D-Mart
-
డీమార్ట్ లాభం అప్
న్యూఢిల్లీ: రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్(డీమార్ట్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 17 శాతంపైగా ఎగసి రూ. 774 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 659 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం జంప్‌చేసి రూ. 14,069 కోట్లను అధిగమించింది. గత క్యూ1లో రూ. 11,865 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇక మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 13,057 కోట్లకు చేరాయి. ఈ కాలంలో కొత్తగా 6 స్టోర్లను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 371ను తాకింది. గత వారాంతాన డీమార్ట్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం వృద్ధితో రూ. 4,953 వద్ద ముగిసింది -
డీమార్ట్ లాభం అప్ క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల రిటైల్ చైన్ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 17 శాతం బలపడి రూ. 690 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 590 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతంపైగా పుంజుకుని రూ. 13,572 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 11,569 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 12,656 కోట్లను తాకాయి. డిసెంబర్ చివరికల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 341కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. హరీష్చంద్ర ఎం.భారుకాను స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. -
డీమార్ట్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 590 కోట్లకు చేరింది. డీమార్ట్ స్టోర్ల కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 553 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 11,569 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 8,494 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో ఈకామర్స్ బిజినెస్(డీమార్ట్ రెడీ)ను మరో 4 నగరాలకు విస్తరించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోనా పేర్కొన్నారు. వెరసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 నగరాలలో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ద్వారా షాప్ ఇన్ షాప్కింద పరిశీలనాత్మకంగా ఒక స్టోర్ లో ఫార్మసీని ప్రారంభించినట్లు వెల్లడించారు. డి సెంబర్కల్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా దేశవ్యాప్తంగా 306 డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో డీమార్ట్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 3,680 వద్ద ముగిసింది. -
డీమార్ట్ ఆదాయం అప్
న్యూఢిల్లీ: డీమార్ట్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ ఆదాయం 25 శాతం ఎగసి దాదాపు రూ. 11,305 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో నమోదైన టర్నోవర్ రూ. 9,065 కోట్లు మాత్రమే. 2022 డిసెంబర్31కల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 306ను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. రాధాకిషన్ దమానీ ప్రమోట్ చేసిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ పలు రాష్ట్రాలలో డీమార్ట్ బ్రాండుతో స్టోర్లను నిర్వహిస్తోంది. ఎన్ఎస్ఈలో డీమార్ట్ షేరు 3.2 శాతం నష్టంతో రూ. 3,931 వద్ద ముగిసింది. -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!
సాక్షి,ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణం తరువాత ఆయన పెట్టుబడుల నిర్వహణ, ట్రస్ట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. అయితే మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం ఝన్‌ఝన్‌వాలా విశ్వసనీయ మిత్రుడు, గురువు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఝున్‌ఝున్‌వాలా ఎస్టేట్‌కు ప్రధాన ట్రస్టీగా వహిరిస్తారు. ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత పెట్టుబడులపై దమానీనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇతర విశ్వసనీయలు కల్‌ప్రజ్ ధరంషి అమల్ పారిఖ్ ఇతర ట్రస్టీలుగా ఉంటారు. ఝున్‌ఝున్‌వాలా తన గురువుగా ఆర్కె దమానీని ఎపుడూ ప్రశంసిస్తూ ఉండేవారు. తన తండ్రి, టాటాస్, విన్స్టన్ చర్చిల్, జార్జ్ సోరోస్, రాధాకిషన్ దమానీ ఈ ఐదుగురు తనకు రోల్ మోడల్స్ అనీ, వారినుంచి స్ఫూర్తి పొందానని పలు ఇంటర్వ్యూలలో ఝున్‌ఝున్‌వాలా గుర్తుచేసుకునేవారు. అందుకే విభిన్నమైన వ్యక్తిత్వాలతో, దలాల్ స్ట్రీట్‌లో ఈ రెండు బిగ్‌బుల్స్ మధ్య ఫ్రెండ్షిప్ని బాలీవుడ్ మూవీ'షోలే'లోని జై-వీరూలతో ఎక్కువగా పోలుస్తారు అభిమానులు. ఝున్‌ఝున్‌వాలా సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం,గత ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నందున ప్రతీ విషయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు ఆయన భార్య, వ్యాపారవేత్త రేఖా కూడా వ్యాపార కుటుంబానికి చెందినవారు, ఫైనాన్స్‌పై అపారమైన అవగాహన కూడా ఆమె సొంతం. దీంతోపాటు, రేఖా సోదరుడు సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే రేర్ ఎంటర్‌ప్రైజెస్‌ని ఉత్పల్ సేథ్ , అమిత్ గోలా ఆధ్యర్యంలోనే నడుస్తుంది. ఝున్ఝున్వాలాకా పెట్టుబడులపై సలహాలందించే ఉత్పల్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి సారించారు.ఇక అమిత్ గోలా ట్రేడింగ్ అంశాలపై ఆయనకు కుడిభుజంలాపనిచేసేవారు. అమిత్ ట్రేడింగ్ బుక్నికూడా నిర్వహిస్తున్నారు. కాగా ఆగస్ట్ 14న మరణించిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లిస్టెడ్ , అన్‌లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులతో సహా కోట్లాది రూపాయల ఆస్తులను అతని భార్య ముగ్గురు పిల్లలకు వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్‌గా రాణిస్తున్న రాధాకిషన్ దమానీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు కూడా. రిటైల్ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్ పేరుతో ఎంట్రీ ఇచ్చి డి-మార్ట్ చెయిన్‌తో పెద్ద సంచలనమే క్రియేట్ చేశారు దమానీ. 2022 జూన్ నాటికి అవెన్యూలో దమానీ నికర విలువ రూ. 1,80,000 కోట్లకు పైమాటే. -
అదరగొట్టిన డీమార్ట్, మార్కెట్ క్యాప్ జూమ్
సాక్షి, ముంబై: ముంబైకి చెందిన డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు మరోసారి అదరగొట్టింది. సోమవారం నాటి నష్టాల మార్కెట్లో కూడా 11శాతం ఎగిసి రికార్డు గరిష్టాన్ని నమోదు చేశాయి. లిస్టింగ్ ధర నుంచి ఏకంగా నాలుగు రెట్లు ఎగిసింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.55 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా డీమార్ట్ బీఎస్ఇలో 18 వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. తద్వారా మార్కెట్ క్యాప్ పరంగా బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే లను అధిగమించింది కాగా గత వారం, అవెన్యూ సూపర్‌మార్ట్స్, 4,098 కోట్ల వరకు సేకరణకుగాను అర్హత కలిగిన సంస్థాగత ప్లేస్మెంట్ (క్యూఐపి)ప్రారంభించింది. ఈ క్యూఐపీ ద్వారా 20 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి 1,999.04 చొప్పున విక్రయిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ క్యూఐపి ద్వారా 20 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి రూజ1,999.04 చొప్పున విక్రయిస్తామని తెలిపింది. ఈ నిధులను తన స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, సరఫరా గొలుసులో పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తిరిగి చెల్లించడానికి వినియోగించనుంది. కాగా 2002 లో ముంబైలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించగా, డిసెంబర్ 31, 2019 నాటికి కంపెనీకి 196 దుకాణాలు డిమార్ట్ సొంతం. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం రూ. 6,809 కోట్లుగా ఉంది, రూ. గతేడాది ఇదే కాలంలో 5,474 కోట్లు. నికర లాభం రూ. 384 కోట్ల నికర లాభాలను సాధించింది. -
డీ–మార్ట్ లాభం 43 శాతం అప్
ముంబై: డీ–మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 43 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.175 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.251 కోట్లకు ఎగసింది. నిర్వహణ పనితీరు ఉత్తమంగా ఉండటం, వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండటతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఆదాయం రూ.3,598 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.4,559 కోట్లకు పెరిగిందని వివరించింది. నిర్వహణ లాభం రూ.303 కోట్ల నుంచి 39 శాతం పెరిగి రూ.423 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభ మార్జిన్ 8.4 శాతం నుంచి 9.3 శాతానికి ఎగసిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.1,593 వద్ద ముగిసింది. -
బీ అలర్ట్: వదంతులు నమ్మకండి!
సాక్షి, ముంబై: గత రెండు రోజులుగా అన్ని వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ‘17వ వార్షికోత్సవం సందర్భంగా డీమార్ట్ రూ.2500 ఫ్రీ షాపింగ్ వోచర్ ఇస్తుంది’’ అనే వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. యూజర్లు వివిధ గ్రూపులలో దీన్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లింక్ ఓపెన్ చేస్తే అచ్చం డీమార్ట్ వైబ్ సైట్ లానే కనిపించే neuenwfarben.com అనే బోగస్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఇది జర్మనీకి చెందిన ఓ వోచర్ స్కామ్ కు చెందిన వైబ్ సైట్అని, తద్వారా ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ మెసేజ్ ను ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు. ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు. ఒకవేళ ఇప్పటికే ఈ మెసేజ్ ఓపెన్ చేసినవారు వెంటనే తమ ఈమెయిల్ ఐడీ, బ్యాంకు, ఇతర ముఖమైన వాటి పాస్ వర్డ్ లు మార్చుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి నకిలీ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లేదంటే వైరస్ ఎటాక్‌తో ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఈ విషయంపై డీమార్ట్ కూడా స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, మెసేజ్‌లు అవాస్తవమని, తాము అటువంటి ఆఫర్లు ఏమీ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కాగా ఇలాంటి మోసపూరిత మెసేజ్‌ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ చేసేటపుడు మరింతజాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకటి రెండు సార్లు పరిశీలించుకొని, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే షేర్ చేయాలి. ఇది ఎవరికి వారు విధించుకోవాల్సిన నియంత్రణ. లేదంటే మనంతో మోసపోవడంతో పాటూ.. మరింత మందిని ప్రలోభపెట్టినవారమవుతాం... తస్మాత్ జాగ్రత్త! -
డీ–మార్ట్ దమానీ వాటా విక్రయం!
న్యూఢిల్లీ: అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ 1 శాతం వరకూ వాటాను (62.4 లక్షల ఈక్విటీ షేర్లను) విక్రయించనున్నారు. ఈ వాటా విక్రయ విలువ రూ.884 కోట్ల మేర ఉంటుందని అంచనా. డీ–మార్ట్ పేరుతో రిటైల్ స్టోర్స్‌ను అవెన్యూ సూపర్‌మార్ట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం కంపెనీ ప్రమోటర్ దమానీ 1 శాతం మేర వాటా విక్రయించనున్నట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ బీఎస్ఈకి నివేదించింది. ఈ షేర్ల విక్రయం ఈ నెల 21 నుంచి వచ్చే నెల 14 మధ్య జరగవచ్చని పేర్కొంది. సెబీ నిబంధనల ప్రకారం లిస్టైన కంపెనీలో కనీసం 25 శాతం వాటాను ప్రజలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ వాటా విక్రయ వార్తల నేపథ్యంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. గురువారం రూ.1,495 వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం రూ.1,379, 1,504 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 5 శాతం నష్టంతో రూ.1,416 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన డీ-మార్ట్ మార్కెట్ చెయిన్
డీ-మార్ట్ సూపర్ మార్కెట్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్లో అదరగొట్టింది. తొలిసారి తన మార్కెట్ క్యాపిటలైజేషన్ 900 బిలియన్ రూపాయల(రూ.90వేల కోట్ల) మార్కును క్రాస్ చేసింది. మంగళవారం కంపెనీ స్టాక్ ధర సరికొత్త స్థాయిలను తాకడంతో, ఈ రికార్డును అవెన్యూ సూపర్‌మార్ట్స్ అధిగమించింది. బీఎస్ఈ డేటాలో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ.921.77 బిలియన్ల మార్కెట్-క్యాప్‌తో 33వ స్థానాన్ని దక్కించుకుంది. నేడు ఈ కంపెనీ స్టాక్ రూ.1476 వద్ద 3 శాతం లాభంలో ట్రేడవుతోంది. రూ.1,479 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని ఈ కంపెనీ స్టాక్ తాకింది. 2017 మార్చి 21 నుంచి ఇదే అత్యధిక స్థాయి. రాధాకిషన్ దమానీ చెందిన ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 131 శాతం పెరిగింది. ఇష్యూ ధర రూ.299కు ప్రస్తుతమున్న ధర 394 శాతం అధికం. ఫుడ్ అండ్ గ్రోసరీ రిటైలింగ్‌లోని వృద్ధి అవకాశాల్లో డీ-మార్ట్ కీలక లబ్దిదారిగా ఉందని బ్రోకరేజ్ సంస్థలు విశ్వసిస్తున్నాయి. పదేళ్ల సమయంలో ప్రస్తుతమున్న రెవెన్యూ, లాభాలు కనీసం తొమ్మిదింతలు, పదమూడింతలు పెరుగుతాయని అంచనావేస్తున్నారు. కాగ, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే సమయంలో కూడా ఈ కంపెనీ ఈ మాదిరే రికార్డుల మోత మోగించడంతో, రాధాకిషన్ దమానీ సంపద భారీగా పెరిగింది. ఆ బంపర్ లిస్టింగ్‌తో ఆయన ఒక్కసారిగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చేరిపోయారు. గతేడాది మార్చిలో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన డీ-మార్ట్
సాక్షి, ముంబై : రిటైల్ చైన్ డీమార్ట్‌లను నిర్వహించే సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ మరోసారి అదరగొట్టింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభాలను ఏడాది ఏడాదికి 65.2 శాతం పెంచుకుని రూ.191 కోట్లగా నమోదుచేసింది. వడ్డీ ఖర్చులు ఏడాది ఏడాదికి 66 శాతం మేర తగ్గడంతో కంపెనీకి లాభాలు పెరిగాయి. ఇతర ఆదాయాలు కూడా ఈ క్వార్టర్లో రూ.21.2 కోట్లు పెరిగాయి. 2018 తొలి క్వార్టర్లో ఇతర ఆదాయాలు రూ.8 కోట్లగా మాత్రమే ఉన్నాయని కంపెనీ చెప్పింది. క్వార్టర్ సమీక్షలో భాగంగా స్టాండ్‌లోన్ రెవెన్యూ రూ.3,508 కోట్లు పెరిగింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ రెవెన్యూలు రూ.2,778 కోట్లుగా ఉన్నాయి. అంటే ఏడాది ఏడాదికి 26.3 శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చిలో అవెన్యూ సూపర్ మార్ట్స్ బ్లాక్ బస్టర్‌గా స్టాక్ మార్కెట్లో లిస్టు అయింది. తక్కువ ప్రొఫైల్ ఇన్వెస్టర్‌గా ఉన్న కంపెనీ వ్యవస్థాపకుడు రాధాక్రిష్ణణ్ దమాని ఒక్కసారిగా దేశంలోనే అత్యంత ధనికవంతుల 20 క్లబ్లో ఒకరిగా చేరారు. ప్రస్తుతం కంపెనీ 132 స్టోర్లను మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఎన్సీఆర్, చత్తీస్‌ఘర్‌లలో నిర్వహిస్తోంది. -
డీ-మార్ట్ దూసుకుపోతుంది
సాక్షి, న్యూఢిల్లీ : డీ-మార్ట్ స్టోర్లు నిర్వహించే సూపర్‌మార్కెట్ చైన్ అవెన్యూ సూపర్ మార్ట్స్ సరికొత్త గరిష్టాలను నమోదుచేస్తూ మార్కెట్లో దూసుకుపోతుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎస్ఈలో 3 శాతం పైకి జంప్ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ.1000 మార్కును బీట్చేసి, రూ.1018 వద్ద నమోదవుతోంది. మార్కెట్లు కొంత ప్రతికూల ట్రేడింగ్‌లో నడుస్తున్నప్పటికీ, అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీ-మార్ట్) స్టాక్ మాత్రం గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్ల నుంచి అంటే ఆగస్టు 10 నుంచి 16 శాతం ర్యాలీ కొనసాగించింది. గత రెండువారాల నుంచి చూస్తున్న ఈ స్ట్రాంగ్ ర్యాలీతో, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.62వేల కోట్లను దాటేసింది. ప్రస్తుతం మొత్తం ర్యాంకింగ్స్‌లో 44వ స్థానానికి వచ్చేసింది. బీఎస్ఈ డేటా ప్రకారం ఉదయం 10:17 గంటల సమయంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ62,901 కోట్లు. ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను, స్టీల్ దిగ్గజం టాటా స్టీల్‌ను, ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని, సిమెంట్ దిగ్గజం షీర్ సిమెంట్‌ను డీమార్ట్ అధిగమించింది. మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు లుపిన్, క్యాడిలా హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, అరబిందో ఫార్మాలను దాటుకుని ఇది ముందుకు వెళ్లింది. -
రెండు రోజుల్లోనే ఆయనకు రూ.6100 కోట్లు
న్యూఢిల్లీ : రాధాకిషన్ దమానీ.. ఈ పేరు ఇటీవల మార్కెట్లో మారుమ్రోగిపోతుంది. ఎప్పుడైతే డీమార్ట్ లను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ లిస్టింగ్ కు వచ్చిందో అప్పడి నుంచి ఈయన సంపద రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తోంది. కుబేరుల జాబితాలోంచి అపర కుబేరుడిని చేసేస్తున్నాయి ఆ కంపెనీ షేర్లు. లిస్టింగ్ డే రోజే 114 శాతం లాభంతో ఎగిసిన రాధాకిషన్ సంపద, కేవలం ఈ రెండు రోజుల్లోనే రూ.6100 కోట్లకు ఎగిసింది. రూ.299తో లిస్టింగ్ కు వచ్చిన అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు, ఇప్పటికే 2.4 రెట్ల లాభంతో దూసుకెళ్లాయి. ఇక బుధవారం ముగింపుకు, శుక్రవారం ట్రేడింగ్ కైతే ఏకంగా 13 శాతం ఎగిసి, మార్కెట్లో మెరుపులు మెరిపించాయి. దీంతో దమానీ, ఆయన ఫ్యామిలీ ఒక్కసారిగా రూ.4300 కోట్లకు వారసులైపోయారు. శుక్రవారం ట్రేడింగ్ లో కంపెనీ స్టాక్ 13.14 శాతం లాభంతో రూ.714 గరిష్ట స్థాయిలను తాకింది. ఈ స్టాక్ బుధవారం రూ.631.60గా ముగిసింది. ఓ వైపు దేశీయ బెంచ్ మార్కు సూచీలు పడిపోతున్నా.. ఆ కంపెనీ షేర్లు మాత్రం ర్యాలీ కొనసాగిస్తూనే ఉన్నాయి. దమానీ, ఆయన భార్య, సోదరుడు గోపాలకిషన్ శివ్కిషన్ దమానీలు అవెన్యూ సూపర్ మార్ట్స్ లో 82.2 శాతం స్టాక్ ను కలిగి ఉన్నారు. ఈ రెండు రోజుల్లోనే వీరి కుటుంబ సంపద రూ.6100 కోట్లకు పెరిగినట్టు తెలిసింది. ఈ సంపద పెంపుతో దమానీ 20వ అత్యంత భారతీయ ధనవంతుడిగా నిలిచినట్టు బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ రిపోర్టు చేసింది. టాప్-500 వరల్డ్ బిలీనియర్ల జాబితాలో కూడా ఆయన చోటు దక్కించుకున్నట్టు పేర్కొంది. 2002లో సూపర్ మార్కెట్ రిటైన్ చైన్ గా స్థాపించబడ్డ ఈ సంస్థ, డీమార్ట్ బ్రాండు పేరు మీద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ మొత్తం 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 118 స్టోర్లను నిర్వహిస్తోంది. -
ఇందుకేనా డి–మార్ట్ దూకుడు!!
రిటైల్‌లో లిస్టెడ్ కంపెనీలు చాలా తక్కువ ♦ మెరుగైన నిర్వహణ సామర్థ్యం డి–మార్ట్ సొంతం ♦ ఈ విషయంలో ఫ్యూచర్ రిటైల్ వెనుకంజ... ♦ అందుకే ఇంత భారీ వాల్యుయేషన్: విశ్లేషకులు ముంబై: డి–మార్ట్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. పబ్లిక్ ఆఫర్‌తో ఇన్వెస్టర్లకు సిరుల పంట పండించిన ఈ సంస్థ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో హాట్ టాపిక్. డి–మార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ధర మార్కెట్లో లిస్టింగ్ రోజే 100 శాతం పైగా ఎగబాకిన సంగతి తెలిసిందే. ఆఫర్ ధర రూ.299 కాగా... ప్రస్తుతం ఈ షేరు రూ.635 వద్ద ఉంది. ఈ షేరుకు ఇంత అధిక విలువ (వాల్యుయేషన్) సమంజసమేనా అన్నది ఇప్పుడు ఇన్వెస్టర్ల మదిని తొలిచేస్తున్న ప్రశ్న. అయితే, పటిష్ట నిర్వహణ సామర్థ్యమే డి–మార్ట్ దూకుడుకు ప్రధాన కారణమని.. ఇదే రంగంలో పాతుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లోని సంస్థాగత రిటైల్ సంస్థలకు ఆద్యుడిగా పేరొందిన ప్యూచర్ రిటైల్ అధినేత కిశోర్ బియానీ... డి–మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ నుంచి చాలా నేర్చుకోవాలని కూడా పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. ఫ్యూచర్ రిటైల్‌తో పోలిస్తే... దేశవ్యాప్తంగా బిగ్‌బజార్‌తో సహా విభిన్న బ్రాండ్లతో రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న ఫ్యూచర్ రిటైల్... పరిమాణంలో చాలా పెద్దదే అయినా, నిర్వహణ సామర్థ్యంలో మాత్రం డి–మార్ట్‌కు ఆమడ దూరంలో ఉందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తిని మోర్గాన్ స్టాన్లీ దీనికి ఉదాహరణగా చూపిస్తోంది. వార్షికంగా డి–మార్ట్‌కు ఇది 14 సార్లు ఉండగా.. ఫ్యూచర్ రిటైల్‌కు మాత్రం కేవలం రెండు సార్లే ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. దీనిప్రకారం... డి–మార్ట్ తన స్టోర్లలో ఉండే సరుకులను ఏడాదికి 14 సార్లు... అంటే ప్రతి 26 రోజులకు ఒకసారి క్లియర్ చేసి మళ్లీ నింపుతుండగా.. ఫ్యూచర్ రిటైల్ మాత్రం ఏడాదికి రెండు సార్లు... అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి నింపుతోంది. ఇక నిర్వహణ మార్జిన్ విషయానికొస్తే.. ఫ్యూచర్ రిటైల్ది 3.2 శాతం మాత్రమే. డి–మార్ట్ 7.9 శాతంతో దూసుకెళ్తోంది. ప్రధానంగా అద్దెల వ్యయం భారీగా పెరిగిపోవడం ఫ్యూచర్ రిటైల్ మార్జిన్లు ఆవిరయ్యేలా చేస్తోంది. అదే డి–మార్ట్ విషయానికొస్తే.. చాలా వరకూ సొంత స్టోర్లను కలిగి ఉండటం లాభిస్తోంది. రిటైల్ స్టోర్‌లో ప్రతి చదరపు మీటర్‌కు ఫ్యూచర్ రిటైల్ ఆదాయం రూ.13,000 మాత్రమే కాగా, డి–మార్ట్ ఏకంగా రూ.24,000 చొప్పున ఆర్జిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్ 244 నగరాలు, పట్టణాల్లో 300కు పైగా బిగ్‌బజార్, ఫుడ్‌బజార్, ఎఫ్‌బీబీ తదితర స్టోర్లను నిర్వహిస్తోంది. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.11,500 కోట్లు కాగా.. కేవలం 45 నగరాల్లో 118 స్టోర్లను మాత్రమే నిర్వహిస్తున్న డి–మార్ట్ మార్కెట్క్యాప్ దీనికి అందనంత ఎత్తులో రూ.40,000 కోట్ల పైకి ఎగబాకడం విశేషం. అన్నింటా ముందంజే... 2016 డిసెంబర్ చివరి నాటికి డి–మార్ట్ రుణ భారం రూ.1,409 కోట్లుగా ఉంది. అంటే డెట్ టు ఈక్విటీ నిష్పత్తి 0.74 శాతం. ఇప్పుడు ఐపీఓ ద్వారా సమీకరించిన రూ.1,870 కోట్ల నిధుల్లో రూ.1,080 కోట్లను రుణాలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోనుంది. అంటే రుణ భారం భారీగా తగ్గి.. లాభదాయకత మరింత జోరందుకుంటుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ క్వార్టర్ వరకూ కంపెనీ రూ.301 కోట్ల నికర లాభం, రూ. 8,800 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్ డెట్ టు ఈక్విటీ 0.6 శాతంగా ఉంది. ఇక ఇన్వెస్టర్లకు అత్యంత కీలకమైన రిటర్న్ ఆన్ ఈక్విటీలో (ఆర్ఓఈ–పెట్టుబడిపై రాబడి) కూడా డి–మార్ట్ 21.1 శాతంతో చాలా ముందుంది. ఫ్యూచర్ రిటైల్ ఆర్ఓఈ 15.5 శాతమే. ఇక ఫ్యూచర్ రిటైల్ ప్రస్తుత షేరు ధర రూ.243 ప్రకారం 32 రెట్ల పీఈతో ట్రేడవుతోంది. డి–మార్ట్ పీఈ చాలా అధికంగా (77 రెట్లు) ఉన్నప్పటికీ... వృద్ధి జోరు, సమర్థమైన వ్యాపార విధానం(మోడల్) వంటివి లెక్కలోకి తీసుకుని చూస్తే ఈ ప్రీమియం సమర్థనీయమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర రంగాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. విమానయాన రంగంలో సమర్థమైన నిర్వహణ కలిగిన ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) అంత్యంత గరిష్టంగా 17 పీఈని కలిగి ఉంది. మరోపక్క, ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు ఉన్న జెట్ ఎయిర్వేస్ పీఈ 9 మాత్రమే. దీనిప్రకారం.. ఫ్యూచర్ రిటైల్ కచ్చితంగా తన వ్యాపార నిర్వహణను మెరుగుపరుచుకోకపోతే... డి–మార్ట్‌తో వేల్యుయేషన్ పరంగా పోటీపడటం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకింత మక్కువ.. డి–మార్ట్ ప్రస్తుత షేరు ధర ప్రకారం పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) అత్యంత భారీ స్థాయిలో 77 రెట్లుగా ఉంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభాలతో పోలిస్తే 77 రెట్ల అధిక రేటుకు ట్రేడవుతున్నట్లు లెక్క. ఈ స్థాయిలో ఇన్వెస్టర్లు ఈ షేరును కొనడం చాలా రిస్కుతో కూడుకున్నదేనని.. స్వల్పకాలానికి తక్కువ లాభాలకు మాత్రమే ఆస్కారం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. చాలా మంది నిపుణులు మాత్రం ప్రస్తుత ధర కంటే దిగువకు ఇప్పుడప్పుడే ఈ షేరు పడిపోయే అవకాశాలు చాలా తక్కువనేనని చెబుతున్నారు. అయితే, తక్షణం మరింత భారీ స్థాయిలకు కూడా వెళ్లకపోవచ్చని.. కంపెనీ ప్రస్తుత షేరు ధర స్థాయికి ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు) చేరుకునేవరకూ ఒక శ్రేణిలో (రేంజ్ బౌండ్) కదలాడవచ్చనేది వారి అభిప్రాయం. కొద్ది కాలం క్రితం అధిక వాల్యుయేషన్లతో ఐపీఓలకు వచ్చి ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చిన థైరోకేర్, డాక్టర్ లాల్ ప్యాథ్‌ల్యాబ్స్ వంటి డయాగ్నోస్టిక్ కంపెనీలను వారు ఉదహరిస్తున్నారు. డి–మార్ట్ వంటి కంపెనీల అధిక వాల్యుయేషన్‌కు ప్రధానంగా ఆయా రంగాల్లో చాలా తక్కువ కంపెనీలు ఉండటం... నిర్వహణ పనితీరు చాలా బాగుండటం వంటివి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ‘చిన్న ఇన్వెస్టర్లకు ఓపిక తక్కువగా ఉంటుందని.. అందుకే వారు కొద్దిగా షేరు ధర పెరగ్గానే విక్రయించేందుకు సిద్ధపడతారు. అదే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా ఇలాంటి షేర్లను కొనుగోలు చేస్తుండటం వల్ల రేటు అధిక స్థాయిల్లోనే కొనసాగుతూ ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రాదు’ అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
డి–మార్ట్.. లాభాల ధమాకా
⇒ రెట్టింపు లాభంతో లిస్టింగ్ ⇒ ఇష్యూ ధర రూ.299.. లిస్టింగ్ ధర రూ.604 ⇒ ముగింపు ధర రూ.641; 114 శాతం లాభం న్యూఢిల్లీ: ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారంలో రికార్డ్ల మోత మోగించగా, ఈ వారం డి–మార్ట్ రిటైల్ స్టోర్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో చరిత్ర సృష్టించాయి. ఇష్యూ ధర(రూ.299)తో పోల్చితే అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు బీఎస్ఈలో 102 శాతం లాభంతో రూ.604 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధరతో పోల్చితే వంద శాతం లేదా దాదాపు రెట్టింపు ధరకు లిస్టయిన షేర్లు ఇటీవల కాలంలో లేవు. ఈ బంపర్ లిస్టింగ్‌తో ఈ కంపెనీ ప్రమోటర్ రాధా కిషన్ దమానీ ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో ఎన్నో మెట్లు పైకి ఎక్కారు. వివరాలు.. ఇంట్రాడేలో రూ.650కు ఇష్యూ ధర(రూ.299)తో పోల్చితే అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు బీఎస్ఈలో 102 శాతం లాభంతో రూ.604 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్ ధర 117 శాతం లాభంతో రూ.650కు దూసుకుపోయింది. చివరకు 114 శాతం లాభంతో రూ.641 వద్ద ముగిసింది. మంగళవారం మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,998 కోట్లకు చేరింది. బీఎస్ఈలో 1.45 కోట్లు, ఎన్ఎస్ఈలో 8 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ..ఈ నెల 8–10 మధ్య ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చింది. 104 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబయిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,870 కోట్లు సమీకరించింది. వంద శాతం లిస్టింగ్ లాభాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద శాతం లాభాలతో లిస్టయిన తొలి కంపెనీ ఇదే. ఈ ఆర్థిక సంవత్సరంలో క్వెస్ కార్పొ 57 శాతం, థైరో కేర్ టెక్నాలజీస్ 48 శాతం చొప్పున లిస్టింగ్ లాభాలను సాధించాయి. ఇక వంద శాతం లిస్టింగ్ లాభాలను ఇచ్చిన కంపెనీ ఇప్పటివరకూ ఒక్కటే ఉంది. రూ.8 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించిన మ్యాక్స్ అలెర్ట్ సిస్టమ్స్ కంపెనీ షేర్ వంద శాతం లిస్టింగ్ లాభాలను ఇచ్చింది. ఐపీఓ సైజ్ పరంగా చూస్తే ఈ రెండిటికి అసలు పోలికే పెట్టకూడదని నిపుణులంటున్నారు. రూ.2,984 కోట్లు సమీకరించిన పవర్‌గ్రిడ్ షేర్ 63 శాతం, రూ.1,771 కోట్లు సమీకరించిన ముంద్రా పోర్ట్ 75 శాతం వరకూ లిస్టింగ్ లాభాలను ఇచ్చాయి. ఇక మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే. ఐదు నిఫ్టీ కంపెనీలు–ఏసీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడియా సెల్యులార్, టా టా మోటార్స్ డీవీఆర్ కన్నా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ. అగ్రశ్రేణి వంద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల జాబితాలో అవెన్యూ సూపర్ మార్ట్స్ 65వ స్థానాన్ని సాధించింది. బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ ఫైనాన్స్ కంపెనీ, మ్యారికో, ఇండిగో, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. ఒక్క రోజులో 20వేల కోట్లు పెరిగిన దమానీ సంపద.. సోమవారమే ఫోర్బ్స్ మ్యాగజైన్ కుబేరుల జాబితాను వెల్లడించింది. ఈ కుబేరుల జాబితాల్లో రాధాకిషన్ దమానీ భారత్‌లో 47వ స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా 896వ స్థానంలో ఉన్నారు. అవెన్యూ సూపర్ మార్ట్స్ బంపర్ లిస్టింగ్‌తో ఆయన సంపద అమాంతం పెరిగిపోయింది. ఆయన పెట్టుబడుల విభాగం బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్, వివిధ ట్రస్టులు కలసి అవెన్యూ సూపర్ మార్ట్స్‌లో 66 శాతం వాటా(41 కోట్ల షేర్లు) ఉంది. అవెన్యూ సూపర్ మార్ట్స్ బంపర్ లిస్టింగ్‌తో ఆయన సంపద ఒక్క రోజులోనే రూ.26,240 కోట్లు(390 కోట్ల డాలర్లు) పెరిగింది. ట్రస్ట్‌ల వాటా షేర్లు తీసేసినా, ఆయన సంపద రూ.20,480 కోట్లు(310 కోట్ల డాలర్లు) పెరిగినట్లు లెక్క. ఇక వివిధ లిస్టెడ్ కంపెనీల్లో ఆయనకున్న వాటాల విలువ రూ.3,000 కోట్ల పైబడే ఉంటుందని అంచనా. వీటన్నింటిని కలుపుకుంటే ఆయన మొత్తం సంపద 440 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. దీంతో ఆయన ఆది గోద్రెజ్, పవన్ ముంజాల్, నుస్లీ వాడియా, రాహుల్ బజాజ్, అజయ్ పిరమళ్ వంటి అతిరథ మహారథులను దాటేశారు. ఈ ధరలో కొనొచ్చా? దేశవ్యాప్తంగా ఈ కంపెనీ డి–మార్ట్ రిటైల్ స్టోర్స్‌ను 120 వరకూ నిర్వహిస్తోంది. నికరలాభం దాదాపు 50 శాతం వృద్ధి సాధిస్తోంది. భారత్‌లో అత్యంత లాభదాయక సూపర్‌మార్కెట్ చెయిన్ ఇదే. ఉత్తమమైన రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ), ప్రమోటర్‌కు పటిష్టమైన నేపథ్యం, వ్యూహాత్మక ప్రదేశాల్లో స్టోర్ల ఏర్పాటు, వ్యయ నియంత్రణపై అధిక దృష్టి, పటిష్టమైన బ్రాండ్–ఈ సానుకూలాంశాలన్నీ ప్రస్తుత ధరలో ఫ్యాక్టర్ అయిపోయాయని ఏంజెల్బ్రోకింగ్కు చెందిన సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ విశ్లేషకులు అమర్జీత్ మౌర్య పేర్కొన్నారు. అందుకని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఇక ఐపీఓలో ఈ షేర్లు అలాట్ కాని ఇన్వెస్టర్లు ఈ షేర్ రూ.500–535 రేంజ్‌కి వచ్చినప్పుడు కొనుగోలు చేస్తే మంచిదని కొంతమంది నిపుణులు సలహా ఇస్తున్నారు. -
21న డి–మార్ట్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిస్టింగ్
న్యూఢిల్లీ: డి–మార్ట్ రిటైల్ చెయిన్ ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు రేపు (ఈ నెల 21– మంగళవారం )స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఈ కంపెనీ ఈ నెల 8–10 మధ్య ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చింది. రూ.1,870 కోట్లు సమీకరించింది. రూ.290–299 ధరల శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓ 104 రెట్లు సబ్‌స్క్రైబయింది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ వారంలో రెండు ఐపీఓలు ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓ నేడు (సోమవారం) ప్రారంభమై ఈ నెల 22న ముగుస్తుంది. రూ. 500–502 ధరల శ్రేణి ఉన్న ఈ ఐపీఓ ద్వారా కంపెనీ కనీసం రూ.239 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 29 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక శంకర బిల్డింగ్ ప్రొడక్టస్ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. రూ.440–460 ధరల శ్రేణి ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ బెంగళూరు కంపెనీ కనీసం రూ.345 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 32 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. -
రెండు ఐపీఓలకు రూ.1.5 లక్షల కోట్ల బిడ్స్
న్యూఢిల్లీ: ఈ వారంలో పబ్లిక్ ఆఫర్లను జారీచేసిన రెండు కంపెనీలకు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ రెండు ఐపీఓలూ పరిమాణంలో పెద్దవి కానప్పటికీ, రూ. 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్స్‌ను చేజిక్కించుకున్నాయి. రేడియో సిటీ ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్వహించే మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, డి–మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈ వారంలో ఐపీఓకు వచ్చాయి. ఈ రెండింటి షేర్ల దరఖాస్తు కోసం ఇన్వెస్టర్లు బిడ్ చేసిన రూ.1.5 లక్షల కోట్లూ వారంరోజులపాటు బ్లాక్ అయిపోతాయి. ఏడు రోజుల తర్వాత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరుగుతుంది. అప్పటిదాకా ఈ సొమ్ములు ఆస్బా(ఆప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) ఖాతాలో ఉండిపోతాయి. ఈ నెల 14న మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, ఈ నెల 16న డి–మార్ట్ షేర్లను కేటాయిస్తాయి. మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓ 40 రెట్లు, అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓ 104 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. రూ.400 కోట్ల మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓకు రూ.13,583 కోట్లు, రూ.1,870 కోట్ల అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓకు రూ.1.38 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి. డి–మార్ట్ ఐపీఓకు బంపర్ స్పందన శుక్రవారంతో ముగిసిన డి–మార్ట్ ఐపీఓ 104.48 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.295–299 ధరల శ్రేణి ఉన్న ఈ ఇష్యూలో ఆఫర్ చేస్తున్న 4.43 కోట్ల షేర్లకు గాను 463.61 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు(క్విబ్)లకు కేటాయించిన వాటా 144.6 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 277.74 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.36 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. గత ఏడాది వచ్చిన అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఐపీఓ 116 రెట్లు, క్వెస్ కార్పొ ఐపీఓ 145 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్... ఈ నెల 21న అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావచ్చు. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్‌బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. -
సూపర్ మార్కెట్ లీడర్ ’డీమార్ట్’ ఐపీవో
ముంబై: రాధాకిషన్ దమానీ ప్రమోట్ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ , సూపర్ మార్కెట్ లీడర్ డీమార్ట్ త్వరలో ఐపీవోకి రానుంది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న డీమార్ట్ మార్చి 8న పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. మార్చి 10న ముగియనున్న ఇష్యూకి రూ. 290-299 ప్రైస్ బ్రాండ్‌గా ప్రకటించింది. ఈ ఐపీవో ద్వారా రూ. 1,810-1866 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 6.23 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 1.87 కోట్ల షేర్లను విక్రయించనుంది. మరో 1.24 కోట్ల షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్), 93.59 లక్షల షేర్లను సంపన్న వర్గాలకు రిజర్వ్ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 2.18 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. ఇష్యూ తరువాత డీమార్ట్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. ఈ ఇష్యూకు గ్లోబల్ కోఆర్డి నేటర్‌గా, లీడ్ మేనేజర్ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వ్యవహరిస్తోంది. ఇతర లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇంగా కాపిటల్, జెఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ క్యాపిటల్ అడ్వైజర్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తున్నాయి. కాగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో అత్యధిక శాతం స్టోర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవల తెలుగు రాష్ట్రాలలోనూ వేగంగా విస్తరిస్తోంది. సుమారు 120 స్టోర్లను ఇప్పటికే నిర్వహిస్తున్న సంస్థ 2016 మార్చికల్లా రూ. 8,600 కోట్ల అమ్మకాలతో 320 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 5.72 ఈపీఎస్ నమోదైంది. గత రెండేళ్లలో కంపెనీ లాభార్జన సగటున 31 శాతం చొప్పున జంప్‌చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7.6 ఈపీఎస్‌ను కంపెనీ అంచనా వేస్తోంది. ఇష్యూ ధర రూ. 300కాగా.. 40 పీఈలో షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
గతవారం బిజినెస్
మార్చి 8న డి–మార్ట్ ఐపీఓ డి–మార్ట్ సూపర్ మార్కెట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్చి 8న రానున్నది. అదే నెల 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించాలని అవెన్యూ సూపర్‌మార్ట్స్ యోచిస్తోంది. కాగా రైల్వేలకు చెందిన మూడు సంస్థలు ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ, ఐఆర్‌సీఓఎన్‌లు త్వరలో ఐపీఓకు రానున్నాయి. ఈ మూడు సంస్థల్లో కొంత వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించనున్నారు. ‘భారత్‌క్యూఆర్ కోడ్’ ఆవిష్కరణ క్యాష్‌లెస్ ఎకానమీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రపంచపు తొలి ఇంటర్‌పోర్టబుల్ పేమెంట్ యాక్సప్టెన్సీ సొల్యూషన్ ’భారత్‌క్యూఆర్ కోడ్’ను ఆవిష్కరించింది. దీంతో రిటైల్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మరింత సులభతరం కానున్నాయి. ’భారత్‌క్యూఆర్ కోడ్’ విధానంలో వ్యాపారుల ఐడీ, ఫోన్ నంబర్ వంటివి అవసరం లేకుండానే లావాదేవీలు నిర్వహించవచ్చు. వ్యాపారులు కేవలం ఒక క్యూఆర్ కోడ్‌ను మాత్రమే కలిగి ఉంటారు. కస్టమర్లు ఆ కోడ్‌ను స్కాన్ చేసి అమౌంట్‌ను ఎంటర్ చేసి పేమెంట్ చేసేయొచ్చు. ఇక్కడ డబ్బులు డైరెక్ట్‌గా మర్చంట్ బ్యాంక్ ఖాతాకు చేరిపోతాయి. స్వైపింగ్ మెఫీన్లతో పనిలేదు. యాహూ–వెరిజోన్ డీల్ విలువ తగ్గింపు వరుసగా రెండు సార్లు డేటా హ్యాకింగ్ ఉదంతాల నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం యాహూ తమ ఇంటర్నెట్ వ్యాపార విభాగం విక్రయ విలువను 350 మిలియన్ డాలర్ల మేర తగ్గించింది. యాహూ ఇంటర్నెట్ వ్యాపారాన్ని వెరిజోన్ కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. తాజా మార్పుల ప్రకారం డీల్ విలువ 4.48 బిలియన్ డాలర్లకు తగ్గుతుంది. అలాగే హ్యాకింగ్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ విచారణకు, షేర్హోల్డర్లు వేసిన దావాల వ్యయాల భారాన్ని యాహూనే భరిస్తుంది. అయితే, ప్రభుత్వపరంగా ఎదురయ్యే ఇతరత్రా వితరణలకయ్యే వ్యయాలను ఇరు సంస్థలు భరిస్తాయి. 15 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా ప్రభుత్వం 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.12,000 కోట్లు. ఆమోదం పొందిన వాటిల్లో డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, వొడాఫోన్, తదితర సంస్థల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) మొత్తం 24 ప్రతిపాదనలను పరిశీలించింది. వీటిల్లో మూడింటిని తిరస్కరించిందని, ఆరింటిపై నిర్ణయాలను వాయిదా వేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వాయిదా పడిన వాటిల్లో రూ.8,000 కోట్ల విలువైన గ్లాండ్ ఫార్మా ప్రతిపాదన కూడా ఉంది. ఇక ఆమోదం పొందిన వాటిల్లో రూ.9,000 కోట్ల ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ ప్రతిపాదన, రూ.750 కోట్ల విలువైన అపోలో హాస్పిటల్స్ ప్రతిపాదనలు ఉన్నాయి. భీమ్ యాప్ డౌన్లోడ్స్@1.7 కోట్లు దేశీ డిజిటల్ పేమెంట్స్ యాప్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) డౌన్లోడ్స్ 1.7 కోట్లకు చేరాయని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే (డిసెంబర్ 30న) ఈ యాప్‌ను ఆవిష్కరించింది. నవంబర్–జనవరి మధ్యకాలంలో యూఎస్ఎస్డీ ప్లాట్‌ఫామ్‌లోని లావాదేవీలు 45% పెరిగాయని పేర్కొన్నారు. నోట్ల రద్దుకు ముందు దేశంలో 8 లక్షల పీవోఎస్ మెషీన్లు ఉంటే.. ఇప్పుడు వీటి సంఖ్య 28 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి డేటాకు చార్జీలు: జియో ప్రమోషనల్ ఆఫర్ల కింద ఇప్పటిదాకా ఉచితంగా లభిస్తున్న రిలయన్స్ జియో డేటా సర్వీసులకు ఏప్రిల్ 1 నుంచి చార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే ప్రస్తుత యూజర్లు మాత్రం వన్ టైమ్ జాయినింగ్ ఫీజు కింద రూ. 99 కడితే నెలకు రూ. 303 టారిఫ్‌తో ప్రస్తుత ప్రయోజనాలను మరో 12 నెలల పాటు పొందవచ్చు. రిలయన్స్ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. జియో సర్వీసులు ప్రారంభించిన తర్వాత 170 రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్ల మైలురాయిని అధిగమించిందని చెప్పారు. 27 నుంచి ఏడో విడత బంగారు బాండ్లు గోల్డ్ బాండ్ల ఏడో విడత జారీకి కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. వీటికోసం ఔత్సాహికులు ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఒక్కరు 500 గ్రాముల బంగారం విలువకు సరిపడా సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మెడికల్ టూరిజంతో ఫార్మా పరుగు దేశీ ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2020 నాటికి 15.92 శాతం చొప్పున వార్షిక వృద్ధి రేటుతో 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని అసోచామ్ అంచనా వేసింది. ఈ వృద్ధికి మెడికల్ టూరిజం బాగా దోహదపడుతుందని తెలియజేసింది. అసోచామ్ తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీటీఎం)తో కలిసి ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2005లో 6 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా మార్కెట్ 2016 నాటికి 17.46 శాతం వార్షిక వృద్ధి రేటుతో 36.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది 2020 నాటికి 55 బిలియన్ డాలర్లకు చేరనుంది. జీఎస్టీపై మొబైల్ యాప్ త్వరలో అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకంగా మొబైల్ యాప్ ఆవిష్కరించింది. జీఎస్టీలో కొంగొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్డేట్ సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ఇది అందుబాటులో ఉంటుందని, తర్వాత ఐఓఎస్ వెర్షన్ కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు. జీఎస్టీ విధానానికి మారేందుకు మార్గదర్శకాలు, తదితర వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. డీల్స్.. ⇒ మరో రెండు ఆర్థిక సంస్థల మధ్య విలీనం జరుగుతుందన్న అంచనాలు మార్కెట్లో మొదలయ్యాయి. ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూ జన్ (గతంలో ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్) విలీనమయ్యేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ⇒ టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌తో చేతులు కలిపింది. జియో యూజర్లు ఇకపై జియోమనీ యాప్ ద్వారా ఉబెర్ ట్యాక్సీలను బుక్ చేసుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ⇒ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.1,600 కోట్లు సమీకరించింది. ⇒ దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్టెల్.. టెలినార్ ఇండియాను చేజిక్కించుకుంది. దేశంలో టెలినార్‌కు ఉన్న ఏడు సర్కిళ్లలో కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు టెలినార్ సౌత్ ఏషియా ఇన్వెస్ట్మెంట్స్ తో ఒప్పందం ఖరారు చేసుకుంది. డీల్ ప్రకారం ఎయిర్టెల్ టెలినార్‌కు నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులూ చేయదు. అయితే, ఆ కంపెనీ భవిష్యత్తులో స్పెక్ట్రం లైసెన్స్ కోసం చెల్లించాల్సిన ఫీజులు, మొబైల్ టవర్ల అద్దెలు అన్నీ కలుపుకొని రూ.1,600 కోట్లను ఎయిర్టెల్ భరిస్తుంది. ⇒ కేజీ–బేసిన్‌లోని గ్యాస్ బ్లాక్‌లో జీఎస్పీసీకి ఉన్న మొత్తం 80 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,000 కోట్లు). -
మార్చి 8న డీ–మార్ట్ ఐపీఓ...
⇒ రూ.1,870 కోట్ల సమీకరణ ⇒ ఇష్యూ ధర రూ.290–299 రేంజ్లో...! న్యూఢిల్లీ: డీ–మార్ట్ సూపర్ మార్కెట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్చి 8న రానున్నది. అదే నెల 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించాలని అవెన్యూ సూపర్‌మార్ట్స్ యోచిస్తోంది. ఈ సంస్థ విలువ రూ.18,000 కోట్లని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 6.23 కోట్ల షేర్లను రూ.290–299 ధరల శ్రేణిలో జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. -
ట్యాంకర్ ఢీ కొని వృద్ధురాలు మృతి
ఎల్బీనగర్: వేగంగా వెళ్తున్న ట్యాంకర్ రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఢీ కొట్టింది. ఈ సంఘటన ఆదివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్నగర్లోని డిమార్ట్ షోరూం వద్ద చోటుచేసుకుంది. వివరాలు..రామాంతపూర్‌కు చెందిన అండాలమ్మ(65) రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన మంచి నీటి ట్యాంకర్ ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.