రెండు రోజుల్లోనే ఆయనకు రూ.6100 కోట్లు
రెండు రోజుల్లోనే ఆయనకు రూ.6100 కోట్లు
Published Fri, Apr 7 2017 7:17 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
న్యూఢిల్లీ : రాధాకిషన్ దమానీ.. ఈ పేరు ఇటీవల మార్కెట్లో మారుమ్రోగిపోతుంది. ఎప్పుడైతే డీమార్ట్ లను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ లిస్టింగ్ కు వచ్చిందో అప్పడి నుంచి ఈయన సంపద రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తోంది. కుబేరుల జాబితాలోంచి అపర కుబేరుడిని చేసేస్తున్నాయి ఆ కంపెనీ షేర్లు. లిస్టింగ్ డే రోజే 114 శాతం లాభంతో ఎగిసిన రాధాకిషన్ సంపద, కేవలం ఈ రెండు రోజుల్లోనే రూ.6100 కోట్లకు ఎగిసింది. రూ.299తో లిస్టింగ్ కు వచ్చిన అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు, ఇప్పటికే 2.4 రెట్ల లాభంతో దూసుకెళ్లాయి.
ఇక బుధవారం ముగింపుకు, శుక్రవారం ట్రేడింగ్ కైతే ఏకంగా 13 శాతం ఎగిసి, మార్కెట్లో మెరుపులు మెరిపించాయి. దీంతో దమానీ, ఆయన ఫ్యామిలీ ఒక్కసారిగా రూ.4300 కోట్లకు వారసులైపోయారు. శుక్రవారం ట్రేడింగ్ లో కంపెనీ స్టాక్ 13.14 శాతం లాభంతో రూ.714 గరిష్ట స్థాయిలను తాకింది. ఈ స్టాక్ బుధవారం రూ.631.60గా ముగిసింది. ఓ వైపు దేశీయ బెంచ్ మార్కు సూచీలు పడిపోతున్నా.. ఆ కంపెనీ షేర్లు మాత్రం ర్యాలీ కొనసాగిస్తూనే ఉన్నాయి. దమానీ, ఆయన భార్య, సోదరుడు గోపాలకిషన్ శివ్కిషన్ దమానీలు అవెన్యూ సూపర్ మార్ట్స్ లో 82.2 శాతం స్టాక్ ను కలిగి ఉన్నారు.
ఈ రెండు రోజుల్లోనే వీరి కుటుంబ సంపద రూ.6100 కోట్లకు పెరిగినట్టు తెలిసింది. ఈ సంపద పెంపుతో దమానీ 20వ అత్యంత భారతీయ ధనవంతుడిగా నిలిచినట్టు బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ రిపోర్టు చేసింది. టాప్-500 వరల్డ్ బిలీనియర్ల జాబితాలో కూడా ఆయన చోటు దక్కించుకున్నట్టు పేర్కొంది. 2002లో సూపర్ మార్కెట్ రిటైన్ చైన్ గా స్థాపించబడ్డ ఈ సంస్థ, డీమార్ట్ బ్రాండు పేరు మీద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ మొత్తం 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 118 స్టోర్లను నిర్వహిస్తోంది.
Advertisement
Advertisement