రెండు ఐపీఓలకు రూ.1.5 లక్షల కోట్ల బిడ్స్
న్యూఢిల్లీ: ఈ వారంలో పబ్లిక్ ఆఫర్‌లను జారీచేసిన రెండు కంపెనీలకు ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ రెండు ఐపీఓలూ పరిమాణంలో పెద్దవి కానప్పటికీ, రూ. 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్స్‌ను చేజిక్కించుకున్నాయి. రేడియో సిటీ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను నిర్వహించే మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్, డి–మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ ఈ వారంలో ఐపీఓకు వచ్చాయి. ఈ రెండింటి షేర్ల దరఖాస్తు కోసం ఇన్వెస్టర్లు బిడ్ చేసిన రూ.1.5 లక్షల కోట్లూ వారంరోజులపాటు బ్లాక్ అయిపోతాయి. ఏడు రోజుల తర్వాత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరుగుతుంది.
అప్పటిదాకా ఈ సొమ్ములు ఆస్బా(ఆప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్‌డ్ అమౌంట్) ఖాతాలో ఉండిపోతాయి. ఈ నెల 14న మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్, ఈ నెల 16న డి–మార్ట్ షేర్లను కేటాయిస్తాయి. మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ ఐపీఓ 40 రెట్లు, అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓ 104 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. రూ.400 కోట్ల మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్ ఐపీఓకు రూ.13,583 కోట్లు, రూ.1,870 కోట్ల అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓకు రూ.1.38 లక్షల కోట్ల బిడ్‌లు వచ్చాయి.
డి–మార్ట్ ఐపీఓకు బంపర్ స్పందన
శుక్రవారంతో ముగిసిన డి–మార్ట్ ఐపీఓ 104.48 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.295–299 ధరల శ్రేణి ఉన్న ఈ ఇష్యూలో ఆఫర్ చేస్తున్న 4.43 కోట్ల షేర్లకు గాను 463.61 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు(క్విబ్)లకు కేటాయించిన వాటా 144.6 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 277.74 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.36 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. గత ఏడాది వచ్చిన అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ ఐపీఓ 116 రెట్లు, క్వెస్ కార్పొ ఐపీఓ 145 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి.
ఈ నెల 21న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్...
ఈ నెల 21న అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావచ్చు. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్‌బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.