 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో డీమార్ట్ స్టోర్ల ప్రమోటర్ రాధాకిషన్ దమానీ కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో రిటైల్ రంగ కంపెనీ స్పెన్సర్స్ రిటైల్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏసీ దిగుమతులపై నిషేధాన్ని ప్రకటించడంతో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. యాంబర్ ఎంటర్ప్రైజెస్ రిఫ్రిజిరేంట్స్సహా ఎయిర్ కండిషనర్ల(ఏసీ) దిగుమతులపై విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) నిషేధం విధించిన వార్తలతో రెండు రోజులుగా యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. తాజాగా ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 2,410 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,340 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 18 శాతం జంప్‌చేసింది. స్పెన్సర్స్ రిటైల్ డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ క్యూ2లో (జులై-సెప్టెంబర్) స్పెన్సర్స్ రిటైల్‌లో అదనపు వాటాను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూన్ చివరికల్లా స్పెన్సర్స్ రిటైల్‌లో రాధాకిషన్ దమానీ 2.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. స్పెన్సర్స్ రిటైల్ బీఎస్ఈకి అందించిన వివరాల ప్రకారం సెప్టెంబర్‌కల్లా దమానీ వాటా 2.20 శాతానికి పెరిగింది. వెరసి 3.25 లక్షల స్పెన్సర్స్ షేర్లను దమానీ క్యూ2లో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో స్పెన్సర్స్ రిటైల్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 7 శాతం వరకూ ఎగసింది. రూ. 78 సమీపంలో ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం బలపడి రూ. 75 వద్ద ట్రేడవుతోంది. -
ఇండియా సిమెంట్స్‌పై దమానీ కన్ను
న్యూఢిల్లీ: డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్‌తో రిటైల్ రంగంలో సంచలనం సృష్టించిన ప్రముఖ ఇన్వెస్టరు రాధాకిషన్ దమానీ తాజాగా ఇండియా సిమెంట్స్‌పై దృష్టి సారించారు. కంపెనీని టేకోవర్ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన షేర్‌హోల్డరు ఎన్ శ్రీనివాసన్‌తో సంప్రతింపులు కూడా జరిపినట్లు సమాచారం. ఇండియా సిమెంట్స్‌లో నియంత్రణ స్థాయి వాటాలు దక్కించుకునేందుకు చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో శ్రీనివాసన్‌కు 29 శాతం వాటాలు ఉన్నాయి. బలవంతపు టేకోవర్ల సమస్య ఎదురుకాకుండా శ్రీనివాసన్ ఇతర ఇన్వెస్టర్ల వైపు కూడా చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బలవంతపు టేకోవర్ కాకుండా మేనేజ్మెంట్లో స్నేహపూర్వక మార్పు జరిగే విధంగానే టేకోవర్ ఉండేట్లు చూస్తానంటూ దమానీ హామీ ఇచ్చినట్లు వివరించాయి. దమానీకి చెందిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించగా, ఇండియా సిమెంట్స్ ఈ సమాచారం సరైనది కాదంటూ పేర్కొంది. క్రమంగా షేర్లు పెంచుకుంటూ.. దమానీ, ఆయన కుటుంబ సభ్యులు ఇండియా సిమెంట్స్‌లో గత కొన్నాళ్లుగా క్రమంగా షేర్లు పెంచుకుంటూ ఉన్నారు. మార్చి 31 నాటికి వారి వాటాలు సుమారు 20 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ డీల్ గానీ సాకారమైన పక్షంలో దమానీ పోర్ట్‌ఫోలియోను మరింత డైవర్సిఫై చేసుకోవడానికి వీలవుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్, లఫార్జ్‌హోల్సిమ్ వంటి పోటీ దిగ్గజాలను ఎదుర్కొనేందుకు ఇండియా సిమెంట్స్‌కు కూడా గట్టి ఇన్వెస్టరు మద్దతు లభించగలదని పేర్కొన్నాయి. 74 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఇండియా సిమెంట్స్‌కు గతేడాది నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్ షేర్ రయ్.. టేకోవర్ వార్తలతో బుధవారం ఇండియా సిమెంట్స్ షేరు ధర సుమారు 4.72 శాతం పెరిగి రూ. 131.95 వద్ద క్లోజయ్యింది. మరోవైపు, అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 2,342 వద్ద క్లోజయ్యింది. ఇండియా సిమెంట్స్ షేరు ఈ ఏడాది మార్చి నాటి కనిష్ట స్థాయిల నుంచి 74 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 95 శాతం ఎగిసింది. 2019 సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఇండియా సిమెంట్స్ షేర్లను దమానీ గణనీయంగా కొనడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆయన వాటా 1.3 శాతంగా ఉండేది. డిసెంబర్ క్వార్టర్ వచ్చేటప్పటికి 4.73 శాతానికి పెరిగింది. మార్చి క్వార్టర్లో సోదరుడు గోపీకిషన్ శివకిషన్ దమానీతో కలిపి 15.16% వాటాలు కొనుగోలు చేయడంతో ఇది 19.89 శాతానికి చేరింది. -
కరోనా వల్ల లాభపడింది ఆ ఒక్కరే
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్‌కు జన్మస్థానమైన చైనాలోని వూహాన్లో పరిస్థితి చక్కబడ్డప్పటికీ మిగతా దేశాల్లో మాత్రం దీని విజృంభణ ఎంతకూ తగ్గడం లేదు. దీంతో దీని వ్యాప్తిని నివారించేందుకు పలు దేశాలు లాక్డౌన్ బాటలో నడిచాయి. మన దేశంలోనూ ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని పొడిగించే ప్రయత్నంలోనూ ఉంది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా వల్ల ఆర్థిక సంక్షోభం రెట్టింపవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న ఏకైక వ్యక్తి అవెన్యూ సూపర్ మార్ట్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ అధినేత రాధాకిషన్ దామాని. (రిటైల్‌లో 80వేల ఉద్యోగాలకు గండం..) ధరలు కాస్త తక్కువగా ఉంటాయన్న పేరుతో హైదరాబాద్ వంటి నగరాల్లో జనం ఎక్కువగా డీమార్ట్‌లో షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. పైగా లాక్డౌన్ వల్ల నిత్యావసరాలకు కొరత వస్తుందనే భయంతో పెద్ద ఎత్తున జనాలు డీమార్ట్ ముందు క్యూ కట్టారు. వారి భయాందోళనలే అతనికి వ్యాపారం బాగా జరిగేందుకు లాభపడ్డాయి. ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో ఆయన సంపద 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూంబెర్గ్ సంస్థ వెల్లడించింది. దీంతో భారత్‌లోని టాప్ 12 శ్రీమంతుల్లో ఆయన ఒకరుగా నిలిచారు. అంతేకాక డీమార్ట్ షేర్ విలువ సైతం ఏకంగా 18 శాతం పెరిగింది. కరోనాతో పోరాటానికి ఆయన రూ.155 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే (కరోనాతో ఫైట్‌కు డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం) -
రెండు రోజుల్లోనే ఆయనకు రూ.6100 కోట్లు
న్యూఢిల్లీ : రాధాకిషన్ దమానీ.. ఈ పేరు ఇటీవల మార్కెట్లో మారుమ్రోగిపోతుంది. ఎప్పుడైతే డీమార్ట్ లను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ లిస్టింగ్ కు వచ్చిందో అప్పడి నుంచి ఈయన సంపద రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తోంది. కుబేరుల జాబితాలోంచి అపర కుబేరుడిని చేసేస్తున్నాయి ఆ కంపెనీ షేర్లు. లిస్టింగ్ డే రోజే 114 శాతం లాభంతో ఎగిసిన రాధాకిషన్ సంపద, కేవలం ఈ రెండు రోజుల్లోనే రూ.6100 కోట్లకు ఎగిసింది. రూ.299తో లిస్టింగ్ కు వచ్చిన అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు, ఇప్పటికే 2.4 రెట్ల లాభంతో దూసుకెళ్లాయి. ఇక బుధవారం ముగింపుకు, శుక్రవారం ట్రేడింగ్ కైతే ఏకంగా 13 శాతం ఎగిసి, మార్కెట్లో మెరుపులు మెరిపించాయి. దీంతో దమానీ, ఆయన ఫ్యామిలీ ఒక్కసారిగా రూ.4300 కోట్లకు వారసులైపోయారు. శుక్రవారం ట్రేడింగ్ లో కంపెనీ స్టాక్ 13.14 శాతం లాభంతో రూ.714 గరిష్ట స్థాయిలను తాకింది. ఈ స్టాక్ బుధవారం రూ.631.60గా ముగిసింది. ఓ వైపు దేశీయ బెంచ్ మార్కు సూచీలు పడిపోతున్నా.. ఆ కంపెనీ షేర్లు మాత్రం ర్యాలీ కొనసాగిస్తూనే ఉన్నాయి. దమానీ, ఆయన భార్య, సోదరుడు గోపాలకిషన్ శివ్కిషన్ దమానీలు అవెన్యూ సూపర్ మార్ట్స్ లో 82.2 శాతం స్టాక్ ను కలిగి ఉన్నారు. ఈ రెండు రోజుల్లోనే వీరి కుటుంబ సంపద రూ.6100 కోట్లకు పెరిగినట్టు తెలిసింది. ఈ సంపద పెంపుతో దమానీ 20వ అత్యంత భారతీయ ధనవంతుడిగా నిలిచినట్టు బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ రిపోర్టు చేసింది. టాప్-500 వరల్డ్ బిలీనియర్ల జాబితాలో కూడా ఆయన చోటు దక్కించుకున్నట్టు పేర్కొంది. 2002లో సూపర్ మార్కెట్ రిటైన్ చైన్ గా స్థాపించబడ్డ ఈ సంస్థ, డీమార్ట్ బ్రాండు పేరు మీద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ మొత్తం 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 118 స్టోర్లను నిర్వహిస్తోంది.